రెండు నెలల్లో లైఫ్ సైన్సెస్ పాలసీ
ఒకే చోట కాకుండా భిన్న ప్రాంతాల్లో ఫార్మా క్లస్టర్లు
ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు
మాదాపూర్: పరిశ్రమల కోసం భూసేకరణ ప్రక్రియను అత్యంత పారదర్శకంగా నిర్వహిస్తామని ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు. రాష్ట్రంలో రెండు నెలల్లో లైఫ్ సైన్సెస్ పాలసీని ప్రకటిస్తామని తెలిపారు. ఈ రంగంలో రాష్ట్రంలో కంపెనీలు నెలకొల్పేందుకు ముందుకొచ్చే సంస్థలకు భూ కేటాయింపు, ప్రోత్సాహకాలకు సంబంధించిన విధానాన్ని ఈ పాలసీలో వెల్లడిస్తామని చెప్పారు.
మాదాపూర్‌లోని హెచ్‌ఐసీసీలో గురువారం ఫార్మా, లైఫ్‌సైన్సెస్ రంగంపై నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఒకే చోట కాకుండా పలు ప్రాంతాల్లో ఫార్మా క్లస్టర్లను ఏర్పాటు చేస్తామని తెలిపారు. పది నెలల్లో రాష్ట్రంలో రూ.35,820 కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయని చెప్పారు. 141 దేశీయ, బహుళజాతి కంపెనీలు ఔషధ టీకాలు, లైఫ్ సైన్సెస్, పరిశోధన రంగాల్లో పనులు ప్రారంభించాయని వెల్లడించారు.
ఇవన్నీ పూర్తి స్థాయిలో ఉత్పత్తి ప్రారంభిస్తే 51,086 మందికి ప్రత్యక్షంగా, లక్షన్నర మందికి పరోక్షంగా ఉద్యోగావకాశాలు లభిస్తాయని తెలిపారు. ఫార్మా రంగంలో ఆసియాలోనే మూడో పెద్ద కంపెనీ అయిన టకెడా లైఫ్ సైన్సెస్ హైదరాబాద్‌లోని బయోలాజికల్– ఈ (బీఈ)తో కలిసి ఏటా ఐదుకోట్ల డెంగ్యూ వ్యాక్సిన్లను ఉత్పత్తి చేస్తుందని, వీటిని ప్రపంచమంతా ఎగుమతి చేస్తుందని వివరించారు.
ఈ కార్యక్రమంలో ఐటీ పరిశ్రమల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్‌రంజన్, లైఫ్ సైన్సెస్ విభాగం డైరెక్టర్ శక్తి నాగప్పన్, టీజీఐఐసీ సీఈఓ మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment