ఎమ్మెల్యేల కోసం జబర్దస్త్.. జలపాఠం!
- ఈ నెల 30 లేదా 31 తేదీల్లో ప్రకటించనున్న ముఖ్యమంత్రి
- అసెంబ్లీ, మండలిలో వేర్వేరుగా జల విధానం ప్రకటన
- తర్వాత అఖిలపక్ష భేటీలో పవర్‌పాయింట్ ప్రజెంటేషన్
- జల విధానంలో ప్రాజెక్టుల రీ డిజైనింగ్.. కొత్త లక్ష్యాల విశ్లేషణ
- జిల్లాలవారీగా ప్రణాళికల తయారీ.. కృష్ణా, గోదావరిలో మన వాటాను సంపూర్ణంగా వాడుకోవడమే లక్ష్యం
- ప్రతి నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగునీరు
- ప్రెజెంటేషన్‌లో అన్ని అంశాలను సమగ్రంగా వివరించండి అధికారులకు సీఎం దిశానిర్దేశం
సాక్షి, హైదరాబాద్: కృష్ణా, గోదావరి నదీ జలాల్లో రాష్ట్రానికి ఉన్న నిర్ణీత వాటాలను సంపూర్ణంగా వినియోగంలోకి తెచ్చేలా ప్రభుత్వం సాగునీటి జల విధాన ప్రణాళికను సిద్ధం చేసింది. ప్రతి నియోజకవర్గంలో లక్ష ఎకరాల భూమిని సాగులోకి తేవడమే లక్ష్యంగా జిల్లాల వారీగా ప్రణాళిక రూపొందించింది. ఈ సమగ్ర జల విధానాన్ని త్వరలోనే ఆవిష్కరించనుంది.
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సూచనల మేరకు ఇరిగేషన్ విభాగం ఇందుకు సంబంధించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌ను సిద్ధం చేసింది. దాదాపు వందకుపైగా టెంప్లెట్లతో ఈ ప్రజెంటేషన్‌ను తయారుచేసింది. రాష్ట్ర భౌగోళిక పరిస్థితులతోపాటు హైదరాబాద్ రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రంలో విలీనమైనప్పుడు సాగునీటి ప్రాజెక్టులకు జరిగిన అన్యాయాన్ని ఇందులో చూపింది. దీంతోపాటు తెలంగాణ ప్రాజెక్టులపై నిర్లక్ష్యం, నిరాదరణను ప్రస్తావించింది. ప్రాజెక్టులను ఎందుకు రీడిజైన్ చేయాల్సి వచ్చిందనే అంశాన్ని ఉటంకించింది. జిల్లాల వారీగా ఆయకట్టు వివరాలు, ప్రాజెక్టుల అంచనా వ్యయం, కొత్తగా సమకూరే ఆయకట్టు, ఎత్తిపోతల పథకాలకు అవసరమయ్యే విద్యుత్ అవసరాలను అందులో పేర్కొన్నారు. వీటితో పాటు జిల్లాల వారీగా ప్రాజెక్టులు, వాటి పరిధిలోని ఆయకట్టు, కొత్త ప్రాజెక్టులు, రీడిజైనింగ్ ద్వారా ఒనగూరే ప్రయోజనాలను విడివిడిగా సమగ్రంగా విశ్లేషించింది.
రీడిజైనింగ్ ఎందుకంటే..?
ప్రాజెక్టుల రీడిజైనింగ్ అవశ్యకతను జలవిధానంలో వివరించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గోదావరి, కృష్ణా జలాలను నేరుగా లేదా పరోక్షంగా మళ్లించుకునే ఆలోచనతోనే ప్రాణహిత-చేవెళ్ల, దేవాదుల, కంతనపల్లి, దుమ్ముగూడెం-నాగార్జునసాగర్ టెయిల్‌పాండ్ ప్రాజెక్టులు తలపెట్టాయని అందులో పేర్కొన్నారు. భవిష్యత్తులో ఎప్పటికీ ఈ ప్రాజెక్టులు పూర్తవకుండా అంతర్రాష్ట్ర వివాదాలు, చిక్కులతో ముడిపెట్టి జటిలం చేశారని వివరించారు. ప్రాణహిత- చేవెళ్ల, కంతనపల్లి ప్రాజెక్టుల ముంపు ప్రాంతం, హద్దులపై పొరుగు రాష్ట్రంతో సంప్రదించకుండానే నిర్ణయించుకున్నారన్నారు. ఎత్తిపోతలకు అవసరమయ్యే నీరు అందుబాటులో ఉంటుందా.. ఏడాదిలో ఎంత కాలం నీరు నిల్వ ఉంటుందనే కనీస అంచనా లేకుండానే దేవాదులకు డిజైన్ చేశారని పేర్కొన్నారు. మొత్తమ్మీద రాష్ట్ర వాటా కింద ఉన్న ప్రతి నీటి చుక్కను ఆయకట్టుకు మళ్లించడం, అవసరాలకు తగ్గట్టుగా నిల్వ చేసుకునేలా ప్రణాళిక రూపొందించింది.
ఎంసీహెచ్‌ఆర్‌డీలో ప్రజెంటేషన్
ఈ నెల 30 లేదా 31వ తేదీల్లో అసెంబ్లీలో ఉభయ సభల సంయుక్త సమావేశం ఏర్పాటు చేసి జల విధానాన్ని ఆవిష్కరించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ భావించారు. కానీ నిబంధనల దృష్ట్యా ఉభయ సభల సమావేశం వీలుకాక పోవడంతో అసెంబ్లీ, మండలిలో జల విధానంపై వేర్వేరుగా ప్రకటనలు చేయాలని నిర్ణయించారు. తర్వాత ఎంసీహెచ్‌ఆర్‌డీలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేలా కార్యాచరణ రూపొందించారు. అన్ని పార్టీల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు అఖిలపక్ష నేతలను దీనికి ఆహ్వానించే అవకాశం ఉంది. గత అసెంబ్లీ సమావేశాల సందర్భంలోనే జల విధానాన్ని ప్రకటించాలని ప్రభుత్వం భావించింది. కానీ ప్రతిపక్షాలు రైతు రుణమాఫీ అంశంపై సభకు అడ్డుపడటం, ఉభయ సభల సమావేశంపై మల్లగుల్లాలతో వెనక్కి తగ్గింది.
అన్ని అంశాలను ప్రజల ముందుంచండి
రాష్ట్ర జల విధానం ప్రకటించనున్న నేపథ్యంలో శుక్రవారం ముఖ్యమంత్రి కేసీఆర్ క్యాంపు కార్యాలయంలో నీటి పారుదల శాఖ అధికారులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈఎన్‌సీ మురళీధర్, విజయ్‌ప్రకాశ్‌తోపాటు ప్రాణహిత సీఈ హరిరామ్, కాళేశ్వరం సీఈ వెంకటేశ్వర్లు, ఎస్సారెస్పీ సీఈ శంకర్‌తోపాటు ఇతర శాఖల అధికారులు హాజరయ్యారు. కాళేశ్వరం, ప్రాణహిత, తుపాకులగూడెం బ్యారేజీలకు త్వరగా టెండర్లు పిలవాలని సీఎం ఈ సందర్భంగా అధికారులకు సూచించారు. ఇప్పటికే నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులతోపాటు కొత్త వాటిని నిర్మించి మొత్తంగా 1.12 కోట్ల ఎకరాలకు నీరివ్వాలని, తద్వారా ప్రతి నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు నీరిచ్చేలా కార్యాచరణ ఉండాలని సూచించారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు రీ డిజైనింగ్‌లో భాగంగా చేపట్టిన కాళేశ్వరం ఎత్తిపోతల ద్వారా ఇప్పటికే ఉన్న నిర్ణీత 16.4 లక్షల ఎకరాల ఆయకట్టుతో పాటు శ్రీరాంసాగర్, సింగూరు, నిజాంసాగర్ ఆయకట్టుకు నీరందించే ప్రణాళికను ప్రజల ముందు పెట్టాలని సీఎం సూచించినట్లు సమాచారం.
ప్రాణహిత ద్వారా ఆదిలాబాద్ జిల్లాలో గతంలో నిర్ణయించిన 56 వేల ఎకరాల కన్నా అధికంగా 1.44 లక్షల ఎకరాలకు నీరందించే ప్రణాళికలను వివరించాలన్నారు. చొక్కారావు దేవాదుల ప్రాజెక్టు ఆయకట్టును ఇందిరమ్మ వరద కాల్వ(ఎఫ్‌ఎఫ్‌సీ) పరిధిలోకి తెచ్చేందుకు కారణాలేమిటీ, దేవాదుల కింద నిర్ణయించిన ఆయకట్టులోంచి 1.90 లక్షల ఎకరాలను వరద కాల్వలోకి ఎలా మారుస్తారో స్పష్టంగా తెలియజేయాలని సమావేశంలో నిర్ణయించారు. కంతనపల్లికి ప్రత్యామ్నాయంగా వచ్చిన తుపాకులగూడెం ప్రాజెక్టుతో ఎస్సారెస్పీ ఆయకట్టు స్థిరీకరణ, 50 టీఎంసీలను హైదరాబాద్ తాగునీటి అవసరాలకు మళ్లించుకునే అవకాశాలను ప్రజెంటేషన్‌లో పొందుపరచాలని సీఎం అధికారులకు సూచించారు.
గవర్నర్‌తో సీఎం భేటీ
సీఎం కేసీఆర్ గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్‌తో భేటీ అయ్యారు. శుక్రవారం మధ్యాహ్నం రాజ్‌భవన్‌కు వెళ్లిన సీఎం దాదాపు రెండు గంటల పాటు గవర్నర్‌తో సమావేశమయ్యారు. బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న తీరు, రాష్ట్రంలో తాజా పరిస్థితులు, సమగ్రజల విధానంపై వీరిరువురు చర్చించినట్లు సమాచారం. ఇటీవల కంటి ఆపరేషన్ చేయించుకున్న గవర్నర్ సతీమణి విమలా నరసింహన్‌ను ఈ సందర్భంగా సీఎం పరామర్శించినట్లు తెలిసింది.