దాళ్వా ఉన్నట్టా? లేనట్టా?
టీడీపీ నేతలు, అధికారుల దాగుడుమూతలు
నీరివ్వలేమంటున్న నీటిపారుదలశాఖ ఎస్‌ఈ
స్పష్టత లేక రైతుల్లో ఆందోళన
టీడీపీ నేతలు, అధికారులు మధ్య సమన్వయ లోపంతో చేస్తున్న ప్రకటనలతో దాళ్వా సాగుపై రైతులు తీవ్ర గందరగోళానికి గురవుతున్నారు. రబీలో దాళ్వాకు సాగునీరందిస్తామని మంత్రులు దేవినేని, కామినేని , టీడీపీ ఎమ్మెల్యే కాగిత
వెంకట్రావు హామీలిస్తుండగా... నీటిపారుదల శాఖ ఎస్‌ఈ రామకృష్ణ మాత్రం నీటి విడుదలకు అసలు అవకాశమే లేదంటున్నారు. దాళ్వాపై ఇంతవరకూ స్పష్టమైన ప్రకనటన చేయకపోవడ ంతో జిల్లా రైతులు కలవరపాటుకు గురవుతున్నారు.
చల్లపల్లి : ఈ ఏడాది ఖరీప్‌సాగు నెలరోజుల ఆలస్యంగా ప్రారంభమయిన విషయం విదితమే. దీనికితోడు దోమపోటు వరిపొలాలను చుట్టేసింది. ఈ నేపథ్యంలో ఖరీఫ్ పంట దిగుబడులు గణనీయంగా తగ్గిపోతాయని చాలామంది రైతులు ఆందోళన చెందుతున్నారు. రబీలో దాళ్వాకు అనుమతిస్తే దానిద్వారానైనా నష్టాన్ని పూడ్చుకోవచ్చని ఆశపడుతున్నారు. మంత్రులు, ముఖ్య అధికారులు పొంతనలేని ప్రకటనలు చేస్తుండడంతో రైతులు అయోమయానికి గురవుతున్నారు. జిల్లాకు చెందిన మంత్రులు నీరిస్తామని చెబుతున్నా... ఇప్పటికే తన పరిధిలో 54 టీఎంసీల సాగునీటి కొరత ఉందని, దాళ్వాకు నీరు విడదల చేసే అవకాశం లేదని నీటిపారుదలశాఖ ఎస్‌ఈ రామకృష్ణ శుక్రవారం ప్రకటించారు. ఇప్పటికే జిల్లాలో పలు ప్రాంతాల్లో సార్వా వరికోతలు ప్రారంభమయ్యాయి. దాళ్వా అదునుకు విత్తనాలు జల్లుకోవడం, వరినారు పోసుకోవడం చేయాలి. అయితే పరిస్థితులను గమనిస్తుంటే ఈ ఏడాది జిల్లాలో చాలా తక్కువ ప్రాంతంలో మాత్రమే దాళ్వాకు అనుమతిచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. గత ఏడాది జిల్లాలో 2.80లక్షల ఎకరాల్లో దాళ్వాసాగుకు అనుమతిచ్చారు. ఈ ఏడాది ఏ నిర్ణయం తీసుకుంటారనేది స్పష్టంగా తేలేవరకు రైతులకు ఆందోళన తప్పదు.
దాళ్వా రైతును ఆదుకోవాలి...
ఈ ఏడాది ఖరీప్‌సాగు ఆలస్యం కావడం, వరికి చీడపీడలు తీవ్రస్ధాయిలో ఆశించడం, దోమపోటు ఎక్కువ కావడంతో గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ ఏడాది దిగుబడులు తీవ్రస్ధాయిలో తగ్గిపోతాయని రైతులు చెబుతున్నారు. గత ఏడాది మూడుసార్లు తుపాన్లు, వాయుగుండాల గాలులకు జిల్లాలో భారీగా దిగుబడులు తగ్గిపోవడంతో రైతులు చాలానష్టపోయారు. గతంలో దాళ్వా సాగుచేసిన రైతులు ఖరీప్‌లో జరిగిన నష్టాన్ని పూడ్చుకున్నారు. దాళ్వాగా వరి లేదంటే మొక్కజొన్న వేసేందుకు రైతులు ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. గత ఏడాది జిల్లాలో 90వేల ఎకరాల్లో మొక్కజొన్న సాగుచేసినట్టు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. అనధికారింగా మరో పదివేల ఎకరాలు ఎక్కువగానే ఉంటుంది. మొక్కజొన్న సాగుచేసిన రైతులు ఎకరాకు రూ.20వేల నుంచి 35వేల వరకూ లాభాలు గడించారు. ఈ దృష్ట్యా ఈ ఏడాది దాళ్వాకు అనుమతివ్వాలని పలువురు రైతులు కోరుతున్నారు.