ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వెల్లడి
ప్రాజెక్టుపై ముందుకే..వెనక్కి తగ్గేదిలేదు
18 నెలల్లో మూడు పద్ధతుల్లో డీపీఆర్ రెడీ
మేలైన మోడల్‌ను ఎంచుకుని పనులు ప్రారంభిస్తాం
తొలిదశలో జంట జలాశయాల నుంచి బాపూఘాట్ వరకు ప్రాజెక్టు
బాపూఘాట్ వద్ద అతిఎత్తైన గాంధీ విగ్రహం, లండన్ ఐ, పెద్ద టవర్
సాక్షి, హైదరాబాద్: మూసీ పునరుజ్జీవంపై ప్రతిపక్ష పార్టీలు రాద్దాంతం చేస్తూ లేనిపోని ప్రచారాలతో ప్రజల మనసులను కలుíÙతం చేస్తున్నాయని సీఎం రేవంత్‌రెడ్డి విమర్శించారు. పైసా ఖర్చు లేకుండా మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు పూర్తి చేస్తామని ఆయన చెప్పారు. మంగళవారం మీడియాతో చిట్‌చాట్ సందర్భంగా ఈ ప్రాజెక్టు గురించి ముఖ్యమంత్రి మాట్లాడారు. ‘గత ప్రభుత్వం తరహాలో కాకుండా మేం ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరిస్తాం. ఏ నిర్ణయం తీసుకోవాలనుకున్నా వేయిసార్లు ఆలోచిస్తా. అలా ఆలోచించే మూసీ పునరుజ్జీవంపై నిర్ణయం తీసుకున్నా.
ఇక ముందడుగే. వెనుకడుగు వేసేది లేదు. పైసా ఖర్చు లేకుండా ప్రైవేటు భాగస్వామ్యంతో పనిచేస్తాం. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఐదు సంస్థల కన్సారి్టయంకు మూసీ ప్రాజెక్టు డీపీఆర్ తయారీ బాధ్యతలు అప్పగించాం. రివర్ బెడ్ ఆర్థికంగా ఎలా ఉపయోగపడుతుందనే కోణంలో, అన్ని సాధ్యాసాధ్యాలకు సంబంధించిన అంశాలతో 18 నెలల్లో ఈ డీపీఆర్ వస్తుంది. ప్రభుత్వ, పీపీటీ, హైబ్రిడ్.. ఈ మూడు పద్ధతుల్లో వస్తుంది. దీని ఆధారంగా ప్రపంచంలోనే మేలైన మోడల్‌ను ఎంచుకుని మూసీ పునరుజ్జీవ పనులకు శ్రీకారం చుడతాం..’ అని సీఎం తెలిపారు.
తొలిదశలో 21 కిలోమీటర్లు
‘తొలిదశలో బాపూఘాట్ వరకు మూసీ పునరుజ్జీవం చేపడతాం. జంట జలాశయాల నుంచి బాపూ ఘాట్ త్రివేణి సంగమం వరకు ఈ పనులు మొదలు పెడతాం. మల్లన్నసాగర్ నుంచి గండిపేట, హిమాయత్‌సాగర్‌కు గోదావరి జలాలు తరలిస్తాం. ఆలోపు వంద శాతం నీటిని శుద్ధి చేస్తాం. అక్కడికి 21 కిలోమీటర్ల మేర పునరుజ్జీవం పూర్తవుతుంది. నవంబర్ తొలివారంలో మల్లన్నసాగర్ నుంచి జంట జలాశయాలకు నీటి తరలింపు ట్రంక్ లైన్ పనులకు టెండర్లను పిలుస్తాం.
బాపూఘాట్ దగ్గర బ్రిడ్జి కం బ్యారేజీ నిర్మిస్తాం. అతిపెద్ద బాపూ విగ్రహం ఏర్పాటు చేస్తాం. లండన్ ఐ (అతిపెద్ద జెయింట్ వీల్) ఏర్పాటు చేస్తాం. అక్కడి నుంచి నగరమంతా వీక్షించేలా సియోల్ టవర్ తరహాలో పెద్ద టవర్ నిర్మిస్తాం. మూసీ వెంట అంతర్జాతీయ వర్సిటీ, గాంధీ ఐడియాలజీ..రీ క్రియేషన్ సెంటర్, నేచర్ క్యూర్ సెంటర్ ఏర్పాటు చేస్తాం..’ అని రేవంత్ చెప్పారు.
ప్రజలనే అడుగుదాం రండి
ఈ ప్రాజెక్టుపై అనుమానాలున్నా, ప్రతిపక్షాలకు ఏదైనా ఆలోచన ఉన్నా నాకందజేయాలి. ఒకవేళ కేటీఆర్, హరీశ్, ఈటల లాంటి నేతలకు నా దగ్గరకు రావడం మొహమాటం అనిపిస్తే సీఎస్‌ను లేదంటే మంత్రులను కలిసి ఇవ్వొచ్చు. మూసీని నగర జీవనాడిగా మార్చేందుకు కలిసి రండి. వాడపల్లి నుంచి వికారాబాద్ వరకు పాదయాత్ర చేస్తా. కేటీఆర్, ఈటల, హరీశ్ కూడా నాతో కలిసి రావాలి. మూసీని అభివృద్ధి చేయాలో లేదో ప్రజలను అడుగుదాం. రూ.లక్షన్నర కోట్ల ఖర్చు కేవలం మూసీకే కాదు.. విశ్వనగర అభివృద్ధి కోసం. ట్రిపుల్ ఆర్, మెట్రో, గోదావరి జలాల తరలింపు, ఎస్టీపీల నిర్మాణం, రేడియల్ రోడ్ల అభివృద్ధికి ఈ నిధులు వెచ్చిస్తాం..’ అని ముఖ్యమంత్రి చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment