
ధనార్జనే ధ్యేయంగా మారిన ప్రస్తుత పరిస్థితుల్లో వైద్యవృత్తిని దైవంగా భావించి పేదల పాలిట వైద్య నారాయణుడిగా మారారు ఆయన. తండ్రి చూపిన సేవా మార్గంలో పయనిస్తూ వేలాది శస్త్ర చికిత్సలు చేసి వైద్యరంగంలో ఎందరికో ఆదర్శంగా నిలిచారు ఆయన. ప్రభుత్వ దవాఖానాలపై విశ్వాసం కలిగేలా విధులు నిర్వర్తిస్తూ.. గడిచిన ఆరున్నరేళ్లలో 13,139 శస్త్ర చికిత్సలు చేశారు ఉస్మానియా జనరల్ ఆస్పత్రి ప్లాస్టిక్ విభాగం హెచ్‌ఓడీ డాక్టర్ నాగప్రసాద్.
అఫ్జల్‌గంజ్ : నాగప్రసాద్ స్వస్థలం పశ్చిమగోదావరి జిల్లా పోలవరం. తండ్రి కృష్ణమూర్తి చీఫ్ ఇంజినీర్. తల్లి పుష్పలత. వీరి కుటుంబం హైదరబాద్‌లో స్థిరపడింది. కృష్ణమూర్తి దంపతులకు నాగప్రసాద్, శ్రీనివాస్ ఇద్దరు కుమారులు. నాగప్రసాద్ వైద్యరంగంలో స్థిరపడ్డారు. చిన్న కుమారుడు శ్రీనివాస్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. నాగప్రసాద్ 1994లో సూపర్ స్పెషలిటీ (ప్లాస్టిక్ సర్జన్) పరీక్షలో ఉత్తీర్ణత సాధించారు. 1997లో ఉస్మానియా జనరల్ ఆస్పత్రిలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా బాధ్యతలు చేపట్టారు. 2004లో అసోసియేట్ ప్రొఫెసర్‌గా, 2009లో ప్రొఫెసర్‌గా వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో మూడేళ్లు పని చేసి 300 శస్త్రచికిత్సలు చేశారు. అనంతరం బదిలీపై నగరంలోని ఉస్మానియా ఆస్పత్రికి వచ్చారు. 2012 నుంచి ఇప్పటివరకు 13,139 శస్త్ర చికిత్సలు చేశారు. ప్రతి ఏటా వెయ్యికిపైగా శస్త్ర చికిత్సలు చేసి పేదోల పాలిట ప్రాణదాతగా నిలుస్తురు.
ఉస్మానియాలోనూ కార్పొరేట్ వైద్యం..
పేదోలకు సేవ చేయడమే లక్ష్యంగా పని చేస్తున్నాను. కార్పొరేట్ స్థాయిలో ఉస్మానియా ఆస్పత్రిలోనూ వైద్యం అందుతోంది. పేదవాళ్లు డబ్బులు వృథా చేసుకోకుండా ఉస్మానియాలో అవసరమైన శస్త్ర చికిత్సలు చేసుకోవాలి. – డాక్టర్ నాగప్రసాద్
Comments
Please login to add a commentAdd a comment