Totapalli reservoir
-
తోటపల్లి దారిలోనే మోతె రిజర్వాయర్!
మోతె రిజర్వాయర్నూ రద్దుచేయాలని ప్రభుత్వ నిర్ణయం {పాణహిత నీళ్లొస్తున్నందున వరద కాల్వ కింద రిజర్వాయర్ అవసరం లేదు.. అధికారులతో ప్రభుత్వ సలహాదారు విద్యాసాగర్‌రావు, ఎస్కే జోిషీ సమీక్ష హైదరాబాద్: శ్రీరాంసాగర్ ఇందిరమ్మ వరద కాల్వ పథకంలో భాగంగా ఉన్న తోటపల్లి రిజర్వాయర్ నిర్మాణాన్ని రద్దు చేసిన ప్రభుత్వం తాజాగా మోతె రిజర్వాయర్‌ను కూడా రద్దు చేయాలని నిర్ణయించింది. ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకు దీనిపై నీటి పారుదల శాఖ త్వరలోనే ఉత్తర్వులు సైతం వెలువరించే అవకాశం ఉంది. ప్రాణహిత-చేవెళ్ల పథకం ద్వారా ప్రస్తుతం మిడ్‌మానేరు వరకు నీళ్లిచ్చే యత్నాలు కొనసాగుతున్నందున అంతకుముందే ఆమోదించిన మోతె రిజర్వాయర్‌తో పెద్దగా అవసరం లేదన్న భావనతో ప్రభుత్వం ఉంది. ఈ రిజర్వాయర్ల టెండర్లను సైతం ప్రభుత్వం రద్దు చేయనుంది. ఎస్సారెస్పీ ఇందిరమ్మ వరద కాల్వ పథకంలో భాగంగా కరీంనగర్, వరంగల్ జిల్లాలో సాగునీరు అందించడానికి మిడ్‌మానేరు, గౌరవెల్లి రిజర్వాయర్లతో పాటు మోతె, తోటపల్లి, గండిపల్లి రిజర్వాయర్లను ప్రతిపాదించారు. ఇందులో తోటపల్లి కింద 49 వేల ఎకరాలు, మోతె కింద 20 వేల ఎకరాల ఆయకట్టును ప్రతిపాదించారు. అయితే, మిడ్‌మానేరు రిజర్వాయర్ ద్వారానే తోటపల్లి నిర్దేశిత ఆయకట్టుకు కూడా నీరిచ్చే అవకాశం ఉండడంతో 2,227 ఎకరాలు, ఆరు గ్రామాలు ముంపునకు గురయ్యే ఈ రిజర్వాయర్ అవసరం లేదని భావించిన ప్రభుత్వం దానిని రద్దు చేసింది. దీనిపై విపక్షాల నుంచి నిరసనలు కొనసాగుతుండగానే ఎస్సారెస్పీ దిగువన, మిడ్‌మానేరు ఎగువన 1.6 టీఎంసీల సామర్ధ్యంతో నిర్మించదలిచిన మోతె రిజర్వాయర్‌ను రద్దు చేయాలని నిర్ణయించడం గమనార్హం. రూ.140 కోట్లతో ఈ రిజర్వాయర్ నిర్మాణ పనుల టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్ ఏళ్లయినా ఇంతవరకు పనులు ప్రారంభించలేదు. దీనికి తోడు ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు మెయిన్ కెనాల్ సైతం ఇక్కడి నుంచే మిడ్‌మానేరు వెళుతుంది. ఆ కెనాల్ల నుంచి డిస్ట్రిబ్యూటరీల ద్వారా మోతె కింది ఆయకట్టుకు నీరిచ్చే అవకాశం ఉంది. అలాంటప్పుడు ప్రత్యేకంగా మధ్యలో మోతె రిజర్వాయర్ అవసరం లేదని అధికారులు చెబుతున్నారు. ఎందుకు రద్దు చేశామో చెబుదాం.. కాగా, ఈ నెల 16న లేక 17న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అఖిలపక్షం ముందు ప్రవేశపెట్టనున్న జల విధానం సందర్భంగా తోటపల్లి, మోతె రిజర్వాయర్ల రద్దుకు సంబంధించిన కారణాలను స్పష్టంగా వెల్లడించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు గురువారం జలసౌధలో జల విధానంపై నాలుగు గంటల పాటు నీటి పారుదల శాఖ చీఫ్ ఇంజనీర్లతో ప్రభుత్వ సలహాదారు విద్యాసాగర్‌రావు, ముఖ్య కార్యదర్శి ఎస్కే జోషి సమీక్షించినట్టు తెలిసింది. రీ ఇంజనీరింగ్‌లో భాగంగా ఎక్కడ రిజర్వాయర్లు అవసరమో, ఎక్కడ అవసరం లేదో వంటి అంశాలతో పాటు, వాటికి గల కారణాలను అన్ని ప్రజల ముందు పెట్టాలని నిశ్చయించారు. ఇదే సమీక్షలో ప్రధానంగా ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులో జరుగుతున్న మార్పులు, ప్రాణహిత, ఇంద్రావతి నదులను ఒడిసి పట్టుకునేందుకు ఉన్న అవకాశాలను వివరించేలా అన్ని నివేదికలు సిద్ధం చేసుకోవాలని అధికారులకు ప్రభుత్వ సలహాదారు ఆదేశించారు. ఖమ్మం జిల్లాలోని దుమ్ముగూడెం ప్రాజెక్టులను పొరుగు రాష్ట్రాల తో వివాదం లేకుండా ఏ విధంగా రీ ఇంజనీరింగ్ చేస్తున్న అంశాలను జల విధానంలో భాగంగా వివరించాలని నిర్ణయించారు. -
‘తోటపల్లి’ని రద్దు చేయాలని రాస్తారోకో
తిమ్మాపూర్ : తోటపల్లి రిజర్వాయర్‌ను రద్దు చేయాలని కోరుతూ నిర్వాసిత గ్రామస్తులు మండలంలోని కొత్తపల్లిలో గురువారం రాస్తారోకో చేశారు. ఒగులాపూర్, ఇందుర్తి, వరుకోలు, ఎర్రగుంటపల్లె, రాంచంద్రాపూర్, గొట్లమిట్లకు చెందిన నిర్వాసితులు అరగంటపాటు ఆందోళన నిర్వహించారు. ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, టీపీసీసీ చైర్మన్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి దిష్టిబొమ్మలు దహనం చేశారు. తోటపల్లి రిజర్వాయర్‌ను రద్దు చేసి సేకరించిన భూములను తిరిగి రైతులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సేకరించిన భూములను పరిశ్రమలకు ఇస్తే ఒప్పుకునేది లేదన్నారు. కాలువల ద్వారా నీరు ఇవ్వడం హర్షనీయమన్నారు. రిజర్వాయర్ నిర్మించాలని పట్టుబడుతున్న కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, బీజేపీల వైఖరి అనాలోచితమని ఆరోపించారు. ఎల్ఎండీ ఎస్సై సతీష్‌కుమార్ సిబ్బందితో వచ్చి రాస్తారోకోను విరమింపజేశారు. ఇందులో హుస్నాబాద్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బద్దం నర్సింహారెడ్డి, ఎంపీటీసీలు ఆకుల మొగిలి, అందె సుజాత, టీఆర్ఎస్ నాయకులు, నిర్వాసితులు పాల్గొన్నారు. -
వారికి కావాల్సింది ప్రజలను ‘ముంచడమే’!
కాంగ్రెస్ పార్టీపై మంత్రి హరీశ్‌రావు ధ్వజం * తోటపల్లి రిజర్వాయరుతో ముంపు సమస్య * రెండు వాగులపై అక్విడక్టులు నిర్మిస్తాం * ముంపు లేకుండానే రెండు పంటలకు నీళ్లిస్తాం సాక్షి, హైదరాబాద్: ‘రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ నిర్మాణాత్మకంగా లేదు. ప్రభుత్వం చేపట్టే ప్రతీ కార్యక్రమాన్ని గుడ్డిగా వ్యతిరేకిస్తోంది. ప్రజలను ముంచడమే లక్ష్యంగా తోటపల్లి రిజర్వాయరును నిర్మించాలని పట్టుబడుతోంది’ అని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు మండిపడ్డారు. తోటపల్లి రిజర్వాయరు కోసం టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ధర్నా చేసి ఆరు గ్రామాలను ముంచమంటున్నారని, ముంపు లేకుండానే నిర్ణీత ఆయకట్టుకు రెండు పంటలకూ నీరిస్తామంటే వారు ఇష్టపడటంలేదని వ్యాఖ్యానించారు. మంత్రి బుధవారం తెలంగాణ భవన్లో రాష్ట్ర ప్రణాళిక మండలి ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి, ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్‌లతో కలసి విలేకకరులతో మాట్లాడారు. కాంట్రాక్టర్ల కోసం కాంగ్రెస్ ప్రాజెక్టులు చేపడితే, టీఆర్ఎస్ మాత్రం ప్రజల కోసం చేపడుతోందన్నారు. కాంట్రాక్టర్ల కోసమే రూపొందించిన తోటపల్లి రిజర్వాయరు వల్ల ఆరు గ్రామాలు, 3,800 ఇళ్లు ముంపునకు గురై వేలాది మంది నిరాశ్రయులుగా మారుతారని వివరించారు. ఈ రిజర్వాయరు 2008లో కాంగ్రెస్ హయాంలోనే మొదలైందని, 2014 వరకు కాంగ్రెస్సే అధికారంలో ఉందని, ఈ ఆరేళ్లలో కనీసం ఆరు తట్టల మట్టికూడా తవ్వలేదని హరీశ్‌రావు ఎద్దేవాచేశారు. 1.70 టీఎంసీల సామర్థమున్న రిజర్వాయరైనా, అందులో వాడుకునేది కేవలం 0.25 టీఎంసీలేనని చెప్పారు. అయినా తోటపల్లి కోసం వెయ్యి కోట్లు ఖర్చు పెట్టాలా, దీనిస్థానంలో కేవలం 100 కోట్లతో మోయతుమ్మెద, ఎల్లమ్మగడ్డ వాగులపై అక్విడక్టులు నిర్మిస్తే ఆరు ముంపు గ్రామాలకూ రెండు పంటలకు నీళ్లు ఇవ్వొచ్చన్నారు. మిడ్‌మానేరులో 25 టీఎంసీల నీరు అందుబాటులో ఉంటుందని చెప్పారు. 2006లో మొదలుపెట్టిన మిడ్‌మానేరుకు ఎని మిదేళ్ల కాలంలో కాంగ్రెస్ కేవలం రూ.78కోట్లు ఖర్చు పెట్టిందని, కానీ, తాము ఏడాదిలోనే రూ.82 కోట్లు ఖర్చు చేశామని, మరి మిడ్‌మానేరును ఎవరు నిర్లక్ష్యం చే సినట్లో కాంగ్రెస్ నాయకులే చెప్పాలన్నారు. ధర్నాలు చేస్తూ రోడ్లెక్కితే ప్రజలు నమ్మరని, ఇన్నాళ్లూ కరీంనగర్ ప్రజలను కాంగ్రెస్ మోసం చేసిందని, వచ్చే ఏడాది కల్లా ఈ రెండు అక్విడక్టులను పూర్తి చే స్తామని హరీశ్‌రావు పేర్కొన్నారు. -
తీరానికి గుండె కోత
పాలకొండ:వర్షాకాలంలో నాగావళి నది ప్రవాహం వల్ల ప్రతి ఏటా రెండు నుంచి మూడు మీటర్ల మేరకు తీరం కోతకు గురవుతోంది. నదికి ఎడమ వైపు ఉన్న పాలకొండ, బూర్జ మండలాల పరిధిలో పలు గ్రామాలను తాకుతోంది. ఇదే పరిస్థితి మరి కొన్నాళ్లు కొనసాగితే వరదలు వచ్చినప్పుడు గ్రామాలకు గ్రామాలు కొట్టుకుపోయే ప్రమాదం ఏర్పడుతుంది. నదిలో ఓ వైపు ఇసుక తవ్వేస్తుండటంతో నీటి ప్రవాహం ఒకవైపునకే మళ్లిపోతూ తీరాన్ని కోతకు గురి చేస్తోంది. కొత్తగా అన్నవరం, అంపిలి, గోపాలపు రం, అల్లెన తదితర గ్రామాల వద్ద ఇసుక రీచులు ఏర్పా టు చేయనుండటంతో ఈ ప్రమాదం మరింత ఎక్కువగా ఉంటుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. తోటపల్లి రిజర్వాయర్ నుంచి శ్రీకాకుళం వరకు నాగావళి ప్రవహిస్తోంది. గతంలో నది మధ్య భాగం నుంచే ప్రవాహం కొనసాగేది. వరదల సమయంలో ఇసుక మేటలు వేయడంతో కాలక్రమంలో వీటిని అధికారులు ఇసుక రీచులుగా గుర్తించి తవ్వకాలకు అనుమతిస్తున్నారు. ఫలితంగా ఆ ప్రాంతాల్లో లోతు పెరిగి నదీ గమనం అటు మళ్లిపోతోంది. ఈ క్రమంలో నదికి ఎడమ వైపున ఉన్న వీరఘట్టం మండలంలో 12 గ్రామాలు, పాలకొండ మండలంలోని 8 గ్రామాలు, బూర్జ మండలంలో 6 గ్రామాలు, ఆమదాలవలస మండలంలో 14 గ్రామాల సమీపంలోకి ప్రవాహం చేరుకుంది. ప్రతి ఏటా కోత పెరుగుతూ గ్రామాలకు, నదికి మధ్య ఉన్న దూరం తరిగిపోతుండటంతో వరద ముప్పు పెరుగుతోంది. రీచులతో అనర్థాలు ఇసుక తవ్వకాల కోసం ప్రభుత్వం ఈ నాలుగు మండలాల పరిధిలో సుమారు 15 రీచులను గుర్తించింది. వీటిలో ఇసుక తవ్వకాలు చేపడితే నదీ వేగం మరింత పెరిగి పూర్తిగా గ్రామాలను ఆనుకొని ప్రవహించే ప్రమాదం ఉంది. ఈ భయంతోనే నదీ తీర గ్రామాల ప్రజలు ఇసుక రీచుల వేలాన్ని అడ్డుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే వరద ప్రమాదానికి అతి సమీపంలో ఉన్నామని, ఇప్పుడున్న ఇసుక దిబ్బలను కూడా తవ్వేస్తే గ్రామాలు కొట్టుకుపోతాయని అంపిలి గ్రామానికి చెందిన లోలుగు విశ్వేశ్వరరావు, గండి రామినాయుడు తదితరులు తెలిపారు. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్‌కు నివేదించనున్నట్టు వివరించారు. భూముల్లో ఇసుక మేటలు మరోవైపు నదికి కుడి భాగంలో ఉన్న రేగిడి మండలం సంకిలి, బొడ్డవలస గ్రామాల వద్ద పంట పొలాల్లో ఇసుక మేటలు వేస్తున్నాయి. గతంలో చెరుకు, వేరుశనగ పంటలు పండే పొలాలు ఇసుక దిబ్బలుగా మారిపోయాయి. ఇసుక తవ్వకాల వల్ల వరదల సమయాల్లో ప్రవాహం దిశ మారి పంట పొలాల పైకి వస్తోందని, ఇసుక మేటలు పేరుకుపోయి భూములు నిస్సారమవుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిలిచిన కరకట్టల నిర్మాణాలు వరద ప్రవాహాన్ని అడ్డుకొనేందుకు నిర్మించ తలపెట్టిన కరకట్టల నిర్మాణాలు అర్ధాంతరంగా నిలిచిపోవడం సమస్యను మరింత జఠిలం చేస్తోంది. అత్యంత ప్రమాదకరంగా ఉన్న అంపిలి, అన్నవరం, గోపాలపురం గ్రామాల మధ్య కనీసం గట్ల నిర్మాణం కూడా చేపట్టలేదు. దీని ప్రభావంతో నదిలో ప్రవాహం 60 వేల క్యూసెక్కులు దాటితే నదీ తీర గ్రామాలు మునిగిపోతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.