8 గంటల ప్రయాణం 4 గంటల్లోనే..
ముంబై: భారత్‌లో ఇక బుల్లెట్ రైళ్ల శకం ప్రారంభం కాబోతోంది. జపాన్, చైనా, అమెరికా, కెనడా, తైవాన్, బ్రిటన్, బ్రెజిల్ తదితర దేశాలు వినియోగిస్తున్న బుల్లెట్ రైళ్లు ఇక మనదేశంలోనూ దూసుకుపోనున్నాయి. రైలు ప్రయాణ సమయాన్ని సగానికి, సగం తగ్గించగలిగే హైస్పీడ్ నెట్‌వర్క్ బుల్లెట్ రైళ్లపై రైల్వే మంత్రి సదానంద గౌడ కొత్త రైల్వే బడ్జెట్‌లో ప్రకటించారు.
ఇప్పటికే సర్వే జరిగిన ముంబై-అహ్మదాబాద్ మధ్య తొలి బుల్లెట్ రైలు సర్వీసును నడుపుతామని ఆయన ప్రకటించారు. ఈ ఒక్క బుల్లెట్ రైలు ప్రాజెక్టుకే రూ. 60వేల కోట్ల రూపాయల ఖర్చవుతుందని అంచనా. ఈ ప్రాజెక్ట్‌కోసం తొలుత రూ. వందకోట్లు బడ్జెట్‌లో కేటాయించారు.
బుల్లెట్ రైలు సర్వీసు ముఖ్యాంశాలు ఇవీ..
* ముంబై-అహ్మదాబాద్ మధ్య దూరం 520 కిలోమీటర్లు. రైలు ప్రయాణానికి ఇపుడు దాదాపు 8గంటలు పడుతుండగా, బుల్లెట్ రైళ్లలో, 3-4గంటల్లోనే గమ్యం చేరుకోవచ్చు.
* ఈ కారిడార్‌లో స్టేషన్‌కు స్టేషన్‌కు మధ్య దూరం 50నుంచి 100కిలోమీటర్లు ఉంటుంది.
* బుల్లెట్ రైలు దాదాపు 350కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. బుల్లెట్ రైళ్ల మార్గాలు మామూలు రైల్వే లైన్లకు సంబంధంలేకుండా ప్రత్యేకంగా ఉంటాయి.
* ప్రస్తుత రైల్వే నెట్‌వర్క్‌లో కిలోమీటర్ రైల్వే ట్రాక్ నిర్మాణానికి రూ. 15కోట్లు ఖర్చవుతుండగా, హైస్పీడ్ నె ట్‌వర్క్‌లో ట్రాక్ నిర్మాణానికి ఏకంగా రూ.125కోట్లు అవుతుంది.
* ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ రైళ్ల ప్రాజెక్ట్‌కు జపాన్ అంతర్జాతీయ సహకార సంస్థ (జేఐసీఏ-జైకా) సహకరిస్తోంది. ప్రాజెక్ట్ ఆర్థిక అంశాలతోపాటుగా, సాంకేతిక పరిజ్ఞాన అంశాలపై కూడా జైకా అధ్యయనం జరుపుతుంది. వచ్చే ఏడాది జూన్‌కు నివేదిక జైకా తన నివేదిక అందజేస్తుంది.