సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాల్లో పక్కా రోడ్లు నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.2 వేల కోట్లు మంజూరు చేసిందని, ఈ పనులకు సంబంధించిన అనుమతులు తాజాగా జారీ అయ్యాయని గిరిజన, మహిళాభివృద్ధి శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ వెల్లడించారు. ఈ రోడ్లతో గిరిజన ప్రాంతాల రూపురేఖలు మారిపోతాయని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. గిరిజన ప్రాంతాల్లో 1,179 రోడ్ల నిర్మాణ పనులను ఈ నిధులతో చేపడతామన్నారు. మొత్తం 3,152.41 కిలోమీటర్ల మేర పనులకు త్వరలో టెండర్లు పూర్తి చేస్తామని, వెనువెంటనే పనులు ప్రారంభించి ఈ ఏడాది చివరికల్లా పూర్తి చేస్తామని మంత్రి వెల్లడించారు.
గిరిజన సంక్షేమ శాఖ ద్వారా తలపెట్టిన కార్యక్రమాలను శనివారం జరిగిన మీడియా సమావేశంలో మంత్రి వివరించారు. రాష్ట్రంలోని ప్రతి యూనివర్సిటీ క్యాంపస్‌లో గిరిజన సంక్షేమ శాఖ ప్రత్యేకంగా గిరిజన బాలబాలికల వసతి గృహాలను నిర్మించనుందని తెలిపారు. ఇప్పటికే వరంగల్ కాకతీయ యూనివర్సిటీ పరిధిలో 500 మంది విద్యార్థులకు సరిపడేలా హాస్టళ్లను నిర్మిస్తున్నామన్నారు. 3,467 గిరిజన ఆవాసాలకు రూ.324 కోట్లు ఖర్చు చేసి త్రీఫేజ్ విద్యుత్ సౌకర్యం కల్పించడంతో దాదాపు 2.4 లక్షల ఎకరాలకు సాగునీటి సౌకర్యం కలిగిందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 11లక్షల ఎకరాల పోడు భూములకు సంబంధించి 4 లక్షల దరఖాస్తులు వచ్చాయని, వాటి పరిశీలన ప్రక్రియ తుది దశకు చేరిందని వెల్లడించారు.
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు త్వరలో పోడు భూముల పట్టాలకు సంబంధించి నిర్ణయం తీసుకుంటాయని, ఆ తర్వాత వెంటనే పట్టాలు పంపిణీ చేసేందుకు గిరిజన సంక్షేమ శాఖ సిద్ధంగా ఉందని చెప్పారు. రాష్ట్రంలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటుకు పార్లమెంటు చట్టం చేసినప్పటికీ ఇప్పటికీ అందుబాటులోకి రాకపోవడం బాధాకర మన్నారు. గిరిజన వర్సిటీ ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 4 వందల ఎకరాల భూమి అప్పగించిందని, దీనితో పాటు భవనాలు, ఇతర వసతులను కూడా కల్పించి హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయానికి బాధ్యతలు అప్పగించిందన్నారు.
ఇదంతా పూర్తయి దాదాపు మూడు సంవత్సరాలు గడిచినా ఇప్పటికీ తరగతులు ప్రారంభం కాకపోవడంతో గిరిజన బిడ్డలు ఉన్నత చదువులకు నోచుకోలేకపోతున్నారని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి క్రిస్టినా జెడ్ చొంగ్తు, ట్రైకార్ చైర్మన్ రామచంద్రనాయక్, జీసీసీ చైర్మన్ రమావత్ వాల్యా నాయక్, గిరిజన సంక్షేమ శాఖ అదనపు కార్యదర్శి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment