What Is 5G Technology And How Does It Work - Sakshi
Sakshi News home page

5జీ:తరం మారింది..సూపర్‌ వేగం వచ్చేసింది

Published Sun, Aug 21 2022 10:07 AM | Last Updated on Sun, Aug 21 2022 12:18 PM

What Is 5g Technology And How Does It Work - Sakshi

శంకరాభరణం సినిమాలో ఓ డైలాగ్‌ ఉంటుంది..

‘‘పూర్వం ఎప్పుడో పడవల్లో ప్రయాణం చేసేటప్పుడు పాడిన పాటానూ.. కట్టిన రాగమూనూ అది. ఇప్పుడు బస్సులు.. రైళ్లు, విమనాలు.. రాకెట్లు.. జాకెట్లు...’’ అని.

ఇంకొన్ని నెలలు గడిస్తే దేశంలోనూ ఇలాంటి డైలాగులే వినిపిస్తాయి. కాకపోతే కొంత మార్పుతో..

ఎలాగంటే... ‘‘ఆపేయ్‌.. ఆపేయ్‌.. ఎప్పుడో 4జీ కాలం నాటి ఇంటర్నెట్టూ.. 

స్ట్రీమింగ్‌ సర్వీసున్నూ. ఇప్పుడు సెకనుకు 20 గిగాబైట్ల 5జీ’’ అని!! 


:::గిళియారు గోపాలకష్ణ మయ్యా

అవును. ఇదే వాస్తవం. మొబైల్‌ ఫోన్లలో సరికొత్త తరం.. విప్లవం మన ముంగిట్లోకి వచ్చేసింది. కేంద్ర ప్రభుత్వం 5జీ స్పెక్ట్రమ్‌ను వేలం వేయడం దాదాపుగా పూర్తవడంతో మునుపెన్నడూ చూడని వేగం, సౌకర్యాలతో ఇప్పుడున్న నాలుగో తరం మొబైల్‌ టెక్నాలజీని తోసిరాజని వినూత్నమైన 5జీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. అంతా బాగానే ఉంది కానీ.. ఏమిటీ 5జీ? ఎలా పనిచేస్తుంది?ఎందుకు దీనికంత క్రేజ్‌? మనకొచ్చే లాభాలేమిటి? 

1979లో తొలి తరం మొబైల్‌ ఫోన్‌ వచ్చిన తరువాత ఈ నలభై ఏళ్ల కాలంలో టెక్నాలజీ ఎంత మారిపోయిందో మనం కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కళ్లముందు ప్రత్యక్షంగా తార్కాణాలు కనిపిస్తునే ఉన్నాయి. ఒక ఊరి నుంచి ఇంకో ఊరికి ట్రంక్‌ కాల్‌ బుక్‌ చేసి ఆపరేటర్‌ కాల్‌ కలిపేదాకా వేచి చూడటమన్న ఫిక్స్‌డ్‌ లైన్‌ టెలిఫోన్‌ టెక్నాలజీకి బ్రేక్‌ వేసి వైర్‌లెస్‌ పద్ధతిలో మొబైల్‌ఫోన్లు అందుబాటులోకి వచ్చేశాయి. ఒకప్పుడు కేవలం మాటలు... అది కూడా అరకొరగా వినిపించేవి. ఇప్పుడు స్పష్టమైన హై డిఫినిషన్‌ వీడియోలూ అరచేతుల్లోని స్మార్ట్‌ఫోన్లలోకి ఇమిడిపోయాయి.

