These Are The Features And Benefits Of 5G Technology - Sakshi
Sakshi News home page

5జీ హుజూర్‌.. భారత్‌ ఖాతాలో మరో రికార్డు.. ఇక మెరుపు వేగమే!

Published Thu, Aug 18 2022 8:57 AM | Last Updated on Thu, Aug 18 2022 9:56 AM

These Are Special Features Of 5G Network - Sakshi

మనిషి జీవితంలోకి వేగం ప్రవేశించి చాలా కాలమే అయింది. మానవుడి జీవన గమనాన్ని సాంకేతిక పరిజ్ఞానం ఎన్నో మేలి మలుపులు తిప్పింది. సెల్యులార్‌ టెక్నాలజీ విప్లవంతో అందరి చేతుల్లోకి సెల్‌ఫోన్లు వచ్చాయి. సాధారణ వాయిస్‌ కాల్స్‌కే జనం మురిసిపోగా.. అసాధారణ అవసరాలు సైతం సెల్‌ఫోన్‌లో చేరుతున్నాయి. 1990లలో 2జీ నెట్‌వర్క్‌తో మొదలైన మనిషి సెల్‌ఫోన్‌ ప్రయాణం.. 3జీ, 4జీని దాటుకొని ఇప్పుడు 5జీ మెరుపు వేగాన్ని అందుకొంటోంది. మనిషి జీవనాన్ని మరో మేలి మలుపు తిప్పడానికి ఇది దోహదం చేయనుంది.

5జీ అంటే..: సెల్యులార్‌ టెక్నాలజీలో ఐదో జనరేషన్‌ను సింపుల్‌గా 5జీ అంటున్నారు.
1జీ: 1980లో తొలి తరం(1జీ) మొబైల్‌ సేవలు మొదలయ్యాయి. బ్రీఫ్‌కేస్‌ సైజ్‌ ఉన్న ఫోన్లు, అది కూడా పరిమిత సంఖ్యలో ఉన్న గ్రూపు సభ్యుల మధ్య కమ్యూనికేషన్‌కు మాత్రమే ఉపయోగపడేవి. 
2జీ: 1990లో రెండో తరం సాంకేతిక పరిజ్ఞానం ప్రారంభమైంది. పర్సనల్‌ హ్యాండ్‌ సెట్‌లు వచ్చాయి. ఇవే సెల్‌ఫోన్లు. వీటితో వాయిస్‌ కాల్స్‌ చేయడం, రిసీవ్‌ చేసుకోవడం సాధ్యమైంది. క్రమేణా ఎస్‌ఎంఎస్‌లు కూడా వచ్చాయి. 2జీ కాలంలో మొదలయిన సెల్‌ఫోన్‌.. మనిషి జీవితంలో భాగమైంది.
3జీ: 2000 సంవత్సరానికి సెల్‌ఫోన్‌ జేబులో ఇమిడిపోయింది. ఇంటర్‌నెట్‌ యాక్సెస్‌ సాధ్యమైంది. సెల్‌ఫోను లేనిదే అడుగు వేయలేని స్థితికి వచ్చింది.
4జీ: 2010కి సెల్‌ఫోన్‌ స్మార్ట్‌ఫోన్‌గా మారిపోయింది. డేటా స్పీడ్‌ అనూహ్యంగా పెరిగింది. ఫోన్‌లో యాప్‌ స్టోర్లు చేరాయి. సోషల్‌ మీడియా ఉవ్వెత్తున ఎగిసింది.
5జీ ఉపయోగాలను ఊహించలేం

- 2జీ వచ్చినప్పుడు డిజిటల్‌ వాయిస్‌ కాలింగ్‌ 1990 దశాబ్దంలో అత్యంత ఉపయోగకరమైన అంశంగా అందరూ భావించారు. ఎస్‌ఎంఎస్‌ అప్పుడు ఓ అద్భుతం. 3జీ ప్రవేశంతో  ‘ఇంటర్నెట్‌ యాక్సెస్‌’ అద్భుతమైన అంశంగా నిలుస్తుందని అనుకున్నారు. అయితే సోషల్‌ మీడియా, స్మార్ట్‌ఫోన్‌ యాప్‌ల దశాబ్దంగా మారింది. 4జీతో రైడ్, షేరింగ్, ఫుడ్‌ డెలివరీ లాంటి క్లౌడ్‌ కంప్యూటింగ్‌ సేవలు వస్తాయని భావించారు. వాటితో పాటు యూట్యూబ్, నెట్‌ఫ్లిక్స్‌ లాంటి వీడియో స్ట్రీమింగ్‌ సౌకర్యాలు, వీడియో కాలింగ్‌ వచ్చి అంతులేని వినోదాన్ని పంచుతున్నాయి.

5జీ ఇంకేమి సౌకర్యాలను తెస్తుందో కచ్చితంగా చెప్పలేం. కానీ మెరుపువేగంతో డేటా ట్రాన్స్‌ఫర్‌ మానవ జీవితాన్ని మరింతగా మారుస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. 4జీ కంటే 5జీలో డేటా ట్రాన్స్‌ఫర్‌ వేగం 20 రెట్లు పెరుగుతుంది. ఇప్పుడు మనకు అందుబాటులో ఉన్న సాధారణ నెట్‌ 100 ఎంబీపీఎస్‌. 5జీలో సాధారణ వేగం 4–5 జీబీపీఎస్‌కు చేరే అవకాశం ఉంటుంది. ఇప్పుడు గంట పాటు డౌన్‌లోడ్‌ చేస్తున్న గేమ్స్‌ లాంటి వాటిని సెకన్ల వ్యవధిలో చేయచ్చు.

ఏ రంగాల్లో మార్పులు వస్తాయి?
- వినోద రంగంలో వర్చువల్‌ రియాలిటీ (వీఆర్‌), ఆగ్‌మెంటెడ్‌ రియాలిటీ (ఏఆర్‌), ఎక్స్‌టెండెడ్‌ రియాలిటీ (ఎక్స్‌ఆర్‌) సౌకర్యాలు మొబైల్‌ ఫోన్లలోకి వస్తాయి.

- విద్యా రంగంలో అనూహ్య మార్పులు వస్తాయి. ఆన్‌లైన్‌ టీచింగ్‌లో విద్యార్థులకు క్లాస్‌రూమ్‌లో ఉన్న అనుభూతి కలుగుతుంది. కంటెంట్‌ సులభంగా అర్థమయ్యేలా బోధించడానికి సహాయపడుతుంది.

- వైద్య రంగంలోనూ అనూహ్య మార్పులు వస్తాయి. అత్యవసర పరిస్థితుల్లో ఉన్న వ్యక్తి 108 (అంబులెన్స్‌)కు కాల్‌ చేసిన వెంటనే అంబులెన్స్‌తో పాటు సమీపంలోని ఆసుపత్రికి కూడా సమాచారం వెళుతుంది. డాక్టర్‌ను అలెర్ట్‌ చేస్తుంది. వేగంగా ఆసుపత్రికి చేరే మార్గాన్ని సూచించడంతో పాటు, ప్రత్యామ్నాయ ఆసుపత్రుల వివరాలను తెలియజేస్తుంది.

- టెలి మెడిసిన్‌లో ఆంధ్రప్రదేశ్‌లాంటి రాష్ట్రాలు ఇప్పటికే దూసుకెళుతున్నాయి. 5జీ అందుబాటులోకి వస్తే డాక్టర్, రోగి ఒక దగ్గర లేకుండా కేవలం మొబైల్‌లో రియల్‌టైమ్‌ వీడియో ద్వారా చికిత్స లభిస్తుంది.

- రోబోటిక్‌ సర్జరీల్లో మరిన్ని సంచలనాలకు దోహదం చేస్తుంది. ఆఫీసులో ఎదురుబొదురు కూర్చొన్నట్లుగా ఉండే వర్చువల్‌ మీటింగ్స్‌కు అవకాశం కల్పిస్తుంది. ఫలితంగా సిబ్బంది మొత్తం ఆఫీసుకే వచ్చి పనిచేయాల్సిన అవసరం ఉండదు. ‘రిమోట్‌ టీమ్‌ ప్రొడక్టి్టవిటీ’ని పెంచుతుంది.

- వాణిజ్య, పారిశ్రామిక రంగాల్లో వినూత్న మార్పులు వస్తాయి. ఫ్లెక్సిబుల్, నమ్మకమైన, సమర్థవంతమైన వ్యాపారానికి భూమికగా నిలుస్తుంది. డిమాండ్, సప్లైని బట్టి ఉత్పత్తి సం స్థలు ఆటోమేటిక్‌గా స్పందించే రోజు వస్తుంది.

- పరిశ్రమల్లో సమస్యలను ‘డిజిటల్‌ నమూనా’ల్లో ముందుగానే గుర్తించొచ్చు. ఫలితంగా సమస్య రాకుండా ముందు జాగ్రత్త తీసుకోవడానికి, ఒకవేళ సమస్య తలెత్తినా వేగంగా పరిష్కరించడానికి అవకాశం ఏర్పడుతుంది.

- వస్తు రవాణాను రియల్‌ టైమ్‌లో పరిశీలించొచ్చు. గోదాములు, పోర్టుల్లో ప్రతి వస్తువును ట్రాక్‌ చేయొచ్చు.

- డ్రైవర్‌ లేని కార్ల వినియోగం గణనీయంగా పెరుగుతుంది. ట్రాఫిక్‌ నియంత్రణ, ప్రమాదాల నివారణకు ఉపయోగపడుతుంది.

- ‘స్మార్ట్‌ గ్రిడ్‌’ కాన్సెప్ట్‌ మరింత బలోపేతం అవుతుంది. విద్యుత్‌ ఆదా అవుతుంది.

- వ్యవసాయంలోనూ సూపర్‌ ఫాస్ట్‌ నెట్‌వర్క్‌ ఉపయోగపడుతుంది. మోటార్లను ఆన్‌/ఆఫ్‌ చేయడానికే కాకుండా, పొలం తడిసిన వెంటనే అలర్ట్‌ చేసే రియల్‌టైం మెకానిజం చౌకగా లభిస్తుంది.

- డ్రోన్ల వినియోగం అత్యంత వేగంగా పెరుగుతుంది. వ్యవసాయం మొదలు అన్ని రంగాల్లో డ్రోన్ల వాడకం సులభం, చౌక అవుతుంది.

4జీ ఫోన్లు 5జీ నెట్‌వర్క్‌కు ఉపయోగపడతాయా?
4జీ ఫోన్లలోని ప్రాసెసర్‌ 5జీ నెట్‌వర్క్‌కు ఉపయోగపడదు.. ప్రాసెసర్‌ అప్‌గ్రెడేషన్‌కు కంపెనీలు అవకాశం ఇస్తే, ఇప్పుడున్న ఫోన్లను చౌకగా మార్చుకోవచ్చు. సాఫ్ట్‌వేర్‌ కూడా మార్చుకోవాలి. లేదంటే 5జీ ఫోన్లు కొనుక్కోవాలి. సిమ్‌ కార్డు కూడా 5జీకి మార్చాలి. స్మార్ట్‌ ఫోన్ల వినియోగంలో ప్రపంచంలో చైనా తొలి స్థానంలో ఉంటే, మనం రెండో స్థానంలో ఉన్నాం. ఈ డిమాండ్‌ మరింత పెరుగుతుంది. 2025 నాటికి గ్లోబల్‌ స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌లోనూ మన దేశం రెండోస్థానంలో కొనసాగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
(ఎం.విశ్వనాథరెడ్డి, సాక్షి ప్రత్యేక ప్రతినిధి)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement