
బెంగళూరు: మైసూరు అర్భన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ముడా) కుంభకోణం కర్ణాటకలో ప్రస్తుతం కలకలం రేపుతోంది. ఈ కేసులో విచారణ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను విచారించేందు రాష్ట్ర గవర్నర్ థావర్ చంద్ గహ్లోత్ అనుమతి మంజూరు చేశారు. దీంతో సీఎంకు రాజకీయంగా ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
అయితే ఈ పరిణామంపై తాజాగా సిద్ధరామయ్య స్పందించారు. తాను ఏ తప్పు చేయలేదని అన్నారు. తనపై విచారణకు ఆమోదిస్తూ గవర్నర్ తీసుకున్న నిర్ణయం రాజ్యాంగ వ్యతిరేకమని, చట్టానికి విరుద్ధమని మండిపడ్డారు. ఈ మేరకు శనివారం సీఎం మాట్లాడుతూ..గవర్నర్ చర్యను కోర్టులో ప్రశ్నిస్తానని, తాను రాజీనామా చేసేంత తప్పు ఏం చేయలేదని పేర్కొన్నారు.
‘మొత్తం కేబినెట్, పార్టీ హైకమాండ్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, లోక్‌సభ రాజ్యసభ ఎంపీలు నా వెంట ఉన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చివేయడానికి బీజేపీ, జేడీ(ఎస్) చేస్తున్న కుట్ర ఇది’ అని విమర్శించారు.
కేబినెట్ అత్యవసర భేటీ..
మరోవైపు ఈ వ్యవహారంపై చర్చించేందుకు సీఎం సిద్ధరామయ్య అధ్యక్షతన నేటి సాయంత్రం కర్నాటక కేబినెట్ అత్యవసర సమావేశమవుతోంది. ఇదిలా ఉండగా గవర్నర్ అనుమతి మంజూరు చేయడాన్ని సవాల్ చేస్తూ కర్నాటక హైకోర్టును ఆశ్రయించే ఆలోచనలో సీఎం సిద్ధరామయ్య ఉన్నారు.
చదవండి: చిక్కుల్లో సిద్దరామయ్య.. సీఎంపై విచారణకు గవర్నర్ అనుమతి