వినోదం, వ్యాపారం, విద్య అన్నీ ఈ స్మార్ట్‌ఫోన్లతోనే నడిచిపోతున్నాయి. అయితే.. వేగం, సౌకర్యం అన్న రెండు అంశాల విషయంలో మనిషి దాహం అంతులేనిది. సెకనుకు గిగాబైట్‌ వేగంతో సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోగల 4జీతో తప్తి పడలేదు. అంతకంటే వేగం, మరింత ఎక్కువ సౌకర్యాలు... వాటితోనే అనేకానేక ఇతర లాభాలను ఆశిస్తూ ఆధునిక టెక్నాలజీ మేళవింపుతో 5జీ మొబైల్‌ టెక్నాలజీని ఆవిష్కరించారు. మూడేళ్ల క్రితం కొన్ని దేశాల్లో ప్రయగాత్మకంగా 5జీ సేవలు మొదలయ్యాయి కూడా. ఈ ఏడాది అక్టోబరుకల్లా భారత్‌లోనూ 5జీ సేవలకు రంగం సిద్ధమైంది. 

4జీ ఎల్‌టీఈ కంటే భిన్నం....
5జీ మొబైల్‌ టెక్నాలజీ ఇప్పుడు మనం వాడుతున్న 4జీ ఎల్‌టీఈ కంటే పూర్తిగా భిన్నమైంది. 4జీ ఎల్‌టీఈ కేవలం ఒకే శ్రేణి రేడియో తరంగాలతో పనిచేస్తే.. 5జీ ఏక కాలంలో మూడు రకాల తరంగాలతో పనిచేయగలదు. గిగాహెర్ట్‌›్జకంటే తక్కువ పౌనఃపున్యమున్న తరంగాలు మొబైల్‌ ఫోన్‌ సంకేతాల పరిధి ఎక్కువగా ఉండేందుకు సాయపడతాయి. భవనాల గోడల గుండా సులువుగా సంకేతాలు ప్రయాణం చేయగలవు. తక్కువ లాటెన్సీ (సంకేతాలు మొబైల్‌ఫోన్‌ నుంచి సెల్‌ టవర్‌కు చేరేందుకు పట్టే సమయం), ఎక్కువ వేగం (సెకనుకు గిగాబైట్‌ వరకూ) ఇవ్వగల మిడ్‌బ్యాండ్‌ స్పెక్ట్రమ్‌ను కూడా 5జీలో వాడతారు. చివరగా సెకనుకు పది గిగాబైట్ల వేగం ఇవ్వగల హైబ్యాండ్‌ స్పెక్ట్రమ్‌ తరంగాలూ ఈ కొత్త టెక్నాలజీలో భాగం కావడం గమనార్హం. 4జీలో లాటెన్సీ గరిష్టంగా 98 మిల్లీసెకన్లయితే 5జీలో ఇది మిల్లీ సెకను కంటే తక్కువ. డౌన్‌లోడింగ్‌ వేగాలు చూస్తే 4జీలో 1సెకనుకు  100 మెగాబైట్ల నుంచి ఒక గిగాబైట్‌ వరకూ ఉంటుంది. 5జీలో 1సెకనుకు కనీసం పది గిగాబైట్ల నుంచి గరిష్ఠంగా 20 గిగాబైట్ల వరకూ ఉంటుంది. అంతేకాదు.. ఇప్పటి నెట్‌వర్క్‌లో ఒక్కో మొబైల్‌ టవర్‌ ద్వారా 200 నుంచి 400 మందికి సేవలందితే.. 5జీలో వంద రెట్లు ఎక్కువ మంది సులువుగా అందుకోగలరు.  

లోటుపాట్లూ లేకపోలేదు...
5జీ టెక్నాలజీ అమలుకు అవసరమైన మౌలిక సదుపాయాల కోసం పెట్టే ఖర్చు చాలా ఎక్కువ. ఉన్న వాటిని తొలగించి కొత్త బేస్‌స్టేషన్లను ఏర్పాటు చేసుకోవాలి. కొత్త టెక్నాలజీ కాబట్టి కొన్ని ఇబ్బందులు ఉండవచ్చు. టెక్నాలజీ ఎంత విజయవంత మవుతుందనేది ఈ లోపాలను అధిగమించడంలో ఉంటుంది. ఇంటర్నెట్‌ ఆధారిత పరికరాలు అత్యధికంగా మొబైల్‌ నెట్‌వర్క్‌లోకి చేరుతూండటం వల్ల భద్రత, వ్యక్తిగత గోప్యత వంటివి సమస్యలు సృష్టించే అవకాశం ఉంది. నెట్‌వర్క్‌లోకి చొరబడేందుకు హ్యాకర్లకు మరిన్ని ఎక్కువ అవకాశాలు ఏర్పడుతూండటం ఇక్కడ గమనించాల్సిన విషయం. 

మన దేశంలో ఎందుకాలస్యం..? 
అమెరికా, చైనా, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్‌ సౌదీ అరేబియా వంటి దాదాపుగా 72 దేశాల్లో 1950 వరకు నగరాల్లో 5జీ సేవలు ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి. 2019లోనే దక్షిణ కొరియా 5జీ సేవల్ని ప్రారంభించింది. మన దేశంలో 2020లోనే 5జీ సేవలు ప్రారంభం కావాల్సి ఉండగా కరోనా మహమ్మారితో ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నం కావడంతో టెలికమ్యూనికేషన్‌ శాఖ 5జీ స్పెక్ట్రమ్‌ వేలం వేయడం ఆలస్యమవుతూ వచ్చింది. అంతేకాకుండా 5జీ నెట్‌వర్క్‌కు కావాల్సిన ఫైబర్‌ నెట్‌వర్క్‌ లైన్లు పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాలేదు. గత ఏడాది నాటికి కేవలం దేశంలో 30% ప్రాంతాల్లో ఈ ఫైబర్‌ నెట్‌వర్క్‌ లైన్లు పూర్తయితే, మరో 70 శాతం మేరకు పనులు పెండింగ్‌లో ఉన్నాయి. టెలికాం సంస్థలన్నీ పూర్తి స్థాయిలో ఫైబర్‌ నెట్‌వర్క్‌ లైన్లు వెయ్యాలంటే కనీసం లక్ష కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలని అంచనా. అందుకే ఇప్పుడు కొన్ని ఎంపిక చేసిన నగరాల్లో మాత్రమే ఈ సదుపాయం అందుబాటులోకి రానుంది. 

టెక్నాలజీతో మన బుర్రలు మందగిస్తాయా?
5జీ టెక్నాలజీ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే మనుషులకు పని తగ్గిపోతుంది. అయితే దీనివల్ల మన బుర్రలు మందగిస్తాయని కొందరి వాదన. ఒకప్పుడు 30 నలభై ఫోన్‌ నెంబర్లను అలవోకగా గుర్తుంచుకోగలిగేవాళ్లమని... మొబైల్‌ ఫోన్లు వచ్చిన తరువాత అది సాధ్యం కావడం లేదని తమ వాదనకు ఆధారంగా కొందరు వ్యాఖ్యానిస్తూంటారు. ఇందులో నిజం కొంతే. ఎందుకంటే అవసరం లేని విషయాలపై దృష్టి పెట్టకపోవడం మెదడుకు ఉన్న సహజ లక్షణం. అలాగని మనం మెదడును వాడుకోవడం లేదని కూడా అనుకోనవసరం లేదు. ప్రయత్నం చేస్తే ఇప్పుడు కూడా మునుపటి స్థాయిలో ఫోన్‌ నెంబర్లు గుర్తు పెట్టుకోవడం కష్టమేమీ కాదు. మునుపటితో పోలిస్తే మన పరిచయాలు.. ఫోన్‌ నెంబర్ల సంఖ్య ఎంత పెరిగిందో కూడా ఒకసారి ఆలోచించాలి. అంతేకాదు... మొబైల్‌ఫోన్ల వల్ల మన బుర్ర మందగిస్తుందనేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు కూడా లేవు.  

 విమానాలకు 5జీతో ముప్పు?
అగ్రరాజ్యం అమెరికాలో 5జీ సేవలు మొదలైన సందర్భంగా కొంత గందరగోళం ఏర్పడింది. పలు దేశాలు అమెరికాకు విమాన సర్వీసులను రద్దు చేసుకున్నారు. 5జీ మొబైల్‌ సర్వీసుల కోసం ఉపయోగించే రేడియో తరంగాల ఫ్రీక్వెన్సీ, విమానాల్లో ఎత్తును సూచించేందుకు వాడే రేడియో ఆల్టీ మీటర్‌ వాడే ఫ్రీక్వెన్సీ దాదాపు ఒకే స్థాయిలో ఉండటం వల్ల సమస్యలు వస్తాయని గుర్తించడం ఇందుకు కారణం. ఈ ఏడాది జనవరిలో వెరిజాన్‌, ఏటీ అండ్‌ టీ టెలికామ్‌ సంస్థలు అమెరికాలో తమ 5జీ సర్వీసులు మొదలుపెట్టిన సందర్భంలో ఈ విషయాన్ని గుర్తించారు.

5జీ సంకేతాల కారణంగా రేడియో ఆల్టీమీటర్‌ ఇంజిన్‌  తాలూకూ బ్రేకింగ్‌ వ్యవస్థను ప్రభావితం చేసి విమానాలు ల్యాండింగ్‌ మోడ్‌లోకి వెళ్లకుండా చేస్తుందని.. దీనివల్ల విమానాలు రన్‌వే పై ఆగకపోవచ్చునని అమెరికా ప్రభుత్వ సంస్థ ఎఫ్‌ఏఏ కూడా స్పష్టం చేసింది. అయితే ఈ సమస్యకు పరిష్కారం కనుక్కునే దిశగా ఇప్పటికే ప్రయత్నాలు మొదలయ్యాయి. రేడియో తరంగాలను ఫిల్టర్‌ చేసే పరికరాలను ఏర్పాటు చేసుకోవడం ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చునని అంచనా. ఈ ఏడాది చివరికల్లా బోయింగ్‌ ఇంజిన్‌ కలిగిన విమానాలు ఈ రేడియో ఫిల్టర్లను అమర్చుకోవాలని ఫెడరల్‌ ఏవియేష¯Œ  ఏజెన్సీ ఇప్పటికే విమానయాన సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది.  

1జీ నుంచి 5జీ వరకు మొబైల్ వైర్‌లెస్ కమ్యూనికేషన్ టెక్నాలజీ జర్నీ

తొలి తరం...(1జీ) 1979
మొట్టమొదట వైర్‌లెస్‌ పద్ధతిలో మొబైల్‌ నెట్‌వర్క్‌ను మొదలుపెట్టింది జపాన్‌కు చెందిన నిప్పాన్‌ టెలిగ్రాఫ్‌ అండ్‌ టెలిఫోన్‌ (ఎన్‌టీటీ) టోక్యో నగరంలో ప్రారంభించింది. 1979లో మొదలు కాగా.. 1984 నాటికి జపాన్‌ మొత్తం 1జీ నెట్‌వర్క్‌ విస్తరణ జరిగింది. అమెరికాలో 1980లో, యునైటెడ్‌ కింగ్‌డమ్‌లో 1985లో 1జీ సేవలు మొదలయ్యాయి. గరిష్ట వేగం సెకనుకు కేవలం 2.4 కిలోబైట్స్‌ మాత్రమే. మాటలు మాత్రమే ఉన్న మొబైల్‌ సర్వీస్‌ ఇది.

రెండో తరం... (2జీ) 1991
యూరోపియన్‌ దేశం ఫిన్లాండ్‌లో 1991లో మొదలైంది రెండో తరం మొబైల్‌ సర్వీస్‌. గ్లోబల్‌ సిస్టమ్‌ ఫర్‌ మొబైల్‌ కమ్యూనికేషన్స్‌ (జీఎస్‌ఎమ్‌) ప్రమాణాలతో డిజిటల్‌ సిగ్నలింగ్‌ ఆధారంగా మాటలు మాత్రమే ఉన్న ఈ సర్వీస్‌ లాభం ఏమిటయ్యా అంటే.. సామర్థ్యం, వేగం రెండూ 1జీ కంటే ఎక్కువ అని చెప్పాలి. బ్యాండ్‌విడ్త్‌ను చూసుకుంటే 30 – 200 కిలోహెర్ట్‌›్జమధ్యలో ఎస్‌ఎంఎస్‌లు, ఎంఎంఎస్‌లు పంపుకునేందుకు కూడా అవకాశం లభించింది. కాకపోతే ఈ ఎస్‌ఎంఎస్, ఎంఎంఎస్‌ల వేగం గణనీయంగా తక్కువ. 2జీ నెట్‌వర్క్‌ ద్వారా అత్యధిక వేగం సెకనుకు 64 కిలోబైట్స్‌ మాత్రమే. 

మాటలకు వీడియోలు తోడైన మూడో తరం... (3జీ) 2001
మాటలకు... డేటా తోడైన మూడో తరం మొబైల్‌ సర్వీసులు 2001లో ఎన్‌టీటీ డోకోమో ద్వారా ప్రారంభమయ్యాయి. వినియోగదారులందరికీ ఒకే రకమైన ప్రమాణాలతో, అత్యధిక సామర్థ్యంతో డేటాను ప్రసారం చేయడంతోపాటు ఇచ్చిపుచ్చుకోవడంలోనూ వేగం ఉండేలా ఇందులో జాగ్రత్తలు తీసుకున్నారు. మొబైల్‌ఫోన్ల ద్వారా వీడియో కాల్స్, వీడియో కాన్ఫరెన్సింగ్, స్ట్రీమింగ్‌ సౌకర్యాలు కూడా దీంతోనే అందుబాటులోకి వచ్చాయి. 3జీ గరిష్ఠ వేగం సెకనుకు మూడు మెగాబైట్లు కావడం గమనార్హం.

 స్మార్ట్‌ఫోన్ల శకానికి నాందీ పలికిన నాలుగో తరం... (4జీ) 2009
యూరోపియన్‌ దేశం స్వీడన్‌ రాజధాని స్టాక్‌హోమ్, నార్వే రాజధాని ఓస్లోలలో 2009లో తొలి 4జీ సర్వీసులు మొదలయ్యాయి. లాంగ్‌టర్మ్‌ ఎవల్యూషన్‌ (ఎల్‌టీఈ), 4జీ ప్రమాణాల పుణ్యమా అని మాటల్లో స్పష్టత, లాటెన్సీ (నెట్‌వర్క్‌కు కనెక్ట్‌ అయ్యేందుకు ఫోన్‌ లేదా పరికరానికి పట్టే సమయం), ఇన్‌స్టంట్‌ మెసేజింగ్‌ వంటివన్నీ అందుబాటులోకి వచ్చాయి. ఇంకోలా చెప్పాలంటే స్మార్ట్‌ఫోన్లు, హ్యాండ్‌హెల్డ్‌ పరికరాల శకం మొదలైందన్నమాట. సోషల్‌మీడియా, నాణ్యమైన స్ట్రీమింగ్‌ సేవల హవా మొదలైందీ ఇప్పటి నుంచే. గరిష్ఠవేగం సెకనుకు 15 నుంచి 20 మెగాబైట్లు. 

అన్నింటా వేగం.. 5జీ (2019)
డేటా ట్రాన్స్‌ఫర్, అప్‌లోడ్‌/డౌన్‌లోడ్‌ వేగాలు 4జీ కంటే కనీసం పది రెట్లు ఎక్కువ వేగవంతమైన మొబైల్‌ సర్వీసు ఈ ఐదో తరం క్లుప్తంగా 5జీ. ’’మీరు కాల్‌ చేస్తున్న వినియోగదారుడు నెట్‌వర్క్‌ పరిధికి ఆవల ఉన్నాడు’’ అన్న సందేశం అస్సలు వినిపించదంటే అతిశయోక్తి కాదు. తక్కువ యాంటెన్నాలతో ఎక్కువమందికి కనెక్షన్లు ఇచ్చేందుకూ వీలు కల్పిస్తుంది ఇది. స్మార్ట్‌ఫోన్లు, కంప్యూటర్లు ల్యాప్‌టాప్‌లతోపాటు ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ కోవలోకి వచ్చే పరికరాలకూ డేటా సామర్థ్యం అలవడటం వల్ల అనేకానేక లాభాలు ఉంటాయని అంచనా. 2019లో పాశ్చాత్యదేశాల్లో ప్రయోగాత్మంగా మొదలైన ఈ కొత్త మొబైల్‌ టెక్నాలజీ ఇప్పుడు భారత్‌లోనూ అందుబాటులోకి రానుంది.

2024 నాటికి ప్రపంచ జనాభాలో కనీసం 65 శాతం మందికి 5జీ సేవలు అందుతాయని ఎరిక్‌సన్‌ మొబైల్‌ రిపోర్ట్‌ చెబుతోంది. 

2019లో 5జీని అందుబాటులోకి తెచ్చిన తొలి దేశంగా దక్షిణ కొరియా రికార్డు సష్టించింది.

10 కోట్లు...
ప్రస్తుతం దేశంలో 5జీ సామర్థ్యమున్న స్మార్ట్‌ఫోన్లు కలిగి ఉన్నవారి సంఖ్య

50 కోట్లు...
2027 నాటికి 5జీ స్మార్ట్‌ఫోన్‌ వినియోగదారులు

97 కోట్ల 96 లక్షల 27 వేల కోట్ల రూపాయలు!!
2035 నాటికి 5జీ టెక్నాలజీ కారణంగా అందే వస్తు, సేవల విలువ. 
 
మూడు కోట్ల 58 లక్షల 42 వేల కోట్ల రూపాయలు!! 
రానున్న 15 ఏళ్లలో కేవలం 5జీ ద్వారా భారత ఆర్థిక వ్యవస్థకు అందే మొత్తం.  

ఆరోగ్యం.. ఆనందం... సౌకర్యం...

చిటికెలో రొబోటిక్‌ సర్జరీలు...
5జీతో వచ్చే మెరుపు వేగం అమెరికా వైద్యుడు అనకాపల్లిలో ఉన్న రోగికీ శస్త్రచికిత్స చేయడాన్ని సుసాధ్యం చేస్తుంది. కనురెప్ప మూసి తెరిచేలోపు గిగాబైట్ల సమాచారం ఖండాలు దాటగలవు కాబట్టి... అత్యవసర పరిస్థితుల్లోనూ సులువుగా ప్రపంచంలోని ఏమూలన ఉన్న నిపుణుడినైనా సంప్రదించవచ్చు. అంతేకాదు.. గ్రామీణ ప్రాంతాల్లోనూ అత్యాధునిక వైద్యసేవలకు శ్రీకారం చుట్టగల టెలిమెడిసిన్‌ విస్తృత వాడకంలోకి వచ్చేందుకు వీలు కల్పిస్తుంది ఈ టెక్నాలజీ. అతితక్కువ ఖర్చుతో నాణ్యమైన వైద్యం అందించడం ద్వారా రోగులు ఆసుపత్రుల్లో చేరాల్సిన అవసరం కూడా ఉండకపోవచ్చునని అంచనా. 

కొత్త అనుభూతుల లోకం...
ఇంటర్నెట్‌ అంటే ఇప్పటివరకూ మనకు దృశ్య శ్రవణ అనుభూతులను మాత్రమే ఇచ్చేది. అయితే 5జీ రాకతో స్పర్శ కూడా అనుభవంలోకి వస్తుంది. హ్యాప్టిక్స్‌ అని పిలిచే ఈ కొత్త అనుభవం ఎన్నో లాభాలు తెచ్చిపెట్టనుంది. సమాచారం మెరుపువేగంతో ప్రయాణిస్తుంది కాబట్టి... అమెరికాలో ఓ వైద్యుడు మెడికల్‌ రోబో ద్వారా ఆస్ట్రేలియాలో ఉన్న రోగికి శస్త్రచికిత్స చేయగలడు. వీడియోగేమ్‌లు, సినిమాల ద్వారా స్పర్శతోపాటు అనేక ఇతర ఇంద్రియ జ్ఞానాలను ఎక్కడికైనా ప్రసారం చేయవచ్చు. 5జీతో రేడియో ఫ్రీక్వెన్సీల్లోనూ సమాచారం ఇచ్చిపుచ్చుకునే అవకాశం లభిస్తుంది. దీనివల్ల ఇంటర్నెట్‌కు అనుసంధానమైన అనేక ఎలక్ట్రానిక్‌ పరికరాలు ఒకదానితో ఒకటి సమాచారం ఇచ్చిపుచ్చుకోవడం సులువుగా జరిగిపోతుంది. 

డ్రైవర్‌ అవసరం లేని వాహనాలు...
డ్రైవర్లు అవసరం లేని వాహనాలు ఇప్పటికే కొన్ని అందుబాటులో ఉన్నాయి కానీ... 5జీ విస్తత వాడకంలోకి వస్తే ఇవి సర్వవ్యాప్తమవుతాయి. వేగవంతమైన డేటా ట్రాన్స్‌మిసబిలిటీ కారణంగా వాహనాల్లోని సెన్సర్లు, కెమెరాలు, మైక్రోప్రాసెసర్లు పరిసరాల్లోని ఇతర వాహనాలతో సంభాషించగలవు. తద్వారా ప్రమాదాలు కనిష్ఠస్థాయికి చేరతాయి. వాహనాల మధ్య సంభాషణ సాధ్యమైన కారణంగా రహదారిపై ముందు వెళుతున్న వాహనం ఏదైనా ప్రమాదాన్ని శంకిస్తే లేదా ట్రాఫిక్‌ సమస్య ఎదుర్కొంటే ఆ విషయాన్ని వెనుకన వస్తున్న వాహనాలకు ప్రసారం చేయడం ద్వారా ట్రాఫిక్‌ జామ్‌లను నియంత్రించగలవు. 

ఫ్యాక్టరీలు నడుస్తాయి....
దేశంలో 5జీ స్పెక్ట్రమ్‌కు జరిగిన వేలంలో కొంత భాగాన్ని అదానీ గ్రూపు సంపాదించుకున్న విషయం తెలిసిందే. అయితే అదానీ గ్రూపు టెలిఫోన్‌ సేవలు అందించే అవకాశం తక్కువ. బదులుగా ఇండస్ట్రియల్‌ అంటే ఫ్యాక్టరీలు నడిపేందుకు 5జీని వాడుకుంటున్నారు. ఇంటర్నెట్‌ ఆధారిత పరికరాలు (ఐఓటీ)లకూ 5జీ ఉపయోగపడుతుంది కాబట్టి.. సెన్సర్లు, రోబోల ద్వారా మొత్తం ఫ్యాక్టరీ వ్యవహారాలన్నీ చక్కబెడతారన్నమాట. ఫ్యాక్టరీలేం ఖర్మ... భవిష్యత్తులో ఇళ్లు, భవనాలు కట్టేందుకూ 5జీ ఆధారిత రోబోలు పనికొస్తాయంటే ఆతిశయోక్తి ఏమీ కాదు. పనిచేయాల్సిన ప్రాంతాన్ని కచ్చితంగా మ్యాప్‌ చేయగలడం, ఇతర రోబోలు, పరికరాలతో సమాచారం ఇచ్చిపుచ్చుకోవడం ద్వారా వేగంగా, సురక్షితంగా భవన, వాహనాలు మాత్రమే కాకుండా... ఏ వస్తువునైనా అసెంబుల్‌ చేయడం సాధ్యమవుతుంది.

కృత్రిమ మేధకు ఊపు....
లాటెన్సీ అతితక్కువగా ఉండటం, డేటా ప్రసార వేగం చాలా ఎక్కువగా ఉండటం వల్ల కృత్రిమ మేధతో పనిచేసే అల్గారిథమ్‌లను మెరుగైన నాణ్యతతో నడిపించవచ్చు. అంటే కృత్రిమ మేధ సాఫ్ట్‌వేర్‌ నిర్ణయాలు తీసుకోవడం మరింత వేగంగా జరుగుతుందన్నమాట. దీనివల్ల అత్యంత కీలకమైన విషయాల్లోనూ మానవ ప్రమేయం లేకుండానే నిర్ణయాలు సురక్షితంగా జరిగిపోతాయి. ప్రిసిషన్‌ అగ్రికల్చర్‌ అంటే.. మానవుల అవసరమే లేకుండా డ్రోన్లు, సెన్సర్లు, కెమెరాలు, స్వతంత్రంగా వ్యవహరించే కృత్రిమ మేధ సాఫ్ట్‌వేర్‌లు కలిసికట్టుగా మన కోసం వ్యవసాయం చేస్తాయి. ఎప్పుడు ఏ కీటకనాశినిని వాడాలి? నీరెప్పుడు అందించాలి? కలుపుతీతకు సమయమేది? వంటివన్నీ తనంతట తానే వాతావరణ, ఇతర పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని నిర్ణయించేందుకు 5జీ వీలు కల్పిస్తుంది. 

5జీ టెక్నాలజీలో ’మేకిన్‌ ఇండియా’కు కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇవ్వడం వల్ల భారత్‌లో ప్రత్యేకమైన 5జీ ఎకోసిస్టమ్‌ ఏర్పడనుంది.టెక్నాలజీలు, పరికరాలు ఇండియా కేంద్రంగా రూపొందనున్నాయి. డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ టెలికమ్యూనికేషన్స్‌లో సంస్కరణలు కూడా 5జీ టెక్నాలజీకి దోహదపడతాయి.– కె.జి.పురుషోత్తమన్, కేపీఎంజీ. 

కోవిడ్‌ కాలంలో ఆన్‌లైన్‌లో వైద్యులను సంప్రదించడం ఎక్కువైంది. 5జీ అందుబాటులోకి వచ్చిన వెంటనే టెలిమెడిసిన్‌తోపాటు ఆరోగ్య రంగంలోనూ స్పష్టమైన మార్పు కనిపిస్తుంది. వేగవంతమైన, సురక్షితమైన టెక్నాలజీ కారణంగా వైద్యం అందించే పద్ధతులు కొత్తపుంతలు తొక్కుతాయి. స్మార్ట్‌సిటీల నిర్మాణంలో, దేశ భద్రత, నిఘా వ్యవస్థల్లోనూ 5జీ కీలకపాత్ర పోషించనుంది. 5జీ ద్వారా కేవలం వీడియోలను చూసి విశ్లేషించడం మాత్రమే కాకుండా.. గుట్టుగా ఫేస్‌ రికగ్నిషన్‌ చేసేందుకూ ఉపయోగపడుతుంది. భారత్‌లో 5జీ ఆధారిత టెక్నాలజీలు, సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు కషి చేస్తున్న స్టార్టప్‌లకు క్వాల్‌కామ్‌ ఇండియా తనవంతు సహకారం అందిస్తోంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాలు 5జీ హ్యాకథాన్, స్టార్టప్‌ హబ్‌లలో చురుకుగా పాల్గొంటున్నాము. క్వాల్‌కామ్‌ డిజైన్‌ ఇన్‌ ఇండియా ఛాలెంజ్, ఇన్నొవేషన్‌ ఫెలోషిప్, యాక్సలరేటర్‌ సర్వీసస్, ఇన్నొవేషన్‌ ల్యాబ్స్‌ వంటి కార్యక్రమాలతో 5జీ టెక్నాలజీల వద్ధికి ప్రయత్నిస్తున్నాం. – రాజెన్‌ వగాడియా, వైస్‌ ప్రెసిడెంట్, క్వాల్‌కామ్‌ ఇండియా. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement