
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలు రెండోరోజు ప్రారంభం అయ్యాయి. మంగళవారం సభ ప్రారంభం కాగానే హెడ్ సెట్ ఘటనపై శాసనసభా వ్యవహారాల శాఖమంత్రి హరీష్ రావు తీర్మానం ప్రవేశపెట్టారు. బడ్జెట్ సమావేశాలు ముగిసేవరకూ 11మంది కాంగ్రెస్ సభ్యులపై సస్పెన్షన్ వేటు పడింది. అలాగే ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్ సభ్యత్వాన్ని రద్దు చేస్తూ స్పీకర్ ప్రకటన చేశారు.
కాగాబడ్జెట్ సమావేశాల తొలి రోజునే అసెంబ్లీలో ఉద్రిక్తత చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఉభయ సభల సంయుక్త సమావేశంలో గవర్నర్ నరసింహన్ ప్రసంగాన్ని అడ్డుకునేందుకు కాంగ్రెస్ సభ్యులు చేసిన ఆందోళన అదుపు తప్పింది. ఏకంగా ప్లకార్డులు, కాగితాలు, హెడ్‌సెట్‌లతో కాంగ్రెస్ సభ్యులు దాడికి దిగటంతో అనూహ్య ఘటనలు చోటు చేసుకున్నాయి. గవర్నర్ ప్రసంగం సమయంలో కాంగ్రెస్ సభ్యులు వెల్‌లోకి చొచ్చుకెళ్లేందుకు విఫలయత్నం చేశారు.
అదే సమయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి .. తమ సీట్లకు అమర్చిన హెడ్‌ఫోన్స్‌ను విరిచేసి గవర్నర్ వైపు గురి చేసి విసిరారు. తన సీటుపై నిలబడి దాడి చేశారు. ఈ క్రమంలో కోమటిరెడ్డి తనంతట తానే అదుపు తప్పి టేబుల్‌పై పడ్డారు. రెండోసారి విసిరిన హెడ్‌ఫోన్స్ ఏకంగా గవర్నర్ ప్రసంగిస్తున్న వేదికపైకి దూసుకెళ్లింది. వెనుక ఉన్న గోడకు తగిలి గవర్నర్ పక్క సీటులో ఉన్న శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్‌కు తగిలింది. దీంతో ఆయన కంటికి గాయమైంది. గవర్నర్ ప్రసంగం ముగిసిన అనంతరం అసెంబ్లీ సిబ్బంది ఆయన్ను హుటాహుటిన సరోజినీదేవి కంటి ఆస్పత్రికి తరలించారు. ఆయనను ఇవాళ మధ్యాహ్నం డిశ్చార్జ్ చేసే అవకాశం ఉంది.