‘కన్సల్టేషన్‌’  కనికట్టు! | Doctor Consultant Fees Are Too High In Hyderabad | Sakshi
Sakshi News home page

Published Wed, May 9 2018 8:34 AM | Last Updated on Tue, Sep 4 2018 5:44 PM

Doctor Consultant Fees Are Too High In Hyderabad - Sakshi

కార్పొరేట్‌ వైద్యం ఖరీదని అందరికీ తెలుసు. వైద్య చికిత్సలే కాదు మినిమమ్‌ కన్సల్టెన్సీ కూడా ఇప్పుడు బహు ఖరీదుగా మారింది. సాధారణంగా ఏదైనా జబ్బు చేసినా...అలాంటి లక్షణాలు కన్పించినా ముందు రోగమేంటో తెలుసుకునేందుకు వైద్యుడిని సంప్రదించక తప్పదు. ఇలా సంప్రదించడంతోనే కార్పొరేట్‌ దోపిడీ ప్రారంభమవుతోంది. జబ్బేంటో తెలియక ముందే రూ.500 నుంచి రూ.1000 చెల్లించుకోవాల్సి వస్తోంది. ఒకప్పుడు డాక్టర్‌ దగ్గరకు వెళ్తే రూ.100 లేదా రూ.150 చెల్లించే వారు. అదే ఫీజుపై మరో రెండుసార్లు చెక్‌ చేయించుకొనే సదుపాయం ఉండేది. ఇప్పుడు సీన్‌ మారింది. కన్సల్టేషన్‌ ఫీజులు అమాంతం పెంచేయడమే కాకుండా...దాన్ని ఒక్కసారి చెకింగ్‌కే పరిమితం చేస్తున్నారు.

మరోసారి వైద్యుడ్ని సంప్రదించాలంటే మరో వెయ్యి సమర్పించాల్సిందే. జనరల్‌ ఫిజీషియన్‌ కాకుండా కేన్సర్, కాలేయం, మూత్రపిండాలు, న్యూరాలజీ, గుండె తదితర స్పెషలిస్టుల వద్దకు వెళ్తే భారీగా కన్సల్టేషన్‌ ఫీజు ఇవాల్సి వస్తోంది. ఇటీవల బేగంపేటలోని ఓ ఆస్పత్రిలో డెంగీతో బాధపడుతున్న ఓ చిన్నారికి చికిత్స అందించినందుకు స్పెషలిస్టు ఒక విజిట్‌ కన్సల్టేషన్‌ చార్జీ రూ.7 వేలు వేసిందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక బస్తీల్లో ఉన్న చిన్నచిన్న క్లినిక్‌ల్లో సైతం డాక్టర్‌ కన్సల్టేషన్‌ చార్జీలు అమాంతం పెంచేశారు. దీంతో సామాన్య ప్రజలు డాక్టర్‌ దగ్గరకు వెళ్లాలంటేనే జంకుతున్నారు.     
– సాక్షి, సిటీబ్యూరో  
 

సాక్షి, సిటీబ్యూరో: కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో వైద్యుల కన్సల్టేషన్, రిజిస్ట్రేషన్‌ చార్జీలు చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే. సాధారణ వైద్యుడు నాడీ పడితే చాలు రూ.500 చెల్లించుకోవాల్సిందే. జనరల్‌ ఫిజిషియన్‌ కాకుండా కేన్సర్, కాలేయం, మూత్రపిండాలు, న్యూరాలజీ, గుండె తదితర స్పెషలిస్టుల వద్దకు వెళ్తే రూ.800 నుంచి రూ.1000 వరకు ఇవాల్సిందే. పదేళ్ల క్రితం పరిస్థితికి ప్రస్తుతానికి భారీ తేడా కనిపిస్తోంది. ఒకప్పుడు వైద్యుడి కన్సల్టేషన్‌ రూ.100 నుంచి రూ.150 ఉంటే అదే ఎక్కువ. అప్పట్లో ఫ్యామిలీ డాక్టర్లు ఉండేవారు. కుటుంబంలో ఎవరికే సమస్య వచ్చినా క్లినికల్‌ ఎగ్జామ్‌తోనే పరిష్కారం లభించేది. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. జ్వరం, తలనొప్పి, జలుబు వంటి సాధారణ జబ్బులకు కూడా వైద్య పరీక్షలు తప్పనిసరిగా మారాయి. హస్తవాసి బాగున్నట్లు కొంచెం పేరు ఉంటే చాలు అంతకు ఎక్కువే చెల్లించుకోవాల్సివస్తోంది. బస్తీల్లో ఉన్న చిన్నచిన్న క్లినిక్‌ల్లో సైతం డాక్టర్‌ కన్సల్టేషన్‌ చార్జీలు అమాంతం పెంచేశాయి.  

ఎన్నిసార్లు విజిట్‌ చేస్తే..  
ఔట్‌పేషెంట్ల పరిస్థితి ఇలా ఉంటే ఇన్‌పేషెంట్ల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. చికిత్స కోసం అడ్మిటైన రోగి నుంచి సర్జరీ, ఐసీయూ, నర్సింగ్, ఫుడ్, బెడ్‌చార్జి,  కన్సల్టేషన్‌ ఇలా దేనికవి వేర్వేరుగా వసూలు చేస్తున్నారు. నిజానికి ఒకసారి వైద్యుడి వద్దకు వచ్చిన రోగికి ఆ వ్యాధి తగ్గే వరకు కన్సల్టేషన్‌ ఫీజు తీసుకోకూడదు. కానీ వైద్యసేవల్లో భాగంగా డాక్టర్‌ ఎన్నిసార్లు వచ్చి చూస్తే అన్ని సార్లు కన్సల్టేషన్‌ ఫీజు చెల్లించాల్సి వస్తోంది. ఇలా ఒక రోగి పూర్తిగా కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యేనాటికి (సర్జరీ కాకుండా) కేవలం డాక్టర్‌ కన్సల్టేషన్‌ చార్జీలే రూ.10వేలకుపైగా ఉంటుందంటే ఆశ్చర్యపోనసరం లేదు. ఇటీవల బేగంపేటలోని ఓ ఆస్పత్రికి డెంగీతో బాధపడుతున్న ఓ చిన్నారికి చికిత్సలు అందించినందుకు స్పెషలిస్టు ఒక విజిట్‌ కన్సల్టేషన్‌ చార్జీ రూ.7 వేలు వేసిందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.    

నిమ్స్‌లో ఓపీ చార్జీలు ఇలా.. 
ప్రతిష్టాత్మక నిమ్స్‌లో మార్నింగ్‌ ఓపీ చార్జి రూ.50 ఉండగా, ఇటీవల రూ.100కు పెంచారు. ఈవినింగ్‌ ఓపీ రూ.300 నుంచి రూ.500కు క్రాస్‌ కన్సల్టేషన్‌ చార్జి రూ. 800కు పెంచారు. రెండో చెకప్‌నకు 14 రోజుల వ్యవధి ఉంటుంది. 

రోగి చెప్పింది కూడా సరిగా విన్పించుకోరు.. 
నిజానికి ఓపీలో వచ్చిన రోగికి ఒకసారి ఫీజు చెల్లిస్తే రెండువారాల వరకు ఎలాంటి ఫీజులు తీసు కోకూడదు. కానీ ప్రస్తుతం కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో రోగి డాక్టర్‌ వద్దకు ఎన్నిసార్లు వెళ్లితే..అన్ని సార్లు కన్సల్టేషన్‌ ఫీజు చెల్లించాల్సి వస్తోంది. ఇంత భారీ మొత్తంలో ఫీజు తీసుకుంటున్న వైద్యులు రోగులతో సరిగా మాట్లాడతారా.. అంటే అదీ లేదు. ముందు తమ వద్ద పని చేస్తున్న అసిస్టెంట్‌ డాక్టర్‌ వద్దకు పంపిస్తున్నారు. ఆ తర్వాత సీనియర్‌ డాక్టర్‌ వద్దకు తీసుకెళ్తున్నారు. రోగి చెప్పింది వినకుండా అసి స్టెంట్స్‌ చెప్పినదే విని మందులు సూచిస్తున్నారు. వచ్చిన ప్రతి రోగితో మాట్లాడాలంటే.. రోజులో కనీసం 20 మందిని కూడా చూడలేం. అదే అసిస్టెంట్‌ ఉంటే 80 నుంచి వంద మంది వరకు చూడవచ్చని ఓ స్పెషలిస్ట్‌ వైద్యుడు స్పష్టం చేశారు.

అప్పట్లో ఇన్ని స్పెషలైజేషన్లు లేవు  
‘మేం చదువుకునే రోజుల్లో ఇన్ని స్పెషలైజేషన్లు లేవు. ఎండీ సీట్లూ తక్కువే. ప్రైవేటులో డొనేషన్లు కట్టి చదువుకోవడాన్ని నామోషిగా ఫీలయ్యేవాళ్లం. ప్రస్తుతం స్పెషలైజేషన్లు పెరిగాయి. డొనేషన్లు పెరిగాయి. దీంతో చదువుపై పెట్టిన పెట్టుబడిని రాబట్టుకునేందుకు వృత్తిలోకి రాగానే భారీగా కన్సల్టేషన్‌ ఇతర ఫీజు పెంచుతున్నారు. కార్పొరేట్‌ ఆస్పత్రులు కూడా తమ నిర్వహణ ఖర్చులు రాబట్టుకునేందుకు ఫీజు పెంచుతున్నాయి.’      
– డాక్టర్‌ నరేంద్రనాథ్, మాజీ డైరెక్టర్, నిమ్స్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement