అసెంబ్లీ వేదికగా జల విధానం
- 8 లేదా 9న ఉభయ సభల సంయుక్త సమావేశం
- భేటీలో పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఆవిష్కరించనున్న సీఎం
- గవర్నర్‌తో ముఖ్యమంత్రి భేటీ.. జలవిధానంపై వివరణ
- గంటన్నరపాటు ప్రాజెక్టులు, చేయబోయే మార్పులపై విశ్లేషణ
- గోదావరి, కృష్ణాలో తెలంగాణకు 1,250 టీఎంసీల వాటా ఉంది
- వాటన్నింటినీ వినియోగంలోకి తెస్తేనే సమస్యలు తీరతాయి
- ఐదేళ్లలో ప్రాణహిత పూర్తి.. చేవెళ్లకు నీళ్లు ఇవ్వడం సాధ్యం కాదు
- కృష్ణాపై ఎగువ రాష్ట్రాల అడ్డుకట్టలపై గవర్నర్ ఆశ్చర్యం!
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ వేదికగా ఉభయసభల సమావేశం ఏర్పాటు చేసి తెలంగాణ సమగ్ర జల వినియోగ విధానాన్ని ప్రకటించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. నదీ జలాలు, నీటి వాటాలు, సాగునీటి ప్రాజెక్టులపై ప్రత్యేకంగా రూపొందించిన పవర్‌పాయింట్ ప్రజెంటేషన్‌ను ఈ నెల 8 లేదా 9న సభలో ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
సంయుక్త సమావేశం ఏర్పాటు చేసేందుకు గవర్నర్ అనుమతి తీసుకోవటం తప్పనిసరి. సాధారణంగా బడ్జెట్ సమావేశాల తొలిరోజు, కొత్త ప్రభుత్వాలు ఏర్పడ్డ తర్వాత జరిగే మొదటి సమావేశాల మొదటి రోజున ఉభయసభలు (శాసనసభ, శాసనమండలి) సంయుక్తంగా సమావేశమవుతాయి. ఆ సందర్భంగా సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించటం ఆనవాయితీ. కానీ ప్రాధాన్యం ఉన్న అంశాలు, బిల్లులపై చర్చించేందుకు ఉభయసభల సమావేశం అవసరమని మంత్రిమండలి నిర్ణయిస్త్తే.. స్పీకర్ అనుమతితో పాటు గవర్నర్‌కు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది.
శుక్రవారం సీఎం కేసీఆర్.. గవర్నర్‌తో సమావేశమై సంయుక్త సమావేశాల ఏర్పాటుపై చర్చించినట్లు తెలిసింది. ఈ మేరకు సమాచారం ఇవ్వటంతోపాటు సమావేశాలకు రావాలని గవర్నర్‌ను ఆహ్వానించినట్లు సమాచారం. కొత్తగా ఏర్పడ్డ తెలంగాణతోపాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గతంలో ప్రత్యేక అంశంపై సంయుక్త సమావేశాలు జరిగిన సందర్భాలు లేవు. దీంతో తెలంగాణ జల విధాన ప్రకటనకు ఏర్పాటు చేసే ఉభయ సభల సంయుక్త సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఇదిగో జల విధానం
తెలంగాణ సమగ్ర జల విధానాన్ని గవర్నర్ నరసింహన్ ముందు సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి లక్ష ఎకరాల సాగునీటిని అందించేందుకు ఏయే ప్రాజెక్టులు చేపట్టాలి, సమైక్య పాలనలో తెలంగాణలోని ప్రాజెక్టులు ఎందుకు ముందుకు సాగలేదు, ఆగిపోయిన ప్రాజెక్టుల డిజైన్లను ఎలా మార్పు చేయాలి, ప్రాణహిత-చేవెళ్ల, పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టుల డిజైన్ ఎలా మారిస్తే ప్రయోజనం.. వంటి కీలకాంశాలను సచిత్రంగా, గ్రాఫిక్ డిజైన్లు, గూగుల్ మ్యాప్‌లతో రూపొందించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. గంటన్నరపాటు ప్రజెంటేషన్ ఇచ్చారు.
గోదావరి, కృష్ణా నీటి వాటాల విషయంలో గతంలో జరిగిన అన్యాయాన్ని వివరించటంతోపాటు తెలంగాణకు ఉన్న నీటి వాటాలను సద్వినియోగం చేసుకునేందుకు చేపడుతున్న భవిష్యత్తు ప్రణాళికలను విశదీకరించారు. ఎంపీ కె.కేశవరావు, ఢిల్లీలో ప్రభుత్వ ప్రతినిధి వేణుగోపాలచారి, మాజీ ఎమ్మెల్యే హరీశ్వర్‌రెడ్డి, నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌కే జోషి, ఇరిగేషన్ విభాగం అధికారులు ఈ భేటీలో పాల్గొన్నారు.
గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయి..
గోదావరి, కృష్ణాలో తెలంగాణకు 1,250 టీఎంసీల నీటి వాటా ఉందని, ఈ నీటిని వినియోగంలోకి తెచ్చుకుంటేనే తెలంగాణ సాగునీటి సమస్యలు తీరుతాయని గవర్నర్‌కు సీఎం వివరించారు. అందుకే కొన్నిచోట్ల ప్రాజెక్టుల రీ ఇంజనీరింగ్, కొన్నిచోట్ల నీటి నిల్వ సామర్థ్యం పెంచే బ్యారేజీల నిర్మాణం చేపడుతున్నట్లు చెప్పారు.
‘‘గత ప్రభుత్వాలు సాగునీటి రంగాన్ని నిర్లక్ష్యం చేశాయి. పర్యావరణ అనుమతులు లేకుండా, భూసేకరణ చేయకుండానే ప్రాజెక్టులు ప్రారంభించారు. దీంతో ఒక్కటి కూడా ముందుకు సాగలేదు. పదేళ్లుగా 25 ప్రాజెక్టులు అసంపూర్తిగానే ఉన్నాయి. కాగితాలపై నిధులు ఖర్చు చేసినట్లు కనబడుతున్నా.. ఒక్క జిల్లాలోనూ ఆయకట్టు ప్రయోజనాలు సిద్ధించలేదు. ప్రాజెక్టులపై పొరుగు రాష్ట్రాలతో వివాదాలను చర్చలతో పరిష్కరించాల్సి ఉన్నా పట్టించుకోలేదు. అందుకే చిక్కుల్లేకుండా వీటిని పూర్తి చేసుకోవాల్సి ఉంది. అందుకే జిల్లాల వారీగా జల విధానం తీసుకు వస్తున్నాం. ప్రాజెక్టుల రీ ఇంజనీరింగ్ చేస్తున్నాం’’ అని పేర్కొన్నారు.
అయిదేళ్లలో ప్రాణహిత
ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును అయిదేళ్లలో పూర్తి చేసే లక్ష్యంతో రీ ఇంజనీరింగ్ చేస్తామని సీఎం స్పష్టంచేశారు. ‘‘గతంలో ఈ ప్రాజెక్టును ప్రతిపాదించిన తుమ్మిడిహెట్టి ప్రాంతంలో నిర్ణీత 160 టీఎంసీల నీటి లభ్యత లేదు. కేంద్ర జలసంఘం ఈ విషయాన్ని ఇప్పటికే స్పష్టంగా తెలియజేసింది. తుమ్మిడిహెట్టిలో బ్యారేజీ నిర్మాణంపై పొరుగున ఉన్న మహారాష్ట్రతో వివాదం నెలకొంది. అందుకే ప్రత్యామ్నాయంగా ఇంద్రావతి, ప్రాణహిత నీటిని వినియోగించుకునేలా మేడిగడ్డ, ఇచ్చంపల్లి ప్రాంతాల వద్ద బ్యారేజీ నిర్మాణానికి సర్వే చేస్తున్నాం. ఇది పూర్తయిన వెంటనే అయిదేళ్లలో ప్రాజెక్టును పూర్తి చేసేలా ముందుకు కదులుతాం’’ అని తెలిపారు.
చేవెళ్ల నేతలది రాజకీయం
ప్రాణహిత నీటిని చేవెళ్ల ప్రాంతానికి ఇవ్వటం సాధ్యం కాదని గవర్నర్‌కు కేసీఆర్ స్పష్టం చేశారు. గూగుల్ మ్యాప్ ద్వారా బ్యారేజీ నుంచి ఉండే దూరం, లిఫ్ట్‌ల వినియోగం, సముద్ర నీటిమట్టంతో పోలిస్తే ఏ ప్రాంతం ఎంత ఎత్తున ఉన్నది, పర్యావరణ అడ్డంకులెన్ని ఉన్నాయన్న అంశాలను ప్రజెంటేషన్‌లో చూపించారు. రంగారెడ్డి జిల్లాలోని ఈ ప్రాంతాన్ని ప్రాజెక్టు పరిధి నుంచి తొలిగించటంపై అక్కడి నేతలు చేస్తున్నదంతా రాజకీయమని, ఆచరణలో ప్రాణహిత నీటిని చేవెళ్ల ప్రాంతానికి ఇవ్వటం సాధ్యం కాదని వివరించారు.
పాలమూరు పాతదే
పాలమూరుపై ఏపీ ప్రభుత్వం అనవసర రాద్ధాంతం చేస్తోందని, నిజానికి ఈ ప్రాజెక్టు పాతదేనని ముఖ్యమంత్రి కేసీఆర్ గవర్నర్‌కు జీవోలను చూపించారు. మహబూబ్‌నగర్, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాలకు సాగు, తాగు అవసరాలు తీర్చేలా పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును చేపడతామని చెప్పారు. భూసేకరణ అంశానికి సంబంధించి 123 జీవో తీసుకువచ్చామని, సహాయ పునరావాసానికి చర్యలు వేగవంతం చేసినట్లు వివరించారు.
ఎగువ రాష్ట్రాల అడ్డుకట్టలు
కృష్ణా నది ఎగువ ప్రాంతంలో కర్ణాటక, మహారాష్ట్ర విచ్చలవిడిగా ఆనకట్టలు కట్టి తెలంగాణకు తగినంత నీరు రాకుండా అడ్డుకట్టలు వేస్తున్నాయని గవర్నర్ దృష్టికి సీఎం తీసుకెళ్లారు. మహారాష్ట్ర, కర్ణాటక కట్టిన బ్యారేజీలన్నింటినీ గూగుల్ మ్యాప్‌ల్లో గవర్నర్‌కు చూపించారు. ఈ సందర్భంగా గవర్నర్ ఒకింత ఆశ్చర్యం వ్యక్తం చేసినట్లు తెలిసింది. అందుకే నిర్ణీత నీటి వాటాను వాడుకునేలా తాము ప్రణాళికలు వేసుకుంటున్నామని సీఎం పేర్కొన్నారు.
హైదరాబాద్ అభివృద్ధిపై ప్రజెంటేషన్
ఇరిగేషన్ ప్రాజెక్టులతో పాటు హైదరాబాద్ అభివృద్ధికి సంబంధించి 45 నిమిషాల ప్రజెంటేషన్‌ను సీఎం గవర్నర్ ముందు ప్రదర్శించారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా తాగునీటిని అందించేందుకు చేపట్టే భవిష్యత్ ప్రణాళికపై ఫోకస్ చేయటంతో పాటు సిటీలో నిర్మించే ఫ్లై ఓవర్లు, స్కైవేలు, స్కై స్కాపర్లకు సంబంధించిన రూట్‌మ్యాప్, డిజైన్లు ఇందులో వివరించారు.