తోటపల్లి దారిలోనే మోతె రిజర్వాయర్!
మోతె రిజర్వాయర్‌నూ రద్దుచేయాలని ప్రభుత్వ నిర్ణయం
{పాణహిత నీళ్లొస్తున్నందున వరద కాల్వ కింద రిజర్వాయర్ అవసరం లేదు..
అధికారులతో ప్రభుత్వ సలహాదారు విద్యాసాగర్‌రావు, ఎస్‌కే జోిషీ సమీక్ష
హైదరాబాద్: శ్రీరాంసాగర్ ఇందిరమ్మ వరద కాల్వ పథకంలో భాగంగా ఉన్న తోటపల్లి రిజర్వాయర్ నిర్మాణాన్ని రద్దు చేసిన ప్రభుత్వం తాజాగా మోతె రిజర్వాయర్‌ను కూడా రద్దు చేయాలని నిర్ణయించింది. ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకు దీనిపై నీటి పారుదల శాఖ త్వరలోనే ఉత్తర్వులు సైతం వెలువరించే అవకాశం ఉంది. ప్రాణహిత-చేవెళ్ల పథకం ద్వారా ప్రస్తుతం మిడ్‌మానేరు వరకు నీళ్లిచ్చే యత్నాలు కొనసాగుతున్నందున అంతకుముందే ఆమోదించిన మోతె రిజర్వాయర్‌తో పెద్దగా అవసరం లేదన్న భావనతో ప్రభుత్వం ఉంది. ఈ రిజర్వాయర్ల టెండర్లను సైతం ప్రభుత్వం రద్దు చేయనుంది.
ఎస్సారెస్పీ ఇందిరమ్మ వరద కాల్వ పథకంలో భాగంగా కరీంనగర్, వరంగల్ జిల్లాలో సాగునీరు అందించడానికి మిడ్‌మానేరు, గౌరవెల్లి రిజర్వాయర్లతో పాటు మోతె, తోటపల్లి, గండిపల్లి రిజర్వాయర్లను ప్రతిపాదించారు. ఇందులో తోటపల్లి కింద 49 వేల ఎకరాలు, మోతె కింద 20 వేల ఎకరాల ఆయకట్టును ప్రతిపాదించారు. అయితే, మిడ్‌మానేరు రిజర్వాయర్ ద్వారానే తోటపల్లి నిర్దేశిత ఆయకట్టుకు కూడా నీరిచ్చే అవకాశం ఉండడంతో 2,227 ఎకరాలు, ఆరు గ్రామాలు ముంపునకు గురయ్యే ఈ రిజర్వాయర్ అవసరం లేదని భావించిన ప్రభుత్వం దానిని రద్దు చేసింది. దీనిపై విపక్షాల నుంచి నిరసనలు కొనసాగుతుండగానే ఎస్సారెస్పీ దిగువన, మిడ్‌మానేరు ఎగువన 1.6 టీఎంసీల సామర్ధ్యంతో నిర్మించదలిచిన మోతె రిజర్వాయర్‌ను రద్దు చేయాలని నిర్ణయించడం గమనార్హం. రూ.140 కోట్లతో ఈ రిజర్వాయర్ నిర్మాణ పనుల టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్ ఏళ్లయినా ఇంతవరకు పనులు ప్రారంభించలేదు. దీనికి తోడు ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు మెయిన్ కెనాల్ సైతం ఇక్కడి నుంచే మిడ్‌మానేరు వెళుతుంది. ఆ కెనాల్‌ల నుంచి డిస్ట్రిబ్యూటరీల ద్వారా మోతె కింది ఆయకట్టుకు నీరిచ్చే అవకాశం ఉంది. అలాంటప్పుడు ప్రత్యేకంగా మధ్యలో మోతె రిజర్వాయర్ అవసరం లేదని అధికారులు చెబుతున్నారు.
ఎందుకు రద్దు చేశామో చెబుదాం..
కాగా, ఈ నెల 16న లేక 17న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అఖిలపక్షం ముందు ప్రవేశపెట్టనున్న జల విధానం సందర్భంగా తోటపల్లి, మోతె రిజర్వాయర్ల రద్దుకు సంబంధించిన కారణాలను స్పష్టంగా వెల్లడించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు గురువారం జలసౌధలో జల విధానంపై నాలుగు గంటల పాటు నీటి పారుదల శాఖ చీఫ్ ఇంజనీర్లతో ప్రభుత్వ సలహాదారు విద్యాసాగర్‌రావు, ముఖ్య కార్యదర్శి ఎస్‌కే జోషి సమీక్షించినట్టు తెలిసింది. రీ ఇంజనీరింగ్‌లో భాగంగా ఎక్కడ రిజర్వాయర్లు అవసరమో, ఎక్కడ అవసరం లేదో వంటి అంశాలతో పాటు, వాటికి గల కారణాలను అన్ని ప్రజల ముందు పెట్టాలని నిశ్చయించారు. ఇదే సమీక్షలో ప్రధానంగా ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులో జరుగుతున్న మార్పులు, ప్రాణహిత, ఇంద్రావతి నదులను ఒడిసి పట్టుకునేందుకు ఉన్న అవకాశాలను వివరించేలా అన్ని నివేదికలు సిద్ధం చేసుకోవాలని అధికారులకు ప్రభుత్వ సలహాదారు ఆదేశించారు. ఖమ్మం జిల్లాలోని దుమ్ముగూడెం ప్రాజెక్టులను పొరుగు రాష్ట్రాల తో వివాదం లేకుండా ఏ విధంగా రీ ఇంజనీరింగ్ చేస్తున్న అంశాలను జల విధానంలో భాగంగా వివరించాలని నిర్ణయించారు.