Optical fiber cable network
-
రష్యా తో ‘లైఫ్ లైన్స్’కు ముప్పు!
ఆధునిక సాంకేతికత మన జీవితాలను ఆక్రమించేసింది. ఇంటర్నెట్ లేనిది క్షణమైనా గడవని పరిస్థితి. కొద్ది గంటలు ప్రపంచంలోని కొన్ని దేశాల్లో ఇంటర్నెట్ సేవలు లేదా సామాజిక మాధ్యమ యాప్‌లు నిలిచిపోతే అదో పెద్ద వార్త అవుతోంది. అలాంటిది ఇంటర్నెట్కు జీవనాడులుగా పరిగణించే సముద్రగర్భంలోని ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్‌ను ఎవరైనా కత్తిరించేస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. ప్రపంచం స్తంభించిపోతుంది. అండర్ వాటర్ క్యాప్సుల్ పనితీరును ప్రత్యక్షంగా పరిశీలిస్తున్న రష్యా అధ్యక్షుడు పుతిన్ (ఫైల్) వివిధ ఖండాలను కలుపుతున్న ఆప్టికల్ ఇంటర్నెట్, రక్షణ వ్యవస్థలు, వైద్య ఆరోగ్య సేవలు, విద్యుత్ పంపిణీ వ్యవస్థలు, ఆర్థిక కార్యకలాపాలు, క్యాబ్ సర్వీసులు, ఫుడ్ డెలివరీలు... ఇలా ఒకటేమిటి ప్రతిదీ నిలిచిపోతుంది. ప్రపంచం అతలాకుతలమవుతంది. ఇప్పుడదే ముప్పు రష్యా నుంచి పొంచి వుందని అమెరికా, బ్రిటన్‌తో సహా ప్రపంచదేశాలు ఆందోళన చెందుతున్నాయి. అణ్వాయుధ పోటీ గతించిన ముచ్చట. శత్రుదేశాలను దెబ్బతీయడానికి, ప్రపంచ దేశాలను భయపెట్టడానికి రష్యా, చైనాలు ఇప్పటికే సైబర్ దాడులను సమర్థమంతమైన ఆయుధంగా వాడుతున్నాయి. ఇతర దేశాల్లోని కీలక వ్యవస్థలపై దాడులు కొనసాగిస్తూ, వాటిని కుప్పకూల్చే ప్రయత్నాలు చేస్తున్నాయి. హ్యాకింగ్, డేటా చౌర్యం జరుగుతోంది. అందుకే ప్రపంచదేశాలన్నీ ‘సైబర్ సెక్యూరిటీ’ని అతిపెద్ద సవాల్‌గా స్వీకరించాయి. ఈ తరుణంలోనే రష్యా గత ఐదారేళ్లుగా కొత్త యుద్ధ తంత్రానికి తెరలేపింది. సముద్రగర్భంలోని ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్‌ను లక్ష్యంగా చేసుకుంటూ... ఏ క్షణమైనా వాటిని తుంచేసే విధంగా అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటోంది. వీటిలో నుంచి ప్రసారమయ్యే సమాచారాన్ని తస్కరించే సాంకేతికతలనూ అభివృద్ధి చేస్తోంది. భారీగా పెట్టుబడులు పెడుతోంది. కొత్తగా నియమితులైన బ్రిటన్ చీఫ్ ఆప్ డిఫెన్స్ స్టాఫ్ అడ్మిరల్ టోనీ రాడకిన్ ఈ జీవనాడులకు రష్యా నుంచే ప్రధాన ముప్పు పొంచి వుందని గతవారం ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. సముద్రగర్భంలోని ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్‌ను పరిరక్షించుకోవడానికి.. ప్రత్యేక