న్యూఢిల్లీ: హైస్పీడ్ ఇంటర్నెట్ అందించే 5జీ సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు కీలకమైన ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ (ఓఎఫ్‌సీ)కు గణనీయంగా ప్రాధాన్యం పెరుగుతోంది. టెలికం శాఖ అంచనాల ప్రకారం 2018లో ఓఎఫ్‌సీ నెట్‌వర్క్ సుమారు 1.4–1.5 మిలియన్ కేబుల్ రూట్ కిలోమీటర్స్ మేర విస్తరించి ఉంది. ఇంటర్నెట్ విస్తృతిని మరింత పెంచే దిశగా ప్రభుత్వం నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరాలంటే 2022 నాటికి ఈ నెట్‌వర్క్‌కు దాదాపు నాలుగు రెట్లు అధికంగా 5.5 మిలియన్ కేబుల్ రూట్ కిలోమీటర్స్ మేర ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ వేయాల్సి ఉంటుంది.
ఇందుకోసం ఏకంగా రూ. 1,80,000 కోట్ల స్థాయిలో పెట్టుబడులు అవసరం. టెలికం సంస్థలు ప్రధానంగా టవర్ల పెంపునకు అవసరమైన ఫైబర్ కేబుల్స్ వేయడంపైనే ముందుగా దృష్టి పెట్టాల్సి రానుండటంతో ఈ పెట్టుబడుల్లో సింహభాగం వాటా ప్రభుత్వమే భరించాల్సి రానుంది. 5జీ సేవలను ముందుగా పెద్ద నగరాల్లోనే ప్రవేశపెట్టే అవకాశం ఉండటంతో వచ్చే రెండు, మూడేళ్లలో టవర్స్ సంఖ్య 5,00,000 నుంచి 7,50,000కు పెంచుకోవాల్సిన అవసరం ఉందని సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (సీవోఏఐ) డైరెక్టర్ జనరల్ రాజన్ మాథ్యూస్ తెలిపారు. ఇందులో 70 శాతం టవర్స్‌కు అవసరమైన ఫైబర్ కేబుల్ వేయాలంటేనే దాదాపు రూ. 50,000 కోట్లు అవసరమని ఆయన పేర్కొన్నారు.
ఓఎఫ్‌సీ అవసరమేంటంటే..
ఇంత భారీ స్థాయిలో ఓఎఫ్‌సీ వినియోగించాల్సి రావడానికి ముఖ్యంగా కొన్ని కారణాలు ఉన్నాయి. సాధారణంగా 5జీ సేవలకు ఉపయోగపడే స్పెక్ట్రం చాలా శక్తిమంతమైనదే అయినా దాని పరిధి చాలా పరిమితంగా ఉంటుంది. దీంతో మరింత పెద్ద సంఖ్యలో టవర్స్ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. 4జీతో పోలిస్తే 5జీ కోసం 3 రెట్లు ఎక్కువగా టవర్స్ అవసరమవుతాయని ఓఎఫ్‌సీ తయారీ దిగ్గజం హిమాచల్ ఫ్యూచరిస్టిక్ చైర్మన్ మహేంద్ర నహతా తెలిపారు. ఇక రెండో కారణం విషయానికొస్తే.. ప్రస్తుతం వినియోగంలో ఉన్న టవర్లలో కేవలం 20% టవర్స్‌కి మాత్రమే ఫైబర్ కేబుల్స్ ఉపయోగిసున్నారు.
5జీ సేవలను సముచిత స్థాయిలో అందించాలంటే వచ్చే మూడేళ్లలో దీన్ని కనీసం 70 శాతానికి పెంచుకోవాల్సిన అవసరం ఉందని మాథ్యూస్ చెప్పారు. మరోవైపు, అంతర్జాతీయ దిగ్గజ సంస్థలు భారత్‌లో ఏర్పాటు చేస్తున్న డేటా సెంటర్లకోసం కూడా ఓఎఫ్‌సీ అవసరం. ఇక రిలయన్స్ జియో ప్రకటించిన ఫైబర్ టు హోమ్ సర్వీసుల కోసం కూడా భారీ స్థాయిలో ఓఎఫ్‌సీ కావాల్సి ఉంటోంది. వచ్చే మూడేళ్లలో సుమారు 1,600 నగరాల్లో 7.5 కోట్ల మందికి టీవీ, వాయిస్, డేటా సేవలను అందించే దిశగా రిలయన్స్ జియో ప్రయత్నాలు చేస్తోంది.
ఇవి కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో కూడా హై స్పీడ్ డేటా సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు జాతీయ బ్రాడ్‌బ్యాండ్ మిషన్ కింద కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన కార్యక్రమాన్ని అమలు చేసేందుకు కూడా ఓఎఫ్‌సీ చాలా కీలకం. తెలంగాణ వంటి కొన్ని రాష్ట్రాలు కూడా ప్రజలకు చౌక బ్రాడ్‌బ్యాండ్ అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నాయి. తెలంగాణ ప్రభుత్వం టీ–ఫైబర్ పేరిట 12,700 పంచాయతీల్లో 2 కోట్ల జనాభాకు బ్రాడ్ బ్యాండ్‌ను అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చేస్తోంది.
చాలా సవాళ్లున్నాయ్..
ఓఎఫ్‌సీకి ఇంత భారీ డిమాండ్ ఉన్నప్పటికీ టెల్కోలు కేబుల్ వేయడంలో టెల్కోలు అనేక సవాళ్లు ఎదుర్కొంటున్నాయి. రహదారులను తవ్వి కేబుల్స్ వేయాలంటే చాలా వ్యయాలతో కూడుకున్నదిగాను, మున్సిపాలిటీల నుంచి అనుమతులు పొందటం కష్టతరంగాను ఉంటోందని టెలికం వర్గాలు తెలిపాయి. ముంబై వంటి నగరాల్లో ఓఎఫ్‌సీ వేయాలంటే కిలోమీటరుకు రూ. 1 కోటి పైగా వ్యయం అవుతుందని వివరించాయి. అండర్‌గ్రౌండ్‌లో ఓఎఫ్‌సీ వేసేందుకు అయ్యే మొత్తం ఖర్చులో కేబుల్ ఖరీదు 15 శాతం కూడా దాటదని పేర్కొన్నాయి.
ఇక ఇప్పటికే భారీ రుణభారంతో సతమతమవుతున్న టెల్కోలకు మళ్లీ ఖరీదైన 5జీ స్పెక్ట్రంను కొనుగోలు చేయడానికి, ఫైబర్ వేయడానికి కావాల్సిన నిధులు ఎక్కడ నుంచి వస్తాయన్న సందేహాలూ నెలకొన్నాయి. మూడు దిగ్గజ టెల్కోలు తమ నెట్‌వర్క్‌ను విస్తరించేందుకు ఈ ఏడాది దాదాపు రూ. 1,00,000 కోట్లు వ్యయం చేస్తున్నాయి. ఇవి మళ్లీ ఫైబర్ కోసం మరో రూ. 15,000 కోట్లు ఖర్చు చేయగలవా అన్నది ప్రశ్నార్థకంగా మారిందని నిపుణులు అభిప్రాయపడ్డారు. అటు ప్రభుత్వానికి కూడా ప్రస్తుత పరిస్థితుల్లో ఓఎఫ్‌సీపై భారీ పెట్టుబడులు పెట్టడం సాధ్యం కాకపోవచ్చని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment