సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కొత్త సచివాలయాన్ని సంక్రాంతి వేళ ప్రారంభించాలనుకున్నప్పటికీ అది పూర్తి స్థాయిలో సిద్ధం కాలేదు. ఉగాది నాటికి సిద్ధం కానున్నట్టు తెలుస్తోంది. దీంతో సంక్రాంతి వేళ కొత్త సచివాలయ భవనం ప్రారంభోత్సవం సందిగ్ధంలో పడింది. ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి దాని ప్రారంభోత్సవంపై అధికారికంగా ప్రకటన విడుదల కాలేదు. ఆ దిశగా ఆదేశాలు అందలేదని అధికారులు చెబుతున్నారు.
►సంక్రాంతి నాటికి ప్రారంభం అన్నట్టుగా తనిఖీల సందర్భంలో ముఖ్యమంత్రి సూచించటం, సంక్రాంతికి ప్రారంభించనున్నట్టు మంత్రులు పలు సందర్భాల్లో పేర్కొనటంతో అధికారులు పనుల్లో వేగం పెంచుతూ వచ్చారు. కానీ.. ప్రధాన భవన నిర్మాణం పూర్తయినా, భవనం లోపల వసతులు కల్పించే పనులు, డ్రైనేజీ, టెలిఫోన్, లైటింగ్, ఏసీ, నీటి పైప్‌లైన్.. ఇలాంటి ఏర్పాట్లు ఏవీ పూర్తి కాలేదు. దీంతో ఇప్పటికిప్పుడు పూర్తి స్థాయిలో కార్యకలాపాలు సాగించే పరిస్థితి లేదు.
ఒకవేళ సంక్రాంతికి ప్రారంభించాలన్న అభిప్రాయంతోనే సీఎం ఉంటే, దానికి ఆటంకం కలగకుండా అధికారులు ముఖ్యమంత్రి కార్యాలయాన్ని సిద్ధం చేశారు. ప్రారంభోత్సవం అంటూ నిర్వహిస్తే, ఆ కార్యాలయంలోనే పూజ చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. కానీ, ఆ పూజా కార్యక్రమానికి సంబంధించి కూడా అధికారికంగా సీఎం కార్యాలయం నుంచి ఎలాంటి ప్రకటన విడుదల కాలేదు.
భవనం పూర్తి స్థాయిలో సిద్ధం కావటానికి మరో రెండు నెలల సమయం పడుతుందని, ఉగాది నాటికి అన్ని పనులూ పూర్తయి ప్రారంభించేందుకు వీలుగా సంసిద్ధమవుతుందంటూ అధికారులు, నిర్మాణ సంస్థ ప్రతినిధులు ఇప్పటికే రోడ్లు భవనాల శాఖ మంత్రికి విన్నవించారు. ఒకవేళ సంక్రాంతి వేళ పూజా కార్యక్రమానికి ముఖ్యమంత్రి ఆదేశిస్తే, సీఎం కార్యాలయంతోపాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కార్యాలయాన్ని కూడా సిద్ధం చేసేందుకు అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో సీఎం కార్యాలయం సిద్ధం కాగా, సీఎస్ కార్యాలయంలో ఆయన ఛాంబర్ వరకు పూర్తయింది.
కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించేందుకు సీఎస్ కార్యాలయంలో భాగంగా నిర్మిస్తున్న హాలు సిద్ధం కాలేదు. గత దసరాకు ప్రారంభించాలని ప్రభుత్వం గట్టిగా ఆదేశించినప్పటికీ, భవనం పూర్తి కాకపోవటంతో అది కుదరలేదు. అప్పట్లో సంక్రాంతి వేళ ప్రారంభించాలనుకున్నారు. ఇప్పుడూ సిద్ధం కాకపోవటంతో మళ్లీ ఉగాదికి మారింది.
దాదాపు 3 వేల మంది కార్మికులు, ఇంజనీర్లు మూడు షిఫ్టుల్లో రాత్రింబవళ్లూ పనిచేస్తున్నా, భారీ నిర్మాణం, అనుబంధంగా ఎన్నో ఏర్పాట్లు ముడిపడి ఉండటం, ఇటీవల ఫార్ములా ఈరేసింగ్ కోసం ఆ ప్రాంగణంలోని కార్మికుల వసతి తొలగించడంతో వారు దూర ప్రాంతాల నుంచి వచ్చి వెళ్లాల్సిన పరిస్థితితో కొంత ఇబ్బంది ఏర్పడటం.. ఇలా రకరకాల కారణాలతో పనుల్లో జాప్యం జరిగింది.
లుంబినీపార్కు ఎదురుగా ప్రధాన ద్వారం..
కొత్త సచివాలయం ప్రధాన ద్వారం లుంబినీ పార్కు ఎదురుగా నిర్మితమవుతోంది. తెలంగాణ రాకముందు ఇక్కడే ప్రధాన ద్వారం ఉండేది. వాస్తుపరంగా అదే కుదరటంతో ఇప్పుడు అక్కడే ఆర్చితో కూడిన ప్రధాన మార్గాన్ని ఏర్పాటు చేస్తున్నారు. సీఎం కాన్వాయ్ ఇందులో నుంచే సచివాలయంలోకి ప్రవేశిస్తుంది.
మూడు దిశలు.. నాలుగు ప్రవేశ ద్వారాలు..
కొత్త సచివాలయానికి మొత్తం నాలుగు ద్వారాలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రధాన ద్వారం తూర్పు దిశలో లుంబినీకి ఎదురుగా రానుండగా, ఎన్టీఆర్ గార్డెన్స్ వైపు ఉన్న గేటు వద్ద ఉద్యోగుల ప్రవేశ ద్వారం నిర్మిస్తున్నారు. ఇక ప్రస్తుతం బిర్లామందిరం వైపు రోడ్డులో ఉన్న పౌరసరఫరాల శాఖ పెట్రోలు బంకును తొలగించారు. దాన్ని సికింద్రాబాద్ ఆర్.పి.రోడ్డులోకి మారుస్తున్నారు.
తొలగించిన పెట్రోలు బంకు ఉన్న ప్రాంతంలో సందర్శకుల కోసం గేటు నిర్మిస్తున్నారు. దానికి తెలుగుతల్లి ఫ్లైఓవర్ దిగువ కూడలి నుంచి నేరుగా ఓ రోడ్డు నిర్మించారు. వాస్తుపరంగా మూడు ద్వారాలు ఉండటం సరికాదన్న ఉద్దేశంతో, భవనం వెనకవైపు మింట్ దిశలో నాలుగో ద్వారాన్ని నిర్మిస్తున్నారు. దాన్ని అత్యవసర ద్వారంగా వాడతారు. అత్యవసర పరిస్థితిలో తప్ప సాధారణ రోజుల్లో దాన్ని వినియోగించరు.
Comments
Please login to add a commentAdd a comment