నిఘా నౌకను 2024 కల్లా జలప్రవేశం చేయిస్తామని బ్రిటన్‌కు చెందిన రాయల్ నేవీ ఇటీవల ప్రకటించింది. ఇది అణ్వాయుధ యుద్ధంతో సమానమైన ముప్పని రక్షణ రంగ నిపుణులు పేర్కొంటున్నారు. ఉక్రెయిన్ సరిహద్దుల్లో రష్యా లక్ష మంది సైన్యాన్ని మోహరించడంతో రెండు నెలలుగా తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఉక్రెయిన్ను ఆక్రమిస్తే తీవ్ర పర్యవసానాలు చవిచూడాల్సి వస్తుందని అమెరికా, నాటో దేశాలు రష్యాను పలుమార్లు హెచ్చరించాయి. దీంతో రష్యా అభివృద్ధి చేస్తున్న సముద్రగర్భ సాంకేతికతలు, సమకూర్చుకుంటున్న సాధానాలపై అంతర్జాతీయంగా చర్చ మొదలైంది. రష్యా ఇలాంటి తీవ్ర చర్యలకు దిగే అవకాశాలు తక్కువే అయినా... అమెరికా, నాటో దేశాలతో ఘర్షణ ముదిరితే... రష్యా దీన్నో ఆయుధంగా వాడే ప్రమాదం ఉందనేది నిపుణుల అభిప్రాయం. రష్యా ఏయే మార్గాల్లో ప్రపంచానికి జీవనాడులైన ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్‌ను దెబ్బతీయగలదో చూద్దాం.. 436: వివిధ సముద్రాల మీదుగా పలు ఖండాలను, ప్రపంచ దేశాలను కలుపుతూ కడలి గర్భంలో మొత్తం 436 ఆప్టికల్ ఫైబర్ కేబుల్ లైన్స్ ఉన్నాయి. వీటి మొత్తం పొడవు.. 12,87,475 కిలోమీటర్లు. ఇవే నేటి మన ప్రపంచపు జీవనాడులు (లైఫ్ లైన్స్). నిరంతరాయ ఇంటర్నెట్ సేవలకు మూలాధారం. వీటిలో అన్నింటికంటే పొడవైనది అమెరికా– ఆసియా ఖండాలను కలిపేది. ఈ కేబుల్‌లైన్ పొడవు 20,004 కిలోమీటర్లు. 97%: అంతర్జాతీయంగా నిత్యం జరిగే కమ్యూనికేషన్స్‌లో 97 శాతం ఈ కేబుల్స్ ద్వారానే జరుగుతుంది. శాటిలైట్స్ మన కమ్యూనికేషన్స్ అవసరాల్లో మూడు శాతం మాత్రమే తీరుస్తున్నాయి. 10 లక్షల కోట్ల డాలర్లు: సముద్రపు అడుగుభాగంలోని 436 కేబుల్ లైన్స్ ద్వారా ప్రతిరోజూ 10 లక్షల కోట్ల డాలర్ల విలువైన ఆర్థిక లావాదేవీలు జరుగుతాయి. ప్రపంచం ఆర్థిక రంగానికి ఇదే లైఫ్‌లైన్. -
డిజిటల్ అండమాన్
న్యూఢిల్లీ: భారత్ యాక్ట్ ఈస్ట్ పాలసీలో అండమాన్ నికోబార్ దీవులు మరింత కీలకంగా మారాయని ప్రధాని మోదీ అన్నారు. చెన్నై నుంచి పోర్ట్‌బ్లెయిర్ వరకు సముద్ర గర్భంలో ఏర్పాటు చేసిన ఆప్టికల్ ఫైబర్ కేబుల్‌ను సోమవారం ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. రూ.1,224 కోట్లతో చెన్నై నుంచి పోర్ట్ బ్లెయిర్ , అక్కడ్నుంచి ఇతర ద్వీపసమూహాలకు 2,312 కి.మీ. పొడవున వేసిన ఈ కేబుల్‌తో అండమాన్ నికోబర్ దీవుల్లో ప్రజలకు 4జీ ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. సెకండ్‌కి 2200 జీబీపీఎస్ సామర్థ్యం గల ఈ కేబుల్ వ్యవస్థ ద్వారా అండమాన్ ద్వీప సమూహానికి స్వాతంత్య్ర దినోత్సవ కానుక ముందే లభించినట్ట యిందని ప్రధాని వ్యాఖ్యానించారు. సరకు రవాణా ద్వారా వాణిజ్య కార్యకలాపాలను పెంచడానికి 10 వేల కోట్లతో గ్రేట్ నికోబార్ ద్వీపసమూహంలో ట్రాన్స్షిప్మెంట్ ఏర్పాటు ప్రతిపాదనలు సిద్ధమయ్యా యన్నారు. కాగా, ప్రకృతి వైపరీత్యాలను ముందుగానే పసిగట్టే శాశ్వత వ్యవస్థకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విభాగాల మధ్య మరింత సమన్వయం అవసరమని ప్రధాని అన్నారు. భారీ వర్షాలు, వరదల పరిస్థితిని ఎదుర్కొంటున్న అస్సాం, బిహార్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ ముఖ్యమంత్రులనుద్దేశించి ప్రధాని మాట్లాడారు. -
ఆప్టికల్ ఫైబర్‌కు ‘5జీ’ జోష్!
న్యూఢిల్లీ: హైస్పీడ్ ఇంటర్నెట్ అందించే 5జీ సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు కీలకమైన ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ (ఓఎఫ్సీ)కు గణనీయంగా ప్రాధాన్యం పెరుగుతోంది. టెలికం శాఖ అంచనాల ప్రకారం 2018లో ఓఎఫ్సీ నెట్వర్క్ సుమారు 1.4–1.5 మిలియన్ కేబుల్ రూట్ కిలోమీటర్స్ మేర విస్తరించి ఉంది. ఇంటర్నెట్ విస్తృతిని మరింత పెంచే దిశగా ప్రభుత్వం నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరాలంటే 2022 నాటికి ఈ నెట్‌వర్క్‌కు దాదాపు నాలుగు రెట్లు అధికంగా 5.5 మిలియన్ కేబుల్ రూట్ కిలోమీటర్స్ మేర ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ వేయాల్సి ఉంటుంది. ఇందుకోసం ఏకంగా రూ. 1,80,000 కోట్ల స్థాయిలో పెట్టుబడులు అవసరం. టెలికం సంస్థలు ప్రధానంగా టవర్ల పెంపునకు అవసరమైన ఫైబర్ కేబుల్స్ వేయడంపైనే ముందుగా దృష్టి పెట్టాల్సి రానుండటంతో ఈ పెట్టుబడుల్లో సింహభాగం వాటా ప్రభుత్వమే భరించాల్సి రానుంది. 5జీ సేవలను ముందుగా పెద్ద నగరాల్లోనే ప్రవేశపెట్టే అవకాశం ఉండటంతో వచ్చే రెండు, మూడేళ్లలో టవర్స్ సంఖ్య 5,00,000 నుంచి 7,50,000కు పెంచుకోవాల్సిన అవసరం ఉందని సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (సీవోఏఐ) డైరెక్టర్ జనరల్ రాజన్ మాథ్యూస్ తెలిపారు. ఇందులో 70 శాతం టవర్స్‌కు అవసరమైన ఫైబర్ కేబుల్ వేయాలంటేనే దాదాపు రూ. 50,000 కోట్లు అవసరమని ఆయన పేర్కొన్నారు. ఓఎఫ్సీ అవసరమేంటంటే.. ఇంత భారీ స్థాయిలో ఓఎఫ్సీ వినియోగించాల్సి రావడానికి ముఖ్యంగా కొన్ని కారణాలు ఉన్నాయి. సాధారణంగా 5జీ సేవలకు ఉపయోగపడే స్పెక్ట్రం చాలా శక్తిమంతమైనదే అయినా దాని పరిధి చాలా పరిమితంగా ఉంటుంది. దీంతో మరింత పెద్ద సంఖ్యలో టవర్స్ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. 4జీతో పోలిస్తే 5జీ కోసం 3 రెట్లు ఎక్కువగా టవర్స్ అవసరమవుతాయని ఓఎఫ్సీ తయారీ దిగ్గజం హిమాచల్ ఫ్యూచరిస్టిక్ చైర్మన్ మహేంద్ర నహతా తెలిపారు. ఇక రెండో కారణం విషయానికొస్తే.. ప్రస్తుతం వినియోగంలో ఉన్న టవర్లలో కేవలం 20% టవర్స్‌కి మాత్రమే ఫైబర్ కేబుల్స్ ఉపయోగిసున్నారు. 5జీ సేవలను సముచిత స్థాయిలో అందించాలంటే వచ్చే మూడేళ్లలో దీన్ని కనీసం 70 శాతానికి పెంచుకోవాల్సిన అవసరం ఉందని మాథ్యూస్ చెప్పారు. మరోవైపు, అంతర్జాతీయ దిగ్గజ సంస్థలు భారత్‌లో ఏర్పాటు చేస్తున్న డేటా సెంటర్లకోసం కూడా ఓఎఫ్సీ అవసరం. ఇక రిలయన్స్ జియో ప్రకటించిన ఫైబర్ టు హోమ్ సర్వీసుల కోసం కూడా భారీ స్థాయిలో ఓఎఫ్సీ కావాల్సి ఉంటోంది. వచ్చే మూడేళ్లలో సుమారు 1,600 నగరాల్లో 7.5 కోట్ల మందికి టీవీ, వాయిస్, డేటా సేవలను అందించే దిశగా రిలయన్స్ జియో ప్రయత్నాలు చేస్తోంది. ఇవి కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో కూడా హై స్పీడ్ డేటా సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు జాతీయ బ్రాడ్‌బ్యాండ్ మిషన్ కింద కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన కార్యక్రమాన్ని అమలు చేసేందుకు కూడా ఓఎఫ్సీ చాలా కీలకం. తెలంగాణ వంటి కొన్ని రాష్ట్రాలు కూడా ప్రజలకు చౌక బ్రాడ్‌బ్యాండ్ అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నాయి. తెలంగాణ ప్రభుత్వం టీ–ఫైబర్ పేరిట 12,700 పంచాయతీల్లో 2 కోట్ల జనాభాకు బ్రాడ్ బ్యాండ్‌ను అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చేస్తోంది. చాలా సవాళ్లున్నాయ్.. ఓఎఫ్‌సీకి ఇంత భారీ డిమాండ్ ఉన్నప్పటికీ టెల్కోలు కేబుల్ వేయడంలో టెల్కోలు అనేక సవాళ్లు ఎదుర్కొంటున్నాయి. రహదారులను తవ్వి కేబుల్స్ వేయాలంటే చాలా వ్యయాలతో కూడుకున్నదిగాను, మున్సిపాలిటీల నుంచి అనుమతులు పొందటం కష్టతరంగాను ఉంటోందని టెలికం వర్గాలు తెలిపాయి. ముంబై వంటి నగరాల్లో ఓఎఫ్సీ వేయాలంటే కిలోమీటరుకు రూ. 1 కోటి పైగా వ్యయం అవుతుందని వివరించాయి. అండర్‌గ్రౌండ్‌లో ఓఎఫ్సీ వేసేందుకు అయ్యే మొత్తం ఖర్చులో కేబుల్ ఖరీదు 15 శాతం కూడా దాటదని పేర్కొన్నాయి. ఇక ఇప్పటికే భారీ రుణభారంతో సతమతమవుతున్న టెల్కోలకు మళ్లీ ఖరీదైన 5జీ స్పెక్ట్రంను కొనుగోలు చేయడానికి, ఫైబర్ వేయడానికి కావాల్సిన నిధులు ఎక్కడ నుంచి వస్తాయన్న సందేహాలూ నెలకొన్నాయి. మూడు దిగ్గజ టెల్కోలు తమ నెట్‌వర్క్‌ను విస్తరించేందుకు ఈ ఏడాది దాదాపు రూ. 1,00,000 కోట్లు వ్యయం చేస్తున్నాయి. ఇవి మళ్లీ ఫైబర్ కోసం మరో రూ. 15,000 కోట్లు ఖర్చు చేయగలవా అన్నది ప్రశ్నార్థకంగా మారిందని నిపుణులు అభిప్రాయపడ్డారు. అటు ప్రభుత్వానికి కూడా ప్రస్తుత పరిస్థితుల్లో ఓఎఫ్‌సీపై భారీ పెట్టుబడులు పెట్టడం సాధ్యం కాకపోవచ్చని పేర్కొన్నారు. -
ఇంటింటికీ ఇంటర్నెట్
హైదరాబాద్ వైఫై ప్రాజెక్టును ప్రారంభించిన కేటీఆర్ ఆరు నెలల్లో గ్రేటర్ వ్యాప్తంగా అరగంట ఉచిత వైఫై అమలు చేస్తామన్న మంత్రి డిజిటల్ ఇండియా ప్రధాన లక్ష్యం: కేంద్ర మంత్రి రవిశంకర్‌ప్రసాద్ హైదరాబాద్: రాబోయే ఐదేళ్లలో తెలంగాణలో ఉన్న కోటి నివాసాలను ఆప్టికల్ ఫైబర్ కేబుల్ నెట్‌వర్క్‌తో అనుసంధానించి ప్రతి ఇంటికి బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ సేవలు అందజేస్తామని, తద్వారా పౌరసేవలు పొందడాన్ని మరిం త సరళం చేస్తామని రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్ మంత్రి కె.తారకరామారావు అన్నారు. దేశంలో తొలి డిజిటల్ రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దుతామని తెలిపారు. ట్యాంక్‌బండ్‌పై రాష్ట్ర ఐటీ శాఖ, బీఎస్ఎన్ఎల్, క్వాడ్జెన్ సంస్థలు సంయుక్తంగా పైలట్ పద్ధతిలో ఏర్పాటు చేసిన వైఫై ప్రాజెక్టును గురువారం ఆయన లాంఛనంగా ప్రారంభించారు. రాబోయే ఆరు నెలల కాలంలో గ్రేటర్ వ్యాప్తంగా బీఎస్ఎన్ఎల్ సంస్థతో కలసి 3వేల హాట్స్పాట్లను ఏర్పాటు చేసి వైఫైసేవలను తొలి అరగంట ఉచితంగా అందిస్తామన్నారు. త్వరలో శాంతిభద్రతల పర్యవేక్షణకు కూడా వైఫై సేవలను వినియోగిస్తామన్నారు. ఈ-గవర్నెన్స్ తరహాలోనే మొబైల్ గవర్నెన్స్ ద్వారా పౌరసేవలను అందజేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. జూన్ 1న టి-హబ్ (సాంకేతిక నవకల్పన కేంద్రం)ను ప్రారంభిస్తామని, ఇందులో పలు స్టార్టప్ (నూతనఐటీకంపెనీలు) కంపెనీలకు స్థానం కల్పించనున్నామన్నారు. ఇంటర్నెట్ ప్రసారాలను నియంత్రించేందుకు పలు సెల్యులార్ కంపెనీలు చేస్తున్న ప్రయత్నాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా సోషల్ మీడియాలో ప్రారంభమైన నెట్న్యూట్రాలిటీ ఉద్యమానికి తమ ప్రభుత్వం పూర్తిగా మద్దతునిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఐటీశాఖ కార్యదర్శి జయేష్‌రంజన్,బీఎస్ఎన్ఎల్ సీజీఎం మురళీధర్,క్వాడ్జెన్ సీఈఓ సీఎస్‌రావు,ఐటీ శాఖ ఓఎస్డీ రమేష్ పాల్గొన్నారు. నగరంలో 5జీ వైఫైసేవలు: రవిశంకర్‌ప్రసాద్ ట్యాంక్‌బండ్, బుద్ధవిగ్రహంతో ఎంతో అందంగా కనిపించే భాగ్యనగరంలో శక్తివంతమైన 5జీ సాంకేతికతతో కూడిన వై-ఫై సేవలు అందుబాటులోకి రావడం సంతోషదాయకమని కేంద్ర ఐటీ మంత్రి రవిశంకర్‌ప్రసాద్ అన్నారు. హైదరాబాద్ వై-ఫై ప్రాజెక్టు ప్రారంభోత్సవం సందర్భంగా కేంద్ర మంత్రి ఢిల్లీ నుంచి రాష్ట్ర మంత్రి కేటీఆర్‌తో స్కైప్ ఫేస్టైమ్కాల్లో మాట్లాడారు. దేశంలోని తాజ్‌మహల్, బోధగయ తదితర చారిత్రక ప్రదేశాలతోపాటు మరో 2,500 కేంద్రాల్లో బీఎస్ఎన్ఎల్ వైఫై సేవలు అందజేస్తుందని తెలిపారు. దేశాన్ని డిజిటల్ ఇండియాగా మార్చడం, ఈ-పంచాయతీల ఏర్పాటు తమ ప్రభుత్వ సంకల్పమని వివరించారు. అంతర్జాతీయ నగరాల సరసన హైదరాబాద్ ఉచిత వైఫై సేవల కల్పన ద్వారా హైదరాబాద్ నగరం శాన్ఫ్రాన్సిస్కో, బార్సిలోనా, లండన్ వంటి స్మార్ట్‌సిటీల జాబితాలో చేరిందని ఐటీ నిపుణులు తెలిపారు. మరో ఆరునెలల్లో నగరంలో 3 వేల వైఫై హాట్‌స్పాట్ పరికరాలను ఏర్పాటు చేయడం ద్వారా నగరవ్యాప్తంగా అరగంట పాటు ఉచిత వైఫై సేవలు అందుబాటులోకి రానున్నాయి. వైఫై సేవలను ఇలా ఉపయోగించుకోండి: ట్యాంక్‌బండ్, నక్లెస్‌రోడ్ పరిసరాల్లో పది కిలోమీటర్ల పరిధిలో 40 వైఫై హాట్స్పాట్లను బీఎస్ఎన్ఎల్, క్వాడ్జెన్ సంస్థలు సంయుక్తంగా ఏర్పాటు చేశాయి. వీటి పరిధిలో మీ స్మార్ట్ ఫోన్లోని వైఫై ఆప్షన్‌ను క్లిక్‌చేసి అవసరమైన వివరాలు పొందుపరిచి ఆ తరవాత లాగిన్ కావాలి. దీంతో తొలి అరగంటపాటు ఉచితంగా వైఫై సేవలను పొందవచ్చు. అంతేకాదు 300 ఎంబీపీఎస్ నిడివిగల ఇంటర్నెట్ ప్రసారాలను వినియోగించుకోవచ్చని బీఎస్ఎన్ఎల్ సంస్థ తెలిపింది. ఆ తరువాత అరగంటకు రూ.30, గంటకు రూ.50, రెండు గంటలకు రూ.120, ఒక రోజంతా వైఫై సేవలను వినియోగించేందుకు రూ.150 విలువచేసే బీఎస్ఎన్ఎల్ వైఫై ఆఫర్ కూపన్లను వినియోగించాలని సూచించింది. ఈ కూపన్లు అన్ని బీఎస్ఎన్ఎల్ ఔట్లెట్లలో అందుబాటులో ఉంటాయని తెలిపింది.