building works
-
సంక్రాంతికి కాదు.. ఉగాదికి సిద్ధం
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కొత్త సచివాలయాన్ని సంక్రాంతి వేళ ప్రారంభించాలనుకున్నప్పటికీ అది పూర్తి స్థాయిలో సిద్ధం కాలేదు. ఉగాది నాటికి సిద్ధం కానున్నట్టు తెలుస్తోంది. దీంతో సంక్రాంతి వేళ కొత్త సచివాలయ భవనం ప్రారంభోత్సవం సందిగ్ధంలో పడింది. ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి దాని ప్రారంభోత్సవంపై అధికారికంగా ప్రకటన విడుదల కాలేదు. ఆ దిశగా ఆదేశాలు అందలేదని అధికారులు చెబుతున్నారు. ►సంక్రాంతి నాటికి ప్రారంభం అన్నట్టుగా తనిఖీల సందర్భంలో ముఖ్యమంత్రి సూచించటం, సంక్రాంతికి ప్రారంభించనున్నట్టు మంత్రులు పలు సందర్భాల్లో పేర్కొనటంతో అధికారులు పనుల్లో వేగం పెంచుతూ వచ్చారు. కానీ.. ప్రధాన భవన నిర్మాణం పూర్తయినా, భవనం లోపల వసతులు కల్పించే పనులు, డ్రైనేజీ, టెలిఫోన్, లైటింగ్, ఏసీ, నీటి పైప్‌లైన్.. ఇలాంటి ఏర్పాట్లు ఏవీ పూర్తి కాలేదు. దీంతో ఇప్పటికిప్పుడు పూర్తి స్థాయిలో కార్యకలాపాలు సాగించే పరిస్థితి లేదు. ఒకవేళ సంక్రాంతికి ప్రారంభించాలన్న అభిప్రాయంతోనే సీఎం ఉంటే, దానికి ఆటంకం కలగకుండా అధికారులు ముఖ్యమంత్రి కార్యాలయాన్ని సిద్ధం చేశారు. ప్రారంభోత్సవం అంటూ నిర్వహిస్తే, ఆ కార్యాలయంలోనే పూజ చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. కానీ, ఆ పూజా కార్యక్రమానికి సంబంధించి కూడా అధికారికంగా సీఎం కార్యాలయం నుంచి ఎలాంటి ప్రకటన విడుదల కాలేదు. భవనం పూర్తి స్థాయిలో సిద్ధం కావటానికి మరో రెండు నెలల సమయం పడుతుందని, ఉగాది నాటికి అన్ని పనులూ పూర్తయి ప్రారంభించేందుకు వీలుగా సంసిద్ధమవుతుందంటూ అధికారులు, నిర్మాణ సంస్థ ప్రతినిధులు ఇప్పటికే రోడ్లు భవనాల శాఖ మంత్రికి విన్నవించారు. ఒకవేళ సంక్రాంతి వేళ పూజా కార్యక్రమానికి ముఖ్యమంత్రి ఆదేశిస్తే, సీఎం కార్యాలయంతోపాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కార్యాలయాన్ని కూడా సిద్ధం చేసేందుకు అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో సీఎం కార్యాలయం సిద్ధం కాగా, సీఎస్ కార్యాలయంలో ఆయన ఛాంబర్ వరకు పూర్తయింది. కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించేందుకు సీఎస్ కార్యాలయంలో భాగంగా నిర్మిస్తున్న హాలు సిద్ధం కాలేదు. గత దసరాకు ప్రారంభించాలని ప్రభుత్వం గట్టిగా ఆదేశించినప్పటికీ, భవనం పూర్తి కాకపోవటంతో అది కుదరలేదు. అప్పట్లో సంక్రాంతి వేళ ప్రారంభించాలనుకున్నారు. ఇప్పుడూ సిద్ధం కాకపోవటంతో మళ్లీ ఉగాదికి మారింది. దాదాపు 3 వేల మంది కార్మికులు, ఇంజనీర్లు మూడు షిఫ్టుల్లో రాత్రింబవళ్లూ పనిచేస్తున్నా, భారీ నిర్మాణం, అనుబంధంగా ఎన్నో ఏర్పాట్లు ముడిపడి ఉండటం, ఇటీవల ఫార్ములా ఈరేసింగ్ కోసం ఆ ప్రాంగణంలోని కార్మికుల వసతి తొలగించడంతో వారు దూర ప్రాంతాల నుంచి వచ్చి వెళ్లాల్సిన పరిస్థితితో కొంత ఇబ్బంది ఏర్పడటం.. ఇలా రకరకాల కారణాలతో పనుల్లో జాప్యం జరిగింది. లుంబినీపార్కు ఎదురుగా ప్రధాన ద్వారం.. కొత్త సచివాలయం ప్రధాన ద్వారం లుంబినీ పార్కు ఎదురుగా నిర్మితమవుతోంది. తెలంగాణ రాకముందు ఇక్కడే ప్రధాన ద్వారం ఉండేది. వాస్తుపరంగా అదే కుదరటంతో ఇప్పుడు అక్కడే ఆర్చితో కూడిన ప్రధాన మార్గాన్ని ఏర్పాటు చేస్తున్నారు. సీఎం కాన్వాయ్ ఇందులో నుంచే సచివాలయంలోకి ప్రవేశిస్తుంది. మూడు దిశలు.. నాలుగు ప్రవేశ ద్వారాలు.. కొత్త సచివాలయానికి మొత్తం నాలుగు ద్వారాలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రధాన ద్వారం తూర్పు దిశలో లుంబినీకి ఎదురుగా రానుండగా, ఎన్టీఆర్ గార్డెన్స్ వైపు ఉన్న గేటు వద్ద ఉద్యోగుల ప్రవేశ ద్వారం నిర్మిస్తున్నారు. ఇక ప్రస్తుతం బిర్లామందిరం వైపు రోడ్డులో ఉన్న పౌరసరఫరాల శాఖ పెట్రోలు బంకును తొలగించారు. దాన్ని సికింద్రాబాద్ ఆర్.పి.రోడ్డులోకి మారుస్తున్నారు. తొలగించిన పెట్రోలు బంకు ఉన్న ప్రాంతంలో సందర్శకుల కోసం గేటు నిర్మిస్తున్నారు. దానికి తెలుగుతల్లి ఫ్లైఓవర్ దిగువ కూడలి నుంచి నేరుగా ఓ రోడ్డు నిర్మించారు. వాస్తుపరంగా మూడు ద్వారాలు ఉండటం సరికాదన్న ఉద్దేశంతో, భవనం వెనకవైపు మింట్ దిశలో నాలుగో ద్వారాన్ని నిర్మిస్తున్నారు. దాన్ని అత్యవసర ద్వారంగా వాడతారు. అత్యవసర పరిస్థితిలో తప్ప సాధారణ రోజుల్లో దాన్ని వినియోగించరు. -
దసరాలోగా మీడియా అకాడమీ భవనం
సాక్షి, హైదరాబాద్: మీడియా అకాడమీ భవనాన్ని దసరాలోగా త్వరగా పూర్తి చేసి సీఎం కేసీఆర్‌తో ప్రారంభిస్తామని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ అన్నారు. భవన నిర్మాణానికి సీఎం కేసీఆర్ రూ.15 కోట్లు మంజూరు చేశారని తెలిపారు. మంగళవారం నాంపల్లిలోని అకాడమీ భవన నిర్మాణ పురోగతిని ఆర్అండ్బీ అధికారులు, కాంట్రాక్టర్‌తో అల్లం నారాయణ సమీక్షించారు. సెప్టెంబర్ చివరి వారంలోగా భవనం పూర్తిచేసి అప్పగించేందుకు ప్రయత్ని స్తామని ఆర్అండ్బీ అధికారులు హామీ ఇచ్చా రని అల్లం స్పష్టం చేశారు. భవనంలో ఒక ఆడిటోరియం, రెండు తరగతి గదులు, లైబ్రరీ, గ్రామీణ, డెస్క్ విలేకరులకు కోసం ఒక బ్రిడ్జ్ కోర్స్ రూపొందించి సర్టిఫికెట్ కోర్స్ ప్రారంభిస్తామని పేర్కొన్నారు. -
సెంట్రల్ విస్టా 60 శాతం పూర్తి
న్యూఢిల్లీ: ఈ నెల చివరికల్లా పూర్తికావాల్సిన ఢిల్లీలోని సెంట్రల్ విస్టా అవెన్యూ ప్రాజెక్ట్‌లో 60 శాతం పనులు పూర్తయినట్లు కేంద్రం వెల్లడించింది. వచ్చే ఏడాది అక్టోబర్‌కల్లా పూర్తికావాల్సిన కొత్త పార్లమెంట్ భవంతి పనులు 35 శాతం పూర్తయినట్లు ఒక ప్రశ్నకు సమాధానంగా కేంద్ర భవనాలు, పట్టణాల శాఖ సహాయ మంత్రి కౌశల్ కిశోర్ గురువారం లోక్‌సభలో చెప్పారు. సెంట్రల్ విస్టాలో భాగంగా కొత్త పార్లమెంట్, కేంద్ర సచివాలయం, ప్రధాని నివాసం, ప్రధాని కార్యాలయం, ఉపరాష్ట్రపతి నివాసం నిర్మిస్తారు. పనుల కోసం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.1,289 కోట్లు కేటాయించినట్లు కౌశల్ చెప్పారు. ‘న్యాయవ్యవస్థ’పై 1,622 ఫిర్యాదులు గత ఐదేళ్ల కాలంలో హైకోర్టు జడ్జీలు, హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు, సుప్రీంకోర్టు జడ్జీలపై, న్యాయస్థానాల్లో అవినీతి ఘటనలపై 1,622 ఫిర్యాదులు అందినట్లు కేంద్రం వెల్లడించింది. ఆయా ఫిర్యాదులు కేంద్రీకృత ప్రజా ఫిర్యాదులు, పర్యవేక్షణా వ్యవస్థ(సీపీజీఆర్ఏఎంఎస్)లో నమోదయ్యాయని ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంగా కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరెన్ రిజిజు గురువారం రాజ్యసభలో చెప్పారు. హైకోర్టు జడ్జీలపై వచ్చిన ఫిర్యాదులు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల చెంతకొస్తాయి. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు, సుప్రీంకోర్టు జడ్జీలపై ఇచ్చిన ఫిర్యాదులు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వద్దకొస్తాయి. ఫిర్యాదులను ‘అంతర్గత విచారణ’లో విచారిస్తారు. తొమ్మిదిన్నర రోజులకు సరిపడా బొగ్గు.. దేశవ్యాప్తంగా థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో నవంబర్ నెలలో బొగ్గు నిల్వలు కాస్త మెరుగుపడ్డాయి. కానీ, ఆ నిల్వలు కేవలం తొమ్మిదిన్నర రోజులకు మాత్రమే సరిపోతాయని ప్రభుత్వ గణాంకాల్లో వెల్లడైంది. గత రెండు నెలలతో పోలిస్తే నవంబర్‌లో 18.95 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నాయని ఓ ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంగా విద్యుత్ మంత్రి ఆర్కే సింగ్ లోక్‌సభలో గురువారం చెప్పారు. ఇవే కేంద్రాల వద్ద సెప్టెంబర్‌లో 10.37 మిలియన్ టన్నుల నిల్వలుండగా అక్టోబర్‌లో కేవలం 8.07 మిలియన్ టన్నుల నిల్వలే ఉన్నాయి. దేశంలోనే 136 బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో నవంబర్‌లో మొత్తంగా 18.958 మిలియన్ టన్నుల నిల్వలు ఉన్నాయి. ఇవి తొమ్మిదిన్నర రోజులకే సరిపోతాయి. వాస్తవానికి ప్రతీ ఏటా ఫిబ్రవరి–జూన్ కాలానికి బొగ్గు గనుల దగ్గర్లోని విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల వద్ద 17 రోజులకు సరిపడా నిల్వలు, బొగ్గు గనులకు సుదూరంగా ఉన్న విద్యుత్ కేంద్రాల్లో 26 రోజులకు సరిపడా నిల్వలు తప్పనిసరిగా ఉండేలా ప్రభుత్వం తాజాగా నిబంధనలను సవరించింది. -
ఐసీయూలో ఉస్మానియా
లక్షలాది మందికి ఆరోగ్యప్రదాయిని ఉస్మానియా ఆస్పత్రి ప్రమాదకరంగా మారింది. ఎన్నో ప్రయోగాలకు, వైద్య అద్భుతాలకు వేదికైన ఈ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి భవనం పైకప్పు గురువారం మళ్లీ పెచ్చులూడింది. నెల రోజుల వ్యవధిలోనే మూడుసార్లు కూలడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. వందలాది మందిచికిత్స పొందుతున్న ఈ భవనంలో వైద్యం అందించడం సురక్షితం కాదని ఇంజినీరింగ్ నిపుణులు ఎన్నోసార్లు హెచ్చరించారు. అయినా ప్రభుత్వం ఈ విషయాన్ని పెడచెవిన పెడుతుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నలుగురు ముఖ్యమంత్రుల కాలంలో ఎన్నో సార్లు నిధులు కేటాయించినా భవన నిర్మాణానికి ఒక్క అడుగూ ముందుకు పడగకపోవడం గమనార్హం. సాక్షి, సిటీబ్యూరో: గోల్సావాడి.. మూసీనది ఒడ్డున వెలసిన ఓ బస్తీ. యునానీ, ఆయుర్వేదం వంటి సంప్రదాయ వైద్య పద్ధతులు మాత్రమే అందుబాటులో ఉన్న రోజుల్లో నాలుగో నిజాం ప్రభువు నసీరుద్దౌలా బ్రిటిష్ వైద్య చికిత్స చేసే ఆస్పత్రిని ఈ బస్తీలో ఏర్పాటు చేయాలని సంకల్పించారు. వైద్యంతో పాటు బోధనా పద్ధతులను, పాఠ్యగ్రంథాలను కూడా అందుబాటులోకి తీసుకురావాలని భావించారు. ఆస్పత్రి నిర్మాణానికి సన్నాహాలు చేపట్టగా ఐదో నిజాం అప్జలుద్దౌలా హయాంలో ఆస్పత్రి నిర్మాణం పూర్తయింది. అలా 1866 నాటికి అప్జల్‌గంజ్ ఆస్పత్రిగా వైద్య సేవలు ప్రారంభించింది. ఫలితంగా అప్పటి వరకు కంటోన్మెంట్‌లోని బ్రిటీష్ సైనికులకు మాత్రమే అందిన ఆధునిక వైద్యం సామాన్యులకూ చేరువయ్యాయి. కానీ ఆ ఆస్పత్రి ఎంతో కాలం మనుగడ సాగించ లేదు. 1908లో మూసీ వరదల్లో నేలమట్టమైంది. అయితే ఏడో నిజాం మీర్ ఉస్మాన్ ఆలీఖాన్ అప్జల్‌గంజ్ ఆస్పత్రి స్ఫూర్తిని బతికించాలని భావించి 27 ఎకరాల విస్తీర్ణంలో ప్రస్తుతం ఉన్న ఆధునిర భవనాన్ని నిర్మించారు. అలనాటి ప్రముఖ ఆర్కిటెక్ట్ విన్సెంట్ మార్గదర్శకత్వంలో ఈ మహాసౌధం నిర్మాణం పూర్తి చేసుకుంది. గొప్పగొప్ప వైద్యులుసేవలందించిన ఆస్పత్రి 1918–20లో ఆస్పత్రి భవనం నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఇండో పర్షియన్ శైలికి రాజస్థానీ, గ్రీకు, రోమన్, శైలి నిర్మాణ పద్ధతులను జత చేసి ఈ భవనాన్ని నిర్మించగా 1925లో అందుబాటులోకి వచ్చింది. ఇందులో ఒకేసారి 450 మంది రోగులకు చికిత్స అందించేలా ఏర్పాట్లు చేశారు. రాత్రి వేళ్లలో విద్యుత్ అందుబాటులో లేని సమయాల్లో కూడా వైద్యసేవలకు ఇబ్బంది లేకుండా ఎక్కువ గాలి, వెలుతురు వచ్చేలా వీటి నిర్మాణం ఉంది. ఆస్పత్రి సూపరింటిండెంట్ ఎడ్వర్డ్ లారీ నేతృత్వంలోని వైద్యబృందం ప్రపంచంలోనే తొలిసారిగా క్లోరోఫామ్‌ను మత్తుమందుగా ఉపయోగించి రోగులకు చికిత్సలు చేశారు. 1982లో దేశంలోనే తొలి కిడ్నీ మార్పిడి చికిత్స కూడా ఇక్కడే జరిగింది. డాక్టర్ గోవిందరాజులు నాయుడు, డాక్టర్ సత్యవంత్ మల్లన్న, డాక్టర్ హార్డికర్, డాక్టర్ సర్ రోనాల్డ్ రాస్, వంటి ప్రముఖ వైద్యులు ఆస్పత్రిలో సేవలు అందించారు. ప్రతిపాదించి పదేళ్లైనా.. నిర్వహణ లేక పాతభవనం శిథిలమైంది. ఇది రోగులకు ఈ భవనం ఏమాత్రం సురక్షితం కాదని ఇంజినీరింగ్ నిపుణులు స్పష్టం చేయడంతో అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి నాలుగు ఎకరాల విస్తీర్ణంలో ఏడంస్తుల కొత్త భవనాన్ని నిర్మించాలని భావించి 2009లో రూ.5 కోట్లు మంజూరు చేశారు. ఆయన మరణం తర్వాత అధికారంలోకి వచ్చిన రోశయ్య 2010లో రూ.200 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. ఆయన రాజీనామా తర్వాత సీఎంగా బాధ్యతలు చేపట్టిన కిరణ్‌కుమార్‌రెడ్డి రూ.50 కోట్లు కేటాయించి భవన నిర్మాణానికి పైలాన్ కూడా ఏర్పాటు చేశారు. 2014 తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ తొలిసారిగా ఉస్మానియాకు వచ్చి పాతభవనాన్ని తక్షణమే ఖాళీ చేయాల్సిందిగా ఆదేశించారు. దీని స్థానంలో అత్యాధునిక హంగులతో మరో రెండు బహుళ అంతస్తుల భవనాలు నిర్మించనున్నట్లు ప్రకటించారు. ఆ మేరకు తొలి బడ్జెట్లో రూ.200 కోట్లు కేటాయించారు. ప్రతిపక్షాలు సహా పురావస్తుశాఖ పరిశోధకుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో ఆ ప్రక్రియ నుంచి వెనక్కు తగ్గారు. ప్రస్తుత భవనం జోలికి వెళ్లకుండా అదే ప్రాంగణంలో ఖాళీగా ఉన్న ప్రాంతాల్లో రెండు 12 అంతస్తుల భవనాలు నిర్మించనున్నట్లు ప్రకటించారు. కానీ ఇప్పటి వరకు పునాది రాయి కూడా పడలేదు. అక్కడన్నారు..ఇక్కడన్నారు.. ప్రమాదకరంగా మారిన పాతభవనంలోని రోగుల కోసం ఏడాది క్రితం కింగ్‌కోఠి, పేట్లబురుజు ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రుల్లో రూ.6 కోట్ల వెచ్చించి ఏర్పాట్లు చేసింది. అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి రోగులను తరలింపు ప్రక్రియ మొదలు పెట్టిన తర్వాత అక్కడికి వెళ్లేందుకు వైద్యులు నిరాకరించారు. దీంతో ఆ ప్రక్రియ కూడా నిలిచిపోయింది. కొత్త భవనం నిర్మించే వరకు ఇదే ఆస్పత్రి ప్రాంగణంలోని పార్కింగ్ప్లేస్లో తాత్కాలిక రేకుల షెడ్లు వేయాలని ప్రతిపాదన కూడా వచ్చింది. అప్పుడే నెల రోజుల్లో కొత్త భవనానికి శంకుస్థాపన చేయనున్నట్లు మంత్రి లక్ష్మారెడ్డి ప్రకటించారు. కానీ ఇప్పటి వరకు అది అమలుకు నోచుకోలేదు. పలు సూచనలు చేసిన ‘ఇంటాక్’.. ♦ చారిత్ర పాతభవనం ఇప్పటికీ పటిష్టంగానే ఉందని 2014లో దీన్ని పరిశీలించిన ఇంటాక్ ప్రతనిధులు తెలిపారు. కనీస మరమతులకు రూ.3 కోట్ల వరకు ఖర్చు అవుతుందని, పూర్తిస్థాయిలో మరమతులకు రూ.16 కోట్ల వరకు ఖర్చు అవుతుందని ప్రకటించారు. ♦ ఉస్మానియా ప్రాంగణం 26.5 ఎకరాలు ఉంది. ఇందులో పాత భవనం 2.5 ఎకరాలు మాత్రమే విస్తరించి ఉంది. రోగుల అవసరాల దృష్ట్యా కొత్త భవనం కట్టాలనుకుంటే పాత భవనాన్ని అలాగే ఉంచి, పక్కన ఉన్న ఖాళీ స్థలంలో కొత్త భవనం కట్టవచ్చు. ♦ హెరిటేజ్ భవనానికి ఎటూ వంద మీటర్ల దూరంలో ఎలాంటి ఎత్తయిన భవనాలు నిర్మించరాదనే నిబంధన ఉంది. ప్రజావసరాల దష్ట్యా ఇలాంటి అభ్యంతరాలపై హెరిటేజ్ నుంచి మినహాయింపు పొందవచ్చు. మూడు నెలలైనా.. కొత్త భవనం నిర్మించాలని డిమాండ్ చేస్తూ ఉస్మానియా జేఏసీ ఆధ్వర్యంలో ఇటీవల వరుసగా 90 రోజుల పాటు ఆందోళన చేశాం. ఆరోగ్యశాఖ మంత్రి జేఏసీ నేతలతో చర్చించి, 15 రోజుల్లో కొత్త భవనానికి శంకుస్థాపన చేస్తామని ప్రకటించారు. ఇది జరిగి మూడు నెలలైనా ప్లానింగ్ కాపీ కూడా ఆమోదముద్ర పొందలేదు. ప్రాణాలకు కనీస రక్షణ లేని ఈ భవనంలో వైద్యం అందించలేం. – డాక్టర్ పాండునాయక్, చైర్మన్,ఉస్మానియా వైద్యుల జేఏసీ -
రేపటిలోగా పనులు పూర్తికావాలి
అధికారులను ఆదేశించిన కలెక్టర్ రోనాల్డ్‌రోస్ మెదక్: కలెక్టరేట్ భవన సముదాయ పనులు ఈనెల 7వ తేదీలోగా పూర్తి చేయాలని కలెక్టర్ రోనాల్డ్‌రోస్ అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన మెదక్ పట్టణ శివారులోని పిల్లికొట్టాల్ వద్ద ఏర్పాటు చేస్తున్న నూతన జిల్లా కలెక్టరేట్ (రాయల్ డిగ్రీ కళాశాల)ను సందర్శించారు. ఈ సందర్భంగా పలు విభాగాలు, శాఖల కోసం ఏర్పాటు చేస్తున్న గదులు, ఫర్నిచర్‌ను పరిశీలించారు. దసరారోజు కలెక్టరేట్ ప్రారంభానికి సీఎం కేసీఆర్ వస్తున్నారని, రోడ్లు, భవన సముదాయ పనులు పకడ్బందీగా చేపట్టాలని ఆదేశించారు. కళాశాలలో కొనసాగుతున్న చిన్న చిన్న మరమ్మతు పనులను వేగవంతం చేయాలని యాజమాన్యానికి సూచించారు. ఆయన వెంట టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి దేవేందర్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ మల్లికార్జున్‌గౌడ్, వైస్చైర్మన్రాగి అశోక్‌తోపాటు పలు శాఖల అధికారులు ఉన్నారు. -
అక్రమ నిర్మాణంపై హరీష్ సీరియస్
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: టీడీపీ నాయకుని భూ దందాకు తెరపడింది. భవన నిర్మాణ పనులను రెవెన్యూ అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు అమీన్పూర్ గ్రామంలోని సర్వే నంబర్ 993లో నిబంధనలకు విరుద్ధంగా కేటాయించిన 20 గుంటల స్థలాన్ని తిరిగి వెనక్కి తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. సదరు నేత భూ ఆక్రమణపై ‘టీడీపీ నేత భూ దందా’ అనే శీర్షికతో శనివారం ‘సాక్షి’ కథనం ప్రచురితం కాగా, నీటిపారుదల శాఖ మంత్రి హారీష్‌రావు, దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి స్పందించారు. ప్రభుత్వ ఆస్తులను కాపాడడంలో ‘సాక్షి’ చూపిన చొరవ అభినందనీయమన్నారు. మిగతా పత్రికలు కూడా ‘సాక్షి’ ఆదర్శంగా తీసుకుని సర్కార్ స్థలాలను కాపాడాలని రామలింగారెడ్డి సూచించారు. ఇక ఈ భూ ఆక్రమణపై సీరియస్‌గా స్పందించిన మంత్రి హరీష్‌రావు సమగ్ర నివేదిక ఇవ్వాలని జిల్లా కలెక్టర్ రాహుల్ బొజ్జాను ఆదేశించారు. దీంతో రెవెన్యూ యంత్రాంగం అఘమేఘాల మీద అమీన్పూర్లో టీడీపీ నాయకుడు కడుతున్న అధునాతన ఫంక్షన్ హాల్‌ను సందర్శించి, భవన నిర్మాణ పనులను నిలిపివేశారు. పటాన్చెరు తహశీల్దార్ మహిపాల్‌రెడ్డి, రోడ్లు, భవనాల శాఖ సహాయక ఇంజనీర్ రాఖశేఖర్ భవన నిర్మాణాన్ని పరిశీలించారు. గ్యాస్ గోదాం నిర్మాణం కోసం స్థలాన్ని పొందిన సదరు నేత ప్రభుత్వాన్ని మోసం చేసి ఫంక్షన్ హాలు కడుతున్నట్లు తహశీల్దార్ మహిపాల్‌రెడ్డి నిర్ధారించారు. ఇదే కారణాన్ని చూపుతూ ‘ఇచ్చిన భూమిని ఎందుకు వెనక్కి తీసుకోకూడదో’ వివరణ ఇవ్వాలని సదరు టీడీపీ నాయకునికి నోటీసులు జారీ చేశారు. మరోవైపు అమీన్పూర్ గ్రామ పంచాయతీ కూడా దిద్దుబాటు చర్యలు చేపట్టింది. తాము అనుమతించిన భవన నిర్మాణ ప్లాన్ కు విరుద్ధంగా భవన నిర్మాణం చేపడుతున్నందున అనుమతిని పూర్తిగా రద్దు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు గ్రామ పంచాయతీ కార్యదర్శికి ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చినట్టు తెలిసింది. కాగా ఇండియన్ గ్యాస్ గోదాం నిర్మాణం కోసం భూమిని పొందిన టీడీపీ నేత గ్రామ పంచాయతీకి మాత్రం ‘కన్వెన్షన్ సెంటర్’ నిర్మాణం కోసం అనుమతించాలని దరఖాస్తు చేసుకోవడం గమనార్హం. -
ఆధునికీకరణ జాప్యం.. అన్నదాతకు శాపం!
నత్తనడకన డ్రెడ్జింగ్ పనులు మరో రెండేళ్లు పొడిగించాలని కాంట్రాక్టర్ల వినతి రైతుల్లో ఆందోళన మచిలీపట్నం, న్యూస్‌లైన్ : అష్టకష్టాలు పడి సాగుచేసిన పంట చేతికందే సమయంలో రైతులను నట్టేట‘ముంచి’ నష్టాల నావ ఎక్కిస్తున్న డ్రెయిన్ల తవ్వకాలు నత్తనడకన సాగుతున్నాయి. రెండేళ్ల క్రితమే టెండర్లు పూర్తయినా ఇంకా కొన్ని పనులను ప్రారంభించకపోగా... ప్రారంభించిన పనులను డెల్టా ఆధునికీకరణ ముసుగులో కాంట్రాక్టర్లు తీవ్ర జాప్యం చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. సముద్ర తీరంలోని మొవ్వ, ఘంటసాల, చల్లపల్లి, బందరు. మోపిదేవి తదితర మండలాల పరిధిలోని లక్ష ఎకరాల్లోని మురుగునీటిని సముద్రంలో కలిపే గుండేరు డ్రెయిన్ 44 కిలోమీటర్ల పొడవు ంది. ఈ డ్రెయిన్‌కు 0నుంచి 16 వ కిలో మీటరు వరకు డ్రెడ్జింగ్ ద్వారా పూడిక తీయాలని నిర్ణయించారు. మూడేళ్ల క్రితం ఈ పనులకు టెండర్లు పిలిచారు. రూ. 20 కోట్ల అంచనాలతో టెండర్లు పిలవగా రూ.18 కోట్లకు పనులను కాంట్రాక్టరు దక్కించుకున్నారు. టెండర్లు పూర్తయిన మూడేళ్ల వ్యవధిలో పూడికతీత పనులు పూర్తిచేయాలనే నిబంధన ఉంది. అయితే రెండేళ్లుగా కాంట్రాక్టర్ పనులే ప్రారంభించలేదు. పదిరోజుల క్రితం గుండేరు డ్రెయిన్ 0.0 కిలోమీటరు వద్ద డ్రెడ్జింగ్పనులను ప్రారంభించారు. ఈ పది రోజుల వ్యవధిలో డ్రెయిన్‌కు ఒకవైపున కిలోమీటరు మేర డ్రెడ్జింగ్ చేశారని డ్రెయినేజీ అధికారులు చెబుతున్నారు. రెండు సంవత్సరాలుగా పనులు చేయని కాంట్రాక్టర్ గడచిన రెండేళ్ల కాలపరిమితిని ఇప్పటినుంచి పొడిగించాలని కోరుతూ ఉన్నతాధికారులకు లేఖ రాయడం పట్ల రైతులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. రసాయనాల పిచికారీకి బ్రేక్.... గతంలో వేసవి కాలంలో డ్రెయిన్లలో పేరుకుపోయిన తూడు, గుర్రపుడెక్క, నాచులను తొలగించేందుకు రసాయనాలు పిచికారీ చేసేవారు. గత రెండు సంవత్పరాలుగా రసాయనాల పిచికారీని నిలిపివేసినట్లు అధికారులు చెబుతున్నారు. గతంలో సాగునీటి సంఘాల ద్వారా డ్రెయిన్లలో రసాయనాల పిచికారీ కార్యక్రమాన్ని నిర్వహించేవారు. సాగునీటి సంఘాల పదవీ కాలం రెండేళ్ల క్రితమే ముగియడంతో డ్రెయిన్ల ఆలనాపాలనా పట్టించుకునేవారే కరువయ్యారు. దీనికి తోడు డ్రె యిన్ పనులను దక్కించుకున్న కాంట్రాక్టర్లు పనులు పూర్తి చేసిన ఏడాది కాలం వరకు డ్రెయిన్లలో తూడు, గుర్రపుడెక్క, నాచులను వారే తొలగించాలనే నిబంధన ఉంది. కాంట్రాక్టర్ పనులు చేయక, డ్రెయినేజీ అధికారులు పట్టించుకోకపోవడంతో మేజర్, మైనర్ డ్రెయిన్లలో పూడికతీత పనులు ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖరీఫ్‌లో కోలుకోలేని దెబ్బ ... జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో పంట చేతికొచ్చే సమయానికి హెలెన్, లెహర్ తుపానులు సంభవించాయి. ప్రధాన డ్రెయిన్లతోపాటు మైనర్ డ్రెయిన్లు పూడుకుపోవడంతో చేతికొచ్చేదశలో వరి పంట దాదాపు 2 లక్షల ఎకరాల్లో దెబ్బతింది. రోజుల తరబడి పంట నీటిలోనే నాని పోవడంతో గత ఖరీప్‌సీజన్‌లో జిల్లా రైతులు దాదాపు రూ.200 కోట్ల పంటలను కోల్పోయినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఇంత నష్టం జరుగుతున్నా డ్రెయినేజీ అధికారులు కాంట్రాక్టర్లతో పనులు చేయించేందుకు చొరవ చూపకపోవడం పట్ల రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గుండేరు డ్రెయిన్ పరిస్థితి ఇలా ఉంటే మిగిలిన డ్రెయిన్లలోనూ పూడికతీత పనులు ఆశించినమేర జరగడం లేదని రైతులు చెబుతున్నారు. గూడూరు. బందరు మండలాల్లోని పలుగ్రామాల ఆయక ట్టునుంచి మురుగునీటిని సముద్రంలో కలిపే శివగంగ డ్రెయిన్ మొత్తం 11.50 కిలోమీటర్ల పొడవు ఉంది. రూ.1.59 కోట్ల అంచనాలతో 0.0 నుంచి 6.0 కిలో మీటర్ల వరకు డ్రెడ్జింగ్ ద్వారా మిగిలిన డ్రెయిన్ లో యంత్రాల ద్వారా పూడిక తీశారు. అయితే ఈడ్రెయిన్ గట్లను బలోపేతం చేయకుండా ఎక్కడి మట్టిని అక్కడే వదిలేశారు. దీంతో రైతుల అగచాట్లు అన్నీ, ఇన్నీ కాకుండా పోయాయి.