(ముంబై నుంచి సాక్షి ప్రతినిధి) : దేశంలోనే తొలి బుల్లెట్ రైలు ప్రాజెక్టు పనులు మళ్లీ ఊపందుకున్నాయి. పెండింగ్‌లో ఉన్న భూసేకరణ సమస్యల్లో కొన్ని పరిష్కారం కావడంతో నిర్మాణ సంస్థ పనులు పునరుద్ధరించింది. ముంబై–అహ్మదాబాద్ మధ్య ప్రతిపాదిత బుల్లెట్ రైలు ప్రాజెక్టును 2026 ఆగస్టు నాటికి పూర్తి చేయాలనేది టార్గెట్.
అయితే భూసేకరణలో జాప్యం కారణంగా ఏడాదిన్నర ఆలస్యమయ్యే అవకాశముంది. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోతో కలిసి హైదరాబాద్‌కు చెందిన పాత్రికేయ బృందం పశ్చిమ రైల్వే, మధ్య రైల్వే కార్యాలయాలు, మ్యూజియం సందర్శించి రైల్వే కార్యకలాపాలు సహా వివిధ కార్యక్రమాలను అధ్యయనం చేసింది.
ఇవీ ముంబై హెచ్‌ఎస్‌ఆర్ స్టేషన్ ప్రత్యేకతలు
ముంబై–అహ్మదాబాద్–హెచ్‌ఎస్‌ఆర్ కారిడార్‌లో ఉన్న ఏకైక భూగర్భస్టేషన్ ముంబై హెచ్‌ఎస్‌ఆర్ స్టేషన్. ఈ స్టేషన్‌లో 6 ప్లాట్‌ఫారాలు ఉంటాయి. ప్రతీ ప్లాట్‌ఫారం పొడవు సుమారు 415 మీటర్లు. గ్రౌండ్ లెవల్ నుంచి 24 మీటర్ల లోతులో ఈ ప్లాట్ ఫారం నిర్మించాలని యోచిస్తున్నారు. ఇందులో ప్లాట్‌ఫాం, కాన్‌కోర్స్, సర్విస్ ఫ్లోర్ సహా మూడు అంతస్తులు ఉంటాయి.
♦ స్టేషనుకు రెండు ప్రవేశ ద్వారాలు/నిష్క్రమణ గేట్లు ఉండేలా ప్రణాళిక రూపొందించారు. ఒకటి మెట్రో లైన్ 2బీ సమీపంలో మెట్రో స్టేషన్‌కు, మరొకటి ఎంటీఎన్‌ఎల్ నిర్మాణం వైపు ప్రయాణికుల రాకపోకలకు తగినంత స్థలం, కాన్‌కోర్స్, ప్లాట్‌ఫాం స్థాయిలో సౌకర్యాలు కల్పించే విధంగా ఎగ్జిట్ గేట్లు రూపొందించారు.
♦ ప్రయాణికుల సౌకర్యానికి సంబంధించి, సహజ లైటింగ్ వ్యవస్థకు ప్రత్యేక స్కైలైట్ ఏర్పాటు చేశారు.
♦ స్టేషన్‌లో ప్రయాణికుల కోసం సెక్యూరిటీ, టికెటింగ్, వెయిటింగ్ ఏరియా, బిజినెస్ క్లాస్ లాంజ్, నర్సరీ, రెస్ట్‌రూమ్, స్మోకింగ్ రూమ్, ఇన్ఫర్మేషన్ కియోస్‌్క, రిటైల్, పబ్లిక్ ఇన్ఫర్మేషన్ అండ్ అనౌన్స్‌మెంట్ సిస్టమ్, సీసీటీవీ నిఘా తదితర సౌకర్యాలు కల్పించారు.
ప్రయాణికులు ఇబ్బంది పడకుండా : సీపీఆర్‌ఓ సుమిత్ ఠాకూర్
రైల్వేకు చెందిన పలు ప్రాజెక్టులు శరవేగంగా అభివృద్ధి చేస్తున్నామని పశ్చిమరైల్వే చీఫ్ పబ్లిక్‌రిలేషన్స్ ఆఫీసర్ సుమిత్ఠాకూర్ చెప్పారు.రైల్వేస్టేషన్ల పునరుద్ధరణ పనులు ప్రోత్సాహకరంగా సాగుతున్నాయని, ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామన్నారు.
నిత్యం 80 లక్షల మంది ముంబై రైల్వే పరిధిలో ప్రయాణిస్తున్నారని, భారత్‌లో సెమీ స్పీడ్ రైళ్ల ప్రవేశానికి మంచి స్పందన లభిస్తోందని, త్వరలోనే అభివృద్ధి చెందిన దేశాల్లో మాదిరిగా హైస్పీడ్ రైళ్ల శకం కూడా ప్రారంభమవుతుందని తెలిపారు. ముంబైలో బుల్లెట్ ట్రైన్ పనులు వివిధ స్థాయిల్లో జరుగుతున్నాయని నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ సుష్మ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment