ఒంగోలు అర్బన్/సబర్బన్: ‘నకిలీ డాక్యుమెంట్లు, స్టాంపు పేపర్లు, ఫోర్జరీలతో ఒంగోలులో జరిగిన భూ అక్రమాలతో ఒంగోలు ఎమ్మెల్యే, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదని ప్రకాశం జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్, ఎస్పీ మలికాగర్గ్ స్పష్టంచేశారు. బాలినేనిపైన, ప్రభుత్వంపైన చేసిన ఆరోపణల్లో ఎటువంటి వాస్తవం లేదన్నారు. ఒంగోలు భూదందాపై సిట్ దర్యాప్తును బాలినేని కుటుంబం ముందుకు సాగనివ్వడంలేదంటూ కథనాలు ప్రచురించటం సరికాదని చెప్పారు. బాలినేని కుటుంబం దర్యాప్తును ఎప్పుడూ అడ్డుకోలేదని అన్నారు. అవాస్తవాలను, అసత్య కథనాలను ప్రచురిస్తే అవి రాజకీయ జీవితంలో ఉండేవారి భవిష్యత్తుపై ప్రభావం చూపిస్తాయన్నారు. ఇలాంటి కథనాలు ప్రచురించేటప్పుడు, ప్రసారం చేసేటప్పుడు సరైన వివరణ తీసుకోవాలని చెప్పారు.
ఒంగోలులో నకిలీ డాక్యుమెంట్లతో జరిగిన భూ కబ్జాలపై సిట్ దర్యాప్తు వివరాలను కలెక్టర్, ఎస్పీ శుక్రవారం ఇక్కడ మీడియాకు వివరించారు. భూ కబ్జాలపై ఒంగోలు జెడ్పీటీసీ, మేయర్ గంగాడ సుజాత, మరికొందరు ఇచ్చిన వేర్వేరు ఫిర్యాదుల మేరకు సిట్ ద్వారా నిష్పాక్షికమైన, వేగవంతమైన దర్యాప్తు చేస్తున్నట్లు కలెక్టర్ చెప్పారు. ఎమ్మెల్యే బాలినేని సోదరుడు వేణుగోపాల్‌రెడ్డి భూమి వివాదంలో ఉందని, దాన్ని భూ కబ్జా కోవలోకి తేవటం çసరికాదని అన్నారు. ఆ భూమి 40 ఏళ్లుగా బ్యాంకు లావాదేవీల ప్రక్రియలో ఉందన్నారు.
సివిల్ పంచాయితీలను కూడా భూ కబ్జాల కింద కథనాలుగా ఇవ్వడం వల్ల సిట్ దర్యాప్తు పక్కదారి పట్టే ప్రమాదం ఉందన్నారు. నకిలీ డాక్యుమెంట్లు, భూకబ్జాల వ్యవహారంపై లోతైన దర్యాప్తు జరిపి, బాధితులకు న్యాయం చేయాలని ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డే స్వయంగా చెప్పారన్నారు. సిట్‌లో ఇద్దరు ఏఎస్పీలు, ముగ్గురు డీఎస్పీలు, 17 మంది సీఐలు, ఎస్సైలు ఇతర పోలీస్ సిబ్బంది ముమ్మరంగా పని చేస్తున్నారని చెప్పారు. రెవెన్యూ విభాగం తరఫున జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో రిజిస్ట్రేషన్ శాఖ, మార్కాపురం, కనిగిరి సబ్ డివిజన్ల పరిధిలోని ఆర్డీవోలు సిట్ సబ్ కమిటీ సభ్యులుగా వ్యవహరిస్తున్నాయని తెలిపారు.
ఫోర్జరీ, నకిలీ స్టాంపులు, నకిలీ డాక్యుమెంట్ల కుంభకోణంపై ఒంగోలు మండలం ముక్తినూతలపాడుకు చెందిన ఒకరు సెప్టెంబర్ 28న ఫిర్యాదు ఇవ్వడంతో భూ కబ్జాల వ్యవహారం వెలుగు చూసిందని కలెక్టర్ చెప్పారు. దీనిపై విచారణ చేపట్టగా లాయర్‌పేటలోని ఒక ఇంట్లో పూర్ణచంద్రరావు, మరికొందరితో కూడిన బృందం ఈ అక్రమాలకు పాల్పడుతున్నట్లు తెలిసిందన్నారు. ఆ ఇంట్లో మీ సేవ బ్లాంక్ సర్టిఫికెట్లు, రిజిస్ట్రేషన్ స్టాంప్ పేపర్లు, పలు ప్రభుత్వ అధికారులకు సంబంధించిన రబ్బర్ స్టాంపులు లభించాయన్నారు. ఇటువంటి అనేక ఫిర్యాదులు రావడంతో సిట్ ఏర్పాటు చేసి లోతైన విచారణ చేపట్టామని తెలిపారు.
ఇప్పటి వరకు 572 డాక్యుమెంట్లు, 60 రబ్బర్ స్టాంప్‌లు, 1,224 జ్యుడిషియల్ స్టాంప్‌లు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. మార్కాపురం, కనిగిరి పరిధిలో కూడా 5 కేసులు నమోదయ్యాయన్నారు. ప్రైవేటు వ్యక్తుల భూములతో పాటు ప్రభుత్వ భూముల డీకే పట్టాల విషయంలోనూ నకిలీ వ్యవహారాలు జరిగాయని తెలిపారు. ఈ దందా పన్నెండేళ్లకు పైగా జరుగుతున్నట్లు తెలిసిందన్నారు. ఎక్కువ కాలం ఎటువంటి లావాదేవీలు జరగని ఖాళీ స్థలాలకు నకిలీ వీలునామా, జీపీఏ వంటివి సృష్టించి మోసాలకు పాల్పడినట్లు దర్యాప్తులో తేలిందని చెప్పారు. ఎటువంటి సమస్యలు లేని స్థలాలకు సైతం నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి, వాటిని గొడవల్లోకి తెచ్చి, కోర్టుల్లో స్టే ఆర్డర్ వంటివి పొందినట్లు కూడా తెలిసిందన్నారు.
నకిలీ డాక్యుమెంట్లతో భూములను బ్యాంకుల్లో తనఖా పెట్టిన సంఘటనలు కూడా ఉన్నాయన్నారు. ఈ వ్యవహారాల్లో అక్రమాలపై లోతైన దర్యాప్తు చేసి కారకులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని చెప్పారు. బాధితులకు న్యాయం జరిగేలా కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఎటువంటి రాజకీయ ఒత్తిళ్లు, ప్రభావం లేకుండా పూర్తి స్వేచ్ఛగా దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఈ అంశంపై స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వాలపై ఆరోపణలు చేయడం వారిని వ్యక్తిగతంగా బాధించడమే అవుతుందని చెప్పారు. విషయాలను పూర్తిగా తెలుసుకుని వార్తా పత్రికలు, టెలివిజన్ ఛానళ్లు వార్తలను ప్రచురించడం, ప్రసారం చేయడం చేయాలన్నారు.
ఎస్పీ మలికాగర్గ్ మాట్లాడుతూ ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్నామని, సిట్ బృందం వేగంగా, నిరంతరాయంగా దర్యాప్తు చేస్తోందని తెలిపారు. దీనిపై ఇప్పటివరకు 54 కేసులు నమోదయ్యాయన్నారు. పూర్ణచంద్రరావు బృందంలో 72 మంది ఉన్నారని, వారిలో 38 మందిని ఇప్పటికే అరెస్టు చేశామని తెలిపారు. మిగిలిన వారిని త్వరలో అరెస్టు చేస్తామన్నారు. ఈ వ్యవహారంలో బాధితులకు న్యాయం చేయాలని ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి మొదటి నుంచి చెబుతున్నారన్నారు. సిట్ దర్యాప్తుపై బాలినేని ప్రభావం ఉందని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment