water policy
-
కరువుపై వామపక్షాల ఉద్యమం
* నేటితో ముగియనున్న సీపీఎం పాదయాత్రలు * సోమ, మంగళవారాల్లో జిల్లాల్లో నిరసనలు * 16 నుంచి 18 తేదీల్లో సీపీఐ కరువు పరిశీలన * ఆ తర్వాత కలెక్టరేట్ల ముట్టడి, చలో సెక్రటేరియట్ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ప్రభుత్వం వెంటనే కరువు సహాయక చర్యలు చేపట్టేలా ఒత్తిడి తెచ్చేందుకు వామపక్షాలు ఉద్యమించనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా తీవ్రమైన కరువు తాండవిస్తున్న దృష్ట్యా ప్రజలను ఆదుకునేందుకు యుద్ధప్రాతిపదికన ప్రభుత్వం చర్యలు తీసుకునేలా కార్యాచరణను చేపట్టాలని లెఫ్ట్ పార్టీలు నిర్ణయించాయి. ఇప్పటికే సీపీఎం ఈ నెల 4 నుంచి 10 వరకు జిల్లాల్లో పాదయాత్రలు, ఇతరత్రా రూపాల్లో కరువు పరిశీలనను చేపట్టింది. సోమ, మంగళవారాల్లో మండల, జిల్లా స్థాయిల్లో ఎక్కడికక్కడ నిరసనలు చేపట్టాలని నిర్ణయించింది. సీపీఐ జిల్లా పర్యటనలు.. రాష్ట్రంలోని 9 జిల్లాల్లోని కరువు పరిస్థితులను పార్టీపరంగా స్వయంగా పరిశీలించేందుకు సీపీఐ నాయకత్వం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులతో మూడు బృందాలను ఏర్పాటు చేసింది. ఈ నెల 16, 17, 18 తేదీల్లో రోజుకో జిల్లా చొప్పున ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో పార్టీ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, అజీజ్‌పాషా, గుండా మల్లేశ్, నల్లగొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో ఎమ్మెల్యే రవీంద్రకుమార్, పల్లా వెంకటరెడ్డి, కూనంనేని సాంబశివరావు, మెదక్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఈర్ల నర్సింహా, పశ్య పద్మ పర్యటించనున్నారు. జిల్లా పర్యటనలు ముగిశాక ఈ నెల 20, 21 తేదీల్లో మండల కేంద్రాల్లో... ఈనెల 22న లేదా 25న జిల్లా కలెక్టర్ల ఎదుట ఆందోళన నిర్వహించాలని సీపీఐ నిర్ణయించింది. ఆ తర్వాత చలో సెక్రటేరియట్ కార్యక్రమం చేపట్టాలని భావిస్తోంది. జలవిధానంపై పార్టీ కమిటీ... రాష్ట్రంలోని ప్రాజెక్టులపై అధ్యయనం చేసి పార్టీపరంగా జలవిధానాన్ని రూపొందించేందుకు కూనంనేని సాంబశివరావు, పశ్య పద్మ, ఈర్ల నర్సింహాతో సీపీఐ ఒక కమిటీని నియమించింది. ఇదివరకే పార్టీ ఆధ్వర్యంలో కృష్ణా, గోదావరి నదులపై ప్రాజెక్టుల సందర్శనను పూర్తి చేసిన నేపథ్యంలో ఈ అధ్యయనానికి ఆయా అంశాలను జోడించి పది రోజుల్లో జలవిధానంపై ఒక పుస్తకాన్ని సిద్ధం చేయాలని నిర్ణయించింది. -
నిలువుటద్దంలా జల విధానం: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: శాసనసభలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆవిష్కరించిన తెలంగాణ జల విధానం రైతాంగం పట్ల ఆయనకున్న నిబద్ధతకు అద్దం పట్టిందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు. సాగునీటి ప్రాజెక్టులపై సీఎం కేసీఆర్ గురువారం ఇచ్చిన ప్రజెంటేషన్ గురించి మంత్రి కేటీఆర్ స్పందిస్తూ.. తెలంగాణ రైతుల ఆకాంక్షలను ముఖ్యమంత్రి ప్రసంగం ఆవిష్కరించిందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే రైతాంగానికి కలిగే ప్రయోజనాల గురించి గత దశాబ్ద కాలంగా ఉద్యమ నాయకుడిగా వివరిస్తూ వచ్చిన ఆయన సీఎంగా లక్ష్యాన్ని సాధిం చడానికి ముందుకెళుతున్నారని చెప్పారు. -
ప్రతిపక్షాలు వచ్చినా.. రాకున్నా ప్రజెంటేషన్
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో రేపు ( గురువారం) జలవిధానంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ఈ సందర్భంగా అసెంబ్లీలో స్క్రీన్ల ఏర్పాటుకు స్పీకర్ మధుసూదనాచారి అనుమతినిచ్చినట్టు తెలిసింది. అసెంబ్లీ గ్యాలరీ ద్వారా ఎమ్మెల్సీలు ప్రజెంటేషన్ వీక్షించేలా మరో స్క్రీన్ ఏర్పాటు చేయనున్నారు. అధికార పక్షం, ప్రతిపక్షాల వైపు, స్పీకర్ వైపు స్క్రీన్లను ఏర్పాటు చేయనున్నారు. జూబ్లీహాల్లోనూ ప్రత్యేకంగా ఓ స్క్రీన్ ఏర్పాటు చేయనున్నారు. కాగా, ఈ నేపథ్యంలో అసెంబ్లీకి ప్రతిపక్షాలు వచ్చినా.. రాకున్నా ప్రజెంటేషన్ ఇవ్వాలని కేసీఆర్ నిర్ణయించినట్టు సమాచారం. -
31న జలవిధానంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్
హైదరాబాద్: ఈ నెల 31వ తేదీ వరకూ తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో అదే రోజున జలవిధానంపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. అయితే సభలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడానికి విపక్షాలు అంగీకరించటలేదు. సభ బయట పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత సభలో చర్చించాలని విపక్షాలు పట్టబడుతున్నాయి. ఈ అంశంపై తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి తుది నిర్ణయాన్ని తీసుకోనున్నారు. ఈ నెల 29న ఎమ్మెల్యేల జీతాల పెంపు, ట్రిపుల్ ఐటీ, అంబేడ్కర్ ఓపెన్ వర్సిటీ బిల్లు, తెలంగాణ వ్యవసాయ మార్కెట్ బిల్లు వంటి అంశాలపై చర్చించనున్నట్టు తెలుస్తోంది. ఈ నెల 30న ఉదయం కరవు, హైదరాబాద్‌కు నీటి సరఫరాపై చర్చ జరుపనున్నారు. -
ఎమ్మెల్యేల కోసం జబర్దస్త్.. జలపాఠం!
- ఈ నెల 30 లేదా 31 తేదీల్లో ప్రకటించనున్న ముఖ్యమంత్రి - అసెంబ్లీ, మండలిలో వేర్వేరుగా జల విధానం ప్రకటన - తర్వాత అఖిలపక్ష భేటీలో పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ - జల విధానంలో ప్రాజెక్టుల రీ డిజైనింగ్.. కొత్త లక్ష్యాల విశ్లేషణ - జిల్లాలవారీగా ప్రణాళికల తయారీ.. కృష్ణా, గోదావరిలో మన వాటాను సంపూర్ణంగా వాడుకోవడమే లక్ష్యం - ప్రతి నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగునీరు - ప్రెజెంటేషన్‌లో అన్ని అంశాలను సమగ్రంగా వివరించండి అధికారులకు సీఎం దిశానిర్దేశం సాక్షి, హైదరాబాద్: కృష్ణా, గోదావరి నదీ జలాల్లో రాష్ట్రానికి ఉన్న నిర్ణీత వాటాలను సంపూర్ణంగా వినియోగంలోకి తెచ్చేలా ప్రభుత్వం సాగునీటి జల విధాన ప్రణాళికను సిద్ధం చేసింది. ప్రతి నియోజకవర్గంలో లక్ష ఎకరాల భూమిని సాగులోకి తేవడమే లక్ష్యంగా జిల్లాల వారీగా ప్రణాళిక రూపొందించింది. ఈ సమగ్ర జల విధానాన్ని త్వరలోనే ఆవిష్కరించనుంది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సూచనల మేరకు ఇరిగేషన్ విభాగం ఇందుకు సంబంధించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌ను సిద్ధం చేసింది. దాదాపు వందకుపైగా టెంప్లెట్లతో ఈ ప్రజెంటేషన్‌ను తయారుచేసింది. రాష్ట్ర భౌగోళిక పరిస్థితులతోపాటు హైదరాబాద్ రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రంలో విలీనమైనప్పుడు సాగునీటి ప్రాజెక్టులకు జరిగిన అన్యాయాన్ని ఇందులో చూపింది. దీంతోపాటు తెలంగాణ ప్రాజెక్టులపై నిర్లక్ష్యం, నిరాదరణను ప్రస్తావించింది. ప్రాజెక్టులను ఎందుకు రీడిజైన్ చేయాల్సి వచ్చిందనే అంశాన్ని ఉటంకించింది. జిల్లాల వారీగా ఆయకట్టు వివరాలు, ప్రాజెక్టుల అంచనా వ్యయం, కొత్తగా సమకూరే ఆయకట్టు, ఎత్తిపోతల పథకాలకు అవసరమయ్యే విద్యుత్ అవసరాలను అందులో పేర్కొన్నారు. వీటితో పాటు జిల్లాల వారీగా ప్రాజెక్టులు, వాటి పరిధిలోని ఆయకట్టు, కొత్త ప్రాజెక్టులు, రీడిజైనింగ్ ద్వారా ఒనగూరే ప్రయోజనాలను విడివిడిగా సమగ్రంగా విశ్లేషించింది. రీడిజైనింగ్ ఎందుకంటే..? ప్రాజెక్టుల రీడిజైనింగ్ అవశ్యకతను జలవిధానంలో వివరించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గోదావరి, కృష్ణా జలాలను నేరుగా లేదా పరోక్షంగా మళ్లించుకునే ఆలోచనతోనే ప్రాణహిత-చేవెళ్ల, దేవాదుల, కంతనపల్లి, దుమ్ముగూడెం-నాగార్జునసాగర్ టెయిల్‌పాండ్ ప్రాజెక్టులు తలపెట్టాయని అందులో పేర్కొన్నారు. భవిష్యత్తులో ఎప్పటికీ ఈ ప్రాజెక్టులు పూర్తవకుండా అంతర్రాష్ట్ర వివాదాలు, చిక్కులతో ముడిపెట్టి జటిలం చేశారని వివరించారు. ప్రాణహిత- చేవెళ్ల, కంతనపల్లి ప్రాజెక్టుల ముంపు ప్రాంతం, హద్దులపై పొరుగు రాష్ట్రంతో సంప్రదించకుండానే నిర్ణయించుకున్నారన్నారు. ఎత్తిపోతలకు అవసరమయ్యే నీరు అందుబాటులో ఉంటుందా.. ఏడాదిలో ఎంత కాలం నీరు నిల్వ ఉంటుందనే కనీస అంచనా లేకుండానే దేవాదులకు డిజైన్ చేశారని పేర్కొన్నారు. మొత్తమ్మీద రాష్ట్ర వాటా కింద ఉన్న ప్రతి నీటి చుక్కను ఆయకట్టుకు మళ్లించడం, అవసరాలకు తగ్గట్టుగా నిల్వ చేసుకునేలా ప్రణాళిక రూపొందించింది. ఎంసీహెచ్ఆర్డీలో ప్రజెంటేషన్ ఈ నెల 30 లేదా 31వ తేదీల్లో అసెంబ్లీలో ఉభయ సభల సంయుక్త సమావేశం ఏర్పాటు చేసి జల విధానాన్ని ఆవిష్కరించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ భావించారు. కానీ నిబంధనల దృష్ట్యా ఉభయ సభల సమావేశం వీలుకాక పోవడంతో అసెంబ్లీ, మండలిలో జల విధానంపై వేర్వేరుగా ప్రకటనలు చేయాలని నిర్ణయించారు. తర్వాత ఎంసీహెచ్ఆర్డీలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేలా కార్యాచరణ రూపొందించారు. అన్ని పార్టీల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు అఖిలపక్ష నేతలను దీనికి ఆహ్వానించే అవకాశం ఉంది. గత అసెంబ్లీ సమావేశాల సందర్భంలోనే జల విధానాన్ని ప్రకటించాలని ప్రభుత్వం భావించింది. కానీ ప్రతిపక్షాలు రైతు రుణమాఫీ అంశంపై సభకు అడ్డుపడటం, ఉభయ సభల సమావేశంపై మల్లగుల్లాలతో వెనక్కి తగ్గింది. అన్ని అంశాలను ప్రజల ముందుంచండి రాష్ట్ర జల విధానం ప్రకటించనున్న నేపథ్యంలో శుక్రవారం ముఖ్యమంత్రి కేసీఆర్ క్యాంపు కార్యాలయంలో నీటి పారుదల శాఖ అధికారులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈఎన్సీ మురళీధర్, విజయ్ప్రకాశ్తోపాటు ప్రాణహిత సీఈ హరిరామ్, కాళేశ్వరం సీఈ వెంకటేశ్వర్లు, ఎస్సారెస్పీ సీఈ శంకర్‌తోపాటు ఇతర శాఖల అధికారులు హాజరయ్యారు. కాళేశ్వరం, ప్రాణహిత, తుపాకులగూడెం బ్యారేజీలకు త్వరగా టెండర్లు పిలవాలని సీఎం ఈ సందర్భంగా అధికారులకు సూచించారు. ఇప్పటికే నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులతోపాటు కొత్త వాటిని నిర్మించి మొత్తంగా 1.12 కోట్ల ఎకరాలకు నీరివ్వాలని, తద్వారా ప్రతి నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు నీరిచ్చేలా కార్యాచరణ ఉండాలని సూచించారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు రీ డిజైనింగ్‌లో భాగంగా చేపట్టిన కాళేశ్వరం ఎత్తిపోతల ద్వారా ఇప్పటికే ఉన్న నిర్ణీత 16.4 లక్షల ఎకరాల ఆయకట్టుతో పాటు శ్రీరాంసాగర్, సింగూరు, నిజాంసాగర్ ఆయకట్టుకు నీరందించే ప్రణాళికను ప్రజల ముందు పెట్టాలని సీఎం సూచించినట్లు సమాచారం. ప్రాణహిత ద్వారా ఆదిలాబాద్ జిల్లాలో గతంలో నిర్ణయించిన 56 వేల ఎకరాల కన్నా అధికంగా 1.44 లక్షల ఎకరాలకు నీరందించే ప్రణాళికలను వివరించాలన్నారు. చొక్కారావు దేవాదుల ప్రాజెక్టు ఆయకట్టును ఇందిరమ్మ వరద కాల్వ(ఎఫ్ఎఫ్సీ) పరిధిలోకి తెచ్చేందుకు కారణాలేమిటీ, దేవాదుల కింద నిర్ణయించిన ఆయకట్టులోంచి 1.90 లక్షల ఎకరాలను వరద కాల్వలోకి ఎలా మారుస్తారో స్పష్టంగా తెలియజేయాలని సమావేశంలో నిర్ణయించారు. కంతనపల్లికి ప్రత్యామ్నాయంగా వచ్చిన తుపాకులగూడెం ప్రాజెక్టుతో ఎస్సారెస్పీ ఆయకట్టు స్థిరీకరణ, 50 టీఎంసీలను హైదరాబాద్ తాగునీటి అవసరాలకు మళ్లించుకునే అవకాశాలను ప్రజెంటేషన్‌లో పొందుపరచాలని సీఎం అధికారులకు సూచించారు. గవర్నర్‌తో సీఎం భేటీ సీఎం కేసీఆర్ గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్‌తో భేటీ అయ్యారు. శుక్రవారం మధ్యాహ్నం రాజ్‌భవన్‌కు వెళ్లిన సీఎం దాదాపు రెండు గంటల పాటు గవర్నర్‌తో సమావేశమయ్యారు. బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న తీరు, రాష్ట్రంలో తాజా పరిస్థితులు, సమగ్రజల విధానంపై వీరిరువురు చర్చించినట్లు సమాచారం. ఇటీవల కంటి ఆపరేషన్ చేయించుకున్న గవర్నర్ సతీమణి విమలా నరసింహన్‌ను ఈ సందర్భంగా సీఎం పరామర్శించినట్లు తెలిసింది. -
పవర్ పాయింట్ ప్రజంటేషన్పై కేసీఆర్ పునరాలోచన
హైదరాబాద్ : తెలంగాణ సమగ్ర జల వినయోగంపై అసెంబ్లీ వేదికగా నదీ జలాలు, నీటి వాటాలు, సాగునీటి ప్రాజెక్టులపై ప్రత్యేకంగా రూపొందించిన పవర్‌పాయింట్ ప్రజెంటేషన్‌పై ముఖ్యమంత్రి కేసీఆర్ పునరాలోచనలో పడినట్లు సమాచారం. విపక్షాలు అడ్డుకుంటే తెలంగాణ జల విధాన ప్రకటన ముందుకు సాగదని ప్రభుత్వం యోచిస్తోంది. దీంతో ప్రజలకు నేరుగా చేరేలా ప్రత్యామ్నాయ మార్గాలపై కసరత్తు చేస్తోంది. సంయుక్త సమావేశానికి బదులుగా మీడియా ద్వారా ప్రజెంటేషన్ ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. -
పవర్ పాయింట్ ప్రజంటేషన్పై కేసీఆర్ పునరాలోచన
-
అసెంబ్లీలో అరుదైన సంఘటన!
-
అసెంబ్లీ వేదికగా జల విధానం
- 8 లేదా 9న ఉభయ సభల సంయుక్త సమావేశం - భేటీలో పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఆవిష్కరించనున్న సీఎం - గవర్నర్‌తో ముఖ్యమంత్రి భేటీ.. జలవిధానంపై వివరణ - గంటన్నరపాటు ప్రాజెక్టులు, చేయబోయే మార్పులపై విశ్లేషణ - గోదావరి, కృష్ణాలో తెలంగాణకు 1,250 టీఎంసీల వాటా ఉంది - వాటన్నింటినీ వినియోగంలోకి తెస్తేనే సమస్యలు తీరతాయి - ఐదేళ్లలో ప్రాణహిత పూర్తి.. చేవెళ్లకు నీళ్లు ఇవ్వడం సాధ్యం కాదు - కృష్ణాపై ఎగువ రాష్ట్రాల అడ్డుకట్టలపై గవర్నర్ ఆశ్చర్యం! సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ వేదికగా ఉభయసభల సమావేశం ఏర్పాటు చేసి తెలంగాణ సమగ్ర జల వినియోగ విధానాన్ని ప్రకటించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. నదీ జలాలు, నీటి వాటాలు, సాగునీటి ప్రాజెక్టులపై ప్రత్యేకంగా రూపొందించిన పవర్‌పాయింట్ ప్రజెంటేషన్‌ను ఈ నెల 8 లేదా 9న సభలో ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సంయుక్త సమావేశం ఏర్పాటు చేసేందుకు గవర్నర్ అనుమతి తీసుకోవటం తప్పనిసరి. సాధారణంగా బడ్జెట్ సమావేశాల తొలిరోజు, కొత్త ప్రభుత్వాలు ఏర్పడ్డ తర్వాత జరిగే మొదటి సమావేశాల మొదటి రోజున ఉభయసభలు (శాసనసభ, శాసనమండలి) సంయుక్తంగా సమావేశమవుతాయి. ఆ సందర్భంగా సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించటం ఆనవాయితీ. కానీ ప్రాధాన్యం ఉన్న అంశాలు, బిల్లులపై చర్చించేందుకు ఉభయసభల సమావేశం అవసరమని మంత్రిమండలి నిర్ణయిస్త్తే.. స్పీకర్ అనుమతితో పాటు గవర్నర్‌కు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. శుక్రవారం సీఎం కేసీఆర్.. గవర్నర్‌తో సమావేశమై సంయుక్త సమావేశాల ఏర్పాటుపై చర్చించినట్లు తెలిసింది. ఈ మేరకు సమాచారం ఇవ్వటంతోపాటు సమావేశాలకు రావాలని గవర్నర్‌ను ఆహ్వానించినట్లు సమాచారం. కొత్తగా ఏర్పడ్డ తెలంగాణతోపాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గతంలో ప్రత్యేక అంశంపై సంయుక్త సమావేశాలు జరిగిన సందర్భాలు లేవు. దీంతో తెలంగాణ జల విధాన ప్రకటనకు ఏర్పాటు చేసే ఉభయ సభల సంయుక్త సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇదిగో జల విధానం తెలంగాణ సమగ్ర జల విధానాన్ని గవర్నర్ నరసింహన్ ముందు సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి లక్ష ఎకరాల సాగునీటిని అందించేందుకు ఏయే ప్రాజెక్టులు చేపట్టాలి, సమైక్య పాలనలో తెలంగాణలోని ప్రాజెక్టులు ఎందుకు ముందుకు సాగలేదు, ఆగిపోయిన ప్రాజెక్టుల డిజైన్లను ఎలా మార్పు చేయాలి, ప్రాణహిత-చేవెళ్ల, పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టుల డిజైన్ ఎలా మారిస్తే ప్రయోజనం.. వంటి కీలకాంశాలను సచిత్రంగా, గ్రాఫిక్ డిజైన్లు, గూగుల్ మ్యాప్‌లతో రూపొందించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. గంటన్నరపాటు ప్రజెంటేషన్ ఇచ్చారు. గోదావరి, కృష్ణా నీటి వాటాల విషయంలో గతంలో జరిగిన అన్యాయాన్ని వివరించటంతోపాటు తెలంగాణకు ఉన్న నీటి వాటాలను సద్వినియోగం చేసుకునేందుకు చేపడుతున్న భవిష్యత్తు ప్రణాళికలను విశదీకరించారు. ఎంపీ కె.కేశవరావు, ఢిల్లీలో ప్రభుత్వ ప్రతినిధి వేణుగోపాలచారి, మాజీ ఎమ్మెల్యే హరీశ్వర్‌రెడ్డి, నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్కే జోషి, ఇరిగేషన్ విభాగం అధికారులు ఈ భేటీలో పాల్గొన్నారు. గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయి.. గోదావరి, కృష్ణాలో తెలంగాణకు 1,250 టీఎంసీల నీటి వాటా ఉందని, ఈ నీటిని వినియోగంలోకి తెచ్చుకుంటేనే తెలంగాణ సాగునీటి సమస్యలు తీరుతాయని గవర్నర్‌కు సీఎం వివరించారు. అందుకే కొన్నిచోట్ల ప్రాజెక్టుల రీ ఇంజనీరింగ్, కొన్నిచోట్ల నీటి నిల్వ సామర్థ్యం పెంచే బ్యారేజీల నిర్మాణం చేపడుతున్నట్లు చెప్పారు. ‘‘గత ప్రభుత్వాలు సాగునీటి రంగాన్ని నిర్లక్ష్యం చేశాయి. పర్యావరణ అనుమతులు లేకుండా, భూసేకరణ చేయకుండానే ప్రాజెక్టులు ప్రారంభించారు. దీంతో ఒక్కటి కూడా ముందుకు సాగలేదు. పదేళ్లుగా 25 ప్రాజెక్టులు అసంపూర్తిగానే ఉన్నాయి. కాగితాలపై నిధులు ఖర్చు చేసినట్లు కనబడుతున్నా.. ఒక్క జిల్లాలోనూ ఆయకట్టు ప్రయోజనాలు సిద్ధించలేదు. ప్రాజెక్టులపై పొరుగు రాష్ట్రాలతో వివాదాలను చర్చలతో పరిష్కరించాల్సి ఉన్నా పట్టించుకోలేదు. అందుకే చిక్కుల్లేకుండా వీటిని పూర్తి చేసుకోవాల్సి ఉంది. అందుకే జిల్లాల వారీగా జల విధానం తీసుకు వస్తున్నాం. ప్రాజెక్టుల రీ ఇంజనీరింగ్ చేస్తున్నాం’’ అని పేర్కొన్నారు. అయిదేళ్లలో ప్రాణహిత ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును అయిదేళ్లలో పూర్తి చేసే లక్ష్యంతో రీ ఇంజనీరింగ్ చేస్తామని సీఎం స్పష్టంచేశారు. ‘‘గతంలో ఈ ప్రాజెక్టును ప్రతిపాదించిన తుమ్మిడిహెట్టి ప్రాంతంలో నిర్ణీత 160 టీఎంసీల నీటి లభ్యత లేదు. కేంద్ర జలసంఘం ఈ విషయాన్ని ఇప్పటికే స్పష్టంగా తెలియజేసింది. తుమ్మిడిహెట్టిలో బ్యారేజీ నిర్మాణంపై పొరుగున ఉన్న మహారాష్ట్రతో వివాదం నెలకొంది. అందుకే ప్రత్యామ్నాయంగా ఇంద్రావతి, ప్రాణహిత నీటిని వినియోగించుకునేలా మేడిగడ్డ, ఇచ్చంపల్లి ప్రాంతాల వద్ద బ్యారేజీ నిర్మాణానికి సర్వే చేస్తున్నాం. ఇది పూర్తయిన వెంటనే అయిదేళ్లలో ప్రాజెక్టును పూర్తి చేసేలా ముందుకు కదులుతాం’’ అని తెలిపారు. చేవెళ్ల నేతలది రాజకీయం ప్రాణహిత నీటిని చేవెళ్ల ప్రాంతానికి ఇవ్వటం సాధ్యం కాదని గవర్నర్‌కు కేసీఆర్ స్పష్టం చేశారు. గూగుల్ మ్యాప్ ద్వారా బ్యారేజీ నుంచి ఉండే దూరం, లిఫ్ట్‌ల వినియోగం, సముద్ర నీటిమట్టంతో పోలిస్తే ఏ ప్రాంతం ఎంత ఎత్తున ఉన్నది, పర్యావరణ అడ్డంకులెన్ని ఉన్నాయన్న అంశాలను ప్రజెంటేషన్‌లో చూపించారు. రంగారెడ్డి జిల్లాలోని ఈ ప్రాంతాన్ని ప్రాజెక్టు పరిధి నుంచి తొలిగించటంపై అక్కడి నేతలు చేస్తున్నదంతా రాజకీయమని, ఆచరణలో ప్రాణహిత నీటిని చేవెళ్ల ప్రాంతానికి ఇవ్వటం సాధ్యం కాదని వివరించారు. పాలమూరు పాతదే పాలమూరుపై ఏపీ ప్రభుత్వం అనవసర రాద్ధాంతం చేస్తోందని, నిజానికి ఈ ప్రాజెక్టు పాతదేనని ముఖ్యమంత్రి కేసీఆర్ గవర్నర్‌కు జీవోలను చూపించారు. మహబూబ్‌నగర్, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాలకు సాగు, తాగు అవసరాలు తీర్చేలా పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును చేపడతామని చెప్పారు. భూసేకరణ అంశానికి సంబంధించి 123 జీవో తీసుకువచ్చామని, సహాయ పునరావాసానికి చర్యలు వేగవంతం చేసినట్లు వివరించారు. ఎగువ రాష్ట్రాల అడ్డుకట్టలు కృష్ణా నది ఎగువ ప్రాంతంలో కర్ణాటక, మహారాష్ట్ర విచ్చలవిడిగా ఆనకట్టలు కట్టి తెలంగాణకు తగినంత నీరు రాకుండా అడ్డుకట్టలు వేస్తున్నాయని గవర్నర్ దృష్టికి సీఎం తీసుకెళ్లారు. మహారాష్ట్ర, కర్ణాటక కట్టిన బ్యారేజీలన్నింటినీ గూగుల్ మ్యాప్‌ల్లో గవర్నర్‌కు చూపించారు. ఈ సందర్భంగా గవర్నర్ ఒకింత ఆశ్చర్యం వ్యక్తం చేసినట్లు తెలిసింది. అందుకే నిర్ణీత నీటి వాటాను వాడుకునేలా తాము ప్రణాళికలు వేసుకుంటున్నామని సీఎం పేర్కొన్నారు. హైదరాబాద్ అభివృద్ధిపై ప్రజెంటేషన్ ఇరిగేషన్ ప్రాజెక్టులతో పాటు హైదరాబాద్ అభివృద్ధికి సంబంధించి 45 నిమిషాల ప్రజెంటేషన్‌ను సీఎం గవర్నర్ ముందు ప్రదర్శించారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా తాగునీటిని అందించేందుకు చేపట్టే భవిష్యత్ ప్రణాళికపై ఫోకస్ చేయటంతో పాటు సిటీలో నిర్మించే ఫ్లై ఓవర్లు, స్కైవేలు, స్కై స్కాపర్లకు సంబంధించిన రూట్‌మ్యాప్, డిజైన్లు ఇందులో వివరించారు. -
జలవిధానానికి తుది మెరుగులు
అధికారులతో మంత్రి హరీశ్‌రావు సమావేశం సాక్షి, హైదరాబాద్: కృష్ణా, గోదావరి నదీ జలాల్లో నిర్ణీత వాటా నీటిని పూర్తిస్థాయిలో వినియోగంలోకి తెచ్చేలా రాష్ట్ర ప్రభుత్వ నూతన జల విధానం సిద్ధమవుతోంది. ప్రతి నియోజకవర్గానికీ లక్ష ఎకరాలకు నీరిచ్చేలా జిల్లాల వారీగా జలవిధానం ప్రకటించాలని ప్రభుత్వం భావిస్తోంది. గోదావరి ఉపనదుల్లో లభ్యతగా ఉన్న సుమారు 600 టీఎంసీల నీటి వినియోగం, బ్యారేజీలు, చెక్‌డ్యామ్‌లు నిర్మించడమే లక్ష్యంగా జలవిధానం తయారవుతోంది. ప్రాజెక్టుల నిర్మాణం, భూసేకరణ, పరిహారం, చిన్ననీటి వనరుల పునరుద్ధరణకు నిధుల కేటాయింపు, ఆయకట్టుకు నీటి సరఫరాపై స్పష్టతనివ్వనుంది. అసెంబ్లీలో సీఎం కేసీఆర్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా దీన్ని వివరించనున్నారు. దీని కంటే ముందు సీఎం ఇరిగేషన్ సీఈలు, ఎస్ఈలతో భేటీ అయ్యే అవకాశముంది. ఈ నేపథ్యంలో ఇరిగేషన్ శాఖ మంత్రి టి.హరీశ్‌రావు బుధవారం అధికారులతో నీటి పారుదల శాఖ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. -
'ప్రతి జిల్లాకు జలవిధానం'
ఖమ్మం: గతంలో చేపట్టిన.. నూతనంగా తీసుకోవాల్సిన ప్రాజెక్టులు, ఆయకట్టు, నిధుల మంజూరు వీటన్నింటినీ కలిపి ప్రతి జిల్లాకు జలవిధానం రూపొందించే యోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉందని రాష్ట్ర భారీ నీటి పారుదలశాఖ మంత్రి టి.హరీశ్ రావు అన్నారు. ఖమ్మం జిల్లా పర్యటన సందర్భంగా బుధవారం స్థానిక ఎన్నెస్పీ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ విధానంతో రాష్ట్రంలో బీడు భూములన్నింటినీ సస్యశ్యామలం చేయడం ప్రభుత్వ ఉద్దేశమన్నారు. జిల్లాలో 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యంగా పెట్టుకున్నారని పేర్కొన్నారు. 'గతంలో తీసుకున్న రాజీవ్, ఇందిరాసాగర్ ప్రాజెక్టులతో జిల్లాకు నీరందించాలని అప్పటి ప్రభుత్వాలు నిర్ణయించాయి. ప్రస్తుతం ఇందిరాసాగర్ హెడ్‌వర్క్స్ ఆంధ్రప్రదేశ్‌లోకి వెళ్లాయి. ఈ విషయమై ఆ ప్రభుత్వానికి రెండుసార్లు లేఖలు రాసినా స్పందించలేదు. ఇందిరాసాగర్ కింద చేసిన పనులు, దుమ్ముగూడెం పనులను అన్నింటినీ కలిపి ఒకే ప్రాజెక్టు కింద జిల్లాకు నీరందించేందుకు ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఇందుకోసం రిటైర్డ్ ఇంజనీర్లు, ప్రభుత్వ ఇంజనీర్లతో కమిటీ వేశాం. నివేదిక రాగానే ముఖ్యమంత్రి ద్వారానే ఈ ప్రాజెక్టు ప్రకటన చేయిస్తాం. ఖమ్మం జిల్లాలో మిషన్ కాకతీయ సక్సెస్ అయింది. తొలి దశలో మిగిలిన చెరువులను రెండో దశలో కూడా పూర్తి చేస్తాం. వ్యవసాయానికి నీళ్లు అందించినప్పుడే ప్రభుత్వం ఆనందంగా ఉంటుంది' అని మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు.