
జలవిధానానికి తుది మెరుగులు
అధికారులతో మంత్రి హరీశ్‌రావు సమావేశం
సాక్షి, హైదరాబాద్: కృష్ణా, గోదావరి నదీ జలాల్లో నిర్ణీత వాటా నీటిని పూర్తిస్థాయిలో వినియోగంలోకి తెచ్చేలా రాష్ట్ర ప్రభుత్వ నూతన జల విధానం సిద్ధమవుతోంది. ప్రతి నియోజకవర్గానికీ లక్ష ఎకరాలకు నీరిచ్చేలా జిల్లాల వారీగా జలవిధానం ప్రకటించాలని ప్రభుత్వం భావిస్తోంది. గోదావరి ఉపనదుల్లో లభ్యతగా ఉన్న సుమారు 600 టీఎంసీల నీటి వినియోగం, బ్యారేజీలు, చెక్‌డ్యామ్‌లు నిర్మించడమే లక్ష్యంగా జలవిధానం తయారవుతోంది.
ప్రాజెక్టుల నిర్మాణం, భూసేకరణ, పరిహారం, చిన్ననీటి వనరుల పునరుద్ధరణకు నిధుల కేటాయింపు, ఆయకట్టుకు నీటి సరఫరాపై స్పష్టతనివ్వనుంది. అసెంబ్లీలో సీఎం కేసీఆర్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా దీన్ని వివరించనున్నారు. దీని కంటే ముందు సీఎం ఇరిగేషన్ సీఈలు, ఎస్‌ఈలతో భేటీ అయ్యే అవకాశముంది. ఈ నేపథ్యంలో ఇరిగేషన్ శాఖ మంత్రి టి.హరీశ్‌రావు బుధవారం అధికారులతో నీటి పారుదల శాఖ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు.