న్యూఢిల్లీ: 5జీ టెక్నాలజీతో కూడిన బడ్జెట్ ఫోన్ల (రూ.10,000–15,000) విభాగంలో కంపెనీల మధ్య పోరు మొదలైంది. మరో ఏడాది కాలంలో దేశవ్యాప్తంగా 5జీ సేవలు అందుబాటులోకి రానున్న నేపథ్యంలో వినియోగదారులు తమ ఫోన్లను కొత్త టెక్నాలజీకి అనుగుణంగా మార్చుకునేందుకు ఆసక్తి చూపించనున్నారు. దీంతో ఈ విభాగం కంపెనీలకు ఆకర్షణీయంగా మారనుంది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది 5జీ స్మార్ట్ ఫోన్ల ఆవిష్కరణలు ఇప్పటికే రెట్టింపు స్థాయిలో ఉన్నాయి. అంటే పోటీ ఇప్పటికే మొదలైనట్టు కనిపిస్తోంది.
రానున్న పండుగల నేపథ్యంలో మరిన్ని 5జీ ఫోన్ల ఆవిష్కరణలు చోటు చేసుకుంటాయని.. కంపెనీల మధ్య పోటీ మరింత వేడెక్కుతుందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే పెరుగుతున్న ద్రవ్యోల్బణం, తయారీ వ్యయాలు (ముడి పదార్థాల వల్ల) పెరిగిపోవడం, బలహీన రూపాయి రూపంలో కంపెనీలు సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. ఈ అంశాల వల్ల కంపెనీలు బ్యాటరీ, డిస్‌ప్లే, మెమొరీ విషయంలో రాజీపడి, రూ.15,000లోపు ధరకే 5జీ ఫోన్లను విక్రయించే ప్రయత్నం చేస్తున్నట్టు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.
బడ్జెట్ విభాగమే టార్గెట్..
రూ.10,000–15,000 విభాగాన్ని 5జీ ఫోన్లు శాసిస్తాయని అంచనా వేస్తున్నట్టు రియల్‌మీ ఇండియా సీఈవో మాధవ్ సేత్ పేర్కొనడం గమనార్హం. ఈ ఏడాది చివరికి ఈ విభాగంలో 5జీ ఫోన్లదే హవా ఉంటుందన్నారు. దీపావళికి చాలా బ్రాండ్లు ఈ విభాగాన్నే లక్ష్యం చేసుకుని ఉత్పత్తులు తీసుకురానున్నట్టు అంచనా వేశారు. ఇదే ధరల శ్రేణిలో ఏకంగా ఆరు 5జీ ఫోన్లు ఒక్క ఆగస్ట్ నెలలోనే విడుదలయ్యాయి. కానీ, క్రితం ఏడాది ఇదే సమయానికి ఈ ధరల శ్రేణిలో ఉన్న 5జీ ఫోన్లు కేవలం మూడే. ‘‘2022 మొదటి ఆరు నెలల్లో రూ.10,000–15,000 ధరల్లోని 5జీ స్మార్ట్‌ఫోన్ల డిమాండ్, క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చిచూస్తే నాలుగు రెట్లు అధికంగా ఉంది’’అని ఫ్లిప్‌కార్ట్ తెలిపింది.
అయితే ఈ ధరల శ్రేణికి సంబంధించి 5జీ ఫోన్ల మార్కెట్ వాటా మొత్తం స్మార్ట్‌ఫోన్లలో చాలా తక్కువే ఉందని చెప్పుకోవాలి. 2022 ద్వితీయ మూడు నెలల్లో 6 శాతంగా ఉంది. 2021 చివరి నుంచి చూస్తే మార్కెట్ వాటా రెట్టింపైందని కౌంటర్ పాయింట్ రీసెర్చ్ తెలిపింది. ఈ ఏడాది చివరికి 5జీ స్మార్ట్‌ఫోన్ల మార్కెట్ వాటా 10 శాతానికి చేరుకోవచ్చని అంచనాలున్నాయి. తక్కువ ధరల్లో అందించేందుకు కంపెనీలు డిస్‌ప్లే, ఫాస్ట్ చార్జింగ్‌లో రాజీపడటం ఒక్కటే ఆందోళన కలిగిస్తోంది.
మార్కెట్ వాటా..
కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ డేటా ప్రకారం.. 5జీ ఫోన్లలో షావోమీ తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది. పోకో బ్రాండ్‌తో కలిపి ఈ విభాగంలో 70 శాతం మార్కెట్ వాటా షావోమీ చేతుల్లోనే ఉంది. రియల్‌మీ మార్కెట్ వాటా 25 శాతంగా ఉంది. ఇక మోటరోలా 5 శాతం వాటా కలిగి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment