
ప్రస్తుతం ఈటల ఏ శాఖ లేని మంత్రిగా ఉండనున్నారు
సాక్షి, హైదరాబాద్: వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌పై వచ్చిన భూకబ్జా ఆరోపణలు రాష్ట్రంలో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈటల తమ భూములు కబ్జా చేశాడని రైతులు ఫిర్యాదు చేయడంతో సీఎం కేసీఆర్ తక్షణమే విచారణకు ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం ఈ అంశంపై హై స్పీడ్‌లో దర్యాప్తు కొనసాగుతుంది. ఈక్రమంలో ఈటలకు మరో భారీ షాక్ తగిలింది. ఈటల నుంచి వైద్య ఆరోగ్యశాఖ, కుటుంబ సంక్షేమ శాఖను సీఎం కేసీఆర్‌కు బదిలీ చేస్తూ గవర్నర్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఈటల ఏ శాఖ లేని మంత్రిగా ఉండనున్నారు. ఈటల మంత్రి పదవులను తనకు బదిలీ చేయాలంటూ కేసీఆర్ చేసిన సిఫారసును గవర్నర్ ఆమోదించారు.
ఈటల అసైన్డ్ భూములు కబ్జా చేశారని ప్రాథమిక విచారణలో తేలిందని కలెక్టర్ హరీష్ తెలిపారు. ఈటలపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి.. రెవెన్యూ, విజిలెన్స్ అధికారులు శనివారం ఉదయం నుంచి విచారణ ప్రారంభించారు. వివాదాస్పద అసైన్డ్ భూములను పరిశీలించిన కలెక్టర్.. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, పౌల్ట్రీ ఫామ్ కోసం రోడ్డు, హ్యాచరీ కోసం షెడ్‌లు నిర్మించారని ఆయన పేర్కొన్నారు.
చదవండి: ఈటలపై భూకబ్జా ఆరోపణలు: వివరాలు వెల్లడించిన కలెక్టర్