సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: టీడీపీ నాయకుని భూ దందాకు తెరపడింది. భవన నిర్మాణ పనులను రెవెన్యూ అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు అమీన్‌పూర్ గ్రామంలోని సర్వే నంబర్ 993లో నిబంధనలకు విరుద్ధంగా కేటాయించిన 20 గుంటల స్థలాన్ని తిరిగి వెనక్కి తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. సదరు నేత భూ ఆక్రమణపై ‘టీడీపీ నేత భూ దందా’ అనే శీర్షికతో శనివారం ‘సాక్షి’ కథనం ప్రచురితం కాగా, నీటిపారుదల శాఖ మంత్రి హారీష్‌రావు, దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి స్పందించారు.
ప్రభుత్వ ఆస్తులను కాపాడడంలో ‘సాక్షి’ చూపిన చొరవ అభినందనీయమన్నారు. మిగతా పత్రికలు కూడా ‘సాక్షి’ ఆదర్శంగా తీసుకుని సర్కార్ స్థలాలను కాపాడాలని రామలింగారెడ్డి సూచించారు. ఇక ఈ భూ ఆక్రమణపై సీరియస్‌గా స్పందించిన మంత్రి హరీష్‌రావు సమగ్ర నివేదిక ఇవ్వాలని జిల్లా కలెక్టర్ రాహుల్ బొజ్జాను ఆదేశించారు.
దీంతో రెవెన్యూ యంత్రాంగం అఘమేఘాల మీద అమీన్‌పూర్‌లో టీడీపీ నాయకుడు కడుతున్న అధునాతన ఫంక్షన్ హాల్‌ను సందర్శించి, భవన నిర్మాణ పనులను నిలిపివేశారు. పటాన్‌చెరు తహశీల్దార్ మహిపాల్‌రెడ్డి, రోడ్లు, భవనాల శాఖ సహాయక ఇంజనీర్ రాఖశేఖర్ భవన నిర్మాణాన్ని పరిశీలించారు. గ్యాస్ గోదాం నిర్మాణం కోసం స్థలాన్ని పొందిన సదరు నేత ప్రభుత్వాన్ని మోసం చేసి ఫంక్షన్ హాలు కడుతున్నట్లు తహశీల్దార్ మహిపాల్‌రెడ్డి నిర్ధారించారు.
ఇదే కారణాన్ని చూపుతూ ‘ఇచ్చిన భూమిని ఎందుకు వెనక్కి తీసుకోకూడదో’ వివరణ ఇవ్వాలని సదరు టీడీపీ నాయకునికి నోటీసులు జారీ చేశారు. మరోవైపు అమీన్‌పూర్ గ్రామ పంచాయతీ కూడా దిద్దుబాటు చర్యలు చేపట్టింది. తాము అనుమతించిన భవన నిర్మాణ ప్లాన్ కు విరుద్ధంగా భవన నిర్మాణం చేపడుతున్నందున అనుమతిని పూర్తిగా రద్దు చేయాలని నిర్ణయించింది.
ఈ మేరకు గ్రామ పంచాయతీ కార్యదర్శికి ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చినట్టు తెలిసింది. కాగా ఇండియన్ గ్యాస్ గోదాం నిర్మాణం కోసం భూమిని పొందిన టీడీపీ నేత గ్రామ పంచాయతీకి మాత్రం ‘కన్వెన్షన్ సెంటర్’ నిర్మాణం కోసం అనుమతించాలని దరఖాస్తు చేసుకోవడం గమనార్హం.
అక్రమ నిర్మాణంపై హరీష్ సీరియస్
Published Sun, Feb 1 2015 5:48 AM | Last Updated on Fri, Aug 10 2018 9:42 PM
Advertisement