విపక్షాల నోళ్లు మూయించాం
♦ మిషన్ కాకతీయతో అద్భుత ఫలితాలు సాధించాం: హరీశ్
♦ మొదటి విడత స్ఫూర్తితో రెండో విడతకు సిద్ధం కావాలి
♦ జనవరి నుంచే పనులకు శ్రీకారం చుట్టాలని అధికారులకు సూచన
♦ సంకుచిత రాజకీయాలకు ప్రభుత్వ చేతలే సమాధానం: ఈటల
♦ 1,200 మంది ఇంజనీర్లతో మిషన్ కాకతీయపై జేఎన్‌టీయూలో సదస్సు
సాక్షి, హైదరాబాద్: మిషన్ కాకతీయను కమీషన్ కాకతీయ అంటూ విమర్శించిన విపక్షాల నోళ్లను మూయించామని సాగునీటి పారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. అనేక జిల్లాల్లో అద్భుత ఫలితాలు సాధించామని చెప్పారు. చెరువుల పునరుద్ధరణ పనులు ఖమ్మం, ఆదిలాబాద్, వరంగల్ జిల్లాలో మంచి ఫలితాలనిచ్చాయన్నారు. కరువు పరిస్థితుల్లోనూ ఖమ్మంలో 5 లక్షల ఎకరాల ఆయకట్టు సాధ్యమైందని చెప్పారు. 22 శాతం లెస్‌కు టెండర్లు ఖరారు కావడంతో రూ.600 కోట్లు, రైతులు పూడిక మట్టిని తరలించుకోవడం ద్వారా మరో రూ.400 కోట్ల మేర ప్రభుత్వానికి ఆదా అయిందని తెలిపారు.
చెరువుల పునరుద్ధరణకు ఉద్దేశించిన మిషన్ కాకతీయ మొదటి విడత పనుల సమీక్ష, రెండో విడత పనుల సన్నద్ధతపై సోమవారం కూకట్‌పల్లిలోని జేఎన్‌టీయూ ఆడిటోరియంలో నీటి పారుదల శాఖ సదస్సు నిర్వహించింది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రులు హరీశ్, ఈటల రాజేందర్ పాల్గొన్నారు. సూపరింటెండెంట్ అధికారి నుంచి అసిస్టెంట్ ఇంజనీర్ల వరకు మొత్తం 1,200 మంది ఇంజనీర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా హరీశ్ మాట్లాడుతూ.. మొదటి విడత స్ఫూర్తితో రెండో విడతకు సిద్ధం కావాలని, జనవరి నాటికే అంచ నాలు, అనుమతులు, టెండర్ల ప్రక్రియ ముగించి పనులు ఆరంభించాలని సూచించారు. రెండో విడతకు రూ.2,083 కోట్లు కేటాయించనున్నట్లు తెలిపారు.
మిషన్ కాకతీయలో 411 పోస్టుల భర్తీకి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, మరో 150 మంది రిటైర్డ్ ఇంజనీర్ల సేవలను వినియోగించుకుంటామని వివరించారు. ఈ సందర్భంగా ఉత్తమ ప్రతిభ కనబరచిన ఇంజనీర్లకు మంత్రి ప్రశంసా పత్రాలు అందించారు. కూకట్‌పల్లికి చెందిన వెంకట్‌రాంరెడ్డి అనే వ్యక్తి మిషన్‌కు రూ.2 లక్షల విరాళం ప్రకటించగా.. యాదగిరిగుట్ట అర్చకులు తమ ఒకరోజు వేతనాన్ని ఇచ్చేందుకు ముందుకు వచ్చినట్లు మంత్రి తెలిపారు.
సత్తా చాటాం..
తెలంగాణ సంకల్ప బలం, సత్తా ఎలాంటిదో మిషన్ కాకతీయ ద్వారా మరోమారు ప్రపంచానికి చాట గలిగామని మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. తెలంగాణ పాలకులకు పరిపాలించుకునే సామర్థ్యమే కాదు.. రాష్ట్రాన్ని ప్రపంచంలో నంబర్‌వన్‌గా నిలిపే సామర్థ్యం ఉందని కేవలం 18 నెలల పాలనతో నిరూపించామని పేర్కొన్నారు. రాజకీయ కుట్రలకు, సంకుచిత రాజకీయాలకు ప్రభుత్వం మాటల ద్వారా కాకుండా చేతల ద్వారా సమాధానం చెబుతోందన్నారు. ఎవరైనా మిషన్ కాకతీయ వంటి కార్యక్రమాన్ని విమర్శిస్తే వారు సూర్యుడిపై ఉమ్మి వేసినట్లేనని, వారంతా పాతాళానికి పోతారని వ్యాఖ్యానించారు.
‘‘రాష్ట్రంలో రైతును ఆదుకునేందుకు ఇప్పటికే రూ.17 వేల కోట్ల రుణమాఫీని ప్రకటించాం. అందులో 50 శాతం మాఫీని పూర్తి చేశాం. వ్యవసాయాన్ని గాడిన పెట్టి రైతులను ఆదుకునేందుకు దీర్ఘ, మధ్యకాలిక వ్యూహాలతో ప్రభుత్వం ముందుకు పోతోంది. ఇందులో భాగంగానే చెరువుల పునరుద్ధరణ, ప్రాజెక్టుల పూర్తికి చర్యలు తీసుకుంటోంది’’ అని అన్నారు. నీటి పారుదల శాఖ పరిధిలో జటిలమైన చట్టాలుంటే వాటిని సరళతరం చేసేందుకు సీఎం సిద్ధంగా ఉన్నారన్నారు. అవసరమైతే చట్టాన్ని వంద మార్లు అయినా మార్చేందుకు సిద్ధమని, చట్టాల పేరిట అభివృద్ధి ఆగొద్దని సీఎం తమతో పదేపదే అంటారని చెప్పారు.