బ్రిజేశ్ ముందుకు బ్రహ్మాస్త్రం!
ట్రిబ్యునల్ ముందు స్వయంగా వాదనలు వినిపించనున్న కేసీఆర్!
- హాజరుకావాల్సిందిగా ఆహ్వానించిన అధికారులు, న్యాయవాదులు
- దీనిపై ముఖ్యమంత్రితో ప్రాథమిక చర్చలు
- కేసీఆర్ దాదాపుగా ఓకే చెప్పినట్లు నీటి పారుదల వర్గాల వెల్లడి
సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదీ జలాల పంపిణీ వివాదం, నీటి లెక్కలు, తెలంగాణకు దక్కాల్సిన వాస్తవ వాటాలపై బ్రిజేశ్ ట్రిబ్యునల్ ఎదుట సీఎం కె.చంద్రశేఖర్‌రావు స్వయంగా వాదనలు వినిపించనున్నారు. ఈ అంశంలో అధికారుల విజ్ఞప్తిపై ఆయన సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది. తుది వాదనల సమయంలో కచ్చితంగా ట్రిబ్యునల్ ముందు హాజరై వాదనలు వినిపిస్తానని హామీ ఇచ్చినట్లు సమాచారం. కృష్ణా జలాల్లో వాస్తవ కేటాయింపులు, జరుగుతున్న వినియోగం, ఉమ్మడి ఏపీలో జరిగిన నష్టం, కొత్త ప్రాజెక్టులకు వరద జలాల మళ్లింపు తదితర అంశాలపై ట్రిబ్యునల్ ముందు వాదనలు వినిపిస్తున్న ప్రభుత్వ న్యాయవాదులు, నీటి పారుదల శాఖ అధికారులు దీనిపై ముఖ్యమంత్రితో చర్చలు సైతం జరిపినట్లు తెలిసింది.
కేంద్రం, ట్రిబ్యునల్‌ల తీరుతో నిరాశ
కృష్ణా జలాల పంపిణీలో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని సవరించాలంటూ మూడున్నరేళ్లుగా రాష్ట్రం విజ్ఞప్తి చేస్తున్నా ఫలితం ఉండడం లేదు. కేంద్రం రాజకీయ ప్రయోజనాలకే పెద్దపీట వేస్తూ కృష్ణా జలాల పంపిణీపై విచారణను తెలంగాణ, ఏపీలకే పరిమితం చేస్తూ నిర్ణయం తీసుకుంది. అటు బ్రిజేశ్ ట్రిబ్యునల్ కూడా తెలంగాణ గోడును ఏమాత్రం వినిపించుకోవడం లేదు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాలకు జరిపిన నికర, మిగులు జలాల కేటాయింపుల జోలికి వెళ్లకుండా.. కేవలం క్యారీ ఓవర్ జలాలు, గోదావరి నుంచి కృష్ణాకు నీటిని తరలిస్తే ఎగువ రాష్ట్రాలకు దక్కే వాటాలపై ప్రధానంగా దృష్టి పెట్టింది. అటు కేంద్ర నిర్ణయం, ఇటు ట్రిబ్యునల్ తీరు రెండూ తెలంగాణకు అశనిపాతంగా మారాయి.
‘పూడిక’ లెక్కలు తీద్దాం!
ఇక నాగార్జున సాగర్ నిల్వ సామర్థ్యం 408 టీఎంసీలుకాగా పూడిక కారణంగా సామర్థ్యం ప్రస్తుతం 312 టీఎంసీలకు తగ్గిపోయిందని.. శ్రీశైలంలోనూ 312 టీఎంసీల నుంచి 215 టీఎంసీలకు తగ్గిందని కేసీఆర్ అధికారులకు వివరించినట్లు తెలిసింది. రెండు ప్రాజెక్టుల్లో పూడికతో తగ్గే నీటిని పాలమూరు, డిండి ప్రాజెక్టులకు మళ్లిద్దామని ప్రాతిపాదన చేద్దామని పేర్కొన్నట్లు చెబుతున్నారు. ఈ విషయాలపై తానే స్వయంగా ట్రిబ్యునల్ ముందుకు వస్తానని చెప్పినట్లు విశ్వసనీయంగా తెలిసింది. అయితే బోర్డు ముందు ముఖ్యమంత్రి ఏ హోదాలో హాజరవుతారు? దానికి ముందుగానే బోర్డు అనుమతి తీసుకోవాలా? అన్నదానిపైనా చర్చలు జరుగుతున్నాయి. ఈ నెల 13, 14, 15 తేదీల్లో ట్రిబ్యునల్ ముందు వాదనలు జరుగుతున్నా.. అవి ఇరు రాష్ట్రాలు సమ ర్పించిన అఫిడవిట్లు, కౌంటర్‌లు కేంద్రంగా ఉండనున్నాయి. దీంతో తీర్పు వెలువరించే ముందు పూర్తిస్థాయిలో జరిగే తుది వాదనల సమయంలో ముఖ్యమంత్రి హాజ రయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
అన్యాయాన్ని ఎండగడదాం..
కృష్ణా జలాల అంశంపై నీటి పారుదల శాఖ అధికారులు, న్యాయవాదులతో ముఖ్యమంత్రి కేసీఆర్ పలు దఫాలుగా సుదీర్ఘ చర్చలు జరిపారు. కృష్ణా పరీవాహక ప్రాంతం తెలంగాణలో 68.5 శాతం ఉన్నా నీటి వాటాలు మాత్రం మొత్తం కేటాయింపుల్లో 35 శాతం మేర మాత్రమే ఉన్నాయని... పరీవాహకాన్ని, ఆయకట్టును పరిగణనలోకి తీసుకొని అయినా కేటాయింపులు పెంచాల్సిందేనని కేసీఆర్ ఇప్పటికే స్పష్టం చేశారు. నాగార్జునసాగర్ నుంచి కృష్ణా డెల్టాకు అవసరానికి మించి నీటి కేటాయింపులు జరిపారని కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. ఇక గతంలో జరిగిన ఒప్పందాల మేరకు తెలంగాణలోని ఆర్డీఎస్‌కు, రాయలసీమలోని సుంకేశుల కేసీ కెనాల్‌కు సమాన కేటాయింపులు జరపాల్సి ఉన్నా.. ఆర్డీఎస్‌కు 12 టీఎంసీలు ఇచ్చి, సుంకేశులకు 39 టీఎంసీలు కేటాయించిన అంశాన్ని వివరించారు.
టీఆర్‌ఎస్ ఎంపీలు పార్లమెంట్‌లో సైతం ఈ అంశాలను లేవనెత్తినా ఫలితం రాలేదు. ఈ నేపథ్యంలో ఈ అంశాన్ని ట్రిబ్యునల్ ముందు తేల్చుకోవాల్సిందేనని నీటి పారుదల శాఖ అధికారులు, న్యాయవాదులు ఇటీవల ముఖ్యమంత్రికి తేల్చిచెప్పినట్లు తెలిసింది. చివరి అస్త్రంగా మీరే స్వయంగా ట్రిబ్యునల్ ముందుకు రావాలని వారు కేసీఆర్‌ను కోరగా.. ఆయన సానుకూలంగా స్పందించినట్లు నీటి పారుదల ఉన్నత స్థాయి వర్గాలు స్పష్టం చేశాయి.