Bapughat
-
ధ్యానముద్రా?.. ‘దండి’యాత్రా?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టులో భాగంగా బాపూఘాట్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టింది. మూసా–ఈసీల సంగమ ప్రాంతమైన ఇక్కడ మహాత్ముడి భారీ విగ్రహం ఏర్పాటుతో ప్రముఖ పర్యాటక ప్రాంతంగా మార్చాలని భావి స్తోంది. ఈ విగ్రహం ఎలా ఉండాలి? మహాత్ముడు ధ్యానముద్ర లో ఉండాలా? లేక దండియాత్రకు వెళ్తున్నట్టు ఉండాలా? మరేదైనా ఆకృతిలో ఉంటే బాగుంటుందా? అన్న దానిపై పరిశీలన జరుపుతోంది. ఈ విషయంలో విస్తృత స్థాయిలో చర్చలు, సంప్రదింపులు జరపాలని.. అవసరమైతే అన్నివర్గాల మేధావులు, అన్ని పార్టీల నేతలు, ప్రజాప్రతినిధుల సలహాలు, సూచనలను స్వీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది.ఎంత ఎత్తుతో ఏర్పాటు చేద్దాం..?ప్రస్తుతం దేశంలోని మహాత్మా గాంధీ విగ్రహాల్లోకెల్లా.. బిహార్ పట్నాలోని గాంధీ మైదాన్‌లో ఉన్న 72 అడుగుల గాంధీ విగ్రహమే అత్యంత ఎత్తయినది. దానిని 2013లో కాంస్యంతో రూపొందించారు. ఇద్దరు చిన్నారులతో గాంధీ ఆప్యాయంగా ఉన్నట్టుగా ఆ విగ్రహాన్ని రూపొందించారు. ఇక గుజరాత్లో నర్మదా నది తీరాన ఏర్పాటు చేసిన సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ విగ్రహం ఎత్తు 182 అడుగులు. అది ప్రపంచంలోనే ఎత్తైన విగ్రహం కూడా. ఈ నేపథ్యంలో అంతకన్నా పెద్దదైన విగ్రహం ఏర్పాటు చేద్దామా, రాష్ట్రంలోని బాపూఘాట్లో మహాత్ముడి విగ్రహం ఎలా ఉంటే ప్రత్యేకత సంతరించుకుంటుంది? అన్న పరిశీలన జరుగుతోంది. దీనిపై సీఎం రేవంత్‌రెడ్డి స్వయంగా నమూనాలు, డిజైన్లపై సంప్రదింపులు జరుపుతున్నట్టు ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి.ప్రపంచ శాంతికి, ఆధ్మాత్మికతకు చిహ్నంగా..బాపూఘాట్‌ను సౌభ్రాతృత్వానికి సంకేతంగా, ప్రపంచ శాంతికి చిహ్నంగా, అటు ఆధ్యాత్మికంగా, ఇటు విద్యా బోధన కేంద్రంగా రూపొందించాలని సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయించారు. ప్రపంచంలోని అందరి దృష్టిని ఆకర్షించేలా బాపూఘాట్‌ను తీర్చిదిద్దాలని అధికారులకు సూచించారు. ప్రపంచంలోనే ఎత్తయిన గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని కూడా పేర్కొన్నారు. ఈ క్రమంలో బాపూఘాట్ వద్ద బ్రిడ్జి కమ్ బ్యారేజీతోపాటు గాంధీ ఐడియాలజీ సెంటర్‌ను ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఈ క్రమంలో అధికారులు బాపూఘాట్‌ను అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.దేశ విదేశాల్లోని విగ్రహాల పరిశీలనదేశ విదేశాల్లో ఎక్కడెక్కడ గాంధీ విగ్రహాలు ఉన్నాయి, ఎక్కడెక్కడ గాంధీ ఆశ్రమాలున్నాయి? ఏయే నమూనాలలో ఉన్నాయనే దానిపై వెంటనే అధ్యయనం చేయాలని సీఎం ఇప్పటికే అధికారులకు సూచించారు. సాధ్యమైనంత త్వరగా నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఈ మేరకు ప్రపంచం దృష్టిని ఆకర్షించేలా బాపూఘాట్లో ఎలాంటి విగ్రహం పెట్టాలి? మూసీ తీరంలో ఎంత ఎత్తున నిర్మించే అవకాశముందనే అంశాలను అధికారులు పరిశీలిస్తున్నారు. గాంధీ బోధనలు, ఆయన ఆచరణ, ఆశయాలను ప్రతిబింబించేలా ఐడియాలజీ సెంటర్‌తోపాటు సమాచార నైపుణ్యం, నైతికత, విలువల కోర్సులను నిర్వహించే ఎడ్యుకేషన్ హబ్‌గా గాంధీ ఆశ్రమం ఏర్పాటుకు ప్రణాళికలను రూపొందిస్తున్నారు.రాష్ట్రంలో అసెంబ్లీ ఎదుట..రాష్ట్రంలో అసెంబ్లీ ఆవరణలో ఉన్న మహాత్మా గాంధీ విగ్రహమే పెద్దది. ధ్యానముద్రలో ఉన్న ఈ విగ్రహం ఎత్తు 22 అడుగులు. ‘మైలైఫ్ ఈజ్ మై మెసేజ్’ అనే సందేశంతో కాంస్యంతో ఈ విగ్రహాన్ని రూపొందించారు. ఇక మన దేశంతోపాటు విదేశాల్లోనూ గాంధీ విగ్రహాలు ఉన్నాయి. అమెరికాలో టెక్సాస్‌లోని ఇర్వింగ్‌లో మహాత్మాగాంధీ మెమోరియల్ ప్లాజా వద్ద 8 అడుగుల కాంస్య విగ్రహం ఉంది. భారతదేశం బయట ఉన్న పెద్ద విగ్రహం అదేనని.. గాంధీ దండి మార్చ్‌కు అడుగేస్తున్న ఆకృతిలోని విగ్రహం ఆకట్టుకుంటుందని చెప్తున్నారు. -
పైసా ఖర్చు లేకుండా మూసీ పునరుజ్జీవం
సాక్షి, హైదరాబాద్: మూసీ పునరుజ్జీవంపై ప్రతిపక్ష పార్టీలు రాద్దాంతం చేస్తూ లేనిపోని ప్రచారాలతో ప్రజల మనసులను కలుíÙతం చేస్తున్నాయని సీఎం రేవంత్‌రెడ్డి విమర్శించారు. పైసా ఖర్చు లేకుండా మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు పూర్తి చేస్తామని ఆయన చెప్పారు. మంగళవారం మీడియాతో చిట్‌చాట్ సందర్భంగా ఈ ప్రాజెక్టు గురించి ముఖ్యమంత్రి మాట్లాడారు. ‘గత ప్రభుత్వం తరహాలో కాకుండా మేం ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరిస్తాం. ఏ నిర్ణయం తీసుకోవాలనుకున్నా వేయిసార్లు ఆలోచిస్తా. అలా ఆలోచించే మూసీ పునరుజ్జీవంపై నిర్ణయం తీసుకున్నా.ఇక ముందడుగే. వెనుకడుగు వేసేది లేదు. పైసా ఖర్చు లేకుండా ప్రైవేటు భాగస్వామ్యంతో పనిచేస్తాం. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఐదు సంస్థల కన్సారి్టయంకు మూసీ ప్రాజెక్టు డీపీఆర్ తయారీ బాధ్యతలు అప్పగించాం. రివర్ బెడ్ ఆర్థికంగా ఎలా ఉపయోగపడుతుందనే కోణంలో, అన్ని సాధ్యాసాధ్యాలకు సంబంధించిన అంశాలతో 18 నెలల్లో ఈ డీపీఆర్ వస్తుంది. ప్రభుత్వ, పీపీటీ, హైబ్రిడ్.. ఈ మూడు పద్ధతుల్లో వస్తుంది. దీని ఆధారంగా ప్రపంచంలోనే మేలైన మోడల్‌ను ఎంచుకుని మూసీ పునరుజ్జీవ పనులకు శ్రీకారం చుడతాం..’ అని సీఎం తెలిపారు. తొలిదశలో 21 కిలోమీటర్లు ‘తొలిదశలో బాపూఘాట్ వరకు మూసీ పునరుజ్జీవం చేపడతాం. జంట జలాశయాల నుంచి బాపూ ఘాట్ త్రివేణి సంగమం వరకు ఈ పనులు మొదలు పెడతాం. మల్లన్నసాగర్ నుంచి గండిపేట, హిమాయత్‌సాగర్‌కు గోదావరి జలాలు తరలిస్తాం. ఆలోపు వంద శాతం నీటిని శుద్ధి చేస్తాం. అక్కడికి 21 కిలోమీటర్ల మేర పునరుజ్జీవం పూర్తవుతుంది. నవంబర్ తొలివారంలో మల్లన్నసాగర్ నుంచి జంట జలాశయాలకు నీటి తరలింపు ట్రంక్ లైన్ పనులకు టెండర్లను పిలుస్తాం.బాపూఘాట్ దగ్గర బ్రిడ్జి కం బ్యారేజీ నిర్మిస్తాం. అతిపెద్ద బాపూ విగ్రహం ఏర్పాటు చేస్తాం. లండన్ ఐ (అతిపెద్ద జెయింట్ వీల్) ఏర్పాటు చేస్తాం. అక్కడి నుంచి నగరమంతా వీక్షించేలా సియోల్ టవర్ తరహాలో పెద్ద టవర్ నిర్మిస్తాం. మూసీ వెంట అంతర్జాతీయ వర్సిటీ, గాంధీ ఐడియాలజీ..రీ క్రియేషన్ సెంటర్, నేచర్ క్యూర్ సెంటర్ ఏర్పాటు చేస్తాం..’ అని రేవంత్ చెప్పారు. ప్రజలనే అడుగుదాం రండి ఈ ప్రాజెక్టుపై అనుమానాలున్నా, ప్రతిపక్షాలకు ఏదైనా ఆలోచన ఉన్నా నాకందజేయాలి. ఒకవేళ కేటీఆర్, హరీశ్, ఈటల లాంటి నేతలకు నా దగ్గరకు రావడం మొహమాటం అనిపిస్తే సీఎస్‌ను లేదంటే మంత్రులను కలిసి ఇవ్వొచ్చు. మూసీని నగర జీవనాడిగా మార్చేందుకు కలిసి రండి. వాడపల్లి నుంచి వికారాబాద్ వరకు పాదయాత్ర చేస్తా. కేటీఆర్, ఈటల, హరీశ్ కూడా నాతో కలిసి రావాలి. మూసీని అభివృద్ధి చేయాలో లేదో ప్రజలను అడుగుదాం. రూ.లక్షన్నర కోట్ల ఖర్చు కేవలం మూసీకే కాదు.. విశ్వనగర అభివృద్ధి కోసం. ట్రిపుల్ ఆర్, మెట్రో, గోదావరి జలాల తరలింపు, ఎస్టీపీల నిర్మాణం, రేడియల్ రోడ్ల అభివృద్ధికి ఈ నిధులు వెచ్చిస్తాం..’ అని ముఖ్యమంత్రి చెప్పారు. -
తొలుత బాపూఘాట్ వరకే!
సాక్షి, హైదరాబాద్: మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టుపై కసరత్తు ముమ్మరం చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. తొలిదశలో బాపూఘాట్ ప్రాంతం వరకే పనులను పరిమితం చేయాలని భావిస్తోంది. నదీ తలంతోపాటు బఫర్ జోన్‌లోని నిర్మాణాల తొలగింపులో ఎదురవుతున్న సమస్యలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. నగర శివార్లలోని బాపూఘాట్ వరకు పునరుజ్జీవం, సుందరీకరణ పనులు పూర్తిచేశాక.. దానిని నమూనాగా చూపి హైదరాబాద్ నగరం నడిబొడ్డున మిగతా పనులు చేపట్టాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం. భూసేకరణ సమస్య లేకపోవడంతో.. వికారాబాద్ అడవుల్లో జన్మంచే మూసీ నది.. ఈసీ, మూసా అనే రెండు పాయలుగా ప్రవహిస్తూ వచి్చ, లంగర్‌హౌజ్ ప్రాంతంలోని బాపూఘాట్ వద్ద సంగమిస్తుంది. ఇందులో ఈసీపై హిమాయత్‌సాగర్, మూసాపై ఉస్మాన్‌సాగర్ రిజర్వాయర్లు ఉన్నాయి. ప్రభుత్వం ప్రస్తుతం ఈ రిజర్వాయర్ల దిగువ నుంచి ఈసీ, మూసా నదుల సంగమం బాపూఘాట్ వరకు భూసేకరణ సమస్యలు పెద్దగా ఉండవని ప్రభుత్వం భావిస్తోంది. రెండు నది పాయల తీరప్రాంతం, బాపూఘాట్‌ను పర్యాటక, ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దేలా ప్రణాళికలు రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.ఇందుకు అనుగుణంగా విభిన్న ప్రణాళికలు, నమూనాలతో సీఎం అధ్యక్షతన మూసీ పునరుజ్జీవంపై త్వరలో జరిగే భేటీకి రావాల్సిందిగా ప్రాజెక్టు కన్సల్టెంట్లను ఆదేశించింది. నిజానికి మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు స్థితిగతులపై రెండు రోజుల క్రితం సీఎం రేవంత్ అధ్యక్షతన భేటీ జరిగింది. ప్రభుత్వ ఉన్నతాధికారులతోపాటు మూసీ రివర్‌ఫ్రంట్ కార్పొరేషన్ అధికారులు, కన్సల్టెంట్ సంస్థ మెయిన్‌హార్ట్ కన్సార్షియం ప్రతినిధులు పాల్గొన్న ఈ భేటీలో మూసీ పునరుజ్జీవం, సుందరీకరణ కోసం చేపట్టాల్సిన పనులపై చర్చించి, పలు నిర్ణయాలు తీసుకున్నారు. భవిష్యత్ అవసరాలకు తగినట్టుగా ‘బఫర్’ మూసీకి ఇరువైపులా 50 మీటర్ల వరకు బఫర్ జోన్‌గా గుర్తించాలని ఇప్పటికే నిర్ణయించినా.. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని బఫర్ జోన్‌ను డిజైన్ చేయాలని సర్కారు భావిస్తోంది. భవిష్యత్తులో మూసీకి ఇరువైపులా రోడ్లు, వంతెనలు, భారీ కూడళ్లు, మెట్రో రైలు మార్గం వంటివి నిర్మించేందుకు వీలుగా ఇప్పుడే ప్రణాళికలు సిద్ధం చేస్తారు. బఫర్ జోన్లో పేరుకుపోయిన చెత్తాచెదారం, రాళ్లు, వ్యర్థాలను తొలగించి సమతలం చేస్తారు.ప్రభుత్వ భూముల లభ్యతను దృష్టిలో పెట్టుకుని ఎక్కడికక్కడ విభిన్న డిజైన్లలో పర్యాటకులను ఆకర్షించేలా మాస్టర్ ప్లాన్ తయారు చేస్తారు. అయితే.. బాపూఘాట్ సమీపంలో ఈసీ, మూసా నదుల సంగమం తీర ప్రాంతంలో రక్షణశాఖ భూములు ఉన్నాయి. ఆ భూముల వివరాలను రెవెన్యూ విభాగం ద్వారా సేకరించి.. మూసీ అభివృద్ధి ప్రాజెక్టుకు కేటాయించేలా కేంద్రాన్ని కోరాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రంగా బాపూఘాట్ ⇒ మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టులో భాగంగా బాపూ ఘాట్ ప్రాంతాన్ని పర్యాటక, ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం భావిస్తోంది. పర్యాటకులను ఆకర్షించేలా బాపూఘాట్ వద్ద స్కైవే, బ్రిడ్జితో కూడిన బరాజ్, పాదచారుల వంతెనను నిర్మించేలా నమూనాలు, ప్రణాళికలు సిద్ధం చేసే బాధ్యతను కన్సల్టెంట్‌కు అప్పగించారు. బాపూఘాట్‌కు ఉన్న చారిత్రక ప్రాధాన్యతను ప్రతి బింబించేలా ఈ డిజైన్లు, ప్రణాళికలు ఉంటాయి.గుజరాత్‌లోని నర్మదానది వద్ద నిర్మించిన సర్దార్ వల్లభాయ్ పటేల్ భారీ విగ్రహం తరహాలో బాపూఘాట్ వద్ద మహాత్మాగాంధీ భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేయా లని భావిస్తున్నారు. ఇక ఈసీ, మూసా సంగమ ప్రదేశాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చి దిద్దేలా ప్రణాళికలు రూపొందించాలని కన్సల్టెంట్‌ను ఆదేశించారు. సంగమ స్థలం వద్ద మహాప్రస్థానం, స్నాన ఘట్టాలతో ఘాట్ల నిర్మాణం వంటి ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నాయి. ఉస్మాన్‌సాగర్‌కు గోదావరి జలాలు ⇒ జంట జలాశయాల నుంచి బాపూఘాట్ వర కు భారీ అభివృద్ధి ప్రణాళికల నేపథ్యంలో.. అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూమి, సేకరించాల్సిన భూమిపై రెవెన్యూ శాఖ కసరత్తు చేయాల్సి ఉంది. గోదావరి జలాలను హి మాయత్‌సాగర్ మీదుగా ఉస్మాన్‌సాగర్‌కు తరలించేందుకు కాలువ తవ్వాలా లేక టన్నె ల్ నిర్మించాలా? అన్న అంశాలను తేల్చే బా ధ్యతను హైదరాబాద్ మెట్రో వాటర్ బోర్డు కు అప్పగించారు. ఈ నెల 24న జరిగిన సమావేశంలో వీటిని సమీక్షించేందుకు సీఎం రేవంత్ మరో సమావేశం ఏర్పాటు చేస్తారని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. -
జాతిపితకు ఘన నివాళులు
లంగర్‌హౌస్‌లోని బాపూఘాట్ వద్ద గవర్నర్, సీఎం నివాళులు సాక్షి, హైదరాబాద్: జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా గవర్నర్ నరసింహన్ , ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఘనంగా నివాళులు అర్పించారు. సోమవారం హైదరాబాద్‌లోని లంగర్‌హౌస్ వద్ద ఉన్న బాపూఘాట్లో గాంధీ విగ్రహం వద్ద పూలమాలలు ఉంచి నివాళులు అర్పించారు. అనంతరం బాపూ ధ్యాన మందిరంలో జరిగిన సర్వమత ప్రార్థనల్లో పాల్గొన్నారు. ‘రఘుపతి రాఘవ రాజారాం..’ అంటూ స్కూల్ విద్యార్థులు, పెద్దలతో కలిసి గవర్నర్, ముఖ్యమంత్రి గళం కలిపారు. అనంతరం స్వాతంత్య్ర సమరయోధులను స్మరిస్తూ రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు పెద్దసంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బాపూఘాట్ వద్ద కేంద్ర మంత్రి దత్తాత్రేయ, రాష్ట్ర మంత్రులు నాయిని, తలసాని శ్రీనివాస్, పద్మారావు, ఎమ్మెల్యేలు చింతల రామచంద్రారెడ్డి, ప్రకాశ్‌గౌడ్, హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్, ప్రభుత్వ ప్రత్యేక సలహాదారు రాజీవ్‌శర్మ, దైవజ్ఞశర్మ తదితరులు నివాళులర్పించారు. ఇక గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కేసీఆర్‌లు రాకముందే సీఎల్పీ నేత జానారెడ్డి బాపూఘాట్‌కు వచ్చి నివాళులు అర్పించారు. సీఎం, గవర్నర్ వచ్చి, వెళ్లిపోయిన అనంతరం కాం గ్రెస్ నేతలు భట్టి విక్రమార్క, పొంగులేటి సుధాకర్‌రెడ్డి నివాళులు అర్పించారు. -
బాపూఘాట్ వద్ద మహాత్ముడికి కేసీఆర్ నివాళి
హైదరాబాద్ : జాతిపిత మహాత్మాగాంధీ 145వ జయంతి సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నివాళులు అర్పించారు. లంగర్‌హౌజ్‌లోని బాపూఘాట్ వద్ద కేసీఆర్.... గాంధీ విగ్రహానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో సీఎంతో పాటు గవర్నర్ నరసింహన్, మంత్రి హరీష్ రావు, డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి, మండలి డిప్యూటీ ఛైర్మన్ నేతి విద్యాసాగర్, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, బీజేపీ ఎంపీ బండారు దత్తాత్రేయ, కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. ఈసందర్భంగా కేసీఆర్ బాపూఘాట్ భూముల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.