ఖమ్మం: గతంలో చేపట్టిన.. నూతనంగా తీసుకోవాల్సిన ప్రాజెక్టులు, ఆయకట్టు, నిధుల మంజూరు వీటన్నింటినీ కలిపి ప్రతి జిల్లాకు జలవిధానం రూపొందించే యోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉందని రాష్ట్ర భారీ నీటి పారుదలశాఖ మంత్రి టి.హరీశ్ రావు అన్నారు. ఖమ్మం జిల్లా పర్యటన సందర్భంగా బుధవారం స్థానిక ఎన్నెస్పీ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ విధానంతో రాష్ట్రంలో బీడు భూములన్నింటినీ సస్యశ్యామలం చేయడం ప్రభుత్వ ఉద్దేశమన్నారు. జిల్లాలో 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యంగా పెట్టుకున్నారని పేర్కొన్నారు.
'గతంలో తీసుకున్న రాజీవ్, ఇందిరాసాగర్ ప్రాజెక్టులతో జిల్లాకు నీరందించాలని అప్పటి ప్రభుత్వాలు నిర్ణయించాయి. ప్రస్తుతం ఇందిరాసాగర్ హెడ్‌వర్క్స్ ఆంధ్రప్రదేశ్‌లోకి వెళ్లాయి. ఈ విషయమై ఆ ప్రభుత్వానికి రెండుసార్లు లేఖలు రాసినా స్పందించలేదు. ఇందిరాసాగర్ కింద చేసిన పనులు, దుమ్ముగూడెం పనులను అన్నింటినీ కలిపి ఒకే ప్రాజెక్టు కింద జిల్లాకు నీరందించేందుకు ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఇందుకోసం రిటైర్డ్ ఇంజనీర్లు, ప్రభుత్వ ఇంజనీర్లతో కమిటీ వేశాం. నివేదిక రాగానే ముఖ్యమంత్రి ద్వారానే ఈ ప్రాజెక్టు ప్రకటన చేయిస్తాం. ఖమ్మం జిల్లాలో మిషన్ కాకతీయ సక్సెస్ అయింది. తొలి దశలో మిగిలిన చెరువులను రెండో దశలో కూడా పూర్తి చేస్తాం. వ్యవసాయానికి నీళ్లు అందించినప్పుడే ప్రభుత్వం ఆనందంగా ఉంటుంది' అని మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు.
'ప్రతి జిల్లాకు జలవిధానం'
Published Wed, Aug 19 2015 7:18 PM | Last Updated on Sun, Sep 3 2017 7:44 AM
Advertisement
Advertisement