సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర సాగునీటి శాఖ దేశానికే దిక్సూచిగా నిలిచిందని.. తెలంగాణ సాగునీటి రంగంలో 60 ఏళ్లపాటు జరిగినదానికి సమానంగా గత నాలుగేళ్లలో అద్భుతమైన ప్రగతి చోటుచేసుకుందని నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. గత అరవై ఏళ్లలో తెలంగాణలో ఇరవై లక్షల ఎకరాలు సాగులోకి వస్తే.. రాష్ట్రం ఏర్పాటైన తర్వాత టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపట్టిన చర్యలతో అంతే స్థాయిలో అదనపు ఆయకట్టు సాగులోకి వస్తోందని చెప్పారు.
ముఖ్యమంత్రి ప్రాజెక్టుల రీ–డిజైనింగ్‌లో సోషల్ ఇంజనీర్‌గా వ్యవహరిస్తే.. క్షేత్రస్థాయిలో ఇంజనీర్లు, ఇతర సిబ్బంది సైనికుల్లా పనిచేశారని ప్రశంసించారు. గురువారం హైదరాబాద్‌లోని ఖైరతాబాద్‌లో ఉన్న ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్‌లో ‘సాగునీటి ప్రాజెక్టులు– నాలుగేళ్ల ప్రగతి’అంశంపై రాష్ట్ర స్థాయి సదస్సు జరిగింది. సీఎస్ ఎస్‌కే జోషితోపాటు సాగునీటి శాఖ ఈఎన్‌సీలు మురళీధర్, నాగేంద్రరావు, సీఈలు సునీల్, శంకర్, మధుసూదన్‌రావు ఇతర ఇంజనీర్లు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
ఈ సందర్భంగా సాగునీటి ప్రగతిపై మంత్రి ప్రజెంటేషన్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ తన పదేళ్ల హయాంలో 5.71 లక్షల ఎకరాలకే నీరిచ్చిందని, అన్ని ప్రాజెక్టులను పెండింగ్‌లోనే పెట్టిందని హరీశ్ ఆరోపించారు. అదే తమ ప్రభుత్వం వచ్చాక పాత వాటిని పూర్తి చేస్తూనే.. కొత్త ప్రాజెక్టులను పరుగులు పెట్టిస్తోందని చెప్పారు.
అందరి సహకారంతో విజయం..
నిజాంసాగర్, నాగార్జునసాగర్, శ్రీరాంసాగర్‌ల కింద మొత్తంగా 18.6 లక్షల ఎకరాల మేర ఆయకట్టు ఉంటే.. ఈ ఏడాది రబీలో ఏకంగా 13 లక్షల ఎకరాలకు నీరందిందని హరీశ్‌రావు తెలిపారు. ‘‘ఇప్పుడు రైతాంగం ఎక్కడా నీటి కోసం ధర్నాలు, రాస్తారోకోలు చేయడం లేదు. రైతులకు ఈ ఏడాది 13 లక్షల ఎకరాలకు నీరు ఇచ్చిన ఘనత మన కేసీఆర్‌కే చెల్లింది. ప్రతిసారి శాసనసభ సమావేశాల్లో ప్రతిపక్షాలు ఆయకట్టు చివరి భూములకు నీరు ఇవ్వాలన్న డిమాండ్లతో ప్రభుత్వంపై దుమ్మెత్తి పోసేవి.
కానీ ఇప్పుడు అలాంటి డిమాండ్ లేకపోవడం మా శాఖ గౌరవాన్ని ఇనుమడింపజేసింది. నీటి యాజమాన్య పద్ధతులు, ఇంజనీర్ల నిరంతర పర్యవేక్షణ, వివిధ శాఖలతో సమన్వయం కారణంగా ప్రాజెక్టుల కింద చివరి ఆయకట్టు వరకు నీరు అందించగలిగాం.’’అని పేర్కొన్నారు. ఇక మిషన్ కాకతీయ పథకం దేశానికే ఆదర్శంగా నిలిచిందని, మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు దాని అమలుకు ముందుకొచ్చాయని చెప్పారు.
కాళేశ్వరం 19 ప్రాజెక్టులతో సమానం
కాళేశ్వరం ప్రాజెక్టు ఒక అద్భుత ప్రయోగమని, ఇది 19 ప్రాజెక్టుల నిర్మాణంతో సమానమని హరీశ్ పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టుకు అనుమతుల సాధన ఓ రికార్డయితే.. ప్రపంచ రికార్డులు బద్దలు కొట్టేలా ప్రాజెక్టు నిర్మాణం జరుగుతోందని చెప్పారు. 139 మెగావాట్ల విద్యుత్ సామర్థ్యంతో నడిచే పంపులు వినియోగించడం ఆసియాలోనే తొలిసారని వివరించారు. ఈ ఏడాదిలోనే పాత వరంగల్ జిల్లాతో పాటు సూర్యాపేట జిల్లాకు ఈ ప్రాజెక్టు తొలి ఫలితాలు అందుతాయని తెలిపారు.
సీఎం కేసీఆర్ వినూత్న ఆలోచనా విధానం, దాన్ని అమలుచేస్తున్న సాగు నీటి శాఖ గొప్పతనంతో ప్రాజెక్టు పరుగులు పెడుతోందని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో 1,832 కిలోమీటర్లు నీటిని సరఫరా చేసే మార్గాలు, 1,531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్‌లు, 203 కిలోమీటర్ల గ్రావిటీ టన్నెళ్లు, 98 కిలోమీటర్ల ప్రెషర్ పైప్‌లైన్లు, 22 లిఫ్టులు, 21 పంపుహౌజ్‌లు, 4,627 మెగావాట్ల విద్యుత్ సబ్‌స్టేషన్లు ఉన్నాయని హరీశ్ చెప్పారు.
ఇలా ఒక ప్రాజెక్టులో భాగంగా ఇన్నింటిని నిర్మించడం ప్రపంచ రికార్డన్నారు. సాగునీటి శాఖలో సుదీర్ఘ కాలం ఒకే ఐఏఎస్ అధికారి పనిచేయడం అరుదైన విషయమని, అలాంటి ఘనత సీఎస్ ఎస్కే జోషి గడించారని కొనియాడారు. ఈ సందర్భంగా నీటి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ చూపిన అధికారుల ను మంత్రి మొమెంటోలతో సత్కరించారు.
ప్రజెంటేషన్‌లోని ముఖ్యాంశాలివీ..
♦ 2004–2014 మధ్య కాలంలో సాగులోకి వచ్చిన కొత్త ఆయకట్టు 5.71 లక్షల ఎకరాలుకాగా.. స్థిరీకరణ జరిగింది 93 వేల ఎకరాలే. ఇందులో ఏఎంఆర్‌పీ, ఎస్సారెస్పీ–2 కింద 5.56 లక్షల ఎకరాలకు నీరిచ్చినట్టు చెప్పినా పారింది 1.5 లక్షల ఎకరాలు మాత్రమే.
♦ టీఆర్‌ఎస్ నాలుగేళ్ల హయాంలో ఎనిమిది పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయగా.. మరో 11 ప్రాజెక్టులను పాక్షికంగా పూర్తి చేసింది. దీంతో కొత్తగా 10 లక్షల ఎకరాలకు నీరివ్వడంతోపాటు మరో 15.72 లక్షల ఎకరాలను స్థిరీకరించడం జరిగింది. 2018–19లో మరో 10 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు సాధించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోంది.
♦ మిషన్ కాకతీయలో భాగంగా పునరుద్ధరించిన చెరువుల కింద మొదటి దశలో 6.73 లక్షల ఎకరాలు, రెండో దశలో 4.29 లక్షలు, మూడో దశలో 1.45 లక్షల ఎకరాలకు కలిపి మొత్తంగా 12.47 లక్షల ఆయకట్టు స్థిరీకరణ జరిగింది. చెరువుల్లో 8.10 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం పెరిగింది. కొత్తగా 1.05 లక్షల ఎకరాలు సాగులోకి వచ్చింది.
♦ మహబూబ్‌నగర్ జిల్లాలో నాలుగు (కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్‌సాగర్) ఎత్తిపోతల పథకాల కింద 2016–17లో 4.5 లక్షల ఎకరాలకు, 2017–18 ఏడాది రబీలో 6.50 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడంతోపాటు 700 చెరువులు నిండాయి. దీంతో వలసలు ఆగాయి.
♦ప్రభుత్వం తెలంగాణలో పాత సాగునీటి ప్రాజెక్టులను పునరుద్ధరించాలని సంకల్పించింది. నాగార్జునసాగర్, నిజాంసాగర్, ఘనపూర్ ఆనకట్ట కాలువల ఆధునీకరణ పనులను పూర్తిచేసి మొత్తం ఆయకట్టుకు నీరందిస్తున్నాం. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కాలువల ఆధునీకరణ కోసం ప్రభుత్వం వెయ్యి కోట్ల నిధులను మంజూరు చేసింది. పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment