బాపూఘాట్‌లో ‘మహాత్ముడు’ ఎలా ఉండాలి?
దేశంలో అత్యధికంగా పట్నాలోని మహాత్ముడి విగ్రహం ఎత్తు 72 అడుగులు
అంతకంటే పెద్దగానా? సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ కంటే ఎత్తైనది కడదామా?
గాంధీ విగ్రహం ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వంలో తర్జనభర్జన
దేశ, విదేశాల్లోని విగ్రహాల పరిశీలనకు నిర్ణయం
బాపూఘాట్‌లో గాంధీ ఐడియాలజీ కేంద్రం ఏర్పాటుపై కసరత్తు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టులో భాగంగా బాపూఘాట్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టింది. మూసా–ఈసీల సంగమ ప్రాంతమైన ఇక్కడ మహాత్ముడి భారీ విగ్రహం ఏర్పాటుతో ప్రముఖ పర్యాటక ప్రాంతంగా మార్చాలని భావి స్తోంది. ఈ విగ్రహం ఎలా ఉండాలి? మహాత్ముడు ధ్యానముద్ర లో ఉండాలా? లేక దండియాత్రకు వెళ్తున్నట్టు ఉండాలా? మరేదైనా ఆకృతిలో ఉంటే బాగుంటుందా? అన్న దానిపై పరిశీలన జరుపుతోంది. ఈ విషయంలో విస్తృత స్థాయిలో చర్చలు, సంప్రదింపులు జరపాలని.. అవసరమైతే అన్నివర్గాల మేధావులు, అన్ని పార్టీల నేతలు, ప్రజాప్రతినిధుల సలహాలు, సూచనలను స్వీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఎంత ఎత్తుతో ఏర్పాటు చేద్దాం..?
ప్రస్తుతం దేశంలోని మహాత్మా గాంధీ విగ్రహాల్లోకెల్లా.. బిహార్ పట్నాలోని గాంధీ మైదాన్‌లో ఉన్న 72 అడుగుల గాంధీ విగ్రహమే అత్యంత ఎత్తయినది. దానిని 2013లో కాంస్యంతో రూపొందించారు. ఇద్దరు చిన్నారులతో గాంధీ ఆప్యాయంగా ఉన్నట్టుగా ఆ విగ్రహాన్ని రూపొందించారు. ఇక గుజరాత్‌లో నర్మదా నది తీరాన ఏర్పాటు చేసిన సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ విగ్రహం ఎత్తు 182 అడుగులు. అది ప్రపంచంలోనే ఎత్తైన విగ్రహం కూడా. ఈ నేపథ్యంలో అంతకన్నా పెద్దదైన విగ్రహం ఏర్పాటు చేద్దామా, రాష్ట్రంలోని బాపూఘాట్‌లో మహాత్ముడి విగ్రహం ఎలా ఉంటే ప్రత్యేకత సంతరించుకుంటుంది? అన్న పరిశీలన జరుగుతోంది. దీనిపై సీఎం రేవంత్‌రెడ్డి స్వయంగా నమూనాలు, డిజైన్లపై సంప్రదింపులు జరుపుతున్నట్టు ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి.
ప్రపంచ శాంతికి, ఆధ్మాత్మికతకు చిహ్నంగా..
బాపూఘాట్‌ను సౌభ్రాతృత్వానికి సంకేతంగా, ప్రపంచ శాంతికి చిహ్నంగా, అటు ఆధ్యాత్మికంగా, ఇటు విద్యా బోధన కేంద్రంగా రూపొందించాలని సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయించారు. ప్రపంచంలోని అందరి దృష్టిని ఆకర్షించేలా బాపూఘాట్‌ను తీర్చిదిద్దాలని అధికారులకు సూచించారు. ప్రపంచంలోనే ఎత్తయిన గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని కూడా పేర్కొన్నారు. ఈ క్రమంలో బాపూఘాట్ వద్ద బ్రిడ్జి కమ్ బ్యారేజీతోపాటు గాంధీ ఐడియాలజీ సెంటర్‌ను ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఈ క్రమంలో అధికారులు బాపూఘాట్‌ను అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
దేశ విదేశాల్లోని విగ్రహాల పరిశీలన
దేశ విదేశాల్లో ఎక్కడెక్కడ గాంధీ విగ్రహాలు ఉన్నాయి, ఎక్కడెక్కడ గాంధీ ఆశ్రమాలున్నాయి? ఏయే నమూనాలలో ఉన్నాయనే దానిపై వెంటనే అధ్యయనం చేయాలని సీఎం ఇప్పటికే అధికారులకు సూచించారు. సాధ్యమైనంత త్వరగా నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఈ మేరకు ప్రపంచం దృష్టిని ఆకర్షించేలా బాపూఘాట్‌లో ఎలాంటి విగ్రహం పెట్టాలి? మూసీ తీరంలో ఎంత ఎత్తున నిర్మించే అవకాశముందనే అంశాలను అధికారులు పరిశీలిస్తున్నారు. గాంధీ బోధనలు, ఆయన ఆచరణ, ఆశయాలను ప్రతిబింబించేలా ఐడియాలజీ సెంటర్‌తోపాటు సమాచార నైపుణ్యం, నైతికత, విలువల కోర్సులను నిర్వహించే ఎడ్యుకేషన్ హబ్‌గా గాంధీ ఆశ్రమం ఏర్పాటుకు ప్రణాళికలను రూపొందిస్తున్నారు.
రాష్ట్రంలో అసెంబ్లీ ఎదుట..
రాష్ట్రంలో అసెంబ్లీ ఆవరణలో ఉన్న మహాత్మా గాంధీ విగ్రహమే పెద్దది. ధ్యానముద్రలో ఉన్న ఈ విగ్రహం ఎత్తు 22 అడుగులు. ‘మైలైఫ్ ఈజ్ మై మెసేజ్’ అనే సందేశంతో కాంస్యంతో ఈ విగ్రహాన్ని రూపొందించారు. ఇక మన దేశంతోపాటు విదేశాల్లోనూ గాంధీ విగ్రహాలు ఉన్నాయి. అమెరికాలో టెక్సాస్‌లోని ఇర్వింగ్‌లో మహాత్మాగాంధీ మెమోరియల్ ప్లాజా వద్ద 8 అడుగుల కాంస్య విగ్రహం ఉంది. భారతదేశం బయట ఉన్న పెద్ద విగ్రహం అదేనని.. గాంధీ దండి మార్చ్‌కు అడుగేస్తున్న ఆకృతిలోని విగ్రహం ఆకట్టుకుంటుందని చెప్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment