అక్కడ కొంటే కాస్త జాగ్రత్త | If there is a bit of caution | Sakshi
Sakshi News home page

అక్కడ కొంటే కాస్త జాగ్రత్త

Published Fri, Sep 18 2015 11:25 PM | Last Updated on Sun, Sep 3 2017 9:35 AM

అక్కడ కొంటే కాస్త జాగ్రత్త

అక్కడ కొంటే కాస్త జాగ్రత్త

యథేచ్ఛగా 111 జీవోలో వెంచర్లు, ప్రాజెక్ట్‌లు
 
{పగతి ఇక్కడేనంటూ నిలువెల్లా ముంచేస్తున్న బిల్డర్లు
అసలు నిర్మాణాలే చేపట్టరాదంటున్న జీవో

 
 ఎన్నారై అయిన శ్రీధర్.. భాగ్యనగరంలో స్థిరాస్తి కొనుగోలుకు ముందడుగేశాడు. విమానాశ్రయం ఉందనో.. ఔటర్‌కు దగ్గరుందనో.. మెట్రో రానుందనో.. చెప్పి.. ఫ్లాటో/ప్లాటో కొనకపోతే సువర్ణావకాశాన్ని కోల్పోయినట్టేనని బిల్డర్లు, రియల్టర్లు నమ్మించారు. దీంతో తొందరపడి స్థిరాస్తిని కొనుగోలు చేశాడతను. తీరా చూస్తే.. తాను కొన్న స్థిరాస్తి బయో కన్జర్వేషన్ జోన్ కిందికొస్తుందని.. అసలక్కడ ఎలాంటి శాశ్వత నిర్మాణాలూ చేపట్టరాదని తెలిసింది. దీంతో  ఎటూ పాలుపోలేదు శ్రీధర్‌కు..
 
 సాక్షి, హైదరాబాద్: ఇలాంటి సంఘటనలు నగరంలో చాలా మందికి అనుభవమే.  ఏ కాస్త ఏమరుపాటుగా ఉన్నా అలాంటి సంఘటనలు ఎవరికైనా పునరావృతమవుతాయనేది నిపుణుల సూచన. ప్రత్యేకించి తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రత్యేక పారిశ్రామిక విధానం, త్వరలో తెరమీదికి రానున్న హౌసింగ్ పాలసీ వంటి వాటితో రాష్ట్రంలో పెట్టుబడులు, పరిశ్రమలు పెద్ద ఎత్తున రానున్నాయి. దీంతో మళ్లీ భాగ్యనగరంలో స్థిరాస్తికి మంచి రోజులు రానున్నాయి. ఇలాంటి సమయంలోనే రియల్టర్లు అందమైన మాటలతో, కలలోని అభివృద్ధిని అరచేతిలో చూపిస్తూ అక్రమ నిర్మాణాలను కొనుగోలుదారులకు అంటగడతారు. ఇలాంటి పరిస్థితుల్లో 111 జీవో పరిధిలో మరింత జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

 ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ జలాశయాలను కాపాడేందుకు, నీటి పరివాహక ప్రాంతాలను పరిరక్షించేందుకు హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాలోని 84 గ్రామాలను జీవ పరిరక్షణ ప్రాంతం (బయో కన్జర్వేషన్ జోన్) పరిధిలోకి తీసుకొచ్చారు. ఇందుకోసం 2006 మార్చిలో ప్రభుత్వం జీవో నంబర్ 111ను విడుదల చేసింది. జీవో పరిధిలో ఎలాంటి శాశ్వత నిర్మాణాలు, లే-అవుట్లు వేయకూడదని స్పష్టం చేసింది కూడా. మాస్టర్ ప్లాన్ ప్రకారం.. 90 శాతం భూమిని బయో కన్జర్వేషన్ జోన్ కిందికి తీసుకొచ్చారు. మిగిలిన 10 శాతంలో నిర్మాణాలుంటాయి. రెండు చెరువుల్లోని ఫుల్ ట్యాంక్ లెవల్ (ఎఫ్‌టీఎల్) 10 కి.మీ. చుట్టూ కాలుష్య పరిశ్రమలు, హోటళ్లు, నివాస, వాణిజ్య సముదాయాల వంటి నిర్మాణాలను అనుమతించరు. 84 గ్రామాల్లోని 90 శాతం భూమి రిక్రియేషనల్, కన్వర్జేషన్ కింద ఉంటుంది. మిగిలిన 10 శాతం స్థలంలో గ్రౌండ్+2 అంతస్తుల వరకే అనుమతిస్తారు.

 ఉల్లంఘనలు జరుగుతున్నదిక్కడే..
 జీవో పరిధిలో 10 శాతంలో నిర్మాణాలను అనుమతిస్తారు అంటే దానర్థం.. మాస్టర్ ప్లాన్ ప్రకారం జీవో పరిధిలోని మొత్తం స్థలంలో 10 శాతం భూమన్నమాట. ఇప్పటికే ఇక్కడ శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం, శంషాబాద్ పట్టణం, 84 గ్రామ కంఠాలు, ఇతర అభివృద్ధి పనులకు స్థలాన్ని కేటాయించారు. అంటే 10 శాతం స్థలం పూర్తయింది. కానీ, రియల్టర్లు ఏం చేస్తున్నారంటే.. 111 జీవో పరిధిలోని ప్రతి లే-అవుట్‌లో 10 శాతం స్థలాన్ని నివాస సముదాయాలకు కేటాయించొచ్చంటూ బుకాయిస్తున్నారు.

 ‘ప్రగతి’ ఇక్కడే అంటూ..
 దశాబ్దకాలంగా 111 జీవో పరిధిలో సుమారు 5,000కు పైగా అక్రమ నిర్మాణాలు వెలిశాయని అంచనా. నిర్మాణాలే కాదు.. ఇక్కడ లెక్కలేనన్ని ఇంజనీరింగ్ కళాశాలలు, రెండు మెడికల్ కాలేజీలూ ఉన్నాయి. వీటిలో ఏ ఒక్కదానికీ అనుమతులు లేవు. ఇదిలా ఉంటే అంతరించిపోతున్న ఔషద మొక్కలు పెంచుతున్నాన ంటూ వేల ఎకరాల్లో రిసార్ట్‌ను  నిర్మించి.. వాటి మధ్యలో రియల్టీ వ్యాపారం చేస్తున్నారు కొందరు రియల్టర్లు. పచ్చని ప్రకృతి మధ్యలో ఆహ్లాదకరంగా జీవించొచ్చని చెబుతూ కొనుగోలుదారులను నిలువునా ముంచుతున్నాయీ సంస్థలు.

ఇవే కాదు. 111 జీవో పరివాహక ప్రాంతాల్లో లెక్కలేనన్ని ఫామ్ హౌస్‌లు, రిసార్టులు వెలిశాయి. ఈ అక్రమ నిర్మాణాలను కొనుగోలు చే సిన వారిలో సామాన్యులే కాదు ఉన్నతోద్యోగులు, ప్రవాసాలూ ఉండటం గమనార్హం. ఇక్కడ ఆకాశహర్మ్యాలు నిర్మించడానికీ అనుమతి లేదు. ఎఫ్‌ఎస్‌ఐ (బిల్టప్ స్పేస్ ఏరియా), పరివాహక ప్రాంతం (క్యాచ్‌మెంట్ ఏరియా) 1:0.5 నిష్పత్తిలో ఉండాలి కూడా. కానీ ఇక్కడ చాలా నిర్మాణాలు జీ+3 అంతస్తులను దాటిపోతున్నాయి. ఎప్పుడో ఒకనాడు ప్రభుత్వం కనక కొరఢా ఝుళిపిస్తే ఈ రియల్టర్ల దగ్గర కొనుగోళ్లు చేసిన సామాన్యులు రోడ్డున పడతారన్నది నిపుణుల మాట.  ఇవి చూడాల్సిందే..

 ‘బఫర్’ అంటే భయమే..
 బఫర్ జోన్ అంటే నీటి పరివాహక ప్రాంతం. చెరువుల నుంచి పల్లపు ప్రాంతాలకు పారుతుంటుంది. దీన్ని అలుగు అంటారు. ఇక్కడి నుంచి పొలాలకు నీరు మళ్లుతుంటుంది. ఈ మధ్య ఉన్న ప్రాంతాన్నే అంటే చెరువుకు, పొలాలకు మధ్య ఉన్న ప్రాంతాన్ని బఫర్ జోన్ అంటారన్నమాట. ఉస్మాన్‌సాగర్ కింద ఉన్న భూములన్నీ బఫర్‌జోన్ కిందికే వస్తాయి. ఈ కింద ఉన్న ప్రాంతాల్లో కట్టడాలు నిర్మించకూడదు. కొనొద్దు కూడా.

 ఎఫ్‌టీఎల్ అంటే జేబు నిల్లే..
 ఫుల్ ట్యాంక్ లెవల్ (ఎఫ్‌టీఎల్) అంటే చెరువు కట్ట ప్రాంతం. ఈ ప్రాంతం నీటి పారుదల శాఖ విభాగం కిందికొస్తుంది. చెరువు కట్ట ప్రాంతాన్ని ఆనుకొని నగరంలో బడా నిర్మాణాలు వెలుస్తున్నాయి. అయితే వీటిలో ఫ్లాట్ కొనేముందు కొనుగోలుదారులు కొన్ని కీలక పత్రాలు చూడాలి. లేకపోతే మొదటికే మోసం వస్తుంది. ఈ ప్రాంతంలోని నిర్మాణాలకు నీటి పారుదల శాఖ నుంచి ధ్రువీకరణ పత్రాన్ని తీసుకోవాలి. అలాగే సంబంధిత మున్సిపల్ రెవెన్యూ ఆఫీసర్ (ఎంఆర్‌ఓ), జీహెచ్‌ఎంసీ క్లియరెన్స్ సర్టిఫికెట్ తప్పసరండోయ్. ఈ మూడు పత్రాల్లో ఏ ఒక్కటి లేకపోయినా సంబంధిత స్థలాన్ని స్వాధీనం చేసుకునే హక్కు ప్రభుత్వానికుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement