♦ పదోన్నతుల లిస్ట్‌పై మండిపడుతున్న నీటి పారుదల ఉద్యోగులు
♦ సీఎం వద్దకు చేరిన ఫైలు
♦ తమకు అన్యాయం జరుగుతోందని జోన్-6 ఉద్యోగుల ఆందోళన
♦ అన్యాయం చేయొద్దని ముఖ్యమంత్రి, సీఎస్‌లకు వినతి
సాక్షి, హైదరాబాద్: నీటి పారుదల శాఖలో పదోన్నతుల వివాదం ముదురుతోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పూర్తిగా నిర్లక్ష్యం చేసిన పదోన్నతుల అంశాన్ని పరిష్కరించాలని ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నా పట్టించుకోని ప్రభుత్వ వైఖరిపై జోన్-6 ఉద్యోగులు గుర్రుగా ఉన్నారు. దీనిపై ఇప్పటికే పలుమార్లు సంబంధిత శాఖా మంత్రి, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందన కానరాకపోవడం, ఉమ్మడి రాష్ట్రంలో తయారు చేసిన సీనియార్టీ లిస్టునే అధికారులు ముఖ్యమంత్రి ఆమోదానికి పంపడం ఇప్పుడు ఆ శాఖలో దుమారం రేపుతోంది. అధికారుల వైఖరిపై తీవ్ర అసంతృప్తితో ఉన్న జోన్-6 ఉద్యోగులు ఈ అంశాన్ని పరిష్కరించాలని రెండు రోజుల కిందట ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజీవ శర్మకు వినతులు సమర్పించారు.
ఒకవేళ అక్కడా స్పందన లేకుంటే సహాయ నిరాకరణకు సిద్ధమవుతున్నారు. ఇరిగేషన్ శాఖలో జోన్-6 ఉద్యోగులకు సంబంధించిన పదోన్నతుల వ్యవహారం 2004లో తెరమీదకు వచ్చింది. రాజధాని హైదరాబాద్‌లోని ప్రధాన కార్యాలయ ఉద్యోగులు పదోన్నతుల్లో అన్యాయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఈ సమస్యను అధ్యయనం చేసేందుకు ప్రభుత్వం గిర్‌గ్లానీ కమిషన్ వేయగా, హైదరాబాద్ ప్రధాన కార్యాలయంలో పనిచేసే ఉద్యోగులను జోన్ 6 కింద పరిగణించి పదోన్నతులు ఇవ్వాలని కమిషన్ ప్రభుత్వానికి సూచించింది. ఇవేవీ అమలుకు నోచుకోలేదు.
ప్రస్తుతం ఇరిగేషన్ విభాగంలో అన్ని స్థాయిల్లో ఇంజనీర్లకు పదోన్నతి ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం సిద్ధం చేసిన పదోన్నతుల అర్హుల జాబితాలో జోన్ 5కు సంబంధించిన ఉద్యోగులే అధికులు ఉన్నారు. ఒకే బ్యాచ్‌కు చెందిన ఇంజనీర్లు కొందరు ఐదో జోన్‌లో చీఫ్ ఇంజనీర్ స్థాయిలో వుంటే, అదే బ్యాచ్‌కు చెందిన ఇంజనీర్లు ఆరో జోన్‌లో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, డిప్యూటీ ఇంజనీర్ల స్థాయిలోనే పనిచేస్తున్నారని జోన్-6 ఉద్యోగులు అంటున్నారు. దీన్ని పట్టించుకోకుండా నీటి పారుదల శాఖ ఉన్నతాధికారులు ప్రస్తుతం ఉమ్మడి రాష్ట్రంలో తయారు చేసిన సీనియార్టీ లిస్టునే సీఎం ఆమోదానికి పంపారు. అక్కడ ఆమోదం దక్కితే తమకు మళ్లీ అన్యాయం జరుగుతుందన్న ఆందోళనలో ఉద్యోగులు సీఎం, సీఎస్‌లకు ప్రత్యేకంగా విన్నవించుకున్నారు.
మళ్లీ అన్యాయం చేయద్దు..
పదోన్నతుల అన్యాయంపై జోన్-6 ఉద్యోగులు సీఎం, సీఎస్‌లకు ప్రత్యేకంగా లేఖ ద్వారా తమ వినతులు తెలియజేశారు. ‘సీఈఎస్‌ఈ పదోన్నతులు, ఇన్‌ఛార్జి నియామకాలకు సంబంధించి ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న సీనియార్టీ లిస్టును ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటోంది. ఇది రాష్ట్ర ప్రయోజనాలకు భిన్నంగా తయారైన జాబితా. గిర్ గ్లానీ కమిటీ నివేదికను పరిగణనలోకి తీసుకోకుండా గతం లో సీనియార్టీ జాబితాను తయారు చేశారు. దీంతో జోన్-5, జోన్-6 ఉద్యోగుల మధ్య విబేధాలకు తెరలేచింది. అత్యున్నత పోస్టులన్నీ జోన్-5 ఉద్యోగులకే వెళ్లాయి. వాటిని ఏవీ సవరించకుండానే ప్రస్తుత పరిపాలనా విభాగపు ఈఎన్‌సీ అవే ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపారు. దీంతో జోన్-6 ఉద్యోగులకు అన్యాయం జరుగుతోంది. ఈ దృష్ట్యా గిర్‌గ్లానీ కమిటీ సిఫార్సులకు అనుగుణంగా ఇన్‌ఛార్జీల నియామకం చేపట్టాలి’ అని వారు కోరారు.
ఇంకా ‘ఉమ్మడి’ జాబితానా?
Published Thu, Oct 8 2015 4:07 AM | Last Updated on Tue, Aug 14 2018 10:54 AM
Advertisement
Advertisement