ఇంటింటికీ ఇంటర్నెట్
హైదరాబాద్ వైఫై ప్రాజెక్టును ప్రారంభించిన కేటీఆర్
ఆరు నెలల్లో గ్రేటర్ వ్యాప్తంగా అరగంట ఉచిత వైఫై అమలు చేస్తామన్న మంత్రి
డిజిటల్ ఇండియా ప్రధాన లక్ష్యం: కేంద్ర మంత్రి రవిశంకర్‌ప్రసాద్
హైదరాబాద్: రాబోయే ఐదేళ్లలో తెలంగాణలో ఉన్న కోటి నివాసాలను ఆప్టికల్ ఫైబర్ కేబుల్ నెట్‌వర్క్‌తో అనుసంధానించి ప్రతి ఇంటికి బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ సేవలు అందజేస్తామని, తద్వారా పౌరసేవలు పొందడాన్ని మరిం త సరళం చేస్తామని రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్ మంత్రి కె.తారకరామారావు అన్నారు. దేశంలో తొలి డిజిటల్ రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దుతామని తెలిపారు. ట్యాంక్‌బండ్‌పై రాష్ట్ర ఐటీ శాఖ, బీఎస్‌ఎన్‌ఎల్, క్వాడ్‌జెన్ సంస్థలు సంయుక్తంగా పైలట్ పద్ధతిలో ఏర్పాటు చేసిన వైఫై ప్రాజెక్టును గురువారం ఆయన లాంఛనంగా ప్రారంభించారు. రాబోయే ఆరు నెలల కాలంలో గ్రేటర్ వ్యాప్తంగా బీఎస్‌ఎన్‌ఎల్ సంస్థతో కలసి 3వేల హాట్‌స్పాట్‌లను ఏర్పాటు చేసి వైఫైసేవలను తొలి అరగంట ఉచితంగా అందిస్తామన్నారు.
త్వరలో శాంతిభద్రతల పర్యవేక్షణకు కూడా వైఫై సేవలను వినియోగిస్తామన్నారు. ఈ-గవర్నెన్స్ తరహాలోనే మొబైల్ గవర్నెన్స్ ద్వారా పౌరసేవలను అందజేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. జూన్ 1న టి-హబ్ (సాంకేతిక నవకల్పన కేంద్రం)ను ప్రారంభిస్తామని, ఇందులో పలు స్టార్టప్ (నూతనఐటీకంపెనీలు) కంపెనీలకు స్థానం కల్పించనున్నామన్నారు. ఇంటర్నెట్ ప్రసారాలను నియంత్రించేందుకు పలు సెల్యులార్ కంపెనీలు చేస్తున్న ప్రయత్నాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా సోషల్ మీడియాలో ప్రారంభమైన నెట్‌న్యూట్రాలిటీ ఉద్యమానికి తమ ప్రభుత్వం పూర్తిగా మద్దతునిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఐటీశాఖ కార్యదర్శి జయేష్‌రంజన్,బీఎస్‌ఎన్‌ఎల్ సీజీఎం మురళీధర్,క్వాడ్‌జెన్ సీఈఓ సీఎస్‌రావు,ఐటీ శాఖ ఓఎస్డీ రమేష్ పాల్గొన్నారు.
నగరంలో 5జీ వైఫైసేవలు: రవిశంకర్‌ప్రసాద్
ట్యాంక్‌బండ్, బుద్ధవిగ్రహంతో ఎంతో అందంగా కనిపించే భాగ్యనగరంలో శక్తివంతమైన 5జీ సాంకేతికతతో కూడిన వై-ఫై సేవలు అందుబాటులోకి రావడం సంతోషదాయకమని కేంద్ర ఐటీ మంత్రి రవిశంకర్‌ప్రసాద్ అన్నారు. హైదరాబాద్ వై-ఫై ప్రాజెక్టు ప్రారంభోత్సవం సందర్భంగా కేంద్ర మంత్రి ఢిల్లీ నుంచి రాష్ట్ర మంత్రి కేటీఆర్‌తో స్కైప్ ఫేస్‌టైమ్‌కాల్‌లో మాట్లాడారు. దేశంలోని తాజ్‌మహల్, బోధగయ తదితర చారిత్రక ప్రదేశాలతోపాటు మరో 2,500 కేంద్రాల్లో బీఎస్‌ఎన్‌ఎల్ వైఫై సేవలు అందజేస్తుందని తెలిపారు. దేశాన్ని డిజిటల్ ఇండియాగా మార్చడం, ఈ-పంచాయతీల ఏర్పాటు తమ ప్రభుత్వ సంకల్పమని వివరించారు.
అంతర్జాతీయ నగరాల సరసన హైదరాబాద్
ఉచిత వైఫై సేవల కల్పన ద్వారా హైదరాబాద్ నగరం శాన్‌ఫ్రాన్సిస్కో, బార్సిలోనా, లండన్ వంటి స్మార్ట్‌సిటీల జాబితాలో చేరిందని ఐటీ నిపుణులు తెలిపారు. మరో ఆరునెలల్లో నగరంలో 3 వేల వైఫై హాట్‌స్పాట్ పరికరాలను ఏర్పాటు చేయడం ద్వారా నగరవ్యాప్తంగా అరగంట పాటు ఉచిత వైఫై సేవలు అందుబాటులోకి రానున్నాయి.
వైఫై సేవలను ఇలా ఉపయోగించుకోండి: ట్యాంక్‌బండ్, నక్లెస్‌రోడ్ పరిసరాల్లో పది కిలోమీటర్ల పరిధిలో 40 వైఫై హాట్‌స్పాట్‌లను బీఎస్‌ఎన్‌ఎల్, క్వాడ్‌జెన్ సంస్థలు సంయుక్తంగా ఏర్పాటు చేశాయి. వీటి పరిధిలో మీ స్మార్ట్ ఫోన్‌లోని వైఫై ఆప్షన్‌ను క్లిక్‌చేసి అవసరమైన వివరాలు పొందుపరిచి ఆ తరవాత లాగిన్ కావాలి. దీంతో తొలి అరగంటపాటు ఉచితంగా వైఫై సేవలను పొందవచ్చు. అంతేకాదు 300 ఎంబీపీఎస్ నిడివిగల ఇంటర్నెట్ ప్రసారాలను వినియోగించుకోవచ్చని బీఎస్‌ఎన్‌ఎల్ సంస్థ తెలిపింది. ఆ తరువాత అరగంటకు రూ.30, గంటకు రూ.50, రెండు గంటలకు రూ.120, ఒక రోజంతా వైఫై సేవలను వినియోగించేందుకు రూ.150 విలువచేసే బీఎస్‌ఎన్‌ఎల్ వైఫై ఆఫర్ కూపన్లను వినియోగించాలని సూచించింది. ఈ కూపన్లు అన్ని బీఎస్‌ఎన్‌ఎల్ ఔట్‌లెట్లలో అందుబాటులో ఉంటాయని తెలిపింది.