సహనమూర్తి...సేవాస్ఫూర్తి..! | 11th may mother's day specail | Sakshi
Sakshi News home page

సహనమూర్తి...సేవాస్ఫూర్తి..!

Published Thu, May 8 2014 11:16 PM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

11th may mother's day specail

వైద్యుడు రోగికి మందుల చీటీ రాసిచ్చి తన పాత్ర పూర్తయిందనుకోకుండా మందులు కొనుక్కోమని డబ్బిస్తుంటే ఏమనాలి? డాక్టర్ ఎం. శ్రీనివాసరావు అనాల్సిందే. ఇలా ఎన్నాళ్లు చేస్తారంటే ‘చేయాలనే మనసు ఉండాలే కానీ ఇదేమంత కష్టం కాద’టారాయన. ‘‘నేను ఇదంతా చేస్తున్నది మా అమ్మకోసమే! అమ్మ కోసం చేసే పని భారమనిపించదు.

నన్ను డాక్టర్‌ని చేయడానికి మా అమ్మ పడిన కష్టంతో పోలిస్తే నేను జనానికి చేస్తున్న సహాయంలో అసలు కష్టమే లేదు. చేతినిండా డబ్బు ఉండి నన్ను డాక్టర్‌ని చేయలేదు, కొడుకుని డాక్టర్‌ని చేయాలనే తపనతో పైసాపైసా కూడబెట్టి నన్ను చదివించింది. మనసున్న డాక్టర్‌గా పేరు తెచ్చుకోమని కోరింది. అందుకే నేను డాక్టర్‌నయిన తర్వాత మా నాన్న పేరుతో క్లినిక్ తెరిచాను, అమ్మ పేరుతో చారిటీ ప్రారంభించి ఉచితంగా వైద్యం చేస్తున్నాను’’ అని కూడా అంటారు.
 
హైదరాబాద్‌లోని డి.డి కాలనీలో డాక్టర్ శ్రీనివాసరావు ఇంటికి వెళ్లగానే మొదట వారి తల్లి వెంకటసుబ్బమ్మ కనిపించారు. మాటలు కలిపాక... ‘‘మాది కడప జిల్లా కొత్తనెల్లూరు, మా వారిది నెల్లూరు జిల్లా ఆత్మకూరు దగ్గర పొనుగోడు. ఆయనకు హైదరాబాద్‌లో ఇరిగేషన్ డిపార్టుమెంట్‌లో క్లర్కు ఉద్యోగం వచ్చింది. నాకు ఐదుగురు పిల్లలు. శ్రీనివాస్ ఆఖరివాడు. అబ్బాయిని డాక్టర్‌ని చేయాలని మావారి కోరిక. ఆయన అలా అంటుంటే నాకూ సంతోషంగా ఉండేది. అనుకున్నట్లే మెడిసిన్‌లో చేర్చాం. కానీ జీవితంలో అన్నీ మనం అనుకున్నట్లే జరగవు.

ఏడాదిలోపే మా జీవితంలో పిడుగుపడినట్లయింది. మా వారు హఠాత్తుగా పోయారు. ఇల్లు గడవాలి, పిల్లల చదువులు, పెళ్లిళ్లు... ఇన్ని బాధ్యతలు నన్ను చుట్టుముట్టాయి. కాంపెన్సేటరీ గ్రౌండ్స్ ప్రకారం మా వారి ఉద్యోగం ఇచ్చారు. నేను పెద్దగా చదువుకోకపోవడంతో స్వీపర్ ఉద్యోగం తప్ప మరే ఉద్యోగానికీ అర్హత లేదు.

స్వీపర్‌గా నాకు వచ్చే జీతంతో ఇల్లు గడుస్తుంది కానీ చదువుల ఖర్చు భారంగా ఉండేది. నా బాధ చూసి శ్రీనివాస్ మెడిసిన్ మానేసి దొరికిన ఉద్యోగంలో చేరతానని పట్టుపట్టాడు. ‘నిన్ను డాక్టర్‌ని చేయాలన్న మీ నాన్న కోరిక తీర్చడానికి నేనింత కష్టపడుతున్నాను. నిన్ను డాక్టర్‌ని చేసినప్పుడే నాకు సంతోషంగా ఉంటుంది. నీ చదువు మాన్పించడం నాకిష్టం లేదు.

నువ్వు ఏదో ఒక ఉద్యోగం చేసి తెచ్చే జీతం డబ్బుని నేను సంతోషంగా ఖర్చుచేయలేను కూడ. డాక్టర్‌గా సంపాదించిన డబ్బుతో నన్ను పోషించు. డాక్టర్‌గా పదిమందికి సహాయం చేయడమే నాకు సంతోషం. ఈ నాలుగేళ్లు కష్టపడడానికి నేను సిద్ధమే’ అని చెప్పాను. ఇక నా కష్టం అంటావా తల్లీ! నేను ఎవరి కోసం కష్టపడ్డాను, నా బిడ్డ కోసమే. పేదోళ్లకు అనారోగ్యం వస్తే వైద్యం చేయించుకోలేక ఎన్ని అవస్థలు పడతారో తెలుసుకుని మసులుకోమని మాత్రం చెప్పేదాన్ని. అప్పటి నా మాట పట్టుకుని ఇంతమందికి సేవ చేస్తూ మంచి పేరు తెచ్చుకుంటాడని ఊహించలేదు.

టీవీల్లో కనిపించే పెద్దోళ్లు, భరణి సారు, కోడి రామకృష్ణ సారు లాంటి గొప్పోళ్లు ఫోన్ చేసి ‘ఎంత మంచి కొడుకుని కన్నావమ్మా, నీ బిడ్డ సినిమా ఇండస్ట్రీలో ఎంతమందికి వైద్యం చేస్తున్నాడో! లైట్‌బాయ్‌లు, జూనియర్ ఆర్టిస్టులకు ఉచితంగా వైద్యం చేస్తాడు అంతా నీ పెంపకంలో గొప్పదనమే’ అని ప్రశంసిస్తుంటే నాకు మనసు నిండిపోతుంటుంది’’ అన్నారామె కళ్లు చెమర్చు తుండగా.

రోజుకు మూడుషిఫ్టుల్లో...

ఉదయం ఏడు గంటల నుంచి పది గంటల వరకు సరూర్‌నగర్‌లో ఇంటి వద్ద ఉచిత వైద్యం, ఆ తర్వాత హాస్పిటల్‌లో డ్యూటీ. మెడికల్ ఆఫీసర్‌గా ఉద్యోగం, సాయంత్రం ఆరు నుంచి పది గంటల వరకు అంబర్‌పేటలో సొంత క్లినిక్ బాధ్యతలు... ఇలా రోజుకు మూడు షిఫ్టుల్లో పనిచేస్తారు డాక్టర్ శ్రీనివాస్.
 
ఈ తల్లీకొడుకులిద్దరూ స్వతహాగా గాయకులు. ఆకాశవాణి కార్యక్రమాల్లో రేడియో అక్కయ్య, అన్నయ్యలతో గొంతుకలిపిన అనుభవం వెంకటసుబ్బమ్మది. ఆమె ఏడేళ్లపాటు రేడియోలో దేశభక్తి గీతాలు, దైవభక్తి గీతాలు ఆలపించారు. భర్తపోయి, ఉద్యోగంలో చేరిన తర్వాత గాయనిగా కొనసాగడం కష్టమైంది. కానీ తల్లి వారసత్వాన్ని అందిపుచ్చుకున్న శ్రీనివాసరావు జానపద గేయాలు పాడతారు, మ్యూజిక్ ఇన్‌స్ట్రుమెంట్స్ ప్లే చేస్తారు. సినిమాల్లో నటిస్తారు. అయితే అవన్నీ డాక్టర్ పాత్రలే. ఇప్పటికి 45 సినిమాలు, సీరియల్స్‌లో డాక్టర్‌గా కనిపించారు.
 
అమ్మా! నీకు వందనం!!

సినీ పరిశ్రమలోని అభిమానులు సన్మానం చేస్తామన్నప్పుడు డాక్టర్ స్పందించిన తీరులో ఆర్ద్రత వ్యక్తమైంది. ‘మీకు కనిపిస్తున్న ఈ రూపం, ఈ వ్యక్తిత్వం, దయాగుణాలకు కారకురాలైన మా అమ్మకు సన్మానం చేయండి’ అన్నారాయన. అలా 2011లో రవీంద్రభారతిలో వెంకటసుబ్బమ్మకు జరిగిన సన్మానాన్ని తలుచుకుంటూ... ‘‘మా అమ్మ అక్కినేనిగారి అభిమాని. నన్ను ఆయనకు పరిచయం చేసుకుని మా అమ్మకు మీ చేతుల మీదుగా సన్మానం చేయమని అడిగాను. మదర్స్‌డే రోజున ఆయన చేతుల మీదుగా జరిగిన సన్మానంలో పిల్లలకు దూరమై వృద్ధాశ్రమాల్లో కాలం వెళ్లదీస్తున్న

అమ్మలెందరో ఉన్నారు. వారికి కూడా కొడుకుగా మారి చేయగలిగింది చేయమని సూచించారు. వృద్ధాశ్రమాలకు వెళ్లి వారికి ఉచిత వైద్యం చేయడమే కాదు, మాకొచ్చే శాంపిల్ మందులిచ్చేవాడిని. చాలా వృద్ధాశ్రమాల్లో నిర్వహణ సరిగ్గా లేక వృద్ధులు అనారోగ్యం పాలవుతున్నారని తెలిసి, ఓ మోడల్ హోమ్ ప్రారంభించాను. నీకు మించిన బరువును తలకెత్తుకుంటున్నావేమో జాగ్రత్త అంటోంది మా అమ్మ. సంకల్పబలమే నడిపిస్తుందనే నమ్మకంతో సాగిపోతున్నాను’’ అన్నారీ డాక్టర్.
 
- వాకా మంజులారెడ్డి
 ఫొటోలు : ఎస్‌ఎస్ ఠాకూర్

 
 మాటల్లో చెప్పలేనంత సంతోషం!
 అప్పుడు మా శ్రీనివాస్ మెడిసిన్ తొలి ఏడాది చదువుతున్నాడు. నాకు వెన్నెముకకు ఆపరేషన్ అయి బెడ్ మీదున్నాను. అప్పుడే కాలేజ్‌లో ప్రాక్టికల్స్‌కి కోటుతో వెళ్లాలనగానే మా వారు తెచ్చారు. నిన్ను కోటులో చూడాలని ఉందని అడిగాను. ఇంటికెళ్లి కోటుతో వచ్చాడు. అప్పుడు కంటినిండా చూసుకుని, దగ్గరకు తీసుకుని ముద్దు పెట్టుకున్నాను. ఆ రోజు పొందిన సంతోషాన్ని మాటల్లో చెప్పలేను.
 - వెంకట సుబ్బమ్మ, డాక్టర్ శ్రీనివాసరావు తల్లి
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement