కొమురం భీమ్ ప్రాజెక్టు
► రైతులకు తప్పని ఎదురుచూపులు
► అలంకారప్రాయంగా కొమురం భీమ్ ప్రాజెక్టు
► పూర్తికాని కాల్వల నిర్మాణం
► ఆరుతడి పంటలే దిక్కు
► వచ్చే ఏడాది ఖరీఫ్‌కూ నీళ్లు అనుమానమే
ఆసిఫాబాద్ : జల్-జంగల్-జమీన్ అంటూ చివరి వరకూ గిరిజన సంక్షేమం కోసం పోరాడి అసువులు బాసిన యోధుడు.. అడవి బిడ్డల దైవం.. కొమురం భీమ్ పేర నిర్మించిన ప్రాజెక్టు ఏడేళ్లయినా నీళ్లందించడం లేదు. ప్రాజెక్టులో సమృద్ధిగా నీరున్నా ఆయకట్టుకు అందని దుస్థితి నెలకొంది. రూ.450 కోట్లతో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టును నవంబర్ 19, 2011న అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రారంభించారు. ఏడాదిలోగా అసంపూర్తిగా ఉన్న కుడి, ఎడమ కాల్వల నిర్మాణం పూర్తిచేసి ప్రాజెక్టుకు అన్ని హంగులూ కల్పిస్తామని ఆ సమయంలో సీఎం కిరణ్ ప్రకటించారు. 2012 ఖరీఫ్ నాటికి 14 వేల ఆయకట్టుకు నీరందిస్తామన్నారు. కానీ.. ఆయన మాటలు నీటి మూటలే అయ్యాయి. ఆయన హామీ ఇచ్చి మూడేళ్లయినా కాల్వల నిర్మాణమే పూర్తికాలేదు. గడువు మీద గడువు మాత్రం పెంచుతూనే ఉన్నారు.
కొనసాగుతున్న గడువు పొడిగింపు
ఆసిఫాబాద్ మండలంలోని అడ వద్ద నిర్మించిన కొమురం భీమ్ ప్రాజెక్టు ద్వారా 44,500 ఎకరాలకు సాగు నీరందాల్సి ఉంది. అయినా.. ఈ ప్రాజెక్టుతో రైతులకు ఒరిగిందేమీ లేకుండాపోయింది. అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టును ప్రారంభించినా.. కాల్వలు నిర్మాణం నేటికీ పూర్తికావడం లేదు. మార్చి 20, 2007లోనే ప్రాజెక్టు పూర్తి కావాల్సి ఉన్నా.. నిధుల కొరత, అటవీశాఖ క్లియరెన్స్, పునరావాసం పనులు పూర్తి కాక ఇప్పటివరకు ఐదు సార్లు గడువు పొడిగించారు. ప్రాజెక్టును మొదట రూ.274.14 కోట్లతో 24,500 ఎకరాలకు సాగు నీరందించాలని పనులు ప్రారంభించారు.
అనంతరం అదనంగా 21 వేల ఎకరాలకు సాగునీరందించాలని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి రూ.170 కోట్ల నిధులు మంజూరు చేశారు. 22, జనవరి 2005లో రూ.274.14 కోట్లు అడ్మినిస్ట్రేటివ్ మంజూరు కాగా, మార్చి 2006లో సాంకేతిక అనుమతి లభించింది. ప్రాజెక్టు నిర్మాణం కాంట్రాక్టు పనులను నవయుగ కంపెనీ దక్కించుకుంది. 20 మార్చి, 2007లో ఈ పనులు పూర్తికావల్సి ఉంది. అయితే.. అటవీశాఖ అనుమతి, భూసేకరణ, పునరావాస పనుల్లో జాప్యంతో పూర్తి కాలేదు. దీంతో 31 మార్చి, 2009 వరకు గడువు పెంచారు. రెండో దఫా 31 ఆగస్టు, 2009 వరకు పెంచారు. మూడో దఫా డిసెంబర్, 2011 వరకు, నాల్గో దఫా 31, డిసెంబర్ 2011 వరకు పెంచారు. గడువులోగా పూర్తి కాకపోవడంతో 30 జూన్, 2013కు ఐదోసారీ గడువు పెంచారు. ఆరోసారి 30, జూన్, 2014 వరకు పెంచారు. గడువులోగా పూర్తి కాకపోవడంతో ఏడో సారీ 30 జూన్, 2016కు పెంచారు.
ప్రాజెక్టు ప్రస్తుత పరిస్థితి..
ప్రాజెక్టు ఎర్త్‌బండ్, ఎడమ హెడ్ రెగ్యులేటర్, 9 గేట్లు పూర్తయ్యాయి. 24వ కిలోమీటర్ నుంచి 54 కిలోమీటర్ వరకు ఐదు చోట్ల ఆసిఫాబాద్, కాగజ్‌నగర్ మండలాల్లో అటవీశాఖ క్లీయరెన్స్ రావల్సి ఉంది. కాల్వల నిర్మాణం పనులు అటవీ శాఖ అనుమతి లేక నిలిచిపోయాయి. ఇప్పటివరకు సుమారు రూ.365 కోట్ల పనులు పూర్తయ్యాయి. ఇటీవల కుడి కాల్వ పనులు సైతం ప్రారంభించారు. పూర్తై ప్రధాన కాల్వ కింద 5వ డిస్ట్రిబ్యూటర్ వరకు పూర్తి చేసి కనీసం 10 వేల ఎకరాలకైనా సాగునీరందిస్తామని ప్రకటించిన అధికారులు చేతులెత్తేశారు.
భూసేకరణే ప్రధాన సమస్య..
ప్రారంభం నుంచి ప్రాజెక్టు నిర్మాణానికి భూసేకరణ ప్రధాన సమస్యగా మారింది. ఏడేళ్లుగా అటవీ భూ సేకరణపై అధికారులు కసరత్తు చేస్తున్నా జాప్యం జరుగుతోంది. తాజాగా ప్రభుత్వం ఇచ్చిన 28 అంశాలను పూర్తి చేసి, కలెక్టర్ ఆమోదంతో మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాల్‌మెంట్‌కు పంపించారు. రెవెన్యూ, అటవీ, ఇరిగేషన్ శాఖల మధ్య సమన్వయం లేక ప్రాజెక్టు పనులు పూర్తికావడం లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.