
న్యూఢిల్లీ: దేశంలోని 6 మార్గాల్లో హైస్పీడ్, సెమీస్పీడ్ కారిడార్లను గుర్తించినట్లు రైల్వేశాఖ బుధవారం తెలిపింది. ఈ మార్గాలపై ఏడాదిలోపు పూర్తిస్థాయి నివేదిక (డీపీఆర్) తయారవుతుందని రైల్వే బోర్డు చైర్మన్ వీకే యాదవ్ చెప్పారు. హైస్పీడ్ కారిడార్‌లో రైళ్లు గంటకు 300 కి.మీ.ల వేగంతో, సెమీస్పీడ్ కారిడార్‌లో 160 కిలోమీటర్ల వేగంతో నడవనున్నాయి. ఈ కారిడార్లలో ఢిల్లీ–నోయిడా–ఆగ్రా–లక్నో–వారణాసి, ఢిల్లీ–జైపూర్–ఉదయ్‌పూర్–అహ్మదాబాద్, ముంబై–నాసిక్–నాగ్‌పూర్, ముంబై–పుణే–హైదరాబాద్, చెన్నై–బెంగళూరు–మైసూర్, ఢిల్లీ–లూథియానా–జలంధర్–అమృత్‌సర్ ఉన్నాయి. స్థల సేకరణ, అక్కడ ఉండే ట్రాఫిక్ వంటి వివరాల ఆధారంగా ఆయా సెక్షన్లను హైస్పీడ్ లేదా సెమీస్పీడ్ కారిడార్లుగా గుర్తిస్తామని చెప్పారు. రానున్న ఆరు నెలల్లోనే 90శాతం భూసేకరణ పూర్తి చేస్తామని చెప్పారు. 2023కల్లా దేశంలోనే మొదటి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు ప్రారంభమవుతుందని చెప్పారు.
2021కల్లా ఆర్‌ఎఫ్‌ఐడీ టాగ్‌లు..
దేశంలోని సుమారు మూడున్నర లక్షల రైల్వే కోచ్‌లు, వాగన్‌లకు 2021కల్లా రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ (ఆర్‌ఎఫ్‌ఐడీ) పూర్తి చేస్తామని రైల్వేశాఖ అధికారులు చెప్పారు. దాదాపు రూ. 112 కోట్లతో ఈ ప్రాజెక్టు చేపడుతున్నట్లు తెలిపారు. ఇప్పటివరకూ 22 వేల వాగన్లు, 1200 కోచ్‌లకు ఆర్‌ఎఫ్‌ఐడీ టాగ్‌లు పూర్తిచేసినట్లు తెలిపారు. దీనివల్ల రైళ్లను సులువుగా ట్రాక్ చేయవచ్చని, సమయానుగుణంగా నడిచేలా చర్యలు తీసుకోవచ్చని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment