మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టుపై రాష్ట్ర సర్కారు యోచన
భూసేకరణ సమస్య పెద్దగా లేకపోవడమే కారణం
రోడ్లు, ఫ్లైఓవర్ కూడళ్లు, మెట్రో అవసరాల కోసం బఫర్ జోన్‌లోకి..
బాపూఘాట్ సంగమం వద్ద రక్షణ శాఖ నుంచి భూములు తీసుకోవాలని నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టుపై కసరత్తు ముమ్మరం చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. తొలిదశలో బాపూఘాట్ ప్రాంతం వరకే పనులను పరిమితం చేయాలని భావిస్తోంది. నదీ తలంతోపాటు బఫర్ జోన్‌లోని నిర్మాణాల తొలగింపులో ఎదురవుతున్న సమస్యలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. నగర శివార్లలోని బాపూఘాట్ వరకు పునరుజ్జీవం, సుందరీకరణ పనులు పూర్తిచేశాక.. దానిని నమూనాగా చూపి హైదరాబాద్ నగరం నడిబొడ్డున మిగతా పనులు చేపట్టాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం.
భూసేకరణ సమస్య లేకపోవడంతో..
వికారాబాద్ అడవుల్లో జన్మంచే మూసీ నది.. ఈసీ, మూసా అనే రెండు పాయలుగా ప్రవహిస్తూ వచి్చ, లంగర్‌హౌజ్ ప్రాంతంలోని బాపూఘాట్ వద్ద సంగమిస్తుంది. ఇందులో ఈసీపై హిమాయత్‌సాగర్, మూసాపై ఉస్మాన్‌సాగర్ రిజర్వాయర్లు ఉన్నాయి. ప్రభుత్వం ప్రస్తుతం ఈ రిజర్వాయర్ల దిగువ నుంచి ఈసీ, మూసా నదుల సంగమం బాపూఘాట్ వరకు భూసేకరణ సమస్యలు పెద్దగా ఉండవని ప్రభుత్వం భావిస్తోంది. రెండు నది పాయల తీరప్రాంతం, బాపూఘాట్‌ను పర్యాటక, ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దేలా ప్రణాళికలు రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఇందుకు అనుగుణంగా విభిన్న ప్రణాళికలు, నమూనాలతో సీఎం అధ్యక్షతన మూసీ పునరుజ్జీవంపై త్వరలో జరిగే భేటీకి రావాల్సిందిగా ప్రాజెక్టు కన్సల్టెంట్లను ఆదేశించింది. నిజానికి మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు స్థితిగతులపై రెండు రోజుల క్రితం సీఎం రేవంత్ అధ్యక్షతన భేటీ జరిగింది. ప్రభుత్వ ఉన్నతాధికారులతోపాటు మూసీ రివర్‌ఫ్రంట్ కార్పొరేషన్ అధికారులు, కన్సల్టెంట్ సంస్థ మెయిన్‌హార్ట్ కన్సార్షియం ప్రతినిధులు పాల్గొన్న ఈ భేటీలో మూసీ పునరుజ్జీవం, సుందరీకరణ కోసం చేపట్టాల్సిన పనులపై చర్చించి, పలు నిర్ణయాలు తీసుకున్నారు.
భవిష్యత్ అవసరాలకు తగినట్టుగా ‘బఫర్’
మూసీకి ఇరువైపులా 50 మీటర్ల వరకు బఫర్ జోన్‌గా గుర్తించాలని ఇప్పటికే నిర్ణయించినా.. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని బఫర్ జోన్‌ను డిజైన్ చేయాలని సర్కారు భావిస్తోంది. భవిష్యత్తులో మూసీకి ఇరువైపులా రోడ్లు, వంతెనలు, భారీ కూడళ్లు, మెట్రో రైలు మార్గం వంటివి నిర్మించేందుకు వీలుగా ఇప్పుడే ప్రణాళికలు సిద్ధం చేస్తారు. బఫర్ జోన్‌లో పేరుకుపోయిన చెత్తాచెదారం, రాళ్లు, వ్యర్థాలను తొలగించి సమతలం చేస్తారు.
ప్రభుత్వ భూముల లభ్యతను దృష్టిలో పెట్టుకుని ఎక్కడికక్కడ విభిన్న డిజైన్లలో పర్యాటకులను ఆకర్షించేలా మాస్టర్ ప్లాన్ తయారు చేస్తారు. అయితే.. బాపూఘాట్ సమీపంలో ఈసీ, మూసా నదుల సంగమం తీర ప్రాంతంలో రక్షణశాఖ భూములు ఉన్నాయి. ఆ భూముల వివరాలను రెవెన్యూ విభాగం ద్వారా సేకరించి.. మూసీ అభివృద్ధి ప్రాజెక్టుకు కేటాయించేలా కేంద్రాన్ని కోరాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.
ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రంగా బాపూఘాట్
⇒ మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టులో భాగంగా బాపూ ఘాట్ ప్రాంతాన్ని పర్యాటక, ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం భావిస్తోంది. పర్యాటకులను ఆకర్షించేలా బాపూఘాట్ వద్ద స్కైవే, బ్రిడ్జితో కూడిన బరాజ్, పాదచారుల వంతెనను నిర్మించేలా నమూనాలు, ప్రణాళికలు సిద్ధం చేసే బాధ్యతను కన్సల్టెంట్‌కు అప్పగించారు. బాపూఘాట్‌కు ఉన్న చారిత్రక ప్రాధాన్యతను ప్రతి బింబించేలా ఈ డిజైన్లు, ప్రణాళికలు ఉంటాయి.
గుజరాత్‌లోని నర్మదానది వద్ద నిర్మించిన సర్దార్ వల్లభాయ్ పటేల్ భారీ విగ్రహం తరహాలో బాపూఘాట్ వద్ద మహాత్మాగాంధీ భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేయా లని భావిస్తున్నారు. ఇక ఈసీ, మూసా సంగమ ప్రదేశాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చి దిద్దేలా ప్రణాళికలు రూపొందించాలని కన్సల్టెంట్‌ను ఆదేశించారు. సంగమ స్థలం వద్ద మహాప్రస్థానం, స్నాన ఘట్టాలతో ఘాట్ల నిర్మాణం వంటి ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నాయి.
ఉస్మాన్‌సాగర్‌కు గోదావరి జలాలు
⇒ జంట జలాశయాల నుంచి బాపూఘాట్ వర కు భారీ అభివృద్ధి ప్రణాళికల నేపథ్యంలో.. అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూమి, సేకరించాల్సిన భూమిపై రెవెన్యూ శాఖ కసరత్తు చేయాల్సి ఉంది. గోదావరి జలాలను హి మాయత్‌సాగర్ మీదుగా ఉస్మాన్‌సాగర్‌కు తరలించేందుకు కాలువ తవ్వాలా లేక టన్నె ల్ నిర్మించాలా? అన్న అంశాలను తేల్చే బా ధ్యతను హైదరాబాద్ మెట్రో వాటర్ బోర్డు కు అప్పగించారు. ఈ నెల 24న జరిగిన సమావేశంలో వీటిని సమీక్షించేందుకు సీఎం రేవంత్ మరో సమావేశం ఏర్పాటు చేస్తారని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
Comments
Please login to add a commentAdd a comment