
కరువుపై వామపక్షాల ఉద్యమం
* నేటితో ముగియనున్న సీపీఎం పాదయాత్రలు
* సోమ, మంగళవారాల్లో జిల్లాల్లో నిరసనలు
* 16 నుంచి 18 తేదీల్లో సీపీఐ కరువు పరిశీలన
* ఆ తర్వాత కలెక్టరేట్ల ముట్టడి, చలో సెక్రటేరియట్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ప్రభుత్వం వెంటనే కరువు సహాయక చర్యలు చేపట్టేలా ఒత్తిడి తెచ్చేందుకు వామపక్షాలు ఉద్యమించనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా తీవ్రమైన కరువు తాండవిస్తున్న దృష్ట్యా ప్రజలను ఆదుకునేందుకు యుద్ధప్రాతిపదికన ప్రభుత్వం చర్యలు తీసుకునేలా కార్యాచరణను చేపట్టాలని లెఫ్ట్ పార్టీలు నిర్ణయించాయి.
ఇప్పటికే సీపీఎం ఈ నెల 4 నుంచి 10 వరకు జిల్లాల్లో పాదయాత్రలు, ఇతరత్రా రూపాల్లో కరువు పరిశీలనను చేపట్టింది. సోమ, మంగళవారాల్లో మండల, జిల్లా స్థాయిల్లో ఎక్కడికక్కడ నిరసనలు చేపట్టాలని నిర్ణయించింది.
సీపీఐ జిల్లా పర్యటనలు..
రాష్ట్రంలోని 9 జిల్లాల్లోని కరువు పరిస్థితులను పార్టీపరంగా స్వయంగా పరిశీలించేందుకు సీపీఐ నాయకత్వం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులతో మూడు బృందాలను ఏర్పాటు చేసింది. ఈ నెల 16, 17, 18 తేదీల్లో రోజుకో జిల్లా చొప్పున ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో పార్టీ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, అజీజ్‌పాషా, గుండా మల్లేశ్, నల్లగొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో ఎమ్మెల్యే రవీంద్రకుమార్, పల్లా వెంకటరెడ్డి, కూనంనేని సాంబశివరావు, మెదక్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఈర్ల నర్సింహా, పశ్య పద్మ పర్యటించనున్నారు. జిల్లా పర్యటనలు ముగిశాక ఈ నెల 20, 21 తేదీల్లో మండల కేంద్రాల్లో... ఈనెల 22న లేదా 25న జిల్లా కలెక్టర్ల ఎదుట ఆందోళన నిర్వహించాలని సీపీఐ నిర్ణయించింది. ఆ తర్వాత చలో సెక్రటేరియట్ కార్యక్రమం చేపట్టాలని భావిస్తోంది.
జలవిధానంపై పార్టీ కమిటీ...
రాష్ట్రంలోని ప్రాజెక్టులపై అధ్యయనం చేసి పార్టీపరంగా జలవిధానాన్ని రూపొందించేందుకు కూనంనేని సాంబశివరావు, పశ్య పద్మ, ఈర్ల నర్సింహాతో సీపీఐ ఒక కమిటీని నియమించింది. ఇదివరకే పార్టీ ఆధ్వర్యంలో కృష్ణా, గోదావరి నదులపై ప్రాజెక్టుల సందర్శనను పూర్తి చేసిన నేపథ్యంలో ఈ అధ్యయనానికి ఆయా అంశాలను జోడించి పది రోజుల్లో జలవిధానంపై ఒక పుస్తకాన్ని సిద్ధం చేయాలని నిర్ణయించింది.