- నత్తనడకన డ్రెడ్జింగ్ పనులు
- మరో రెండేళ్లు పొడిగించాలని కాంట్రాక్టర్ల వినతి
- రైతుల్లో ఆందోళన
మచిలీపట్నం, న్యూస్‌లైన్ : అష్టకష్టాలు పడి సాగుచేసిన పంట చేతికందే సమయంలో రైతులను నట్టేట‘ముంచి’ నష్టాల నావ ఎక్కిస్తున్న డ్రెయిన్ల తవ్వకాలు నత్తనడకన సాగుతున్నాయి. రెండేళ్ల క్రితమే టెండర్లు పూర్తయినా ఇంకా కొన్ని పనులను ప్రారంభించకపోగా... ప్రారంభించిన పనులను డెల్టా ఆధునికీకరణ ముసుగులో కాంట్రాక్టర్లు తీవ్ర జాప్యం చేస్తున్నారనే ఆరోపణలున్నాయి.
సముద్ర తీరంలోని మొవ్వ, ఘంటసాల, చల్లపల్లి, బందరు. మోపిదేవి తదితర మండలాల పరిధిలోని లక్ష ఎకరాల్లోని మురుగునీటిని సముద్రంలో కలిపే గుండేరు డ్రెయిన్ 44 కిలోమీటర్ల పొడవు ంది. ఈ డ్రెయిన్‌కు 0నుంచి 16 వ కిలో మీటరు వరకు డ్రెడ్జింగ్ ద్వారా పూడిక తీయాలని నిర్ణయించారు. మూడేళ్ల క్రితం ఈ పనులకు టెండర్లు పిలిచారు. రూ. 20 కోట్ల అంచనాలతో టెండర్లు పిలవగా రూ.18 కోట్లకు పనులను కాంట్రాక్టరు దక్కించుకున్నారు. టెండర్లు పూర్తయిన మూడేళ్ల వ్యవధిలో పూడికతీత పనులు పూర్తిచేయాలనే నిబంధన ఉంది.
అయితే రెండేళ్లుగా కాంట్రాక్టర్ పనులే ప్రారంభించలేదు. పదిరోజుల క్రితం గుండేరు డ్రెయిన్ 0.0 కిలోమీటరు వద్ద డ్రెడ్జింగ్‌పనులను ప్రారంభించారు. ఈ పది రోజుల వ్యవధిలో డ్రెయిన్‌కు ఒకవైపున కిలోమీటరు మేర డ్రెడ్జింగ్ చేశారని డ్రెయినేజీ అధికారులు చెబుతున్నారు. రెండు సంవత్సరాలుగా పనులు చేయని కాంట్రాక్టర్ గడచిన రెండేళ్ల కాలపరిమితిని ఇప్పటినుంచి పొడిగించాలని కోరుతూ ఉన్నతాధికారులకు లేఖ రాయడం పట్ల రైతులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
రసాయనాల పిచికారీకి బ్రేక్....
గతంలో వేసవి కాలంలో డ్రెయిన్లలో పేరుకుపోయిన తూడు, గుర్రపుడెక్క, నాచులను తొలగించేందుకు రసాయనాలు పిచికారీ చేసేవారు. గత రెండు సంవత్పరాలుగా రసాయనాల పిచికారీని నిలిపివేసినట్లు అధికారులు చెబుతున్నారు. గతంలో సాగునీటి సంఘాల ద్వారా డ్రెయిన్లలో రసాయనాల పిచికారీ కార్యక్రమాన్ని నిర్వహించేవారు. సాగునీటి సంఘాల పదవీ కాలం రెండేళ్ల క్రితమే ముగియడంతో డ్రెయిన్ల ఆలనాపాలనా పట్టించుకునేవారే కరువయ్యారు. దీనికి తోడు డ్రె యిన్ పనులను దక్కించుకున్న కాంట్రాక్టర్లు పనులు పూర్తి చేసిన ఏడాది కాలం వరకు డ్రెయిన్‌లలో తూడు, గుర్రపుడెక్క, నాచులను వారే తొలగించాలనే నిబంధన ఉంది. కాంట్రాక్టర్ పనులు చేయక, డ్రెయినేజీ అధికారులు పట్టించుకోకపోవడంతో మేజర్, మైనర్ డ్రెయిన్లలో పూడికతీత పనులు ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఖరీఫ్‌లో కోలుకోలేని దెబ్బ ...
జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌లో పంట చేతికొచ్చే సమయానికి హెలెన్, లెహర్ తుపానులు సంభవించాయి. ప్రధాన డ్రెయిన్లతోపాటు మైనర్ డ్రెయిన్లు పూడుకుపోవడంతో చేతికొచ్చేదశలో వరి పంట దాదాపు 2 లక్షల ఎకరాల్లో దెబ్బతింది. రోజుల తరబడి పంట నీటిలోనే నాని పోవడంతో గత ఖరీప్‌సీజన్‌లో జిల్లా రైతులు దాదాపు రూ.200 కోట్ల పంటలను కోల్పోయినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఇంత నష్టం జరుగుతున్నా డ్రెయినేజీ అధికారులు కాంట్రాక్టర్లతో పనులు చేయించేందుకు చొరవ చూపకపోవడం పట్ల రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గుండేరు డ్రెయిన్ పరిస్థితి ఇలా ఉంటే మిగిలిన డ్రెయిన్లలోనూ పూడికతీత పనులు ఆశించినమేర జరగడం లేదని రైతులు చెబుతున్నారు.
గూడూరు. బందరు మండలాల్లోని పలుగ్రామాల ఆయక ట్టునుంచి మురుగునీటిని సముద్రంలో కలిపే శివగంగ డ్రెయిన్ మొత్తం 11.50 కిలోమీటర్ల పొడవు ఉంది. రూ.1.59 కోట్ల అంచనాలతో 0.0 నుంచి 6.0 కిలో మీటర్ల వరకు డ్రెడ్జింగ్ ద్వారా మిగిలిన డ్రెయిన్ లో యంత్రాల ద్వారా పూడిక తీశారు. అయితే ఈడ్రెయిన్ గట్లను బలోపేతం చేయకుండా ఎక్కడి మట్టిని అక్కడే వదిలేశారు. దీంతో రైతుల అగచాట్లు అన్నీ, ఇన్నీ కాకుండా పోయాయి.