
‘మిషన్ కాకతీయ’కు మరో రూ.12.13కోట్లు
ఇప్పటివరకు రెండు విడతల్లో రూ.38.57 కోట్లు విడుదల
మొత్తం 131 చెరువుల పునరుద్ధరణకు మార్గం సుగమం
పనులు త్వరితగతిన పూర్తిచేయాలని ప్రభుత్వం ఆదేశం
సాక్షి, రంగారెడ్డి జిల్లా : మిషన్ కాకతీయలో భాగంగా మరికొన్ని చెరువుల పునరుద్ధరణకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. తొలివిడత కింద గత నెలలో 44 చెరువుల మరమ్మతులు, అభివృద్ధికి సర్కారు రూ.26.44కోట్లు విడుదల చేసింది. తాజాగా 87 చెరువుల పునరుద్ధరణ కోసం రూ.12.13కోట్లు విడుదల చేసింది. ఈమేరకు ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తంగా ఇప్పటివరకు 131 చెరువుల అభివృద్ధికి రూ.38.57కోట్లు విడుదలయ్యాయి.
రెండు విడతలుగా నిధులు..
జిల్లాల వారీగా సమీక్షలో భాగంగా గతేడాది చివర్లో నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు జిల్లా యంత్రాం గంతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ క్రమంలో తొలివిడత తలపెట్టే 555 చెరువుల పునరుద్ధరణపై చర్చించిన అనంతరం విడతలుగా నిధులు మంజూరు చేయనున్నట్లు స్పష్టం చేశారు. ఇందులో భాగంగా ఇప్పటివరకు రెండు విడతలుగా నిధులు మంజూరయ్యాయి. ఇందులో జనవరి ఏడో తేదీన ఎనిమిది మండలాల్లోని 44 చెరువులకు రూ.26.44 కోట్లు మంజూరయ్యాయి. తాజాగా 13 మండలాల్లోని 87 చెరువులకుగాను రూ.12.13కోట్లు విడుదల చేశారు.
ఇక పనులు ఉరకలెత్తించాలి..
విడతలవారీగా నిధులు మంజూరు అవుతుండడంతో పనులు ప్రారంభించేందుకు అధికారులకు వెసులుబాటు కలిగింది. తొలివిడత నిధులు మంజూరు కావడంతో.. ఆయా పనులకు సంబంధించి జిల్లా నీటిపారుదల శాఖ ఇంజినీర్లు టెండర్లు ఖరారు చేసి పనులను ఇప్పటికే ప్రారంభించారు. తాజాగా రెండోవిడత నిధులు రావడంతో ఒకట్రెండు రోజుల్లో టెండర్లు పిలవాల్సి ఉంది. ఈ ప్రక్రియ అనంతరం పనులు ప్రారంభిస్తారు. ఇదిలా ఉంటే త్వరలో మరిన్ని నిధులు విడుదలయ్యే అవకాశం ఉంది. దీంతో ఆలోపు తాజాగా చేపట్టిన పనులన్నీ పూర్తిచేసేలా నీటిపారుదల అధికారులు ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారు.