వారికి కావాల్సింది ప్రజలను ‘ముంచడమే’!
కాంగ్రెస్ పార్టీపై మంత్రి హరీశ్‌రావు ధ్వజం
* తోటపల్లి రిజర్వాయరుతో ముంపు సమస్య
* రెండు వాగులపై అక్విడక్టులు నిర్మిస్తాం
* ముంపు లేకుండానే రెండు పంటలకు నీళ్లిస్తాం
సాక్షి, హైదరాబాద్: ‘రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ నిర్మాణాత్మకంగా లేదు. ప్రభుత్వం చేపట్టే ప్రతీ కార్యక్రమాన్ని గుడ్డిగా వ్యతిరేకిస్తోంది. ప్రజలను ముంచడమే లక్ష్యంగా తోటపల్లి రిజర్వాయరును నిర్మించాలని పట్టుబడుతోంది’ అని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు మండిపడ్డారు.
తోటపల్లి రిజర్వాయరు కోసం టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ధర్నా చేసి ఆరు గ్రామాలను ముంచమంటున్నారని, ముంపు లేకుండానే నిర్ణీత ఆయకట్టుకు రెండు పంటలకూ నీరిస్తామంటే వారు ఇష్టపడటంలేదని వ్యాఖ్యానించారు. మంత్రి బుధవారం తెలంగాణ భవన్‌లో రాష్ట్ర ప్రణాళిక మండలి ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి, ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్‌లతో కలసి విలేకకరులతో మాట్లాడారు. కాంట్రాక్టర్ల కోసం కాంగ్రెస్ ప్రాజెక్టులు చేపడితే, టీఆర్‌ఎస్ మాత్రం ప్రజల కోసం చేపడుతోందన్నారు.
కాంట్రాక్టర్ల కోసమే రూపొందించిన తోటపల్లి రిజర్వాయరు వల్ల ఆరు గ్రామాలు, 3,800 ఇళ్లు ముంపునకు గురై వేలాది మంది నిరాశ్రయులుగా మారుతారని వివరించారు. ఈ రిజర్వాయరు 2008లో కాంగ్రెస్ హయాంలోనే మొదలైందని, 2014 వరకు కాంగ్రెస్సే అధికారంలో ఉందని, ఈ ఆరేళ్లలో కనీసం ఆరు తట్టల మట్టికూడా తవ్వలేదని హరీశ్‌రావు ఎద్దేవాచేశారు. 1.70 టీఎంసీల సామర్థమున్న రిజర్వాయరైనా, అందులో వాడుకునేది కేవలం 0.25 టీఎంసీలేనని చెప్పారు. అయినా తోటపల్లి కోసం వెయ్యి కోట్లు ఖర్చు పెట్టాలా, దీనిస్థానంలో కేవలం 100 కోట్లతో మోయతుమ్మెద, ఎల్లమ్మగడ్డ వాగులపై అక్విడక్టులు నిర్మిస్తే ఆరు ముంపు గ్రామాలకూ రెండు పంటలకు నీళ్లు ఇవ్వొచ్చన్నారు.
మిడ్‌మానేరులో 25 టీఎంసీల నీరు అందుబాటులో ఉంటుందని చెప్పారు. 2006లో మొదలుపెట్టిన మిడ్‌మానేరుకు ఎని మిదేళ్ల కాలంలో కాంగ్రెస్ కేవలం రూ.78కోట్లు ఖర్చు పెట్టిందని, కానీ, తాము ఏడాదిలోనే రూ.82 కోట్లు ఖర్చు చేశామని, మరి మిడ్‌మానేరును ఎవరు నిర్లక్ష్యం చే సినట్లో కాంగ్రెస్ నాయకులే చెప్పాలన్నారు. ధర్నాలు చేస్తూ రోడ్లెక్కితే ప్రజలు నమ్మరని, ఇన్నాళ్లూ కరీంనగర్ ప్రజలను కాంగ్రెస్ మోసం చేసిందని, వచ్చే ఏడాది కల్లా ఈ రెండు అక్విడక్టులను పూర్తి చే స్తామని హరీశ్‌రావు పేర్కొన్నారు.