ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి
‘బందరు పోర్టుకు భూసమీకరణ’పై వామపక్షాల డిమాండ్
సాక్షి, విజయవాడ బ్యూరో : బందరు పోర్టు, ఇండస్ట్రియల్ కారిడార్‌కోసం లక్ష ఎకరాలకుపైగా భూమిని సమీకరించాలన్న రాష్ట్రప్రభుత్వ నిర్ణయాన్ని పది వామపక్ష పార్టీలు తప్పుపట్టాయి. భూసమీకరణకు సంబంధించి సోమవారం నోటిఫికేషన్ జారీ చేయాలన్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. విజయవాడలోని సీపీఎం రాష్ట్ర కార్యాలయంలో సీపీఐ(ఎంఎల్) రాష్ర్ట నాయకుడు విజయ్‌కుమార్ అధ్యక్షతన పది కమ్యూనిస్టు పార్టీల నాయకుల సమావేశం ఆదివారం రాత్రి జరిగింది. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను వివరిస్తూ పది వామపక్షపార్టీల నేతలు ఒక ప్రకటన విడుదల చేశారు. బందరు పోర్టు, ఇండస్ట్రియల్ కారిడార్ పేరుతో తీరప్రాంతంలోని మత్స్యకారులు, రైతులు, ప్రజల జీవనాన్ని దెబ్బతీసే ప్రభుత్వ ప్రయత్నాలను అడ్డుకుంటామని ప్రకటించారు. ప్రభుత్వం తన తీరును మార్చుకోకపోతే ఉద్యమం తప్పదని హెచ్చరించారు. భూమిని కాపాడుకునేందుకు బందరు ప్రాంతానికి చెందిన రైతులు, ప్రజలు చేస్తున్న ఉద్యమాలకు బాసటగా నిలవాలని నిర్ణయించినట్టు తెలిపారు.
సీపీఎం నాయకుల అరెస్ట్‌లకు ఖండన: శ్రీకాకుళం జిల్లా కొవ్వాడలో అణు విద్యుత్ ప్లాంట్ నిర్మాణం వల్ల రాష్ర్ట ప్రజలకు జరిగే నష్టాన్ని వివరిస్తూ ఈ నెల 17వ తేదీన విశాఖలో నిర్వహించనున్న జాతీయ సెమినార్‌పై ప్రచారం నిర్వహిస్తున్న సీపీఎం నాయకులను పోలీసులు అరెస్టు చేయడాన్ని పది లెఫ్ట్ పార్టీల నాయకులు ఖండించారు. రాష్ట్రప్రభుత్వ చర్యలను ప్రజాస్వామిక వాదులంతా నిరసించాలని వారు విజ్ఞప్తి చేశారు.