
ముంపునకు కళ్లెం!
సుదీర్ఘకాలంగా రెండు నియోజకవర్గాల ప్రజలను ‘ముంపు'తిప్పలు పెడుతున్న కొండవీటి వాగు ఆగడాలకు కళ్లెం వేసే దిశగా ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులు అడుగులు వేస్తున్నారు. ఎన్నో ఏళ్ల నుంచి మంగళగిరి, తాడికొండ ప్రాంత రైతుల కంటి మీద కునుకు లేకుండా చేస్తోన్న వాగు వరద ముంపునకు శాశ్వత పరిష్కారం చూపాలని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) చేసిన సూచనలను పరిగణలోకి తీసుకున్న నిపుణుల కమిటీ ఎట్టకేలకు శనివారం హైదరాబాద్‌లో సమావేశమైంది.
సాక్షి ప్రతినిధి, గుంటూరు :
కొత్త రాజధానిని కొండవీటివాగు వరద ముంచెత్తకుండా నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికపై ఇరిగేషన్ శాఖ ఉన్నతస్థాయి సమావేశం శనివారం హైదరాబాద్‌లో జరిగింది. మంగళగిరి, తాడికొండ నియోజకవర్గాల్లోని 20 వేల హెక్టార్లలో పంటను కొండవీటి వాగు వరద నుంచి కాపాడడమే కాకుండా కొత్త రాజధాని తాగు నీటి అవసరాలు తీర్చాలని ఈ కమిటీ నిర్ణయానికి వచ్చింది. ఇందుకు మూడు లేక నాలుగు చెరువుల్లో నీటిని నిల్వచేయాలని నిర్ణయం తీసుకున్నారు.
డెల్టా ఆధునీకరణపై ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ ఈ నెల 12న జిల్లాలో పర్యటించింది. ఈ సందర్భంగా సాగునీటి, మురుగు నీటి ాలువల పరిస్థితులను పరిశీలించారు. ప్రజాప్రతినిధులు, రైతుల నుంచి అభిప్రాయాలను తెలుసుకున్నారు.
కొండవీటివాగు ముంపు నివారణకు శాశ్వత పరిష్కారం చూపాలని, డెల్టా ఆధునీకరణకు ముందే కొండవీటివాగు సమస్య పరిష్కరించాలని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) నిపుణుల కమిటీని కోరారు.
అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న నిపుణుల కమిటీ కొండవీటివాగు ముంపు సమస్య పరిష్కారానికి ప్రభుత్వానికి ఒక నివేదిక అందచేసింది. దీనిపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించడంతో నిపుణుల కమిటీతోపాటు ఇరిగేషన్‌శాఖ ఫీల్డు స్థాయి ఇంజినీర్లు సమావేశమయ్యారు.
కొండవీటి వాగు పరీవాహక ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్న డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లతోపాటు పలువురు పాల్గొన్నారు.
కొండవీటి వాగు వల్ల ప్రతి ఏటా తాడేపల్లి, మంగళగిరి, తాడికొండ, అమరావతి మండలాల్లో 20 వేల హెక్టార్లలో వాణిజ్య పంటలు నీట మునిగి ఆ ప్రాంత రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారని, వాగుకు వచ్చే 5,600 క్యూసెక్కుల వరదనీరు వల్ల ఉల్లి, పత్తి, కూరగాయలు, మిరప, చెరకు, పసుపు, కంద, వరి తదితర పంటలు పూర్తిగా దెబ్బతింటున్నాయని వారు తెలిపారు.
వాగు ప్రవహించే గ్రామాల్లో చిన్న, చిన్న రిజర్వాయర్లు, చెరువులు
నిర్మించి, వర్షం నీరు నిల్వ చేయడం వల్ల, భూగర్భజలాలు పెరిగే అవకాశం ఉందని తెలిపారు.
అలాగే వాగుకు ఇరువైపులా రిటైనింగ్ వాల్ నిర్మిస్తే, రవాణా సౌకర్యం మెరుగుపడి, రైతులు తమ పంటలను త్వరితగతిన మార్కెట్‌కు తరలించే అవకాశం ఉంటుందన్నారు.
ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే) ఇచ్చిన సూచనలను కూడా కమిటీ పరిశీలనలోకి తీసుకున్నది. అయితే వాగుకు వచ్చే 5,600 క్యూసెక్కులలో వరద నీటి కోసం కనీసం మూడు లేక నాలుగు చెరువులను నిర్మించి నిల్వ చేయాలనే ఆలోచనకు వచ్చినట్టు తెలిసింది.
కొత్త రాజధాని కృష్ణానదికి సమీపంలోని తాడికొండ, వైకుంఠపురం తదితర ప్రాంతాల్లో నిర్మించనున్న నేపథ్యంలో అక్కడి ప్రజలు, మంగళగిరి, తాడేపల్లి తదితర ప్రాంతాల ప్రజల అవసరాలకు ఈ నీటిని చెరువుల్లో నిల్వ చేయాలనే అభిప్రాయానికి వచ్చినట్టు తెలిసింది.