High Speed Network
-
5జీ హుజూర్.. 4జీ ఫోన్లు 5జీ నెట్‌వర్క్‌కు ఉపయోగపడతాయా?
మనిషి జీవితంలోకి వేగం ప్రవేశించి చాలా కాలమే అయింది. మానవుడి జీవన గమనాన్ని సాంకేతిక పరిజ్ఞానం ఎన్నో మేలి మలుపులు తిప్పింది. సెల్యులార్ టెక్నాలజీ విప్లవంతో అందరి చేతుల్లోకి సెల్ఫోన్లు వచ్చాయి. సాధారణ వాయిస్ కాల్స్‌కే జనం మురిసిపోగా.. అసాధారణ అవసరాలు సైతం సెల్ఫోన్లో చేరుతున్నాయి. 1990లలో 2జీ నెట్‌వర్క్‌తో మొదలైన మనిషి సెల్‌ఫోన్ ప్రయాణం.. 3జీ, 4జీని దాటుకొని ఇప్పుడు 5జీ మెరుపు వేగాన్ని అందుకొంటోంది. మనిషి జీవనాన్ని మరో మేలి మలుపు తిప్పడానికి ఇది దోహదం చేయనుంది. 5జీ అంటే..: సెల్యులార్ టెక్నాలజీలో ఐదో జనరేషన్‌ను సింపుల్‌గా 5జీ అంటున్నారు. 1జీ: 1980లో తొలి తరం(1జీ) మొబైల్ సేవలు మొదలయ్యాయి. బ్రీఫ్‌కేస్ సైజ్ ఉన్న ఫోన్లు, అది కూడా పరిమిత సంఖ్యలో ఉన్న గ్రూపు సభ్యుల మధ్య కమ్యూనికేషన్‌కు మాత్రమే ఉపయోగపడేవి. 2జీ: 1990లో రెండో తరం సాంకేతిక పరిజ్ఞానం ప్రారంభమైంది. పర్సనల్ హ్యాండ్ సెట్లు వచ్చాయి. ఇవే సెల్ఫోన్లు. వీటితో వాయిస్ కాల్స్ చేయడం, రిసీవ్ చేసుకోవడం సాధ్యమైంది. క్రమేణా ఎస్ఎంఎస్లు కూడా వచ్చాయి. 2జీ కాలంలో మొదలయిన సెల్‌ఫోన్.. మనిషి జీవితంలో భాగమైంది. 3జీ: 2000 సంవత్సరానికి సెల్‌ఫోన్ జేబులో ఇమిడిపోయింది. ఇంటర్నెట్ యాక్సెస్ సాధ్యమైంది. సెల్‌ఫోను లేనిదే అడుగు వేయలేని స్థితికి వచ్చింది. 4జీ: 2010కి సెల్‌ఫోన్ స్మార్ట్‌ఫోన్‌గా మారిపోయింది. డేటా స్పీడ్ అనూహ్యంగా పెరిగింది. ఫోన్లో యాప్ స్టోర్లు చేరాయి. సోషల్ మీడియా ఉవ్వెత్తున ఎగిసింది. 5జీ ఉపయోగాలను ఊహించలేం - 2జీ వచ్చినప్పుడు డిజిటల్ వాయిస్ కాలింగ్ 1990 దశాబ్దంలో అత్యంత ఉపయోగకరమైన అంశంగా అందరూ భావించారు. ఎస్ఎంఎస్ అప్పుడు ఓ అద్భుతం. 3జీ ప్రవేశంతో ‘ఇంటర్నెట్ యాక్సెస్’ అద్భుతమైన అంశంగా నిలుస్తుందని అనుకున్నారు. అయితే సోషల్ మీడియా, స్మార్ట్‌ఫోన్ యాప్‌ల దశాబ్దంగా మారింది. 4జీతో రైడ్, షేరింగ్, ఫుడ్ డెలివరీ లాంటి క్లౌడ్ కంప్యూటింగ్ సేవలు వస్తాయని భావించారు. వాటితో పాటు యూట్యూబ్, నెట్‌ఫ్లిక్స్ లాంటి వీడియో స్ట్రీమింగ్ సౌకర్యాలు, వీడియో కాలింగ్ వచ్చి అంతులేని వినోదాన్ని పంచుతున్నాయి. 5జీ ఇంకేమి సౌకర్యాలను తెస్తుందో కచ్చితంగా చెప్పలేం. కానీ మెరుపువేగంతో డేటా ట్రాన్స్ఫర్ మానవ జీవితాన్ని మరింతగా మారుస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. 4జీ కంటే 5జీలో డేటా ట్రాన్స్ఫర్ వేగం 20 రెట్లు పెరుగుతుంది. ఇప్పుడు మనకు అందుబాటులో ఉన్న సాధారణ నెట్ 100 ఎంబీపీఎస్. 5జీలో సాధారణ వేగం 4–5 జీబీపీఎస్‌కు చేరే అవకాశం ఉంటుంది. ఇప్పుడు గంట పాటు డౌన్లోడ్ చేస్తున్న గేమ్స్ లాంటి వాటిని సెకన్ల వ్యవధిలో చేయచ్చు. ఏ రంగాల్లో మార్పులు వస్తాయి? - వినోద రంగంలో వర్చువల్ రియాలిటీ (వీఆర్), ఆగ్మెంటెడ్ రియాలిటీ (ఏఆర్), ఎక్స్టెండెడ్ రియాలిటీ (ఎక్స్ఆర్) సౌకర్యాలు మొబైల్ ఫోన్లలోకి వస్తాయి. - విద్యా రంగంలో అనూహ్య మార్పులు వస్తాయి. ఆన్లైన్ టీచింగ్‌లో విద్యార్థులకు క్లాస్‌రూమ్‌లో ఉన్న అనుభూతి కలుగుతుంది. కంటెంట్ సులభంగా అర్థమయ్యేలా బోధించడానికి సహాయపడుతుంది. - వైద్య రంగంలోనూ అనూహ్య మార్పులు వస్తాయి. అత్యవసర పరిస్థితుల్లో ఉన్న వ్యక్తి 108 (అంబులెన్స్)కు కాల్ చేసిన వెంటనే అంబులెన్స్‌తో పాటు సమీపంలోని ఆసుపత్రికి కూడా సమాచారం వెళుతుంది. డాక్టర్‌ను అలెర్ట్ చేస్తుంది. వేగంగా ఆసుపత్రికి చేరే మార్గాన్ని సూచించడంతో పాటు, ప్రత్యామ్నాయ ఆసుపత్రుల వివరాలను తెలియజేస్తుంది. - టెలి మెడిసిన్‌లో ఆంధ్రప్రదేశ్‌లాంటి రాష్ట్రాలు ఇప్పటికే దూసుకెళుతున్నాయి. 5జీ అందుబాటులోకి వస్తే డాక్టర్, రోగి ఒక దగ్గర లేకుండా కేవలం మొబైల్లో రియల్‌టైమ్ వీడియో ద్వారా చికిత్స లభిస్తుంది. - రోబోటిక్ సర్జరీల్లో మరిన్ని సంచలనాలకు దోహదం చేస్తుంది. ఆఫీసులో ఎదురుబొదురు కూర్చొన్నట్లుగా ఉండే వర్చువల్ మీటింగ్స్‌కు అవకాశం కల్పిస్తుంది. ఫలితంగా సిబ్బంది మొత్తం ఆఫీసుకే వచ్చి పనిచేయాల్సిన అవసరం ఉండదు. ‘రిమోట్ టీమ్ ప్రొడక్టి్టవిటీ’ని పెంచుతుంది. - వాణిజ్య, పారిశ్రామిక రంగాల్లో వినూత్న మార్పులు వస్తాయి. ఫ్లెక్సిబుల్, నమ్మకమైన, సమర్థవంతమైన వ్యాపారానికి భూమికగా నిలుస్తుంది. డిమాండ్, సప్లైని బట్టి ఉత్పత్తి సం స్థలు ఆటోమేటిక్‌గా స్పందించే రోజు వస్తుంది. - పరిశ్రమల్లో సమస్యలను ‘డిజిటల్ నమూనా’ల్లో ముందుగానే గుర్తించొచ్చు. ఫలితంగా సమస్య రాకుండా ముందు జాగ్రత్త తీసుకోవడానికి, ఒకవేళ సమస్య తలెత్తినా వేగంగా పరిష్కరించడానికి అవకాశం ఏర్పడుతుంది. - వస్తు రవాణాను రియల్ టైమ్‌లో పరిశీలించొచ్చు. గోదాములు, పోర్టుల్లో ప్రతి వస్తువును ట్రాక్ చేయొచ్చు. - డ్రైవర్ లేని కార్ల వినియోగం గణనీయంగా పెరుగుతుంది. ట్రాఫిక్ నియంత్రణ, ప్రమాదాల నివారణకు ఉపయోగపడుతుంది. - ‘స్మార్ట్ గ్రిడ్’ కాన్సెప్ట్ మరింత బలోపేతం అవుతుంది. విద్యుత్ ఆదా అవుతుంది. - వ్యవసాయంలోనూ సూపర్ ఫాస్ట్ నెట్వర్క్ ఉపయోగపడుతుంది. మోటార్లను ఆన్/ఆఫ్ చేయడానికే కాకుండా, పొలం తడిసిన వెంటనే అలర్ట్ చేసే రియల్‌టైం మెకానిజం చౌకగా లభిస్తుంది. - డ్రోన్ల వినియోగం అత్యంత వేగంగా పెరుగుతుంది. వ్యవసాయం మొదలు అన్ని రంగాల్లో డ్రోన్ల వాడకం సులభం, చౌక అవుతుంది. 4జీ ఫోన్లు 5జీ నెట్‌వర్క్‌కు ఉపయోగపడతాయా? 4జీ ఫోన్లలోని ప్రాసెసర్ 5జీ నెట్‌వర్క్‌కు ఉపయోగపడదు.. ప్రాసెసర్ అప్‌గ్రెడేషన్‌కు కంపెనీలు అవకాశం ఇస్తే, ఇప్పుడున్న ఫోన్లను చౌకగా మార్చుకోవచ్చు. సాఫ్ట్వేర్ కూడా మార్చుకోవాలి. లేదంటే 5జీ ఫోన్లు కొనుక్కోవాలి. సిమ్ కార్డు కూడా 5జీకి మార్చాలి. స్మార్ట్ ఫోన్ల వినియోగంలో ప్రపంచంలో చైనా తొలి స్థానంలో ఉంటే, మనం రెండో స్థానంలో ఉన్నాం. ఈ డిమాండ్ మరింత పెరుగుతుంది. 2025 నాటికి గ్లోబల్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోనూ మన దేశం రెండోస్థానంలో కొనసాగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. (ఎం.విశ్వనాథరెడ్డి, సాక్షి ప్రత్యేక ప్రతినిధి) -
ఇంటర్నెట్ సమస్య తొలగాలి
సాక్షి, న్యూఢిల్లీ: మారుమూల ప్రాంతాల్లో ఉన్న న్యాయవాదుల కోసం హైస్పీడ్ ఇంటర్నెట్ వసతి అందుబాటులోకి తీసుకురావాలని సుప్రీంకోర్టు ప్రధానన్యాయమూర్తి జస్టిస్ నూతలపాటి వెంకటరమణ కేంద్రప్రభుత్వానికి సూచించారు. నగరాల్లోని లాయర్లకు అందుబాటులో ఉన్నట్టుగా సబార్డినేట్ కోర్టు స్థాయిలో లాయర్లకూ హైస్పీడ్ ఇంటర్నెట్ అందుబాటులో లేదన్న అంశాన్ని ప్రస్తావించారు. ఈ మేరకు ఇటీవల కేంద్ర న్యాయ శాఖ, ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖల మంత్రి రవిశంకర్ ప్రసాద్‌కు తాను 8న లేఖ రాసినట్టు తెలిపారు. సుప్రీం కోర్టు రిటైర్డ్ జస్టిస్ ఆర్.వి.రవీంద్రన్ రచించిన ‘చట్టం, న్యాయంలో క్రమరాహిత్యాలు’ అనే పుస్తకావిష్కరణ కార్యక్రమంలో జస్టిస్ ఎన్వీ రమణ మాట్లాడారు. ఈ సందర్భంగా జరిగిన ప్యానెల్ డిస్కషన్లో పాల్గొన్నారు. గ్రామీణ, గిరిజన, మారుమూల, పర్వత ప్రాంతాల్లో కనెక్టివిటీ సరిగాలేక న్యాయం అందడంలో వేగంపై తీవ్ర ప్రభావం చూపిందని, వేలాది మంది యువ న్యాయవాదుల జీవనోపాధికి తీవ్ర విఘాతం కలిగించిందని ఆందోళన వ్యక్తంచేశారు. ఇంటర్నెట్ కనెక్టివిటీ లభ్యతలో తారతమ్యాల కారణంగా న్యాయవ్యవస్థ నుంచి ఒక తరం న్యాయవాదులను బలవంతంగా నెట్టివేసినట్టు అవుతోందని ఆందోళన వ్యక్తంచేశారు. కోవిడ్ కారణంగా ఉపాధి కోల్పోయి ఆర్థికంగా దెబ్బతిన్న లాయర్లకు సాయపడేందుకు యంత్రాంగం ఏర్పాటుచేయాలని న్యాయ శాఖ మంత్రికి సూచించినట్లు వెల్లడించారు. -
హైస్పీడ్ రైల్వే కోసం కారిడార్ల గుర్తింపు
న్యూఢిల్లీ: దేశంలోని 6 మార్గాల్లో హైస్పీడ్, సెమీస్పీడ్ కారిడార్లను గుర్తించినట్లు రైల్వేశాఖ బుధవారం తెలిపింది. ఈ మార్గాలపై ఏడాదిలోపు పూర్తిస్థాయి నివేదిక (డీపీఆర్) తయారవుతుందని రైల్వే బోర్డు చైర్మన్ వీకే యాదవ్ చెప్పారు. హైస్పీడ్ కారిడార్‌లో రైళ్లు గంటకు 300 కి.మీ.ల వేగంతో, సెమీస్పీడ్ కారిడార్‌లో 160 కిలోమీటర్ల వేగంతో నడవనున్నాయి. ఈ కారిడార్లలో ఢిల్లీ–నోయిడా–ఆగ్రా–లక్నో–వారణాసి, ఢిల్లీ–జైపూర్–ఉదయ్‌పూర్–అహ్మదాబాద్, ముంబై–నాసిక్–నాగ్‌పూర్, ముంబై–పుణే–హైదరాబాద్, చెన్నై–బెంగళూరు–మైసూర్, ఢిల్లీ–లూథియానా–జలంధర్–అమృత్సర్ ఉన్నాయి. స్థల సేకరణ, అక్కడ ఉండే ట్రాఫిక్ వంటి వివరాల ఆధారంగా ఆయా సెక్షన్లను హైస్పీడ్ లేదా సెమీస్పీడ్ కారిడార్లుగా గుర్తిస్తామని చెప్పారు. రానున్న ఆరు నెలల్లోనే 90శాతం భూసేకరణ పూర్తి చేస్తామని చెప్పారు. 2023కల్లా దేశంలోనే మొదటి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు ప్రారంభమవుతుందని చెప్పారు. 2021కల్లా ఆర్ఎఫ్ఐడీ టాగ్లు.. దేశంలోని సుమారు మూడున్నర లక్షల రైల్వే కోచ్‌లు, వాగన్లకు 2021కల్లా రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ (ఆర్ఎఫ్ఐడీ) పూర్తి చేస్తామని రైల్వేశాఖ అధికారులు చెప్పారు. దాదాపు రూ. 112 కోట్లతో ఈ ప్రాజెక్టు చేపడుతున్నట్లు తెలిపారు. ఇప్పటివరకూ 22 వేల వాగన్లు, 1200 కోచ్‌లకు ఆర్ఎఫ్ఐడీ టాగ్లు పూర్తిచేసినట్లు తెలిపారు. దీనివల్ల రైళ్లను సులువుగా ట్రాక్ చేయవచ్చని, సమయానుగుణంగా నడిచేలా చర్యలు తీసుకోవచ్చని చెప్పారు. -
ఆప్టికల్ ఫైబర్‌కు ‘5జీ’ జోష్!
న్యూఢిల్లీ: హైస్పీడ్ ఇంటర్నెట్ అందించే 5జీ సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు కీలకమైన ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ (ఓఎఫ్సీ)కు గణనీయంగా ప్రాధాన్యం పెరుగుతోంది. టెలికం శాఖ అంచనాల ప్రకారం 2018లో ఓఎఫ్సీ నెట్వర్క్ సుమారు 1.4–1.5 మిలియన్ కేబుల్ రూట్ కిలోమీటర్స్ మేర విస్తరించి ఉంది. ఇంటర్నెట్ విస్తృతిని మరింత పెంచే దిశగా ప్రభుత్వం నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరాలంటే 2022 నాటికి ఈ నెట్‌వర్క్‌కు దాదాపు నాలుగు రెట్లు అధికంగా 5.5 మిలియన్ కేబుల్ రూట్ కిలోమీటర్స్ మేర ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ వేయాల్సి ఉంటుంది. ఇందుకోసం ఏకంగా రూ. 1,80,000 కోట్ల స్థాయిలో పెట్టుబడులు అవసరం. టెలికం సంస్థలు ప్రధానంగా టవర్ల పెంపునకు అవసరమైన ఫైబర్ కేబుల్స్ వేయడంపైనే ముందుగా దృష్టి పెట్టాల్సి రానుండటంతో ఈ పెట్టుబడుల్లో సింహభాగం వాటా ప్రభుత్వమే భరించాల్సి రానుంది. 5జీ సేవలను ముందుగా పెద్ద నగరాల్లోనే ప్రవేశపెట్టే అవకాశం ఉండటంతో వచ్చే రెండు, మూడేళ్లలో టవర్స్ సంఖ్య 5,00,000 నుంచి 7,50,000కు పెంచుకోవాల్సిన అవసరం ఉందని సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (సీవోఏఐ) డైరెక్టర్ జనరల్ రాజన్ మాథ్యూస్ తెలిపారు. ఇందులో 70 శాతం టవర్స్‌కు అవసరమైన ఫైబర్ కేబుల్ వేయాలంటేనే దాదాపు రూ. 50,000 కోట్లు అవసరమని ఆయన పేర్కొన్నారు. ఓఎఫ్సీ అవసరమేంటంటే.. ఇంత భారీ స్థాయిలో ఓఎఫ్సీ వినియోగించాల్సి రావడానికి ముఖ్యంగా కొన్ని కారణాలు ఉన్నాయి. సాధారణంగా 5జీ సేవలకు ఉపయోగపడే స్పెక్ట్రం చాలా శక్తిమంతమైనదే అయినా దాని పరిధి చాలా పరిమితంగా ఉంటుంది. దీంతో మరింత పెద్ద సంఖ్యలో టవర్స్ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. 4జీతో పోలిస్తే 5జీ కోసం 3 రెట్లు ఎక్కువగా టవర్స్ అవసరమవుతాయని ఓఎఫ్సీ తయారీ దిగ్గజం హిమాచల్ ఫ్యూచరిస్టిక్ చైర్మన్ మహేంద్ర నహతా తెలిపారు. ఇక రెండో కారణం విషయానికొస్తే.. ప్రస్తుతం వినియోగంలో ఉన్న టవర్లలో కేవలం 20% టవర్స్‌కి మాత్రమే ఫైబర్ కేబుల్స్ ఉపయోగిసున్నారు. 5జీ సేవలను సముచిత స్థాయిలో అందించాలంటే వచ్చే మూడేళ్లలో దీన్ని కనీసం 70 శాతానికి పెంచుకోవాల్సిన అవసరం ఉందని మాథ్యూస్ చెప్పారు. మరోవైపు, అంతర్జాతీయ దిగ్గజ సంస్థలు భారత్‌లో ఏర్పాటు చేస్తున్న డేటా సెంటర్లకోసం కూడా ఓఎఫ్సీ అవసరం. ఇక రిలయన్స్ జియో ప్రకటించిన ఫైబర్ టు హోమ్ సర్వీసుల కోసం కూడా భారీ స్థాయిలో ఓఎఫ్సీ కావాల్సి ఉంటోంది. వచ్చే మూడేళ్లలో సుమారు 1,600 నగరాల్లో 7.5 కోట్ల మందికి టీవీ, వాయిస్, డేటా సేవలను అందించే దిశగా రిలయన్స్ జియో ప్రయత్నాలు చేస్తోంది. ఇవి కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో కూడా హై స్పీడ్ డేటా సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు జాతీయ బ్రాడ్‌బ్యాండ్ మిషన్ కింద కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన కార్యక్రమాన్ని అమలు చేసేందుకు కూడా ఓఎఫ్సీ చాలా కీలకం. తెలంగాణ వంటి కొన్ని రాష్ట్రాలు కూడా ప్రజలకు చౌక బ్రాడ్‌బ్యాండ్ అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నాయి. తెలంగాణ ప్రభుత్వం టీ–ఫైబర్ పేరిట 12,700 పంచాయతీల్లో 2 కోట్ల జనాభాకు బ్రాడ్ బ్యాండ్‌ను అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చేస్తోంది. చాలా సవాళ్లున్నాయ్.. ఓఎఫ్‌సీకి ఇంత భారీ డిమాండ్ ఉన్నప్పటికీ టెల్కోలు కేబుల్ వేయడంలో టెల్కోలు అనేక సవాళ్లు ఎదుర్కొంటున్నాయి. రహదారులను తవ్వి కేబుల్స్ వేయాలంటే చాలా వ్యయాలతో కూడుకున్నదిగాను, మున్సిపాలిటీల నుంచి అనుమతులు పొందటం కష్టతరంగాను ఉంటోందని టెలికం వర్గాలు తెలిపాయి. ముంబై వంటి నగరాల్లో ఓఎఫ్సీ వేయాలంటే కిలోమీటరుకు రూ. 1 కోటి పైగా వ్యయం అవుతుందని వివరించాయి. అండర్‌గ్రౌండ్‌లో ఓఎఫ్సీ వేసేందుకు అయ్యే మొత్తం ఖర్చులో కేబుల్ ఖరీదు 15 శాతం కూడా దాటదని పేర్కొన్నాయి. ఇక ఇప్పటికే భారీ రుణభారంతో సతమతమవుతున్న టెల్కోలకు మళ్లీ ఖరీదైన 5జీ స్పెక్ట్రంను కొనుగోలు చేయడానికి, ఫైబర్ వేయడానికి కావాల్సిన నిధులు ఎక్కడ నుంచి వస్తాయన్న సందేహాలూ నెలకొన్నాయి. మూడు దిగ్గజ టెల్కోలు తమ నెట్‌వర్క్‌ను విస్తరించేందుకు ఈ ఏడాది దాదాపు రూ. 1,00,000 కోట్లు వ్యయం చేస్తున్నాయి. ఇవి మళ్లీ ఫైబర్ కోసం మరో రూ. 15,000 కోట్లు ఖర్చు చేయగలవా అన్నది ప్రశ్నార్థకంగా మారిందని నిపుణులు అభిప్రాయపడ్డారు. అటు ప్రభుత్వానికి కూడా ప్రస్తుత పరిస్థితుల్లో ఓఎఫ్‌సీపై భారీ పెట్టుబడులు పెట్టడం సాధ్యం కాకపోవచ్చని పేర్కొన్నారు. -
8 గంటల ప్రయాణం 4 గంటల్లోనే..
ముంబై: భారత్‌లో ఇక బుల్లెట్ రైళ్ల శకం ప్రారంభం కాబోతోంది. జపాన్, చైనా, అమెరికా, కెనడా, తైవాన్, బ్రిటన్, బ్రెజిల్ తదితర దేశాలు వినియోగిస్తున్న బుల్లెట్ రైళ్లు ఇక మనదేశంలోనూ దూసుకుపోనున్నాయి. రైలు ప్రయాణ సమయాన్ని సగానికి, సగం తగ్గించగలిగే హైస్పీడ్ నెట్వర్క్ బుల్లెట్ రైళ్లపై రైల్వే మంత్రి సదానంద గౌడ కొత్త రైల్వే బడ్జెట్లో ప్రకటించారు. ఇప్పటికే సర్వే జరిగిన ముంబై-అహ్మదాబాద్ మధ్య తొలి బుల్లెట్ రైలు సర్వీసును నడుపుతామని ఆయన ప్రకటించారు. ఈ ఒక్క బుల్లెట్ రైలు ప్రాజెక్టుకే రూ. 60వేల కోట్ల రూపాయల ఖర్చవుతుందని అంచనా. ఈ ప్రాజెక్ట్‌కోసం తొలుత రూ. వందకోట్లు బడ్జెట్లో కేటాయించారు. బుల్లెట్ రైలు సర్వీసు ముఖ్యాంశాలు ఇవీ.. * ముంబై-అహ్మదాబాద్ మధ్య దూరం 520 కిలోమీటర్లు. రైలు ప్రయాణానికి ఇపుడు దాదాపు 8గంటలు పడుతుండగా, బుల్లెట్ రైళ్లలో, 3-4గంటల్లోనే గమ్యం చేరుకోవచ్చు. * ఈ కారిడార్‌లో స్టేషన్‌కు స్టేషన్‌కు మధ్య దూరం 50నుంచి 100కిలోమీటర్లు ఉంటుంది. * బుల్లెట్ రైలు దాదాపు 350కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. బుల్లెట్ రైళ్ల మార్గాలు మామూలు రైల్వే లైన్లకు సంబంధంలేకుండా ప్రత్యేకంగా ఉంటాయి. * ప్రస్తుత రైల్వే నెట్‌వర్క్‌లో కిలోమీటర్ రైల్వే ట్రాక్ నిర్మాణానికి రూ. 15కోట్లు ఖర్చవుతుండగా, హైస్పీడ్ నె ట్‌వర్క్‌లో ట్రాక్ నిర్మాణానికి ఏకంగా రూ.125కోట్లు అవుతుంది. * ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ రైళ్ల ప్రాజెక్ట్‌కు జపాన్ అంతర్జాతీయ సహకార సంస్థ (జేఐసీఏ-జైకా) సహకరిస్తోంది. ప్రాజెక్ట్ ఆర్థిక అంశాలతోపాటుగా, సాంకేతిక పరిజ్ఞాన అంశాలపై కూడా జైకా అధ్యయనం జరుపుతుంది. వచ్చే ఏడాది జూన్‌కు నివేదిక జైకా తన నివేదిక అందజేస్తుంది.