'కేసీఆర్పై చర్యలు తీసుకోవాలని గవర్నర్ను కోరతాం'
హైదరాబాద్ : ఓవైపు శాసనసభ సమావేశాలు కొనసాగుతుండగానే మరోవైపు టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ....పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించటం అప్రజాస్వామికమని సీఎల్పీ ఉప నాయకుడు జీవన్ రెడ్డి మండిపడ్డారు. సభ అరగంట వాయిదా అనంతరం ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద విలేకర్లతో మాట్లాడారు. అభద్రతా భావంతోనే కేసీఆర్ ఇతర పార్టీల ఎమ్మెల్యేలను ఫిరాయింపులకు ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు.
ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి టీఆర్ఎస్లో చేర్చుకోవడమనేది నైతికమన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రాజ్యాంగ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని ...పార్టీ ఫిరాయింపులే ఇందుకు నిదర్శనమన్నారు. రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘించిన కేసీఆర్పై చర్యలు తీసుకోవాలని గవర్నర్ను కోరతామని జీవన్ రెడ్డి తెలిపారు. స్పీకర్ కూడా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేశారు.
రైతులను ఆదుకోవటంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని జీవన్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పాలనలో అందరికి ఫించన్లు అందించామని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. మెదక్ జిల్లాలో రైతులు ఎక్కువగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అన్నారు. అర్హత పేరుతో టీఆర్ఎస్ ప్రభుత్వం ఫించన్లను కుదిస్తుందని జీవన్ రెడ్డి ధ్వజమెత్తారు.