2014లో ఉస్మానియాకు వచ్చిన సీఎం..
లక్షలాది మందికి ఆరోగ్యప్రదాయిని ఉస్మానియా ఆస్పత్రి ప్రమాదకరంగా మారింది. ఎన్నో ప్రయోగాలకు, వైద్య అద్భుతాలకు వేదికైన ఈ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి భవనం పైకప్పు గురువారం మళ్లీ పెచ్చులూడింది. నెల రోజుల వ్యవధిలోనే మూడుసార్లు కూలడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. వందలాది మందిచికిత్స పొందుతున్న ఈ భవనంలో వైద్యం అందించడం సురక్షితం కాదని ఇంజినీరింగ్
నిపుణులు ఎన్నోసార్లు హెచ్చరించారు. అయినా ప్రభుత్వం ఈ విషయాన్ని పెడచెవిన పెడుతుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నలుగురు ముఖ్యమంత్రుల కాలంలో ఎన్నో సార్లు నిధులు కేటాయించినా భవన నిర్మాణానికి ఒక్క అడుగూ ముందుకు పడగకపోవడం గమనార్హం.
సాక్షి, సిటీబ్యూరో: గోల్సావాడి.. మూసీనది ఒడ్డున వెలసిన ఓ బస్తీ. యునానీ, ఆయుర్వేదం వంటి సంప్రదాయ వైద్య పద్ధతులు మాత్రమే అందుబాటులో ఉన్న రోజుల్లో నాలుగో నిజాం ప్రభువు నసీరుద్దౌలా బ్రిటిష్ వైద్య చికిత్స చేసే ఆస్పత్రిని ఈ బస్తీలో ఏర్పాటు చేయాలని సంకల్పించారు. వైద్యంతో పాటు బోధనా పద్ధతులను, పాఠ్యగ్రంథాలను కూడా అందుబాటులోకి తీసుకురావాలని భావించారు. ఆస్పత్రి నిర్మాణానికి సన్నాహాలు చేపట్టగా ఐదో నిజాం అప్జలుద్దౌలా హయాంలో ఆస్పత్రి నిర్మాణం పూర్తయింది. అలా 1866 నాటికి అప్జల్‌గంజ్ ఆస్పత్రిగా వైద్య సేవలు ప్రారంభించింది. ఫలితంగా అప్పటి వరకు కంటోన్మెంట్‌లోని బ్రిటీష్ సైనికులకు మాత్రమే అందిన ఆధునిక వైద్యం సామాన్యులకూ చేరువయ్యాయి. కానీ ఆ ఆస్పత్రి ఎంతో కాలం మనుగడ సాగించ లేదు. 1908లో మూసీ వరదల్లో నేలమట్టమైంది. అయితే ఏడో నిజాం మీర్ ఉస్మాన్ ఆలీఖాన్ అప్జల్‌గంజ్ ఆస్పత్రి స్ఫూర్తిని బతికించాలని భావించి 27 ఎకరాల విస్తీర్ణంలో ప్రస్తుతం ఉన్న ఆధునిర భవనాన్ని నిర్మించారు. అలనాటి ప్రముఖ ఆర్కిటెక్ట్ విన్సెంట్ మార్గదర్శకత్వంలో ఈ మహాసౌధం నిర్మాణం పూర్తి చేసుకుంది.
గొప్పగొప్ప వైద్యులుసేవలందించిన ఆస్పత్రి
1918–20లో ఆస్పత్రి భవనం నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఇండో పర్షియన్ శైలికి రాజస్థానీ, గ్రీకు, రోమన్, శైలి నిర్మాణ పద్ధతులను జత చేసి ఈ భవనాన్ని నిర్మించగా 1925లో అందుబాటులోకి వచ్చింది. ఇందులో ఒకేసారి 450 మంది రోగులకు చికిత్స అందించేలా ఏర్పాట్లు చేశారు. రాత్రి వేళ్లలో విద్యుత్ అందుబాటులో లేని సమయాల్లో కూడా వైద్యసేవలకు ఇబ్బంది లేకుండా ఎక్కువ గాలి, వెలుతురు వచ్చేలా వీటి నిర్మాణం ఉంది. ఆస్పత్రి సూపరింటిండెంట్ ఎడ్వర్డ్ లారీ నేతృత్వంలోని వైద్యబృందం ప్రపంచంలోనే తొలిసారిగా క్లోరోఫామ్‌ను మత్తుమందుగా ఉపయోగించి రోగులకు చికిత్సలు చేశారు. 1982లో దేశంలోనే తొలి కిడ్నీ మార్పిడి చికిత్స కూడా ఇక్కడే జరిగింది. డాక్టర్ గోవిందరాజులు నాయుడు, డాక్టర్ సత్యవంత్ మల్లన్న, డాక్టర్ హార్డికర్, డాక్టర్ సర్ రోనాల్డ్ రాస్, వంటి ప్రముఖ వైద్యులు ఆస్పత్రిలో సేవలు అందించారు.
ప్రతిపాదించి పదేళ్లైనా..
నిర్వహణ లేక పాతభవనం శిథిలమైంది. ఇది రోగులకు ఈ భవనం ఏమాత్రం సురక్షితం కాదని ఇంజినీరింగ్ నిపుణులు స్పష్టం చేయడంతో అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి నాలుగు ఎకరాల విస్తీర్ణంలో ఏడంస్తుల కొత్త భవనాన్ని నిర్మించాలని భావించి 2009లో రూ.5 కోట్లు మంజూరు చేశారు. ఆయన మరణం తర్వాత అధికారంలోకి వచ్చిన రోశయ్య 2010లో రూ.200 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. ఆయన రాజీనామా తర్వాత సీఎంగా బాధ్యతలు చేపట్టిన కిరణ్‌కుమార్‌రెడ్డి రూ.50 కోట్లు కేటాయించి భవన నిర్మాణానికి పైలాన్ కూడా ఏర్పాటు చేశారు. 2014 తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ తొలిసారిగా ఉస్మానియాకు వచ్చి పాతభవనాన్ని తక్షణమే ఖాళీ చేయాల్సిందిగా ఆదేశించారు. దీని స్థానంలో అత్యాధునిక హంగులతో మరో రెండు బహుళ అంతస్తుల భవనాలు నిర్మించనున్నట్లు ప్రకటించారు. ఆ మేరకు తొలి బడ్జెట్‌లో రూ.200 కోట్లు కేటాయించారు. ప్రతిపక్షాలు సహా పురావస్తుశాఖ పరిశోధకుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో ఆ ప్రక్రియ నుంచి వెనక్కు తగ్గారు. ప్రస్తుత భవనం జోలికి వెళ్లకుండా అదే ప్రాంగణంలో ఖాళీగా ఉన్న ప్రాంతాల్లో రెండు 12 అంతస్తుల భవనాలు నిర్మించనున్నట్లు ప్రకటించారు. కానీ ఇప్పటి వరకు పునాది రాయి కూడా పడలేదు.
అక్కడన్నారు..ఇక్కడన్నారు..
ప్రమాదకరంగా మారిన పాతభవనంలోని రోగుల కోసం ఏడాది క్రితం కింగ్‌కోఠి, పేట్లబురుజు ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రుల్లో రూ.6 కోట్ల వెచ్చించి ఏర్పాట్లు చేసింది. అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి రోగులను తరలింపు ప్రక్రియ మొదలు పెట్టిన తర్వాత అక్కడికి వెళ్లేందుకు వైద్యులు నిరాకరించారు. దీంతో ఆ ప్రక్రియ కూడా నిలిచిపోయింది. కొత్త భవనం నిర్మించే వరకు ఇదే ఆస్పత్రి ప్రాంగణంలోని పార్కింగ్‌ప్లేస్‌లో తాత్కాలిక రేకుల షెడ్లు వేయాలని ప్రతిపాదన కూడా వచ్చింది. అప్పుడే నెల రోజుల్లో కొత్త భవనానికి శంకుస్థాపన చేయనున్నట్లు మంత్రి లక్ష్మారెడ్డి ప్రకటించారు. కానీ ఇప్పటి వరకు అది అమలుకు నోచుకోలేదు.
పలు సూచనలు చేసిన ‘ఇంటాక్’..
♦ చారిత్ర పాతభవనం ఇప్పటికీ పటిష్టంగానే ఉందని 2014లో దీన్ని పరిశీలించిన ఇంటాక్ ప్రతనిధులు తెలిపారు. కనీస మరమతులకు రూ.3 కోట్ల వరకు ఖర్చు అవుతుందని, పూర్తిస్థాయిలో మరమతులకు రూ.16 కోట్ల వరకు ఖర్చు అవుతుందని ప్రకటించారు.
♦ ఉస్మానియా ప్రాంగణం 26.5 ఎకరాలు ఉంది. ఇందులో పాత భవనం 2.5 ఎకరాలు మాత్రమే విస్తరించి ఉంది. రోగుల అవసరాల దృష్ట్యా కొత్త భవనం కట్టాలనుకుంటే పాత భవనాన్ని అలాగే ఉంచి, పక్కన ఉన్న ఖాళీ స్థలంలో కొత్త భవనం కట్టవచ్చు.
♦ హెరిటేజ్ భవనానికి ఎటూ వంద మీటర్ల దూరంలో ఎలాంటి ఎత్తయిన భవనాలు నిర్మించరాదనే నిబంధన ఉంది.
ప్రజావసరాల దష్ట్యా ఇలాంటి అభ్యంతరాలపై హెరిటేజ్ నుంచి మినహాయింపు పొందవచ్చు.
మూడు నెలలైనా..
కొత్త భవనం నిర్మించాలని డిమాండ్ చేస్తూ ఉస్మానియా జేఏసీ ఆధ్వర్యంలో ఇటీవల వరుసగా 90 రోజుల పాటు ఆందోళన చేశాం. ఆరోగ్యశాఖ మంత్రి జేఏసీ నేతలతో చర్చించి, 15 రోజుల్లో కొత్త భవనానికి శంకుస్థాపన చేస్తామని ప్రకటించారు. ఇది జరిగి మూడు నెలలైనా ప్లానింగ్ కాపీ కూడా ఆమోదముద్ర పొందలేదు. ప్రాణాలకు కనీస రక్షణ లేని ఈ భవనంలో వైద్యం అందించలేం.
– డాక్టర్ పాండునాయక్, చైర్మన్,ఉస్మానియా వైద్యుల జేఏసీ
Comments
Please login to add a commentAdd a comment