వామపక్షాల ‘పొలిటికల్‌ ఫోరం’! | left partys political forum | Sakshi
Sakshi News home page

వామపక్షాల ‘పొలిటికల్‌ ఫోరం’!

Published Fri, Jan 5 2018 1:51 AM | Last Updated on Mon, Aug 13 2018 8:12 PM

left partys political forum - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత జరిగిన ఎన్నికల్లో నామ మాత్రంగా కూడా ప్రభావం చూపలేక పోయిన వామపక్షాలు ఈసారి తమ ఉనికి చాటుకునేందుకు ప్రణాళికలు రచిస్తున్నాయి. 2014 సార్వత్రిక ఎన్నికల్లో సీపీఎం భద్రాచలం, సీపీఐ దేవరకొండ అసెంబ్లీ నియోజకవర్గాల్లో విజయం సాధించాయి. ఇల్లందులో వరుసగా గెలుస్తూ వచ్చిన న్యూడెమొక్రసీ ఓటమిపాలుకాగా.. నర్సం పేట నియోజకవర్గంలో మూలాలున్న ఎంసీపీఐ కూడా ప్రాభవాన్ని కోల్పోయింది.

ఎన్నికల్లో పోటీ పడి ఒంటరిగా గెలి చేంత శక్తి లేక ప్రజాపోరాటాలు, ఆందోళనలతో ఉనికి కాపాడుకుంటున్న వామపక్ష పార్టీలూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో రాను న్న సార్వత్రిక ఎన్నికల నాటికి ఈ పార్టీలన్నింటినీ ఒకే వేదిక మీదకు తీసుకువచ్చే ప్రయత్నాలను సీపీఎం తన భుజాలపై వేసుకుంది. టీఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్‌లను మినహాయించి ఇతర అన్ని పార్టీలను కలుపుకుని ఒక రాజకీయవేదికను ఏర్పాటు చేసే ప్రయత్నాలు ముమ్మరం చేసింది. సీపీఎం వర్గాలు చెబుతున్న సమాచారం మేరకు ఈ నెల 25న పొలిటికల్‌ ఫోరం ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి.

అందరినీ ఏకతాటిపైకి తెచ్చేందుకు..
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం చేపట్టిన మహాజన పాదయాత్ర సామాజిక న్యాయం, సమగ్ర అభివృద్ధిని డిమాండ్‌ చేస్తూ సాగింది. అనంతరం వివిధ వర్గాల నుంచి వచ్చిన సూచనల మేరకు అన్ని సంఘాలను ఏకం చేయడానికి తెలంగాణ ప్రజాసంఘాల ఐక్యవేదిక(టి–మాస్‌)కు రూపం ఇచ్చారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో టి–మాస్‌ ఫోరాలు ఏర్పాటయ్యాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల రాజకీయాలకు వెళ్లాలనుకునే వారిని కూడగట్టడం ద్వారా రాష్ట్రంలో ఒక ప్రత్యామ్నాయ రాజకీయ వేదికను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రచించారు.

ఈ వేదికలో చేరడానికి సీపీఐ, న్యూడెమోక్రసీ ఇంకా అంగీకారం తెలపలేదు. ఎంసీపీఐ, ఫార్వర్డ్‌ బ్లాక్, సూసీ, ఆర్‌ఎస్పీ, బీఎస్పీ, ఎంబీటీ, లోక్‌సత్తా తదితర 32 పార్టీలు, ప్రజాసంఘాలు ఈ ప్రత్యామ్నా య రాజకీయ వేదికలో చేరడానికి ఇప్పటికే అంగీకారం తెలిపాయని చెబుతున్నారు. ఏప్రిల్‌లో జరిగే తమ జాతీయ మహాసభల్లో చర్చించి దీనిపై నిర్ణయం తీసుకుంటామని సీపీఐ చెప్పిందని, ప్రొఫెసర్‌ కోదండరాం చైర్మన్‌గా వ్యవహరిస్తున్న టీజేఏసీనీ కలసి రావాల్సిందిగా ఆహ్వానించినట్లు సీపీఎం వర్గాలు చెపుతున్నాయి.

ఈ ప్రత్యామ్నాయ రాజకీయ వేదికకు బహుజన వామపక్ష ప్రజాతంత్ర వేదిక (బీఎల్‌డీఎఫ్‌), బహుజన వామపక్ష వేదిక(బీఎల్‌ఎఫ్‌) పేర్లు పరిశీలనలో ఉన్నట్టు సమాచారం. ఇప్పటికే వివిధ వరా ్గలు, పార్టీలతో జరిపిన సమావేశాల అనంతరం ఈ నెల 25న ఫోరంను లాంఛనం గా ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు సీపీఎం వర్గాలు చెపుతున్నాయి. ఈ వేదిక తరఫున రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేయాలని, ఉమ్మడి ప్రణాళికలను ప్రకటించాలని నిర్ణయించారు. జనా భా దామాషా పద్ధతిన టికెట్లను కేటాయించాలనే అభిప్రాయానికి వచ్చినట్టు తెలు స్తోంది. ఫోరం ఆవిర్భావ సందర్భంలో దీనికి సంబంధించి ప్రకటనలు చేసే అవకాశం ఉంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement