నోట్ల రద్దుకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శన చేపట్టిన వామపక్ష నేతలు తమ్మినేని, నారాయణను అడ్డుకుంటున్న పోలీసులు
సాక్షి, హైదరాబాద్: వామపక్ష పార్టీల నిరసన ప్రదర్శనను పోలీసులు భగ్నం చేశారు. నోట్ల రద్దు దుష్ప్రభావాన్ని చాటిచెప్పేందుకు హైదరాబాద్‌లో బుధవారం తలపెట్టిన ర్యాలీని అడ్డుకున్నారు. ఆయాపార్టీల నేతలను అరెస్టు చేశారు. జనజీవితాన్ని అతలాకుతలం చేసిన ‘పెద్దనోట్ల రద్దు’కు ఏడాది పూర్తయిన సందర్భంగా సీపీఐ, సీపీఎం, సీపీఐ ఎంఎల్(న్యూడెమోక్రసీ), ఎస్‌యూసీఐ తదితర పది వామపక్ష పార్టీలు ఆందోళన చేపట్టాయి. బషీర్‌బాగ్‌లో గల బాబూ జగ్జీవన్‌రాం విగ్రహం నుంచి జనరల్ పోస్టాఫీస్ వరకు వామపక్షాల నాయకులు, కార్యకర్తలు ప్రదర్శనగా బయలుదేరారు. ఈ సందర్భంగా సీపీఐ జాతీయ నేత కె.నారాయణ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, న్యూడెమోక్రసీ నాయకులు గోవర్ధన్, చలపతిరావు, ఎంసీపీఐ నేత బాబు తదితరులను అరెస్టు చేసి బేగంపేట పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
నోట్ల రద్దుతో సాధించిందేమీలేదు: నారాయణ
నల్లధనాన్ని వెలికితీస్తానని కబుర్లు చెప్పిన మోదీ ప్రభుత్వం నోట్ల రద్దుతో సాధించిందేమీ లేదనే విషయం ఏడాదిలో రుజువైందని నారాయణ అన్నారు. నోట్ల రద్దు వల్ల ఏవో లాభాలు ఒరిగాయని చెప్పేందుకు బీజేపీ వారు ఉత్సవాలు చేసుకుంటుంటే, దాని వల్ల సామాన్యులకు జరిగిన నష్టాన్ని వివరించేందుకు తాము నిరసన ప్రదర్శనకు పిలుపునిచ్చామని చెప్పారు. ముందు అనుమతి ఇచ్చి తర్వాత పర్మిషన్ లేదంటూ పోలీసులు అడ్డుకోవడం తగదని మండిపడ్డారు. వీరభద్రం మాట్లాడుతూ దేశ ఆర్థిక వ్యవస్థ ‘పిచ్చోడి చేతిలో రాయి’లా మారిందని అన్నారు. పార్లమెంటుకు, క్యాబినెట్‌కు తెలియకుండానే అనేక నిర్ణయాలు జరుగుతున్నాయని విమర్శించారు. ప్రజానుకూల ఆర్థిక విధానాల కోసం వామపక్ష శక్తులు బలోపేతం కావాలని, దానికి త్వరలోనే తెలంగాణలో బీజం పడబోతున్నదని తమ్మినేని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment